కొత్త నడక  (Author: డి. నాగజ్యోతి శేఖర్)

"చిత్రంగా కళ్ళెగరేసి నన్ను వెక్కిరింపుగా నవ్వింది నా స్నేహితురాలు స్వప్న.చిరుకోపంగా చూస్తున్న నన్ను ఇంకా అలానే ఆట పట్టిస్తూ...

"ఏంటీ!సత్తెకాలపు సుబ్బమ్మా!టెక్నాలజీ దూసుకుపోతున్న ఈ కాలంలో ఉత్తరం రాస్తావా?!అదే కాబోయే భర్త కి.   పైగా టెక్నో గా పనిచేస్తూ. హాయిగా ఏ స్కైప్ లోనో మాట్లాడుకోక! ఇంకా కావాలంటే బయట చక్కగా కలిసి మాట్లాడుకోవాలి.ఇంకా పెన్నూ,కాగితం,రాత-గీతా అంటావేంటే బాబు! నిన్ను చూస్తే నవ్వు రాదా మరి!"అంది ఉడికిస్తూ.అయినా నేనేం చలించలేదు.

   “ప్రాణ స్నేహితురాలివని చెప్పా అంతే! నువ్వు నవ్వాల్సిన అంత విషయం ఏముంది ఇందులో.మనం ఎదురుగా ఉన్నా కూడా కొన్ని భావాలు ఎదుటివారికి చెప్పలేము.ఫోన్లో మాట్లాడితే మరు క్షణం మరచి పోతాం. అదే రాత అయితే శాశ్వతంగా ఉంటుంది.ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు.మరల మరల చదువుకొని ఆనందించవచ్చు.అవి రికార్డెడ్ హిస్టరీ ఒకరకంగా.ఉత్తరాలు చేసిన గొప్ప కార్యాలు చరిత్రలో ఎన్ని ఉన్నాయి. అయినా   ఇప్పుడు ఇది నా వ్యక్తిత్వానికి సంబంధించిన సమస్య.అక్షరాలుగా మారితేనే చెరగకుండా ఉంటుంది.నీ నవ్వులాపి దయ చేస్తే నేను ఉత్తరం రాసుకుంటాను".అన్నాను.” సరే తల్లి!.  ఉత్తరమే రాసుకుంటావో, అత్తారింటికి అత్తరే పూసుకుంటావో నీ ఇష్టం.కానీ అతను బిత్తరబోయి ఉత్తర కుమారుడు అవ్వకుండా చూడు!" అంటూ నా భుజం మీద చరిచి వెళ్ళిపోయింది.చిన్నప్పటి  స్నేహం.చదువులై ఉద్యోగాలు చేస్తున్నా చెక్కుచెదరలేదు. నన్ను ఏమైనా అనే చనువు  స్వప్నకుంది.తను వెళ్ళాక, నా ఆలోచనలు వారం రోజుల క్రితం కార్తీక్ తో జరిగిన నా పెళ్లిచూపుల ఘట్టంలోనికి మళ్ళాయి!

   తనూ నాలానే సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూడగానే ఆకట్టుకునే రూపం.నేనూ తనకి నచ్చానని తన చూపుల్ని బట్టి అర్ధమయ్యింది. అయితే ఎక్కడో నాకు సంశయం. నా గూర్చి అమ్మా వాళ్ళు పూర్తిగా చెప్పారో లేదో అని.అయినా చెప్పకుండా ఎలా దాచగలరూ?దాచితే దాగేది కాదు చిన్నప్పటినుండి అడుగు తడబడే నా నడక గూర్చి! చెప్పే ఉంటారు.అయినా అతని నోటి వెంట వినాలి. లేదా నా నోటితోనైనా అతనికి చెప్పాలి.అందుకే అతనితో మాట్లాడాలన్నాను.పెద్దవాళ్ళు అభ్యంతరం చెప్పలేదు.తను కూడా ఉత్సహంగా

వచ్చాడు నా గదిలోకి.  నా వంకే తేరిపారా చూస్తున్న అతని చూపుల్ని మోయలేక నా కనురెప్పలు వాలిపోయాయి.

