పెసరట్టు ఉప్మా  (Author: కొమరవోలు సరోజ)

లక్ష్మిపతి గారింట్లో ఉప్మా-పెసరట్టు పార్టీ కి కొందరు స్నేహితుల్ని ఆహ్వానించారు. శనివారం 5 గంటలకే రమ్మని లక్ష్మి పతిగారి సతీమణి సుహాసిని అందరికి చెప్పింది . కొందరు గ్రోసరీ కెళ్ళి 6 గంటలకొచ్చారు. మరి కొందరు సాయంత్రం బ్యూటీ స్లీప్ అయ్యాక కొత్తగా ఇండియానుండి తెచ్చుకున్న సరికొత్తనగలు వేసుకుని, అంతకంటే సరికొత్త చీరెలుకట్టుకుని ముచ్చటగా ముస్తాబై 7 గంటలకొచ్చారు. 

రాగానే అందరికీ వేడివేడి పచ్చిమిరపకాయ బజ్జీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచం నిమ్మరసం, పైన కొంచం కొత్తి మీరవేసినవి 2 బజ్జిలు ఒకప్లేటులో, మరొక చిన్నప్లేటు లోఒక అరిశ అందరికీ ఇచ్చింది సుహాసిని.

లక్ష్మిపతిగారు అందరికి ఘాటు ఘాటు ఆర్గానిక్ అల్లం బాగా దంచి వేసిన టీ పెద్దపెద్ద కప్పులనిండా పోసి సర్వ్ చేసారు. “ఇవన్నీ తిని ఇంత టీ తాగితే పెసరట్టు ఎట్లా తింటాం?”  అడిగారొకరు. “చూద్దాంలే...10 గంటలకు” చెప్పారు లక్ష్మిపతి.

లక్ష్మిపతి, సుహాసిని ఇద్దరూ గుంటూరు సీమవారే. బిఎస్సి. లోను ఎం. స్సీ లోకూడా క్లాసుమేట్స్. పెళ్లి తరువాత కెనడా వచ్చి సెటిలయ్యారు. తెలుగు భాషన్నా, సంస్కృతి, సంప్రదాయాలన్నా వెర్రి అభిమానం. ఈరోజు పార్టీకి కూడా అదే కారణం. అందరూ ఫ్యామిలీ రూములో ఇంచక్కా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాదిరిగా కార్పెట్ మీద గుండ్రంగా సమావేశమయ్యారు. 

లక్ష్మిపతి చెప్పటం మొదలుపెట్టారు. న్యూజెర్సీ తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో దాదాపు 35 వసంతాలు పూర్తిచేసుకున్న “తెలుగు జ్యోతి” పత్రిక మనందరికీ తెలిసిందే కదా! ఎలాంటి సాంకేతిక సాధనలులేని కాలం నుండి నిరాటంకంగా జరుగుతోందని మనందరికీ తెలుసు. మనం ఎట్లా వ్రాసినా, ఏమి అనకుండా  శ్రమపడి, ప్రచురించి మనల్ని ప్రోత్సహించారు. వారు ఇప్పుడు ఒక  ప్రణాళిక చేపట్టారు. మనపట్ల గౌరవంతో మనల్ని కూడా పాలు పంచుకోమని అనటం వల్ల ఈరోజు మిమ్మల్నిరమ్మన్నాను. ఎందుకన్నా-నంటే కొన్ని విషయాలలో కేవలం నా ఒక్కడి భావజాలం  ప్రదర్శించటంకంటే  వివిధకోణాలను దర్శించి వెలువరించే పలువురి  అభిప్రాయాలు విలువయినవని. “సరే ముందు ఆడవాళ్ళతో మొదలుపెడదాం.”

“తెలుగుతనమంటే ఏమిటి?”

“పెసరట్టు రుచి, గోంగూర పసా, ఆవకాయ అరిసెలు, సున్నుండల రుచి తెలిసి ఉండటమా?“

మాయ  మాట్లాడింది. “అవును, లేకపోతే వాళ్ళు తెలుగు వాళ్ళేకాదంటాను”.

“మగవాళ్ళు ధోవతి, ఉత్తరీయం, ఆడవాళ్లు చీర ధరించ-టం, సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టడం జ్ఞాపకాలను పంచుకో-డం, సామాన్య వ్యవహార నిర్వహణకు సరిపడినంత తెలుగు-భాష ను మరచిపోకుండావుండటం. బొమ్మలకొలువు సంక్రాంతికి తప్పకుండ పెట్టడం. గొబ్బెమ్మలు గోధుమపిండితో చేసి పైన దట్టంగా కాఫీపొడి అద్ది పైన ప్లాస్టిక్   గుమ్మడిపూలు గుచ్చటం“ చెప్పింది రత్నసీత. 

“నానా రుచిరార్ధసూక్తి నిధి, ప్రసన్న కథా కలితార్ధ యుక్తి, యెల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి, భాగవతంబు తెలిసి పలుకుట, వేయి పడగల పాము విప్పరుకొనివచ్చే, ఇదీ  తెలుగుతనమంటే“ నొక్కి వక్కాణించాడు రాధాకృష్ణ. 

“వేలంటైన్స్ డే మనది కాకపోవచ్చు కానీ ప్రతిమనిషికీ అవసరమైంది ప్రేమే కనుక అందువల్ల మన తెలుగుతనం మంటగలుస్తుందని నేననుకోను” ఉమాదేవి ఉవాచ. 

