మనీషి  (Author: అప్పరాజు నాగజ్యోతి)

“ ఏమండీ, వీడు... వీడసలు మన కొడుకేనా?“

ఆవేశంతో రొప్పుతూ సోఫాలో ఒక ప్రక్కకి వొరిగిపోతున్న అపర్ణని పొదివి పట్టుకుని లోనికి తీసుకెళ్ళి బీపీ మాత్ర ఇచ్చి తిరిగి హాల్లోకి వచ్చాను.

తల్లినుండి అటువంటి ప్రతిస్పందనని ఊహించలేదేమో, బిత్తరపోయినట్టుగా నిలుచున్న రిత్విక్ ని చూస్తే జాలేసి దగ్గరకి రమ్మన్నట్లుగా చేత్తో పిలిచాను.

గభాల్న వచ్చి రెండు చేతులతో నన్ను చుట్టేసి నా భుజానికి తలని ఆనించాడు. ఓదార్పుగా వాడి వెన్ను నిమురుతూ వుండిపోయాను.

రెండు క్షణాల తర్వాత“ నాన్నా, అమ్మేంటి ఇంత చిన్నవిషయానికే అంతలా కోప్పడుతోంది? నిజానికి నేను చేసిందాంట్లో తప్పేముందనీ?“ అన్న రిత్విక్ మాటలకి, కాసేపటి ముందర వాడిపై కలిగిన జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది!

‘ఇంత చిన్నవిషయానికే‘ అన్న వాడి పదప్రయోగానికి నా ఒళ్ళంతా భగభగమండగా, కళ్ళెరచేస్తూ“ నీనోటి నుండి మరొక్క మాట వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, పోరా వెధవా“ అంటూ వాడ్ని దూరంగా నెట్టేసాను!

నాకోపానికి బెదిరిపోయాడు రిత్విక్. వాడి బిక్కమొహం చూసాక, తమాయించుకుని“ నీతప్పేమిటో నీకు తెలియాలంటే ముందుగా నువ్వొక కథ వినాలి“ అంటూ ఇన్నేళ్ళుగా వాడికి తెలీని మా జీవిత రహస్యాన్ని ఈవేళ వాడి ముందు తెరిచాను.

***

అవి ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు.

మూడవసంవత్సరంలో వుండగా ఆ ఏడాదే యూనివర్సిటీలో చేరిన అపర్ణని చూసిన క్షణమే ఆమెపై మనసు పారేసుకుని, ఆమే నా జీవితభాగస్వామి అని నిశ్చయించుకున్నాను.

తెల్లటి తెలుపు, ముట్టుకుంటే కందిపోతాయేమో అన్నట్లున్న నున్నటి బుగ్గలు, కనీకనిపించని సన్నటి నడుము, త్రాచుపాములాంటి పొడవైనజడతో అప్సరసలా వుండే అపర్ణని ప్రేమిస్తున్నామంటూ మా కాలేజీ అబ్బాయిల్లో ముప్పాతికమందిదాకా ఆమె వెనకాల పిచ్చాళ్ళలా తిరిగారు. అయితే, తన కంటిచూపుతోనే వాళ్ళందరినీ ఆమడదూరంలో నిలిపేసిన అపర్ణ, నా ఒక్కడితో మాత్రం చనువుగా వుండేది. బహుశా తొలిచూపులోనే తనపట్ల నాలో ఉదయించిన ప్రేమభావమే తనలోనూ కలిగిందేమో!

చదువులో తన సందేహాలని తీర్చుకునేందుకు తరచుగా నా వద్దకి వస్తుండేది అపర్ణ. ఆ క్రమంలో మా ఇద్దరిమధ్యా స్నేహం పెరిగింది. దానికి తోడు సాహిత్యంపట్ల మా ఇద్దరికీ ఉన్న అభిరుచి మమ్మల్ని మానసికంగా మరింత దగ్గర చేసింది. అలా మాస్నేహం కాస్తా గాఢమైన ప్రేమగా మారేందుకు ఎంతోకాలం పట్టలేదు. అయితే సాంప్రదాయంపైనున్న గౌరవంతో మేమెన్నడూ హద్దులు దాటలేదు. చదువులు పూర్తయాక ఇంట్లో పెద్దవాళ్లకి చెప్పి వాళ్ళ అంగీకారంతోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము.