   నీళ్లు నములుతూ.."అదీ...అదీ..మీకు. ..నా గూర్చి." అంటున్న నా మాటల్ని మధ్యలోనే ఆపేసి, "చిన్నప్పటి నుండీ మీకు నడకలో చిన్న తేడా ఉంది అంతే కదా!" చప్పున తలెత్తాను.అతని కళ్ళలో ఎగతాళి లేదు.నిర్మలత్వం ఉంది."  అది నాకు ముందే తెలుసు.  ఆ  అడుగుల వెంటేగా ఇప్పుడు నేను వచ్చింది. కానీ శారీరక దుర్బలత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ నువ్వు ఒక్కో మెట్టూ ఎదిగిన విధానంలో కనిపించిన ఆత్మవిశ్వాసం గూర్చి విని,తెలుసుకొని. నీ లాంటి అమ్మాయే కావాలనుకున్నా...!" అంటున్న అతన్ని..."  కావాలనుకోవడం వేరు.జీవితాంతం భరించడం వేరు.అందుకే ఈ పెళ్లి చూపులూ అవీ వద్దని ఎంత చెప్పినా అమ్మానాన్న వినడంలేదు.వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు.అయినా నా అవకరంతో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేను. అమ్మా నాన్నకు ఎలాగూ తప్పదు.ఆ విషయమే మీతో చెబుదామని..." అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నా!.

అతని కళ్ళలో అదే స్థిరత్వం.

"ఇప్పుడు మరింత నచ్చావు. నీ ఆత్మ గౌరవానికి ఏమీ భంగం కలుగదు.కలుగ నివ్వను.నిన్నే పెళ్లి చేసుకుంటా.సరేనా...బాయ్..." అంటూ ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయిన అతన్ని చూస్తూ ఉద్వేగానికి లోనయ్యా! నాతో పాటు నా లోపాన్ని ఇష్టపడుతున్న అతను నా మదిలో ఒక గౌరవ స్థానం ఏర్పరచుకున్నాడు.ఇన్నాళ్లూ అణచిపెట్టిన కలల లోకానికి అతన్ని అధిపతిని చేశా ఆ క్షణం నుండి!

అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకయ్యింది.ఆ రోజు  రాత్రి లేట్ గా ఒక ప్రాజెక్ట్ ముగించి అలసటగా అనిపించి లాప్టాప్  మూసి కాస్త గాలి పీల్చికోవాలి అని అమ్మ ఎంతో ప్రేమ గా పెంచిన మా తోటలోకి వెళ్ళాను.మా తోట అంటే నాకెంతో ఇష్టం. నా బాల్య స్నేహితురాలిలా అనిపిస్తుంది.ఎప్పుడో మా తాత గారు నగర చివారులో కొన్న చాలా పెద్ద స్థలంలో విశాలంగా కట్టుకున్న ఇల్లు.ఇప్పుడా స్థలం నగర నడిబొడ్డుకి వచ్చేసింది చుట్టూ ఇల్లు పెరగడంతో. చుట్టూ ఉన్న అపార్టుమెంట్ల మధ్య మా ఇల్లో పురాతన భవంతిలా ఉంటుంది.తాత గారు మంచి ప్రకృతి ప్రేమికుడు, భావకుడు.ఆయన ఎంతో ప్రేమతో అందంగా కట్టుకున్న ఇల్లుని ఆయన ప్రేమ చిహ్నంగా అలానే ఉంచేశారు నాన్న.  సాయంత్రాలూ,వెన్నెల రాత్రులూ మేము ముగ్గురం ఆ ఇంటి చుట్టూ ఉన్న పూల తోటలో గడపడం అలవాటుగా మారింది.  ఈ రోజు కూడా కాస్త పని నుండి సేద తీరడానికి తోటలోకి వెళుతుండగా చెట్ల వెనుక ఉన్న సిమెంట్ బెంచీ నుండి నాన్న మాటలు వినబడ్డాయి.  అమ్మా నాన్న ఇంత రాత్రి అయినా నిద్ర పోలేదా. వాళ్ళ ఏకాంతాన్ని భంగపరచడం ఇష్టం లేక వెనుదిరిగ బోతున్న నాకు నాన్న నోటి నుండి నా పేరు, కార్తిక్ పేరు వినబడడంతో తెలియకుండానే ఆగిపోయా-ను.

