సంక్రాంతి హేల
సంక్రాంతి హేల
చలి పులిని తరిమికొడుతూ
తిమిరంతో సమరం చేస్తూ
భోగిమంటల కోలాహలంతో
దినకరుడిని మేలు కొలుపుతూ అడుగిడింది సంక్రాంతి లక్ష్మి
తెలి మంచు చీల్చుకుని బద్దకంతో ఒళ్ళు విరుస్తున్న
భానుడికి స్వాగతం పలుకుతూ ఇంటి ముంగిట తీర్చిదిద్దిన
రంగు రంగుల రంగవల్లికలు
గౌరమ్మకు ప్రతీకగా మధ్యన గొబ్బిళ్ళు
"హరిలో రంగ హరీ "అంటూ హరినామ సంకీర్తనతో
పల్లెను మేల్కొల్పుతున్న హరిదాసు
డూ డూ బసవన్నల సన్నాయి రాగాలు
పండుగ సందడిని పరవశంతో మోసుకొస్తున్న పిల్ల తెమ్మెరలు
పెరట్లో అరిసెలు వండడానికి
కొత్త బియ్యం దంపుతూ మగువల ముచ్చట్ల
సంబరాల సందడి
డాబా మీద పతంగుల పోటీలతో
కుర్రకారు కేరింతల హోరు కోడిపందాల జోరుతో
కోలాహలం సంతరించుకున్న ఊరు
వరండా వాలు కుర్చీలో
మీసాల చాటు సంబరాన్ని దాచుకుంటూ
గాంభీర్యం నటిస్తున్న నాన్న
ఆప్యాయత అనురాగాలను కలగలుపుతూ
కమ్మని వంటలు చేస్తున్న అమ్మ
పిండి వంటలతో విందు భోజనాల మధ్య సరదా కబుర్లు
కొత్తగా పెళ్లయిన అక్కా బావల సరస సల్లాపాలు
సాయంకాలం చిన్నారులకు దిష్టి తీసి భోగి పళ్ళ పేరంటం
అటక మీది పాత బొమ్మలను దింపి
కొత్తగా కొన్న సీతారాముల బొమ్మను చేర్చి
సంస్కృతికి అద్దం పడుతూ
తీర్చిదిద్దిన బొమ్మల కొలువు
పట్టు చీరల రెపరెపలతో చేతినిండా గాజుల గలగలలతో
మగువల పేరంటాల హడావిడి
పల్లె ముంగిట్లో పసందైన సంక్రాంతి సందడి
పక్షుల కోసం ఇంటి ముంగిట కట్టిన జొన్న కంకులు
పశువులను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు
చేతి కందిన పంటతో సంతృప్తి నిండిన గుండెతో
రైతు ఇంట సంక్రాంతి హేల!
Telugu Jyothi Ugadi 2024
2024-26 తెలుగు కళా సమితి కార్యవర్గం (మా సమాచారం)
అధ్యక్షుని కలం నుండి… (TFAS అధ్యక్షుని సందేశం)
New York Life Insurance (Advertisement)
2022-2024 TFAS కార్యవర్గ విజయాలు (మా సమాచారం)
బాపు, రమణలతో నా తీపి గురుతులు... (కథలు)
Free health camp by TFAS for Edison community (TFAS కార్యక్రమాలు)
కొత్త చేతులు మొలకెత్తాలి (కవితలు)
వృద్ధాప్యం ఎంత దయలేని దండనో (కవితలు)