అభయహస్తం
అభయహస్తం (Author: గొర్తి వాణి శ్రీనివాస్)
ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వీష్ణ్వాలయంలో స్వామివారికి ప్రతి ఏటా భోగం జరుగుతుంటుంది. ఆ సంవత్సరం కూడా గుళ్లో పూజలు అర్చనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
సుదర్శనాచారి గుడి అర్చకుడు.తెల్లవారు జామున లేచి స్నానం చేసి ప్రసాదం చేసేపని మొదలుపెట్టాడు. చలి విపరీతం. చన్నీళ్ళు పోసుకున్నాడేమో వడవడ వణుకుతూ మంత్రాలు చదువుతున్నాడు.
మారెమ్మ వచ్చి గుడి ఆవరణంతా శుభ్రంచేసి ముగ్గులువేసి వెళ్ళింది.
ఆలయ ద్వారాలు తెరిచిన సుదర్శనాచారి అవాక్కయ్యాడు. స్వామివారి అభయ హస్తానికి ఉండాల్సిన వెండి తొడుగుమాయమయింది. పూలలో జారి పడిపోయిం-దేమో అని అంతా వెతికి చూసాడు.ఎక్కడా లేదు
కంగారుగా బయటకొచ్చి ఎవరినన్నా పిలుద్దామనుకుంటే ఎవరూ లేరక్కడ.
సుదర్శనాచారికి భయం వేసింది. తను ఏ పాపం ఎరగడు. తనమీద నింద పడుతుందేమో అని విలవిల్లాడాడు.
రాత్రి గుడిలో భక్తుల రద్దీ ఉన్నమాట నిజం. కానీ గుడి తలుపులు మూసేముందు అంతా సజావుగానే ఉన్నట్టు గుర్తు. తెల్లవారేసరికి వెండి తొడుగు మాయం. పోలీసులొస్తే నేరం తనదే అంటారు.
'హయ్యో, పెరుమాళ్ వార్! ఎందుకయ్యా నాకింతటి పరీక్ష పెట్టావు. తెలిసి నేనేతప్పూ చెయ్యలేదుగదయ్యా. నన్ను రక్షించి కర్తవ్యాన్ని బోధించు స్వామీ' అంటూ భారమైన గుండెతో దైవానికి నమస్కరిస్తూ నిలబడ్డాడు.
అప్పుడే ఎండోమెంట్ బోర్డ్ మెంబర్ సూర్యనారాయణ దైవదర్శనానికి వచ్చాడు. ఆవిషయాన్ని ఆయనతో చెప్పాలా వద్దా అని తటపటాయించాడు సుదర్శనాచారి.
ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తెలుస్తుంది. తెలిసీ చెప్పక పోవడం కూడా దోషమే అని గుండె దిటవు చేసుకుని జరిగింది చెప్పాడు.
"అయ్యవారి అభయహస్తం తాలూకు వెండి తొడుగు పోయిందా? జాగ్రత్తగా చూసారా? మీకు తెలీకుండా ఎలా మాయమౌతుంది? అంటే మిమ్మల్ని అనుమానించాలని కాదు. మీరెంత నిజాయితీపరులో నాకు తెలుసు. కానీ ఈ విషయాన్ని పై అధికారులకు వెంటనే తెలియపరుద్దాం. ఇది భక్తుల మనో భావాలతో ముడిపడిన అంశం కాబట్టి
ముందుగా పోలీసులకి రిపోర్ట్ చేద్దాం" అన్నాడు.
సుదర్శనాచారి గుడి బాధ్యత ఇంకొకరికి అప్పజెప్పి సూర్యనారాయణతో కలిసి పోలీస్ స్టేషన్ కి బయల్దేరాడు.
పోలీసులు వాళ్ళిచ్చిన కంప్లైంట్ తీసుకుని
సుదర్శనాచారిని ఎస్. ఐ గారు వచ్చేదాకా బల్లమీద కూర్చోమన్నారు. సూర్యనారాయణ వెళ్ళిపోయాడు.