ఇంజనీరింగ్పూర్తయాక చెన్నై ఐఐటిలో ఎంటెక్‍లో చేరాను. భౌతికంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వున్నా టెక్నాలజీ పుణ్యాన ఇద్దరం దగ్గరగానే ఉన్నాము. గంటగంటకీ ఈమెయిళ్ళు, వాట్సప్ మెసేజులూ పంపుకున్నా రోజుకి ఒక్కమారైనా ఫోనులో ఒకరి గొంతు ఒకరం వినకపోతే మాకస్సలు తోచేది కాదు. ప్రేమలో ఉన్న ఏ జంటకైనా ఆ స్థితి సహజమేగా!

ఎంటెక్ పూర్తయాక చెన్నైలోనే ఉద్యోగం రావడంతో వెంటనే చేరిపోయాను. అప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ కంపెనీలో అపర్ణ సెలక్టయింది.

ఆర్ధికస్వాతంత్ర్యం ఇచ్చిన ధీమాతో మా ప్రేమవిషయం మా ఇళ్ళల్లో చెప్పేసాం!

కులాలు ఒక్కటే కావడంవలనా, హోదాల్లోనూ, ఆస్థిఅంతస్తుల్లోనూ యిరుకుటుంబాలూ ఒకేస్థాయిలో వుండడంమూలానా అన్ని ప్రేమకథల్లా కాకుండా మాప్రేమకి మా పెద్దలనుండి ఏ విధమైన అభ్యంతరాలూ రాలేదు.

‘ అంతా మా అదృష్టం, పూర్వజన్మ సుకృతం ‘ అనుకుని మురిసిపోతుండగానే విరాజ్ రూపంలో వచ్చిన అనుకోని విపత్తు మా ఇరువురి జీవితాలనీ అతలాకుతలం చేసేసింది!

***

అత్యంతదురదృష్టకరమైన ఆ రోజు....

మానిశ్చితార్థానికి కావలసిన ఉంగరాలని ఎంపిక చేసుకునేందుకుగానూ నేనూ, అపర్ణా కలిసి కార్లో బయల్దేరాము.

‘నిశ్చితార్థమయాక నీతో కలిసి చిన్నతిరుపతికి వస్తానని మ్రొక్కుకున్నాను. వచ్చే శనివారం నీకు కుదురుతుంది కదూ ‘ అన్న అపర్ణ అభ్యర్థనకి ‘ దేవీగారి ఆజ్ఞ. నీ మాటెన్నడైనా కాదన్నానా అప్పూ‘ అంటూ ప్రేమగా తన చేయి నొక్కాను.

‘ థ్యాంక్యూ శరత్ ‘ అంటూ నాకు దగ్గరగా జరిగి నా భుజంపై తలానించింది అపర్ణ.

ఈలోగా ఎర్రలైట్ పడడంతో కారాపాను.

కాళ్ళు లేని అవిటిబిచ్చగాడు చక్రాలపీటపైన కూర్చుని అడుక్కుండడాన్ని చూసి నా హృదయం ద్రవించిపోగా“ డ్యాష్ బోర్డులో డబ్బులుంటాయి, తీసివ్వు అప్పూ“ అని నేనంటుండగానే తన పర్సులోనుండి ఇరవైరూపాయల నోటుని తీసి ఆ బిచ్చగాడి చేతికి అపర్ణ అందిస్తుండగా జరిగిపోయిందా దారుణం!

ఏం జరిగిందో నేనర్థంచేసుకునేలోగానే, తెరిచిన కారు కిటికీలోనుండీ విసురుగా అపర్ణ మొహంపై ఆసిడ్‍ని పోసేసి బైకుపై వేగంగా పారిపోయాడు ఎవరో దుర్మార్గుడు!

