తెలుగుతనమంటే...  (Author: నామని సుజనాదేవి)

తెలుగుతనమంటే. .

అచ్చులలో అమ్మతనపు  ఆనవాళ్ళు 

హల్లులలో  హంపిశిల్పాల హొయలు

అక్షరాలలో అరవిరిసిన సుమాల పరిమళాలు  

పదాలలో సుస్వరాల పదనిసలు

పద్యాలలో   పరవళ్ళు తొక్కే నుడికారాలు

బాణీలలో  బంధించే వశీకరణ బాణాలు  

జడత్వాన్ని ఝాడిపించే జావళీలు 

చటుక్కున  మెరిసే చమత్కారాలు

సరిగమల సరాగాల మైమరిచే కీర్తనలు

***    

కవిత్రయం  కళ్ళముందు పరిచిన కావ్యాలు

వ్యాసవాల్మీకులు విరచించిన మహా గ్రంథాలు

నాటి రారాజులు పెంచి పోషించిన కళలు ఖండికలు

నేటి కవి దిగ్గజాల కలం నుండి జాలువారిన  జాతిరత్నాలు

*** 

విదేశీయులనే మెప్పించి రప్పించిన సంస్కృతీ సంప్రదాయాలు

వినువీధిలో విశ్వకేతనం ఎగురవేసిన క్రీడలు పతకాలు

నోటికి కడు పసందుగా ‘అతిథి దేవోభవాంటూ‘ వడ్డించే అనురాగాలు

పంట చేల గట్లపై వినిపించే లయబద్ధమైన విన్యాసాలు

బాపూ బొమ్మల ముళ్ళపూడి రచనల కలబోతలు

కనువిందు చేసే అచ్చతెలుగు ఆడపడుచుల వయ్యారాలు

వెరసి.  తెలుగుతనమంటే

అవని నుండి ఆకాశం వరకు ఆవరించిఉన్న అమృతత్వం

ఆకలిగొన్నవారికి అన్నం పెట్టె ఆత్మీయతానుబంధం 

 పండగలా  ఉన్నది  పంచుకోవడం, బంధాలు పెంచుకోవడం

అనిర్వచనీయమైన అనుభూతి

కల్లలెరుగని కపటమెరుగని బంధాల కలబోతలు

ఎల్లలెరుగని అనురాగాల వెళ్ళబోతలు !

 

0 Comments