కూరాడు పులిసింది  (Author: మచ్చ విజేందర్)

ఇద్దరక్క సెల్లెండ్ల ఉయ్యాలో

ఒక్కూరికిచ్చెనే ఉయ్యాలో

ఒక్కడే మాయన్న ఉయ్యాలో

చూసన్న పోడాయె ఉయ్యాలో

చూసిపోదామంటె ఉయ్యాలో

యేరడ్డామాయె ఉయ్యాలో…

అని పెత్తరమాసనాడు అమ్మలక్కలంతా ఊరి బొడ్రాయికాడ చేరి అందమైన రాగం ఎత్తుకొని పాడుతున్నరు. రంగురంగుల పూలతో రమ్యంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ ఎత్తుకున్న రాగాన్ని లయతప్పకుండా మోసుకెల్తున్నరు. సృష్టిలో ఎంత మనోహరమైన దృశ్యమో. సాయంత్రంపూట నెమళ్ళన్నీ వీధి దీపాలు కింద నాట్యమాడుతున్నట్లే ఉన్నది.

పిల్లలంతా వాళ్ళవాళ్ళ ఆటల్లో మునిగివున్నరు. పెద్దలంతా చుట్టూ నిలబడి ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ చెవులకు తేనెసోకునంత ఇంపైన ఆ పాటలను వింటూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మురిసిపోతున్నరు.

వరమ్మ అక్కడే కొంచెం దూరంగా ఉన్న సిమెంటు బల్ల మీద కూర్చొని ఉన్నది. అందరి ఆడకూతుళ్ళను చూడగానే తన కూతురు ప్రమీల కండ్లల్ల కనపడ్డది. ఒక్కసారే గుండె గుభెల్లుమన్నది. దుఃఖం పొంగుకొచ్చింది. కండ్లల్ల నీళ్ళు సుడులు సుడులుగా తిరిగినయ్. నడుముకు చుట్టుకున్న కొంగు తీసి కండ్ల నీళ్ళు తుడుచుకున్నా తల్లీ కూతుళ్ళను ఎడబాపిన నెల కిందటి జ్ఞాపకాలు సుడులు సుడులుగా మనసుల తిరుగుతనే ఉన్నయి.

అది వానకాలం. భూమి నల్లదుప్పటి కప్పుకున్నట్లుగా ఉండ్రాళ్ళ చవితి ముందు అమావాస్య చీకటి చిక్కగా పరుచుకున్నది. బంగాళాఖాతంలో వాయుగుంం వల్ల మబ్బు తూట్లు పడ్డట్టే ఎడతెరిపి లేకుండా ముసురుపట్టి కారుతున్నది. వాన చప్పుడూ, అక్కడక్కడా పిడుగు పడిన శబ్దం తప్ప ఇండ్లల్లో ఉన్నవాళ్ళకు ఇంకేమీ వినిపించడం లేదు. చలికి ఎవరింట్లో వాళ్ళు పిట్ట పిల్లల్లాగా ముడుచుకొని పడుకున్నరు. తెల్లవారుజాము కావస్తున్నది.

వరమ్మ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నవి. అయ్యను అవ్వను తలచుకొంటూ శోకంపెట్టి పెద్దగా ఏడుస్తున్నది. తెల్లవారుతుండడంతో మబ్బులు మెల్లమెల్లగా విడిపోయి వర్షం తగ్గుముఖం పడుతున్నది. వరమ్మ ఏడుపు పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు కూతగా కొంచెం కొంచెం వినపడుతున్నది. మెల్లగా ఒక్కొక్కరు గొడుగులు పట్టుకొని వరమ్మ ఇంటి ముందు గుమిగూడారు. "ఏమైందే వరమ్మా..! ఎందుకేడుత్తానవ్..." అని ఒక పెద్దామె అడిగింది.

"దొంగలే అవ్వా దొంగలు." అని బోసిపోయిన తన మెడను చేతులను కాళ్లను చెవులనూ ఏడుస్తూనే  చూపించింది. వరమ్మ ఇంట్ల దొంగలు పడ్డారనే విషయం అందరికీ అర్ధమైంది. ఎట్లైందీ, ఏం జరుగిందని ఒక్కొక్కరు అడిగి తెలుసుకుంటున్నరు వరమ్మను ఓదారుస్తూనే.