“ఎంతైనా మన పూర్వి అదృష్టవంతురాలు లలిత.  తన పెళ్లి సమస్య అవుతుంది అనుకున్నాం.  కానీ కార్తిక్ లాంటి మంచి అబ్బాయి సంబంధం కుదిరింది" అంటున్న నాన్నను వారిస్తూ.

"ఏం అదృష్టమోనండీ! మన ఇంటిని అతనికి రాసివ్వడం మాత్రం అంత  సబబుగా అనిపించడం లేదు. మన పూర్విని సరిగా చూసుకుంటాడా అని ఎక్కడో భయం తొలుస్తుంది అండీ!" అమ్మ నాన్న మాటకి ఎదురు చెప్పడం ఎప్పుడూ వినలేదు.  నాన్న అమ్మ వద్దన్నది ఏదీ చేసి ఎరుగడు.  కానీ దానికి భిన్నంగా ఈ రోజు...

"భయం దేనికి లలిత! మనకా ఒక్కగాని ఒక్క అమ్మాయి.  మన తర్వాత ఎలాగూ ఇదంతా వాళ్లదే కదా.  ముందుగా ఇస్తే తప్పేంటి అంట. అయినా నువ్వు ఆ అబ్బాయిని ఎలా ఇలా తప్పుగా అర్ధం చేసుకున్నావ్  ..." నాన్న ఇంకా ఏదో అంటున్నా...వినాలనిపించలేదు. గుండెల్లో బాధా,కోపం సుళ్ళు తిరిగాయి. గబ గబా నడవాలనుకొని అడుగు తడబడి ముందుకు తూలాను. లోపలి నుండి కన్నీరు తన్నుకొచ్చింది. అంటే కార్తీక్... కార్తీక్ తనని ఆస్తి కోసం చేసుకుంటున్నాడా.  ఎంత మోసం.  పైకి నన్నెంతో అభిమానించానన్న అతను ఇంతటి కుసంస్కారా! అమ్మ వాళ్ళ ప్రేమ సౌధం ఇది. దాన్ని వారికి ఈ పెళ్లి పేరుతో దోచుకోవాలి అనుకున్నాడా! ఒక్కసారిగా అతని మీద ఏర్పరచుకున్న ప్రేమ అంతా ముక్కలయ్యింది.  ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా... తెలిసిన కారణానికి, తెలియని దుఃఖాన్ని అక్షరాలుగా మార్చాలనిపించింది ఎప్పటిలానే. తాతగారు ఇలానే ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా కాగితపై పెట్టేవారు. పక్కనే కూర్చుని” ఎందుకు తాతగారు ఇలా రాస్తూ ఉంటారు అంటే.  అక్షరాలు,కాగితాలూ మన బంధువులు అమ్మా.  ఈ భావాన్నైనా రాతగా మారిస్తే మనస్సు ఉపశమిస్తుంది."  అనేవారు.  అదే అలవాటు నాకూ వచ్చింది.  తెల్లవారుతుండగా ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చి తాతగారి టేబుల్ దగ్గరకు నడిచాను.  రాస్తూనే ఉన్నాను.  అంతలో స్వప్న వచ్చింది. పొద్దునే మా తోట లో జాగింగ్ చేసి నన్ను పలకరించడం రివాజు తనకి. పొద్దున్నే కాగితాలు ముందేసుకూర్చున్న నన్ను కళ్ళతోనే ప్రశ్నించింది ఏమిటి కధ అన్నట్టు. తనకు జరిగిన విషయం చెప్పాలనిపించలేదు.  అవమానంగా అనిపించింది.  విషయం దాచి కార్తిక్ కి ఉత్తరం రాయాలి అనుకుంటున్నా అని స్వప్నకు చెప్పిన ఫలితమే ఇందాక జరిగింది.  వర్తమానంలోకి వచ్చి ఆగిపోయిన రాతను కొనసాగించా. కార్తిక్ కి గట్టి బుద్ధి చెప్పాలి.  అతనితో ఇంక ప్రత్యక్షంగా మాట్లాడదలుచుకోలేదు. అతని గొంతు మరలా వినాలను-కోలేదు. అందుకే నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉత్తరం రాయాలనుకున్నా!