గంటయ్యింది రెండు గంటలు గడిచినా ఎస్ ఐ రాలేదు.
కాఫీ తెప్పించి ఇచ్చారు. సుదర్శనాచారి వద్దని చెప్పాడు.
స్వామి కైoకర్యం చేసి నివేదన చెయ్యనిదే పచ్చి గంగైనా ముట్టని నాకెందుయ్యా ఇంత పరీక్ష పెట్టావు. తెలియని అపరాధం చేసుంటాను.అందుకే నాకీ శిక్ష వేశావు అనుకుంటూ కళ్ళుమూసుకున్నాడు.
ప్లాస్క్ తో కాపీ పట్టుకొచ్చాడు సుదర్శనా చారి కొడుకు వాసు. “నాన్నా! మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చి విచారించడం అన్యాయం. మీరేం తప్పుచేసారని? దేవుడి సామానుపోవడం మీ తప్పెలా అవుతుంది? ఎస్ ఐ గారితో నేను మాట్లాడతాను" అన్నాడు
"నువ్వేం మాట్లాడొద్దు, నేనేతప్పూ చేయలేదని నా అంతరాత్మకి తెలిసి.ఆ దేవుడికి తెలుసు. నిజం ఒక్కటే ఉంటుంది.అది తప్పకుండా బయటపడుతుంది.నువ్వు ఇంటికెళ్లు, అమ్మ కంగారుపడుతుంటుంది. నేను బాగానే ఉన్నానని చెప్పు.ఎస్ ఐ గారితో మాట్లాడి వెంటనే వచ్చేస్తానని చెప్పు. రాముడు మావయ్యకు ఫోన్ చేసి చెప్పు."
"సరే నాన్నా జాగ్రత్త. మనవాళ్ళంతా పోలీస్టేషన్ బయట కూర్చున్నారు. నీకేం కాదు నాన్నా" అన్నాడు.
ఎప్పుడూ దైవ పూజ తప్ప ఏమీ తెలీని అమాయకుడై తండ్రి అలా పోలీస్టేషన్ కి రావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు వాసు. మధ్యాహ్నం అయింది.ఎస్ ఐ రాగానే కేస్ వివరాలు చెప్పాడు కానిస్టేబుల్.
గుడికి సంబంధించిన సిసి కెమారా ఫుటేజ్ తెప్పించి చూసారు.
దీపం వెలుగు తప్ప అక్కడ అంతా చీకటిగా ఉంది. అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎవరో తచ్చాడుతున్నట్టు కనిపించింది.ఏదీ స్పష్టంగా లేదు. ఆ కదిలేది మనిషా కాదా కూడా తెలియకుండా అస్పష్టంగా ఉంది. గుడిలోకి ఎవరో చొరబడ్డారని అర్ధమవుతోంది.
కానీ దైవానికి సంబంధించిన ఏ ఒక్క వస్తువునీ ముట్టుకోలేదు. బంగారు గిన్నెలు కూడా పోలేదు. కేవలం ఒక్క అభయ హస్తానికి వుండే వెండి తొడుగు మాత్రమే పోయింది. ఇంత పెద్ద సాహసం చేసింది దీనికోసమేనా? ఇంకేమైనా కారణం ఉందా, వాళ్ళు ఎవరై ఉంటారని విచారణ చెయ్యమని ఆదేశించాడు ఎస్ ఐ. రిపోర్ట్ తయారు చేయించి సుదర్శనచారి చేత సంతకం పెట్టించుకుని పంపించేశారు.
నీరసంగా ఇంటికొచ్చిన భర్తని చూసి బావురుమంది భార్య రుక్మిణి.” చీమకైనా అపకారం తలపెట్టని మీకెందుకండీ ఇంత పరీక్ష, ఒక సంతోషాన్ని మీతో పంచుకుందామనుకు-నేంతలో ఇలా జరిగిపోయింది. మనవాడికి క్యాంపస్ సెలక్షన్స్ లోమంచి ఉద్యోగం వచ్చింది. జీతం కూడా ఎక్కువే.ఇక మన కష్టాలన్నీ తొలగిపోయినట్టే.