అంతలోనే "అవ్వా ఏమైందే..." అనుకుంట ఆగమాగంతోని వరమ్మ పెద్దకొడుకు రమణయ్య అక్కడికి వచ్చిండు. వరమ్మ ఇంకా వివరించి చెప్పే పరిస్థితిలో లేదు. ఏడుస్తూనే ఉన్నది. అక్కడున్నవాళ్ళనే అడిగి తెలుసుకున్నడు. "పోతే పోయింది తియ్. ఎవనికి బాకీ ఉంటె వానికే అయితది. ఇంక నయం. వాళ్ళు కత్తి సూపెట్టి సొమ్ము గుంజుకున్నరు. నిన్నైతె ఏమనలేదు. ఈడికింతే సాలు. మన గాచారం మంచిగున్నదనుకోవాలె." అని తల్లిని సముదాయించుకుంట అన్నడు. పెద్ద కోడలు అటువైపే రాలేదు. చిన్న కొడుకు చిన్న కోడలుకు జ్వరమొచ్చిందని పట్నం ప్రైవేటు దావాఖానల చేర్పించి అక్కడనే ఉన్నడు. కోడలు ఎట్లున్నదో అనే రంది ఓ దిక్కైతే ఇప్పుడు ఇంకో రంది మోపైంది వరమ్మకు.

"పాపం ముసల్ది కాయకష్టం జేసుకొని, తినక తాగక పైసకు పైస కూడబెట్టుకొని ఇంత సొమ్ము జేయించుకొని పెయి మీద ఏసుకున్నది. ఉన్నంత కాలం ఉంచుకుంట అటెంక నా బిడ్డకయితదని అందరితోటి శెప్పుకునేది. దొంగలు పాడుగాను మాయిల్లమే దోసుకపోయిరి. ఈ నడుమ దొంగలు బాగ తిరుగుతాండ్రు పైలంగుడాలె." అనుకుంట అందరూ అక్కడి నుండి కదిలిపోయిండ్రు.

మధ్యాహ్నం వరకల్లా కూతురు ప్రమీల గుడ్ల నీళ్ళు తీసుకుంట వరమ్మ ఇంటికి రానే వచ్చింది. ఎట్లున్నవు ఏమైందని అడగకుండనే... "నిమ్మలమైందా ఇగ. ఉన్న సొమ్ము దొంగల పాలు జేత్తివి. ఎప్పటికైనా నాకేనాయె ఇయ్యిమని ఎంతడిగినా ఇయ్యకపోతివి. ఉన్నది నాశినం జేత్తివి. మొండి శేతులు ముందటేసుకొని కూసుంటివి. రేపు నువ్వు సత్తె వట్టిగనే అయితదా. అంతమందమన్న ముట్టజెప్పక పోతివి. పెండ్లినాడు ఏం లేదని అడ్డమైనోనికి అట్టిగనే దారపోత్తివి. నీ అల్లుడు ఏమంటడో ఇప్పుడు. ఇగ అవ్వగారిల్లు తొక్కనిత్తడో లేదో." అని కోపంతోని కలగలిసిన బాధతో తల్లి మీద ఎట్లబడుతె అట్లనే నోటికచ్చినట్టు అరిచింది ప్రమీల.

ఆ మాటలు వినగానే వరమ్మ గుండెలు పగిలిపోయినయ్. "ఇల్లు కాలి ఒగడేడుత్తే సుట్ట నిప్పు అడిగిండట ఇంకెవడో. సొమ్ము పోయి నా రందిల నేనుంటే నడుమ నీ లొల్లేందే. తోల్తెనే రారాదు లేకుంటె లేదు. ఈడేమన్న పాశిపోతాందా మురిగిపోతాందా." అని కూతురని చూడకుండానే ఆవేశంతోని కొట్టిపారేసినట్టే మాట్లాడింది వరమ్మ.

"గట్లంటానవేందే... పెండ్లైన కాడికెల్లి ఆయిమనంగ ఓ శీరె బెట్టినవా రైకె బెట్టిందానివా. నువ్వింతకు, నీ కోడండ్లంతకు ఏరుక తినేటోళ్ళేనాయె. నా రాతే ఇట్ల పాడుగావచ్చు. ఇంకేమున్నది రాను. అయ్య ఏనాడో పాయె. అవ్వవు ఉన్నా లేనట్టే మాట్లాడబడ్తివి. ఇగ నీ ఇంట్ల అడుగుబెడ్తె సూడు." అని ఏడ్సుకుంటనే కోపంతోని అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రమీల.

