ఆకాంక్ష
ఆకాంక్ష (Author: ఎమ్. విజయశ్రీముఖి)
బిందువునై ఉద్భవించాను
సింధువునై విస్తరించాలని
పరిమాణం ఎంతన్నది కాదు ప్రశ్న
పరిమళంలా వ్యాపించాలని!
నేలపై ఉన్న నేను నింగికెదగాలని
నిర్లిప్తపు నిశీధిని తరమాలని
నేనో నెలవంకగా మారాలనీ
వసుధను వెన్నెలతో నింపాలని!
కనీసం...
చిన్న చుక్కల్లోనైనా ఒక లెక్కనై
చిరు కాంతినవ్వాలనీ.. జనావళికివ్వాలని!
వానకారు కోయిలనై కూయాలని
వానతో కలసి కురవాలనీ
విత్తనంతో నేను పొత్తుకలిసి
మొక్కనై చెట్టునై మానునై
ఆకలి తీర్చాలని, నీడనివ్వాలనీ..సేదతీర్చాలనీ!
మనిషి నైనందుకు మనసున్నందున
మానవత్వం, మమకారం మదినిండుగ
నింపుకోవాలని, నిలుపుకోవాలని
ప్రయాస?... కాదిది...ప్రయత్నం!
తుదకు...
జీవన మార్గం జటిలమైనా
జన్మంతా శాంతికై జపమైనా
జీవన్ముక్తి పొందాలని
జన్మరాహిత్యం చెందాలని
ఈ కట్టెనొదిలే ముందు
నాకున్న ఒకే ఒక కాంక్ష...
చిట్ట చివరి ఆకాంక్ష!
<><><>