‘అమ్మా’ అంటూ అపర్ణ నోటినుండి వెలువడిన ఆర్తనాదానికి నా గుండెలవిసిపోయాయి. బాధతో విలవిలలాడుతున్న తనని ఓదారుస్తూ అతికష్టంపై కారుని ఆస్పత్రిదాకా డ్రైవ్ చేసాను.

విషయం తెలుస్తూనే అంతా ఆస్పత్రికి పరిగెత్తుకొచ్చారు.

ఈ దారుణానికి కారకులెవరో అక్కడ అపర్ణ స్నేహితురాళ్ళ మాటల్లోతెలిసింది.

నేను చెన్నైకి వెళ్ళిన తర్వాత విరాజ్ అనే జూనియర్ కుర్రాడొకడు యూనివర్సిటీలో అపర్ణ వెనకాలే తిరిగేవాడట. తనకంటే చిన్నవాడైన అతన్ని తమ్ముడిలా భావించిన అపర్ణఅతనితోస్నేహంగా ఉండేదట. సోదరుడిలా భావించిన విరాజ్ ఉన్నట్లుండి ఒకరోజు తనని ప్రేమిస్తున్నానంటూ వాలెంటైన్‍కార్డునీ, ఎర్రగులాబీనీ చేతిలో పెట్టడంతో షాకయిన అపర్ణ, అతని రెండు చెంపలపైనా వాతలు తేలేట్టు కొట్టిందట.

ఆ సంఘటన తర్వాత అపర్ణ విరాజ్‍ని తప్పించుకుని తిరిగినా అతడుమాత్రం ఆమెని వదిలిపెట్టలేదు. చివరకి ఆమెకి నిశ్చితార్థం జరగబోతోందని తెలిసాక తనకి దక్కని ఆమెని మరెవ్వరికీ దక్కనివ్వనంటూ అందరిముందూ బెదిరించాడట. అయితే అపర్ణ దాన్ని పెద్దగా ఖాతరు చేయలేదు. ఏదో ఉక్రోశంలో అంటున్న మాటలుగా భావించి వదిలేసింది.

ఇవన్నీ విని నేను చాలా బాధపడ్డాను.

మొహంపై ఆసిడ్ బుసబుసమంటూ పొంగుతున్నప్పుడు బాధతో అపర్ణ మెలికలు తిరగడం గుర్తుకొచ్చి మనసంతా కలిచివేసింది. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన విరాజ్‍ని తలుచుకుంటేనే నా రక్తం సలసలకాగిపోతోంది.

పోలీస్ డిపార్టుమెంటులో డిఎస్పిగా ఉన్న నా స్నేహితుడి నాన్నకి ఫోను చేసి విషయమంతా చెప్పగా, వెంటనే రంగంలోకి దిగి వారంరోజుల్లో విరాజ్‍ని పట్టుకుని సెల్లో వేయించి పకడ్బందిగా ఎఫ్ఐఆర్ వ్రాయించారాయన. అప్పటికిగానీ నామనసు శాంతించలేదు.

***

ప్రాణాపాయంనుండైతే బైటపడిందిగానీ, చెంపపై ఆసిడ్ పడినంతమేరా అపర్ణముఖం వికారంగా మారింది. కాస్మెటిక్ శస్త్రచికిత్సలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

నాలుగురోజుల వరకూ ఏసమస్యా రాలేదు కానీ, ఆ తర్వాత ఒకమారు అనుకోకుండా అద్దంలో అపర్ణ తన మొహాన్ని చూసుకోవడం జరిగింది.

అంతే, గుండెలవిసేలా పెద్దగా కేకలు పెట్టింది!

అంతా హడలిపోయాము. డాక్టర్లు పరిగెత్తుకొచ్చారు. చివరకి ఆరోజు అపర్ణకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి నిద్రబుచ్చవలసి వచ్చింది.