వాడు మనిద్దర్నీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మనం పొట్టకట్టుకుని రూపాయి రూపాయి కూడబెట్టి వాడ్ని చదివించింది ఈరోజుకోసమే కదండీ. మనసారా సంతోషించే సమయంలో మీమీద ఈ నింద పడటం బాధగా వుందండీ" రుక్మిణి తన ఆవేదనంతా వెళ్లగక్కుకుంది.
"ఊరుకో రుక్మిణీ కొడుకు వలన ఆనందం, కొడుకు చేత బాధ రెండూ అనుభవించాల్సింది మనమే. ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు ఏకకాలంలో ఒకేలా భావించి తుడుచుకోవాలి మనం" అన్నాడు
"నాన్నా నన్ను క్షమించండి" అంటూ వాసు తండ్రి కాళ్ళమీద పడ్డాడు.
ఏం అర్ధంకాలేదు రుక్మిణికి. ఏం జరిగింది అంది కంగారుగా.
"అమ్మా నన్ను క్షమించు. నాలో ఎంత టాలెంట్ వున్నా ఒక్క ఉద్యోగంలో కూడా సెలెక్ట్ కాలేదు. ఏమీ చదవని మొద్దులు సెలెక్ట్ అవుతుంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్ధం కాలేదు. కాలేజ్ టి ఎన్ పీ కూడా సరిగా స్పందించ-లేదు. ఉద్యోగం రాక నేను మీకు భారంగా మిగిలిపోతానేమో అని భయం వేసింది నాన్నా అందుకే..."
"అందుకే దొంగతనానికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు గర్భాలయంలోకి ప్రవేశించావా?"
"మీకెలా తెలుసు నాన్నా?" ఆశ్చర్యంగా అడిగాడు వాసు.
"అంత చీకట్లో కూడా సిసి కెమారాలో నిన్ను నేను గుర్తుపట్టాను. నీకు ఉద్యోగం రావాలని
పెరుమాళ్ కి పూజచేసి రక్షరేకు స్వామివారి అభయ హస్తానికి తగిలించి నీ చేతికి కట్టానుకదా. నీ అహంకారంతో దాన్ని నువ్వు నీ కాలికి కట్టుకున్నావు కదూ, ఒళ్ళంతా ముసుగు కప్పుకున్నా నీకాలికి కట్టుకున్న రక్షరేకు దీపం కాంతిలో మెరుస్తూ కనిపించింది. దాన్ని వాళ్లంతా ఏదో వస్తువు అనుకున్నారు. కానీ నేను గుర్తుపట్టాను. నీ అపచారానికి తగిన ఫలితం ఇప్పుడు అందరం అనుభవిస్తున్నాం చూడు"
"అయ్యో నాన్నా, అహంకారంతో కాదు.తీవ్రమైన అసంతృప్తితో అలా చేసాను.తోటివాళ్ళకి ఉద్యోగం వచ్చి నాకు రాకపోతే ఎంత మానసిక హింసకు గురయ్యానో నాకే తెలుసు. చచ్చిపోదామనిపించింది నాన్నా, రెండుసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాను. చివరకు నేను కోరుకున్న చావుకూడా నాకు రాదా అని గుండె పగిలేలా ఏడ్చాను. నా ఊహ తెలిసిన దగ్గర్నుంచీ మీరు స్వామి అభయ హస్తాన్ని నమ్ముకోమని చెప్పేవారు. నమ్ముకున్నందుకు నాకేం ఒరిగింది. మీకేం ఒరిగింది. అందుకే...."
