మట్టి పరిమళం  (Author: కొమురవెల్లి అంజయ్య)

అన్ని పరిమళాలకు జన్మస్థలి మట్టి
తన పాట తనే పాడుకుంటుంది పచ్చని సుగంధాలతో
ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియని సేద్యకారి
పాఠం నేర్చుకోవాలంటే మట్టిలో పెరిగిన చెట్టు గురువు

అమ్మ, నాన్నల ప్రేమ వాత్సల్యం మట్టి పరిమళాల సేద్యం
పాలు తాగి రొమ్ములు కోస్తానంటే మట్టిలో కలిపేంత ఆగ్రహం

మబ్బులు చిట్టి ముత్యాలై రాలగానే చాలదు కోరిన పంటకు
కూరలో ఉప్పులా చెమట బలం కలిస్తే పసందు
మట్టిలో సేద్యమంటే మట్టి గుణం తెలిసి చేయాలి
అపుడే రైతుకు కడుపారా తృప్తి, కంటినిండా నిద్ర

మట్టిలో పుట్టిన వాటితోనే బతుకుతూ
కాళ్లకు మట్టంటకుండా ఉండాలనుకోవడం
వేర్లను నరికేసి చెట్టు పెరగాలనుకోవడమే
కుమ్మరి మట్టి సారెపై పాత్రలు, చేస్తే జీవనచిత్రాలు
వాములో కాలితే మట్టి పరిమళ జీవన సేద్యం

మట్టి భాష వినడానికి,  కనడానికి, రచించడానికి
మట్టి మనసులను ఆలింగనం చేసుకోవాలి మనసారా
రెండాకుల మొక్కగా మొదలెట్టాలి బతుకు సూర్యనమస్కారంతో
గాలిలోని తేమ కంటే మనిషిలో తేమ కావాలి సంస్కారవంతం
మనిషిగా బతికి మమతలు పంచాలి

పంటకు పట్టిన పురుగులా మట్టిని కలుషితం చేస్తే
జీవుల భవిష్యత్తుపై రెట్ట వేసినట్లే
మట్టి పరిమళ సేద్యం పచ్చగుండాలంటే
మట్టి దేవతను కన్న బిడ్డల్లా కాపాడుకోవాలి
కంటికి రెప్పలా చూసుకోవాలి

0 Comments