ఆపైన అపర్ణ సరిగా నిద్రపోయిన రాత్రే లేదు. ఏ క్షణమో చిన్నపాటి కునుకు తీసేది, అంతలోనే గభాల్న పెద్దగా కేకలేస్తూ ప్రక్కనే ఏ వస్తువుంటే దాంతో తనని తాను గాయపరుచుకునేది. ఇరవైనాలుగ్గంటలూ తనని ఎవరో ఒకరు కాచుకుని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండుమార్లు ఆత్మహత్యాప్రయత్నాలు చేసింది. సమయానికి నేను అక్కడే వుండడంవలన తనని కాపాడుకోగలిగాను.

మానసికంగా క్రుంగిపోయిన అపర్ణని చూస్తుంటే నాకు గుండెలు పిండేసినట్లుగా అయి ఓదార్చేందుకు తన దగ్గరకి వెళ్తే, మరోవేపుకిమొహం త్రిప్పేసుకుని ‘ నా దగ్గరకి రావొద్దు, వెళ్ళిపో ‘ అంటూ బలంగా నన్ను త్రోసేసేది.

యిలా రెండుమార్లు జరిగేటప్పటికి, ఆమె మానసికస్థితి కుదుటపడేదాకా ఆమెవద్దకి వెళ్ళొద్దని నన్ను హెచ్చరించి, ఆ పైన అపర్ణకి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలెట్టారు డాక్టర్లు.

జరుగుతున్న పరిణామాలకి ప్రేక్షకుడిలా ఉండిపోవలసిరావడంతో వేదనకి గురైన నాకు, వీటన్నింటిని మించిన మరో షాక్ అమ్మానాన్నలనుండి ఎదురైంది.

“నిశ్చితార్థం జరగకపోవడం మంచిదైంది. లేదంటే ఖాయమైన సంబంధాన్ని రద్దు చేసామన్న చెడ్డపేరు మనకుటుంబానికి ఆపాదించేవారంతా“

“నిజమేనండీ, మనవాడి తలరాత బావుంది కాబట్టి బ్రతికిపోయాం. అదే పెళ్లితర్వాత ఇలా జరిగుంటే, ఆ వికృతరూపాన్ని వాడు జీవితాంతం భరించవలసివచ్చేది“

అమ్మానాన్నల మాటలని వినలేక రెండు చెవులూ గట్టిగా మూసేసుకున్నాను.

కోపాన్ని ఆపుకోలేక గట్టిగా అరిచేసాను.

“మీరసలు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తోందా? నేనూ, అపర్ణ నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటూ ప్రాణంలా మసలుకున్నాం. అలాంటిది, ఈవేళ తనకి ఆక్సిడెంట్ జరిగింది కదాని ఇన్నేళ్ళ మా ప్రేమని మరిచిపోతానని మీరెలా అనుకున్నారు?“

వినకూడని మాటలు వింటున్నట్లుగా మొహం పెట్టారు అమ్మా, నాన్న!

కొద్ది క్షణాల తర్వాత మెల్లిగా అమ్మ“అది కాదురా కన్నా, మేము నీ మంచికోరే చెబుతున్నా....” అంటుంటే“ చాల్లే ఊరుకో అమ్మా, ఆడదానివైవుండీనిస్సహాయస్థితిలో వున్నయువతికి అండగా నిలబడవలసిందిపోయి యిలా ఆలోచించడం నీకు సిగ్గుగా అనిపించడం లేదూ? ఇదే నీ కూతురికి జరిగితే ఇలాగే మాట్లాడేదానివా?“ అన్నాను.

అమ్మ ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోవడంతో నాన్న అందుకున్నారు.

