సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్)

ఇది ప్రపంచమంతా కోట్లాది విద్యార్ధులు పట్టభద్రులయ్యే సమయం. కోట్ల మంది కళ్ళల్లో ఆశలూ, ఆశయాలూ తళతళలాడే సమయం. ఇది ప్రతి సంవత్సరం జరిగే పండగే ఐనా ఈ యేడు ఇది రెండు కారణాల వల్ల చాలా చాలా విచిత్రమైన పరిస్థితులలో జరుగుతున్నది.

మన మానవ విజ్ఞానం ప్రతి యేటా కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది. అలా జరగక పోతే మానవ సంస్కృతికే వన్నె తగ్గుతుంది. కానీ ఈ రోజుల్లో శక్తి పుంజుకుంటున్న కృత్రిమ మేధ (Artificial Intelligence) ఎవరికీ అంతు చిక్కని తోవలు తొక్కుతున్నది. కృత్రిమ మేధలో ప్రతిభలూ పట్టాలూ సంపాదించడం ఒక పక్కా, వాళ్ళకి ఎలాటి ఉద్యోగాలు దొరుకుతాయీ, అసలు ఉద్యోగాల స్వరూపమే ఎలా ఉంటుందీ అన్న భయాలు మరో పక్కా.  అవి ఎవరికీ అర్ధం కాని విషయాలౌతున్నాయి. పాతికేళ్ళ క్రితం అంతర్జాలం (internet) దినదిన ప్రవర్ధమానమౌతున్నప్పుడు, కూడా ఇటువంటి అనుమానాలూ భయాలూ ఉండేవి, కానీ అప్పుడు, దీని వలన మానవ జీవితం ఎంతో ఉత్కృష్టంగా పరిమళిస్తుందీ అన్న ఒక ఆశాభవం ఉండేది. చాలా విధాలుగా ఆ ఆశలు ఫలించాయి కూడా. ఈ రోజుల్లో ఉన్నట్లుగా దీనివలన మన జీవితం ఏమౌతుందీ, మన ప్రపంచం, మన నాగరికత ఏమౌతాయీ అన్న భయాలుండేవి కావు.   

అది అలా ఉండగా రాజకీయంగా ప్రపంచం ఎటువైపు పోతున్నదీ అన్న భయం మరో పక్క. దాదాపు గత ఎనభై ఏళ్ళుగా అంటే రెండో ప్రపంచ యుధ్ధం అంతమైనప్పటి నుంచీ ప్రపంచ చరిత్ర చూస్తే, శాంతి కాముకత పెరిగిందీ, బడుగు వర్గాల ఉధ్ధరణ చాలా జరిగింది. ఇదంతా ఒక రకగా 'శాంతి ప్రయోజనం' (Peace Dividend). దానికిప్పుడు చాలా ముప్పు వచ్చేటట్లున్నది. ఎటు చూచినా యుధ్ధ భేరీలు వినపడ్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అణిగిపోయేదెప్పుడూ 'చిన్న' వాడే. శక్తిమంతుల పై చెయ్యి ఇంకా శక్తిమంతమౌతుంది. శక్తిమంతులకీ బడుగు వాళ్లకీ మధ్య శతృత్వం కాకపోయినా వారి ఆధిక్యత ఎప్పుడూ ఉండేదే. కానీ సంఘంలో శాంతి ఉన్నప్పుడు, బడుగువాడు తన జీవితం ప్రశాంతంగా గడుపుకోగలడు. యుధ్ధకాలంలో 'భద్రత ' అన్న నెపంతో అందరినీ, అంటే బడుగు ప్రజలని, కాళ్ళ కింద తొక్కేయడం సులువు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల మధ్య జీవితంలో అడుగు పడ్తున్న పట్టభద్రులందరికీ ఆశీస్సులివ్వడం తప్ప చేయగలదేమిటో అర్ధం కావడంలేదు.

ఇక ఈ సంచికలో:

  • పొత్తూరి ఉమాదేవి గారు అమ్మని కాళిని కమ్మంటున్నారు
  • లక్ష్మీ శైలజ గారు 'వసంతం' లో బాధ్యతెవరిది, భార్యంటే గౌరవం లేని భర్తదా, కోడల్ని ఖాతరు చేయని అత్త మామలదా అని అడిగారు
  • పాణ్యం దత్తశర్మ గారి తృతీయం అద్వితీయం చదివితే, ఔరా భారతీయ న్యాయ వ్యవస్థ అంత గొప్పగా ఉన్నదా అన్న ఆశ్చర్యం కలుగుతుంది సుమా
  • మచ్చ విజేందర్ గారు 'కూరాడ పులిసిందిలో మనకి మామూలుగా తెలియని ఒక సాంఘిక వర్గం గురించి రాశారు.
  • విజయ శ్రీముఖి గారు 'ఆకాంక్ష' లో తానే ప్రకృతినైతే ఎంత బావుణ్ణు అన్నారు
  • యల్లనూరు వేంకట రమణా రెడ్డి గారు 'ఉత్తరాయణం' లో బాల్యన్నించీ తన ఊరూ, వాడా, దేశంలో జరిగిన మార్పుల గురించి విస్తృతంగా రాశారు.
  • అప్పరాజు నాగజ్యోతి గారు 'మనీషి లో తన కోపం ఆపుకోలేక అమ్మాయి జీవితాన్ని నాశనం చేద్దామనుకునే దౌర్భాగ్యుల గురించి రాశారు
  • చొక్కర తాతా రావు గారు మనిషెంత 'బిజీ' ఐపోయాడూ అని వాపోయారు 'నాకొక మనిషి కావాలి' లో
  • రాచమళ్ళ ఉపేందర్ గారు నాన్నని తలచుకుని 'తియ్యటి కన్నీళ్ళు' కార్చారు.

0 Comments