ఉక్రోషం సిరా గా మార్చి,ఉత్తరం మొదలు పెట్టా! సంభోదన తెలియదు. అయినా రాశా!

“ఓ వరుడా! ఏమన్నావు!  వైకల్యం ఉన్నా నా వ్యక్తిత్వం నచ్చి చేసుకుంటున్నా అన్నావు కదూ! కానీ నీ నిజ రూపం ఇప్పుడే బయట పడింది.  నా అదృష్టం కొద్దీ పెళ్లికి ముందు-గానే.  నువ్వో డబ్బుకి అమ్ముడుపోయే వ్యక్తివి.  అందుకే నా  అవయవ లోపానికి అదనపు రుసుముగా మా తాతగారి ప్రేమ నిలయాన్ని దోచుకోవాలను కున్నావ్!

 నాతో వేసే తడబాటు సప్త పదుల్ని సంపదగా మార్చుకోవాలనుకున్నావ్. ఔదార్యం పేరుతో అంతస్తు పెంచుకోవాలనుకున్నావ్. కుంచించుకు పోయింది నా కాలు కాదు నీ మనస్సు. నా కన్న వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేయాలనుకున్న నీ దోపిడీ గుణంతో నేను సహవాసం చేయలేను.  అమ్మకానికి పెట్టిన నీ ఆత్మ తో బంధం పెంచుకోలేను.  ఈ పెళ్లి జరగదు. ఇది అహంభావం అని నువ్వనుకున్నా ఇది నా ఆత్మ గౌరవం."

ఎప్పటికీ నీది కాని 'పూర్వి'కళ్ళు మసక బారుతుండగా...మెదడు తేలిక అవుతుండగా మరోసారి చదివి,పొంగిన ఆత్మ విశ్వాసం తో పోస్ట్ చెయ్యడానికి బయలు దేరా! 

అక్కడితో అతన్ని నా మనస్సులోంచి తుడి చేసి

నా రొటీన్ లో పడిపోయా!అమ్మా నాన్నలకు మాత్రం విషయం తెలియనీయలేదు.అయితే వారం తర్వాత నాకో ఉత్తరం వచ్చిందని ఆఫీస్ బాయ్ తెచ్చిచ్చాడు.  ఆఫీస్ కి ఎవరు రాస్తారు అబ్బా...అదీ ఉత్తరం! అనుకుంటుండగా..  కార్తిక్ కి నేను రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది.  ఫ్రొం కార్తిక్.  ఒక్కసారిగా కోపం వచ్చి ట్రే లో పడేశా ఉత్తరాన్ని.

ఏం రాసి ఉంటాడు.నాది పొగరు అని తేల్చేసి ఉంటాడు. అంతేనా లేక ఇంకా ఏమైనా బేరాలు ఆడాలనుకుంటు-న్నాడా... అమాయకత్వం నటిస్తూ మరో నాటకం సృష్టించాడా...

సాయంత్రం వరకూ ఇదే ఆలోచనలతో లెటర్ తీసీ, పెడుతున్నా గానీ చదివేందుకు మనస్సు ఒప్పలేదు.  ఆఫీస్ అవర్స్ అయిపోయాయి. ఇంటికెళ్లే ముందు అసంకల్పితంగా ఆ ఉత్తరాన్ని హాండ్ బాగ్ లో వేసుకున్నా!  బాగ్ చాలా బరువుగా అనిపించింది. నిద్ర పోయే ముందు అకస్మాత్తుగా ఆ ఉత్తరం జ్ఞప్తికి వచ్చి బాగ్ లోంచి తీసి తడబడే చేతుల్తో చించా....