కోపంలో అననైతే అన్నది కానీ అటెంక బిడ్డె మీదికే పాణం గుంజబట్టింది వరమ్మకు. ఆనాటి నుంచి సొమ్ము పోయిన బాధ కంటే కూతురు మీదనే రంది ఎక్కువైంది. ఆ బాధను మరిచిపోదామని బొడ్రాయి కాడికి వచ్చినా పండుగ రూపంలో ఆ సంఘటన మనసును తొలుస్తూనే ఉన్నది.

అప్పటికే ఆడిపాడి అలసిపోయి ఆడపడుచులంతా ఎవరింటికి వాళ్ళు పోతున్నరు. "ఓ వరమ్మా..! ఏమాలోచన జేత్తానవ్. ఇగపటు బతుకమ్మ పలారం." అని ఎవరో పిలిచి సత్తుముద్ద చేతిలపెట్టి వెళ్ళిపోయిండ్రు. అప్పుడు   బిడ్డలోకంల నుండి బయటకు వచ్చింది వరమ్మ. చుట్టూ చూసింది. "అరె శాన పొద్దు పోయింది గద." అనుకుంట ఇంటికి నడిచింది.

****

వరమ్మకు ఒక కూతురు ఇద్దరు కొడుకులు. కూతురే పెద్దది. వరమ్మ భర్త సాయిలు తాగీతాగీ కాలం చేసిండు. వరమ్మ కూలి నాలి చేసి పిల్లలను పెంచి పెద్ద చేసింది. కూతురు ప్రమీలను ఓ పేదింటి అయ్య చేతిల పెట్టి చేతులు దులుపుకున్నది.   చేతికచ్చిన కొడుకులను పట్టుకొని రెండెకరాల పొలం కొన్నది ఇల్లు కట్టింది. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసింది. వాళ్ళకు పిల్లలు కూడా పుట్టిండ్రు. ఇప్పుడు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నరు. తిండి పెట్టినందుకు పింఛను పైసలిచ్చి వరమ్మ చిన్న కొడుకుతోనే ఉంటది. కూలి పైసలు మాత్రం తన దగ్గరే దాచుకుంటది.

కొడుకులిద్దరికీ తల్లి వరమ్మంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఆమె వాళ్ళను ఎంత కష్టపడి పెంచిందో తెలుసు కాబట్టి తల్లి మాటంటే ఎప్పుడూ గౌరవమే ఇద్దరికీ. అక్కకు అవసరం ఉన్నప్పుడు వరమ్మ పదో పరకో ఇచ్చినా, చూసి చూడనట్టే ఉంటరు. అక్క పెండ్లికి ఏమీ ఇవ్వలేదన్న సంగతి వాళ్లకు కూడా తెలిసిన విషయమే. కానీ కోడండ్లకు మాత్రం అది నచ్చేది కాదు. కాలం అట్లా సాగిపోతున్నది.

ఆరేండ్ల కింద ఒకనాడు ప్రమీల తల్లిగారింటికి వచ్చింది. మునుపటిలాగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడుతలేదు. చాటుకు తల్లితోనే ఏదో గుసగుస చెప్తున్నది. కానీ వరమ్మ అంతగా పట్టించుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నది. విషయం కొడుకులు కోడండ్లు గమనిస్తూనే ఉన్నరు. ఈసారి ఆడపడుచేదో పెద్ద పథకంతోనే వచ్చిందని మాత్రం కోడండ్లకు అర్థమవుతున్నది. అక్క ఏదో బాధలో ఉన్నదని గమనించిన తమ్ముళ్లు పట్టిపట్టి అడగడంతో అసలు విషయం చెప్పింది. తన కొడుకు ఎక్కువ కులం పిల్లతోని సోపతి చేసినందుకే నేరం అంటగట్టిండ్రని, పదివేలు దండుగ కట్టాల్నని, ఏడ్సుకుంట చెప్పింది.

అక్క మాటలు విన్న పెద్ద తమ్ముడు రమణయ్య... "అయ్యో..! గట్లెట్లాయెనే అక్క. అయినా మా దగ్గెరేమున్నదే. మా సంసారం నీకు తెల్వందానె. మా ఇల్లంత దులిపినా రెండు మూడు వేలకు ఎక్కువెల్లయ్." అనుకుంట తమ్మున్ని కూడా అడిగి మూడు వేల రూపాయలు జమచేసి ఇచ్చాడు. కొడుకులకు తెలువకుంట వరమ్మ రెండు వేలు ఇచ్చింది. ఇక్కడికి ఇంతే నయమనుకుని ఆ డబ్బులు తీసుకుని ప్రమీల వెళ్లిపోయింది. కొడుకులు ఎటోళ్ళటు పనికి వెళ్ళిండ్రు. పెద్ద కోడలు అమృత మొఖమంతా మాడ్చుకొని గులుక్కుంటనే భర్త వెనుక నడిచింది. అసలు ముచ్చట అప్పుడు మొదలుపెట్టింది చిన్న కోడలు నీలవేణి.