"అందుకు దొంగతనం చేసి అమ్ముకున్నావా?నాన్నగారికి కళంకం తెచ్చావా అప్రాచ్యుడా." అంది రుక్మిణి ఆవేశంగా
"అమ్ముకోలేదమ్మా, నా ఆత్మాభిమానానికి అడుగడుగు-నా పరీక్షలు ఎదురైనప్పుడల్లా ఆ అభయహస్తాన్ని ముందు పెట్టుకుని దూషిస్తూ నా మనోవ్యధని చల్లార్చుకుండామని తీసుకొచ్చాను. అంతగానీ ఇలా నాన్నగారిమీదకొస్తుందని ఊహించలేదమ్మా"
"ఛీ ఇలాంటి తండ్రికి నువ్వెలా పుట్టావురా? నీ మొహం నాకు చూపించకు"ఆవేశంతో మాటలంటున్న రుక్మిణిని వారించాడు సుదర్శనాచారి.
"యువతలో తీవ్ర నిరాశ , నిస్పృహలే వాళ్ళలో విపరీత ధోరణులను ప్రేరేపిస్తాయి. కొందరు హంతకులు, తీవ్రవాదులు-గా ఉన్మాదులుగా మారతారు. లక్ష్యం లేకుండా ప్రవర్తిస్తారు. తల్లి దండ్రులుగా వాళ్ళకి ఊరట కలిగించాల్సిన బాధ్యత మనమీదుంది. వాసూ! గెలుపు వచ్చేదాకా ఎదురుచూసే సహనం లేనప్పుడు ఇలాంటి పరిస్తితుల్నే ఎదుర్కోవాల్సొ-స్తుంది. దుక్కిదున్ని, పంటవేసి, ఫలసాయం వచ్చేదాకా రైతు నిరీక్షించకపోతే ఏమౌతుంది? ఎసెట్లో బియ్యం పోసి ఉడికేదాకా ఆగకపోతే అన్నమెలా పుడుతుంది. కాలం మనకోసం దాచివుంచింది పొందాలంటే సహనంతో వేచిచూడాలి."
తలదించుకున్నాడు వాసు.
"ఆచారిగారూ!ఎస్ ఐ గారు మిమ్మల్ని పోలీస్టేషన్ కి తీసుకురమ్మన్నారు.త్వరగా రండి", చెప్పాడు కానిస్టేబుల్..
లబ్బుమంది రుక్మిణి. ఆయనకేం తెలీదని ఏడుస్తూ చెప్పింది.
"నేనూ వస్తాను పదనాన్నా, జరిగింది చెప్తాను ఆ శిక్షేదో నేనే భరిస్తాను"అన్నాడు వాసు.
పోలీసుస్టేషన్ లో ఎండోమెంట్ బోర్డ్ సభ్యులంతా వున్నారు. “రండి ఆచారిగారూ.మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాం. దొంగ దొరికాడులేండి. మీరు కూడా ఈ కంప్లైట్ కాగితాలమీద సంతకం పెట్టండి. ఇక మీ గుడి పనులు మీరు చేసుకోవచ్చు" అన్నాడు సూర్యనారాయణ.
వాసు, సుదర్శనాచారి మొహమొహాలు చూసుకున్నారు
"దొంగ ఎలా దొరికాడు?" అడిగాడు వాసు.
"వారం క్రితం సీ సీ ఫుటేజ్ చూస్తే పాత నేరస్తుడు సుబ్బడు గుడిలోకి ప్రవేసిస్తూ కనిపించాడు. శటకోపాన్ని కాజేశాడు. గుళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు దొరికాడు. పట్టుకుని నాలుగు తంతే స్వామివారి హారం కాజేద్దామని రెండుసార్లు వచ్చానని, అది సాధ్యంకాక చేతికందిన డబ్బులు మాత్రం పట్టికెళ్లానని దీనిసంగతి నాకేం తెలీదని అంటున్నాడు. వెండి హస్తాన్ని ఎక్కడో అమ్మేసి ఆ డబ్బుల్తో తాగేసుంటాడు. అది వాడి పొట్టలోకి చేరిపోయింది.అందుకే ఊచలు లెక్కపెడుతు-న్నాడు" చెప్పాడు హెడ్ కానిస్టేబుల్.