“డియర్ పూర్వి!  నన్ను ప్రతిసారీ నీ ఆత్మ విశ్వాసంతో కట్టి పడేస్తున్నావ్!  అయితే నీ ఉత్తరం చదివాక నీలో కూడా చిన్న లోపం ఉందని అర్ధమయ్యింది. అయితే అది నేను ఖచ్చితంగా సరిదిద్దగలను అనుకో నీకు తోడుగా ఉండి. ఇంతకూ విషయానికి వస్తే ఎంతో తెలివితేటలూ ఉన్న నీకు తొందరపాటు, అపోహ పడడం కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది.  నువ్వు చాలా పొరబడుతున్నావ్.  నేను నిన్ను డబ్బు చూసి చేసుకుంటున్నానా... నీ గుణాల కన్నా ఎక్కువ డబ్బుందా నీ దగ్గర? నీ లోపాన్ని నేను అవకాశం గా కాదు బాధ్యతగా తీసుకున్నా! నీకు తెలుసా నాకో చెల్లి ఉండేది.  తనకు చిన్నప్పుడు ఆక్సిడెంట్ వల్ల విరిగిన కాలు సెట్ అవ్వలేదు. గెంతులు వేసే నా చెల్లి చక్రాల కుర్చీకే పరిమితం అయ్యింది.  కానీ నీలా నా చెల్లికి ఆత్మస్థైర్యం లేదు.  ఆ నైరాశ్యంలోనే తను బలవంతంగా ఈ లోకాన్నీ,  మమ్మల్నీ విడిచి వెళ్ళిపోయింది.  తన వైకల్యం గూర్చి మేము పడ్డ బాధ, తన నిష్క్రమణ తో మేము అనుభవించిన వ్యధా అంతా ఇంతా కాదు.  నీలా ఆత్మవిశ్వాసం తో జీవితంలో ఎదిగి ఉంటే ఎంత బావుండేది..  నా చెల్లిలా ఎందరో శారీరక వైకల్యంతో పాటు మానసిక కుంగుబాటుకి లోనవుతున్న వాళ్ళకి ధైర్యం నింపేందుకు నడుం కట్టుకున్నా! అలాంటి సమయంలో నే నువ్వు తారస-పడ్డావు.  నేను పూనుకొన్న కార్యక్రమంలో పాలుపంచు-కొనేనుదుకు నీ లాంటి తోడు కావాలి.  అలాంటి వారికి ఆసరా ఇచ్చి వారికి బతుకుపై భరోసా కల్పించాలి.  అందుకు నేను ఒక హోమ్ స్టార్ట్ చేసాను.  నా సొంత ఖర్చులతో రన్ చేస్తున్నా.  దివ్యాఅంగులను కొందరిని దత్తత తీసుకొని చదువుల్లో ముందుకు వెళ్లేలా   చేస్తున్నా.  ఇదేదో నా గొప్ప తనం కోసం నీకు చెప్పడం లేదు.నిన్ను కించ పరిచానని అపార్ధం చేసుకుంటున్నావని చెబుతున్నాను.  నీతో ఈ విషయాలన్నీ పంచుకుందాం అనేంతలో నీ ఉత్తరం వచ్చింది.