"ఏందే... పెద్ద శిన్న లేకుంట ఎట్లబడుతె అట్లనే నోటికచ్చినట్టు మాట్లాడుతానవ్. అత్త అన్న మర్యాద ఏమన్న ఉన్నదానె నీకు. కోడల్దానివి కోడల్దాన్లెక్కనే ఉండాలె." అంటున్నది వరమ్మ.

"మాట్లాడకపోతే ఏంది మరి. ఈడ తినబడ్తివి ఆడ పెట్టబడ్తివి. నువ్వు పెట్టుడే గాక మాతోని గుడ పెట్టియ్యబడితివి. బిడ్డె ఒక్కతే పుట్టిందా నీకు. ఈ కొడుకులను ఏన్నన్న అడుకచ్చుకున్నవా ఏంది. కొడుకులద్దు కొడుకుల పిల్లలద్దు. ఏ పండుగకన్న ప్యారంటానికన్న గిది పెడుత గది కొనిత్తనన్నవా నీ నోట. అచ్చినప్పుడల్లా అప్పుడిన్ని ఇప్పుడిన్ని ఇచ్చుకుంట చేసుకున్న కాడికి అటే పంపబడితివి." అని నోరు నెత్తిల బెట్టుకొని వరమ్మ మీద పెద్దగా అరుస్తున్నది చిన్న కోడలు నీలవేణి.

"నా దగ్గెరేమున్నదే పంపెతందుకు. మిమ్ముల కాదనుకుంట దానికేమున్నదే పెట్టేది. దాని లగ్గం నాడు ఎల్లీఎల్లక ఏమియ్యకనే పోతిని. మీ మొగోళ్ళు శిన్నోల్లని ఇంత సదువు జెప్పిచ్చి పెండ్లి జేశి భూమి జాగ మీకే అప్పజెప్తిని. గిప్పుడే గాదె దానికి పెట్టింది. అయినా మీ ఇంట్లకెల్లి దోశి దానికి పెడుతాన్నా ఏమన్న. నా కష్టమేనాయె. నడుమ నీదేంబోతాంది." అని ఆవేశంగా కోడలు కంటె ఎక్కువనే మాట్లాడింది వరమ్మ.

"అట్లనా... నాదేం పోతలేదా... అయితే నా ఇంట్ల తినకు నా ఇంట్ల ఉండకు. నీ దారేందో నువ్వు సూసుకో ఇగ." అని కట్టిరిసినట్టే అన్నది నీలవేణి.

ఆ మాటలతోని వరమ్మకు దుఃఖం ఆగలేదు. ఎంతో కష్టపడి కట్టుకున్న తన ఇంట్ల నుండే తనను వెళ్ళిపొమ్మని కోడలు అనేసరికి వరమ్మ ఏడ్సుకుంటనే... "అంటె నేను మందినానె. వాళ్ళు నా కొడుకులు గాదా. వాళ్ళను నేను కనలేదా. వాళ్ళ సొమ్ము తినే హక్కు నాకు బరాబరుంటది. ఇయ్యాల మీ మొగలైనారు వాళ్ళు. ఏడ జెప్పుకుంటవో శెప్పుకోపో. నువ్వు కట్టినిల్లు గాదు పెట్టిన పొయ్యి గాదు. నా ఇంట్ల నీనుంట. నువ్వెవతివే నన్ను పొమ్మనెతందుకు." అని కరాఖండిగ కొట్టిపారేసినట్టే చెప్పింది.

"ఐతే నువ్వే ఉండు. నేనే పోత ఇగ." అని ఏడ్సుకుంట ఇంట్లకు నడిచింది నీలవేణి.