వాసు ఏదో అనేంతలో,” అయ్యా! మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. మీ అందరి ఆశీస్సులూ అందించండి. అదే మహాభాగ్యం" అన్నాడు సుదర్శనాచారి.
"అభినందనలు బాబూ, తండ్రికి తగ్గ తనయుడివి. మీనాన్న కష్టపడి చదివించినందుకు ప్రయోజకుడివి అయ్యావు. ఉద్యోగం బాగా చేసుకుని పైకిరా." అని అక్కడున్నవాళ్ళంతా అభినందనలు తెలిపారు.
అందరికీ నమస్కరించి కొడుకు చెయ్యి పట్టుకుని అక్కడ్నించి బయటకొచ్చాడు సుదర్శనాచారి.
"నేను చేసిన తప్పుకు వేరెవరో బలవడం నాకిష్టంలేదు నాన్నా. అసలువిషయం చెప్పేస్తాను." అన్నాడు వాసు.
సరే, నువ్వింటికెళ్లు నేను చెప్తాను అని కొడుకుని పంపించి సూర్యనారాయణను ఒకసారి బయటకు రమ్మని పిలిచాడు.
"ఏం ఆచారి గారూ నాతో ఏదన్నా చెప్పాలా?" అన్నాడు..
"ఏం లేదండీ. తప్పు చెయ్యని అతనెవరో జైలుపాల-య్యాడు. అతనివద్ద పోయిన సొమ్మూ దొరకలేదు. పోలీసు విచారణ కొనసాగించమని చెబితే ఎలావుంటుంది?" అన్నాడు.
"వాడు చెయ్యని నేరం లేదుటండీ, ఈనాటికి పాపంపండి సీ సీ కెమారా పాత ఫుటేజుల్లో దొరికాడు.అప్పుడు చేసిన తప్పులన్నింటికీ ఇప్పుడు శిక్ష అనుభవిస్తాడులెండి. నాతో ఇంకేమన్నా చెప్పాలా"
"అవునండీ, ఇన్నాళ్లూ నిరుద్యోగిగా ఉన్న నాకొడుకు వాసు సమాజం మీద, దైవం మీద పెంచుకున్న ద్వేషం కారణంగా ఈ పొరపాటుకు పాల్పడ్డాడు. ఇప్పుడు చేసిన పనికి తీవ్రంగా పశ్చాత్తాప పడుతున్నాడు. ఆ అభయ-హస్తాన్ని తిరిగి స్వామివారికి అలంకరించేందుకు ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోండి. దీనికి ప్రాయశ్చిత్తంగా మీరేం చెయ్యమంటే అది చేయడానికి సిద్ధంగా వున్నాడు. ఆ పెరుమాళ్ళ సాక్షిగా" అంటూ దణ్ణం పెట్టి నిలబడ్డాడు సుదర్శనాచారి.
సూర్యనారాయణ నడుస్తున్నవాడల్లా ఆగి నిలబడిపో-యాడు. కొద్ది సేపు ఆలోచించి “ఎంతపని చేశాడండీ, చిన్నప్పటినుంచీ వాసు ఎంత బుద్దిగా వుండేవాడో నాకు తెలుసు. అతను సమ్యమనాన్ని కోల్పోయి చేసిన దుందుడుకు చర్య ఇది. ఒకపని చెయ్యండి వాసు కోరుకున్న ఉద్యోగం అతనికి వచ్చింది కాబట్టి అతని మొదటి జీతంతో స్వామివారికి అభయహస్తం చేయించి ఇమ్మనండి. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేనేలేదు" అన్నాడు.
సూర్యనారాయణను పెరుమాళ్లుగా భావించి నమస్కరిం-చాడు సుదర్శనాచారి.
..............సమాప్తం...........