ఇంతకీ డబ్బు గూర్చి కదూ నిన్ను కావాలని అనుకుంటున్నానన్నావ్... మీ నాన్నగారు పెళ్లి గ్రాండ్ గా చేసి నాకు బహుమతి గా... అదే కట్నం గా భారీగా ఇస్తానన్నప్పుడు నేను ఆయనతో చెప్పిన మాటలు వింటే నన్ను అర్థం చేసుకుంటావ్ అనుకుంటున్నా.  నేను ఎంత వద్దన్నా ఆయన వినకపోవడంతో నా కోరిక చెప్పాను వారికీ కష్టం కలగ కుండా.  మన పెళ్లి గుడిలో చేసి పెళ్లికయ్యే ఖర్చుని మా దివ్యఅంగ సదన్ కి ఇవ్వమని చెప్పా అంతగా ఇవ్వాలి అనిపిస్తే.చిన్న పసుపు తాడు చాలు పూర్వి నిన్ను నా ఇంటికి తీసుకు పోవడానికి.

నీ ఉత్తరం వచ్చే వరకూ తెలియదు నాకు మీ ఇంటిని నాకివ్వాలనుకుంటున్నారని.అదే విషయం మీ నాన్నగారిని అడిగాను.అప్పుడు వారేం చెప్పారో తెలుసా పూర్వి.

"నా బిడ్డలాంటి ఎందరో బిడ్డల్ని చేరదీయాలను-కుంటున్న నీ గొప్ప ఆశయంలో మాకూ భాగమివ్వు కార్తిక్. ఆ సదన్ ఏదో మా లంకంత ఇంట్లోనే ఉండనివ్వు.  ఇది కోట్లు ఖరీదు చేస్తుందని అందరూ అంటుంటే నేనెప్పుడూ నమ్మలేదు.  దీన్ని అమ్మలేదు.అమ్మలేను.ఇప్పుడు నిజంగా ఒక మంచి ఆశయానికి ఉపయోగపడితే దీని విలువ నిజంగా కోట్ల లో ఉంటుందని నమ్ముతాను.  నా మాట విను కార్తిక్.  పూర్వీ, నువ్వూ మా కళ్ళ ముందే ఉండాలన్న చిన్న స్వార్ధం కూడా ఉంది ఇందులో" అన్నారు.  అయితే పూర్వి పేరు మీదే ఉంచండి.నాకు, నా ఆశయానికి తను తోడు ఉంటే చాలు అని చెప్పాను.  నిజం పూర్వి.  ఇదే నిజం.  నేను అమ్ముడు పోలేదు పూర్వి! నీ ప్రేమకు మాత్రమే దాసోహమయ్యాను.  నువ్వు నాకు కావాలి పూర్వి.  నువ్వు మాత్రమే కావాలి.ఇంకా నువ్వు అపార్ధం లోనే ఉంటే నిన్ను చూసి జాలిపడతాను అంతే! ఉంటాను.

 నీ కార్తిక్

ఉత్తరం ముగిసే సమయానికి నా కళ్ళు తెరుచుకుని ఆనంద భాష్పాలు రాల్చాయి.  గుండె నిండుగా ప్రేమ నిండిపోయింది. గబాలున ఫోన్ తీసుకొని కార్తిక్ కి కాల్ చేశా!

"పూర్వీ!" మార్ధవంగా పలికిన అతని గొంతు వినగానే" ఎందుకు నాకు వెంటనే చెప్పలేదు?వారం టైం ఎందుకు తీసుకున్నావ్" ఉక్రోషం గా అడిగా. అదే చిరునవ్వుతో చెప్పాడు కార్తిక్.

"నీకు ఉత్తరాలు అంటే ఇష్టం కదా.  చెరగని వ్యక్తిత్వాలు ఎప్పుడూ లేఖా రూపంలోనే ఉండాలని రాశా.  లేఖా రాణికి ఉత్తరం రాయాలంటే ఒక వారమైనా ఆలోచించి అందమైన పదాలు కూర్చోద్దూ...."

ఒక్కసారిగా నా హృదయం సంతోష సాగరమై ఎగసింది.  అతని చేయి నన్ను జీవితాంతం తడబడకుండా నడిపిస్తుంది అనే భరోసా కలిగింది.  తృప్తిగా కార్తిక్ రాసిన ఉత్తరాన్ని గుండెలకు హత్తుకున్నా!

ఇక నా” కొత్తనడక” మొదలవబోతుంది.

0 Comments