“రాఖీ పండుగ ఆంధ్రాలో మనకు అలవాటు లేకపోవచ్చు. కానీ భారతీయులదేకదా! ఆకోణంలో ఆలోచిస్తే అక్కా-తమ్ముళ్ళ మధ్య, అన్నాచెలెళ్ల మధ్య మరింత అనురాగం కలుగుతుందని నమ్మకమేకాదు, వాస్తవంకూడా. అలాంటప్పుడు ఆచరిస్తే అది తప్పని నేను అనుకోను. అందువల్ల మన తెలుగు తనం కొన్ని పాళ్ళు తరిగి పోతుందనీ నేననుకోను” తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాడు. ఫణీంద్ర.

“అట్లతద్దెకి గోరింటాకు పెట్టుకోడం, తెల్లవారు ఝామున పెరుగన్నం తినటం, కొత్త బట్టలు కట్టుకుని ఉయ్యాల ఊగటం. సాధ్యమైతే ఇక్కడకూడా జరుపుకోవటం, హాట్ డాగ్స్ లాంటివి తినకపోవడం, భావి తరాలవారికి మన పండుగలు, పబ్బాలు, నోములు, వ్రతాలూ ఇత్యాదులు తెలియచెప్పటం ..... “  మాధవి చెప్పింది. 

“నేను చెబుతాను“ అంటూ లేచి నిలబడ్డాడు అనురాగ్. 

“అందరూ, కూర్చునే మాట్లాడారుగా!  నువ్వెందుకు లేచావు?” అడిగింది సుహాసిని.

“ఏమి లేదాంటీ, నిలబడి మాట్లాడితే నాకేదో ఉత్సాహం వచ్చినట్లుంటుంది.” అన్నాడు. అందరూ చిరునవ్వులు చిందించారు. 

“తెలుగుతనమంటే ప్రధానంగా తెలుగులో మాట్లాడాలి.  మన తరువాత తరం వారికి కూడా తప్పనిసరిగా తెలుగు నేర్పించాలి. తెలుగు పద్ధతులు, సంస్కృతి సంప్రదాయాలు గౌరవించడం, పాటించడం,  తెలుగు సంస్కృతి గురించి వివరంగా తెలుసుకోవటం. ఇద్దరు తెలుగువాళ్లు కలిసినపుడు మనసారా హాయిగా తెలుగులో మాట్లాడుకోవడం, అవసరమైనప్పుడే ఇంగ్లీషులో మాట్లాడటం.  పెద్దలను వినయంతో గౌరవించడం“

“లక్ష్మిపతి గారూ, మీరు మాట్లాడండి, ఆకలి మొదలవు-తోంది. రేపు ఉదయం గుడిలో తెలుగు క్లాసులున్నాయికదా! మీ అభిప్రాయం విని పెసరట్లు తిని, బయల్దేరుతాం“ చెప్పారు మిత్రులు. 

“మీరందరు చక్కగా చెప్పారు, ధన్యవాదాలు, సమయం తీసుకుని వచ్చినందుకు, మీఅభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు.   అయితే నా దృష్టిలో భాష అత్యంత ప్రధానమైనది. ఆభాషను పరిరక్షించుకునే బాధ్యత మనమీదే వుంది. సంఘంలో పరస్పర అవగాహనా సాధనం భాషే. మాతృభాషలో చదువుకున్నవారికి ఇతర భాషలు, సులభతరం అవుతాయి. అదట్లావుంచి, శ్రీశ్రీకవిత్వం, దేవులపల్లి వారి గేయాలు, జాషువా కవిత్వం. విదూషీమణి ఊటుకూరి లక్ష్మీ కాన్తమ్మగారి కవిత్వం చదవాలన్నా మనకు భాష ముఖ్యం.  అట్లాగే, అన్నమయ్య, త్యాగరాజుల వంటి వాగ్గేయ కారుల పద సంపద అవగాహన కావాలన్నా, కూచిపూడి నాట్యంలో హావ, భావ, రసాలు ఆస్వాదించాలన్నా, భాష తెలియాలి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలన్నీ మన భాషతోనే ముడిపడివున్నాయి. సంస్కృతి, పధ్ధతులు నిలుస్తాయి అనటంలో సందేహం లేదు. భాషను ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది కను మరుగయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది కనుక అందుకు తగిన కృషిచేసి, మన తెలుగు భాషను అమృతతుల్యంగా ఆస్వాదించగలిగితే …అదే తెలుగు తనమని నావిశ్వాసం“ అంటూ ముగించారు లక్ష్మిపతిగారు. 

సుహాసిని, అందరికీ పెసరట్లు స్టెయిన్లెస్ స్టీల్, కంపార్మెంట్ పళ్లేలలో ఒక్కొక్కళ్ళకి 2 పెసరట్లు కొంచం ఉప్మా, అల్లం-పచ్చడి, కొబ్బరిపచ్చడి, కొత్తావకాయవేసి, పెసరట్లమీద కొద్దిగానెయ్యి వేసి యిచ్చింది. 

“తెలుగు భాష మాధుర్యం బాగా వివరించారు, మీరు చెప్పినది చాల సముచితంగా వుంది.”

“అవును. తెలుగుతనమంటే ముమ్మాటికీ తేనె వంటి మన తెలుగే” అన్నారందరూ. సుహాసిని స్త్రీలకు  బొట్టుపెట్టి “విశిష్ట తెలుగు మహిళలు” అనే పుస్తకాలిచ్చింది. లక్ష్మిపతిగారు పురుషులందరికీ శ్రీ కాళహస్తీశ్వర శతకాలిచ్చారు. పార్కింగ్ వరకూ వెళ్లి మరొకసారి అందరికీ థాంక్స్ చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టిన ఆ తెలుగు దంపతులకు మనసంతా తెలుగు వెలుగు తో నిండి పోయింది. “ఇదే నిజమైన తెలుగుతనం“ అని తృప్తిగా శ్వాస తీసుకున్నారు.

 

4 Comments