“ నువ్వెన్నైనా చెప్పరా శరత్, ఆ పిల్లని ఈ ఇంటికోడలిగా మేము సుతరామూ ఒప్పుకోము. నీకు ఆ పిల్ల కావాలో, మేము కావాలో తేల్చుకో“

నిష్కర్ష్యగా చెప్పిన నాన్నవేపు ఏహ్యంగా చూసి, అమ్మ వారిస్తున్నా వెనుతిరిగి చూడకుండా యింటినుండీ శాశ్వతంగా బైటికొచ్చేసా!

నేరుగావెళ్లి అపర్ణ అమ్మానాన్నలతో మాట్లాడి, ఆపైన మూడుమాసాల్లో, అపర్ణని ఒప్పించి రిజిస్టరువివాహం చేసుకుని నాతోపాటు చెన్నైకి తీసుకొచ్చేసాను.

***

అందరికీ దూరంగా వచ్చేస్తే అపర్ణలో మార్పు వస్తుందనీ, ఇద్దరం కలిసి కొత్తజీవితాన్ని మొదలెట్టొచ్చనీ ఆశించాను.

కానీ ఆమెలో అదే నిరాశ, అదే అనాసక్తత, అదే ఉదాసీనత!

అపర్ణని అలా చూస్తుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంటోంది.

అయితే అనుకోకుండా ఒకరోజు....

ఇంట్లో నుండే అమెరికాలోని నా క్లైంట్ రాబర్ట్ తో మీటింగులో ఉండగా, టేబుల్‍ పై కాఫీకప్పుని పెట్టేసి వెనుతిరుగుతున్న అపర్ణ నుదిటికి నా చేయి తగిలింది. దాంతో, ఆమె మొహాన్నిఎప్పుడూ సగం పైగా కప్పేస్తూ వుండే శాలువా అకస్మాత్తుగా జారిపోయింది. నేలపై పడిన శాలువాని నేను వంగి తీసిస్తే దాన్నందుకుని మౌనంగా లోనికి వెళ్ళిపోయింది అపర్ణ.

ఇదంతా చూస్తున్న రాబర్ట్, మీటింగుని ముగించేముందు నాతో అన్న ఒకే ఒక్క మాట“ వై డోంట్ యు షో హర్ టు ఎ బెస్ట్ కాస్మెటిక్ సర్జన్ హియర్ ఇన్ యుఎస్“ అని!

అంతవరకూ ఆ ఆలోచనే రానందుకు నన్ను నేను బాగా తిట్టుకున్నాను.

ఆ తర్వాత, మా కంపెనీని ఒప్పించి ప్రాజెక్టుపనిపై అపర్ణతోసహా అమెరికాకి వెళ్లి అక్కడ అత్యంత ఆధునిక సదుపాయాలున్నఆస్పత్రిలో చేర్పించి అపర్ణకి కాస్మో ట్రీట్మెంట్‍నిప్పించి దాదాపు తన ముఖాన్ని మునుపటి రూపుకి తెచ్చేందుకుగానూ ఆరునెలలు పట్టింది. ఆ సమయంలో మా వెన్నంటే వుండి రాబర్టు చేసిన సాయాన్నీ, మాగుండెల్లో అతను నింపిన ధైర్యాన్నీ నేనూ, అపర్ణా ఎన్నటికీ మర్చిపోలేము.

ఇండియాలోలా ఇక్కడ ఎవ్వరూ తన వేపు గుచ్చిగుచ్చి చూడడమూ, ఆరాలు తీయడమూ చేయకపోవడంవలన అపర్ణ మనసుకి ప్రశాంతత దొరికింది. దాంతో యిక ఇండియాకి తిరిగి వెళ్ళే ఆలోచన చేయకుండా అమెరికాలోనే స్థిరపడిపోయాము. అపర్ణ కూడా ఇక్కడే ఉద్యోగంలో చేరిపోయింది.

***

“ నేనిప్పుడు చెప్పిందంతా కథ కాదనీ, మా జీవితంలో జరిగిన యధార్థసంఘటనేననీ ఈపాటికి నీకర్థమయే వుంటుంది రిత్విక్. యిప్పుడు చెప్పు, ముప్పైఏళ్ళ క్రితం తానున్న పరిస్థితుల్లోనే ఇప్పుడు తనకి కాబోయే కోడలుందనీ, అటువంటి విపత్కరపరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఆసరాగా నిలబడవలసిన తన కొడుకు ఆమెని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చేసాడనీ తెలిసాక, ఒక స్త్రీగా మీ అమ్మ అలాకాక ఇంకెలా మాట్లాడగలదు?“

రిత్విక్ నోరు విప్పలేదు. మౌనంగా తలొంచుకునే కూర్చున్నాడు.

“ అయినా, ఆ అమ్మాయిని అయిదేళ్లనుండి గాఢంగా ప్రేమిస్తున్నవాడివి ఒక్కక్షణంలో అంత ప్రేమనీ ఎలా త్రుంచేసుకోగలిగావురా? పైగా నీది చాలా సున్నితమైన మనస్సనీ, అందవిహీనంగా మారిన హాసిని ముఖాన్ని చూడలేననీ చెబుతూ నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. సున్నితత్వం అంటే ఎదుటివారి కష్టాలకి స్పందించడం, చేతనైనంత సాయాన్ని వారికందించడం. అంతేకానీ ఇలా పిరికిపందలా బాధ్యతలనుండీ, బంధాలనుండీ తప్పించుకుని దూరంగా పారిపోవడం కాదు. ఒక్క మాట చెప్పరా, నువ్వూ, హాసిని కలిసే ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తుంటారు కదా, మరి ప్రమాదవశాత్తూ పొంగిన ఆ ద్రావకం హాసినిపై కాకుండా నీ శరీరంపైన పడుంటే, ఆ ప్రమాదం నీకే జరిగుంటే హాసిని కూడా నీలాగే నిన్నూ, నీప్రేమనీ గాలికొదిలేసి తన దారి తాను చూసుకునేదా?“

నేనడిగినదానికి చలించిపోయిన రిత్విక్తనకి తనే చెప్పుకుంటున్నట్లుగా మాట్లాడసాగాడు.

“ లేదు లేదు, హాసిని ఎన్నటికీ అలా చేయదు. తనెంతో సేవాభావంతో వుండే అమృతమూర్తి. ప్రతీవారం ఆసుపత్రులకి వెళ్లి అక్కడ క్యాన్సర్ రోగులకి తన చేతులతో స్వయంగా తినిపిస్తుంది, అందరూ బాగుండాలంటూ నిత్యం దేవుడ్ని ప్రార్థిస్తుంటుంది! అలాంటి హాసిని విషయంలో నేను చేసింది నిజంగా క్షమార్హం కాదు. నేనిప్పుడే తన దగ్గరకి వెళ్తాను“

మనసులో మాలిన్యాన్నంతా కడిగేస్తున్నట్లుగా మొహాన్ని తడిపేస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ వడివడిగా బైటకెళ్ళబోయాడు రిత్విక్.

అది చూసి, హాల్లోకి ఎప్పుడొచ్చిందోగానీ“ ఉండు నాన్నా, మేమూ నీతో వస్తాము“ అంటూ గబగబా చెప్పులేసుకుంది అపర్ణ.

తలెత్తి చూసేందుకు సిగ్గుపడ్తున్న కొడుకు చుబుకాన్ని పైకెత్తి అతని కన్నీళ్ళని తుడుస్తూ ‘చూడు నాన్నా, తప్పులు చేయడం మానవసహజం. అయితే చేసింది తప్పని తెలుసుకున్న వెంటనే దాన్ని సరిదిద్దుకునే మనిషికి తలదించుకోవలసిన అవసరం లేదు ’ అన్న అపర్ణ మాటలకి ‘ నన్ను క్షమించమ్మా‘ అంటూ ఆమెని తన రెండుచేతులతో చుట్టేసాడు రిత్విక్.

నిజమే, తప్పు చేసినవాడు మనిషైతే, ఆ తప్పుని సరిదిద్దుకునేవాడు మనీషి!!!

0 Comments