ఆ మాటతో వరమ్మ నోరు మూతపడ్డది. ఈ కతంత ఎట్లనో ఉన్నదని వెనుకకు తగ్గింది. కొడుకుల సంసారం ఆగం కాకూడదని బాగా ఆలోచించింది. ఇంతకు ముందు ఓసారి పెద్ద కోడలు ఇట్లనే అన్నది. ఈ రోజు చిన్న కోడలు. ఇక ఎవరికీ భారం కాకూడదు అనుకున్నది. కొడుకులు ఇంటికి రాగానే తన నిర్ణయం చెప్పి ఒప్పించింది. తన ఇంటికి ఎదురుగా ఉన్న తన భూమిలోనే చిన్న పెంకుటిల్లు వేసుకొని తన బతుకేదో తాను బ్రతకడం మొదలుపెట్టింది. జీవితం చిన్ననాటి బొమ్మరిల్లులా తిరిగి తిరిగి మళ్లీ మొదటికే వచ్చింది. ఇప్పుడు వరమ్మ ఆలోచనంతా కూతురు మీదకే మళ్ళింది. ఎందుకంటే కొడుకులు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నరు. వాళ్ళ జీవితాల కోసం రంది పడాల్సిన పనిలేదు. వాళ్ళ నుంచి కూతురికి ఏమి దక్కదు. కోడండ్లు దక్కనివ్వరు కూడా. అందుకే ఇకనుంచి కూతురు కోసమే సంపాదించాలని గట్టిగా నిశ్చయించుకున్నది. ఆ ఆరాటంతోనే ఎదురైన పనికల్లా వెల్తూ కూలీనాలీ చేసి తినీ తినక ఆరేండ్లుగా పైస పైస పోగు చేసింది.

కూడబెట్టిన పించను పైసలకు తోడు అంతకు ముందే కొడుకులకు తెలియకుండా దాచుకున్న డబ్బులు కలిపి మూన్నెళ్ళ కిందట చెవులకు అర్థ తులం రాళ్ళకమ్మలు, మెడకు తులంనర గొట్టాల గొలుసు, చేతులకు ముందటి కడియాలు, కాళ్ళకు ఇరవై తులాల పట్టగొలుసులు చేయించుకున్నది. కూతురుకు చిల్లర చిల్లర పెడితే పేరుండదని ఆ ఉపాయం చేసింది. దాంతో కోడండ్ల కడుపుమంట ఇంకింత ఎక్కువైంది. కూతురు ప్రమీల మాత్రం చాలా సంబురపడ్డది.

ఆనాటి నుండి ప్రమీల మనసెప్పుడూ తల్లి సొమ్ము మీదనే ఉండేది. పిల్లల చదువులకనీ పంట పెట్టుబడికనీ ఎన్నోసార్లు ఆ సొమ్మును తనకివ్వమని కూడా అడిగింది. కానీ వరమ్మ ఎప్పుడూ కూతురికి అవకాశం ఇవ్వలేదు.

ఎప్పుడడిగినా...

"నేను అర్వ కష్టపడి సంపాయించుకున్న. నేనుంత కాలం నాసొమ్ము నాతోనే వుంటది. గీ సొమ్ము నా పెయి మీనుంటె నాక్కూడా ధైర్నంగుంటది. అటెంక నీదేనాయె. ఇప్పుడే తీశి నీ శేతుల పెడితే నీ మొగడు ఉన్నకాడికి అమ్ముకొని తింటడు. ఇట్లున్నా ఉంటది. ఎన్ని అరిగోసలు ఎదురైనా మీ కష్టం మీద మీరు బతుక్కుంట సంసారం ఎల్లదీసుకోవాలె. నా సొమ్ముకు ఆశపడద్దు. ఇట్లనే కాపాడి నీ బిడ్డె పెండ్లి వరకు ఇత్తతీయ్. అమ్మమ్మ పెట్టిందని నా పేరన్న ఉంటది." అని కూతురికి నచ్చచెప్పేది వరమ్మ.

"నీ కోడండ్లు మొదలే శెంకినోళ్ళు. వాళ్ళు మాయ మాటల్తోని నిన్ను బొంకిచ్చి బోర్లేశి ఏదోనాడు ఉన్న సొమ్ము గుంజుకుంటరు. గప్పుడు నీ పాణం నిమ్మలమైతది." అని తల్లికి సమాధానం చెప్పేది ప్రమీల.

నెల కిందట దొంగలు ఉన్న సొమ్ము దోచుకుపోవడంతో అటు వరమ్మ కోరికా నెరవేరలేదు. ఇటు ప్రమీల ఆశా తీరలేదు. నవ్వెటోని ముందట జారి పడ్డట్టే కోడండ్ల ముందట తలెత్తుకొని తిరుగకుంటయింది వరమ్మ పరిస్థితి. పెద్ద కోడలు మాత్రం మంచిపనే అయ్యిందన్నట్టుగా ఎట్లైందీ ఏమైందని కూడా వచ్చి అడగలేదు.

ఆరేండ్ల నుంచి ఏ కోడలు ఎట్లున్నవు అత్తా అని మందలియలేదు. మంచి చెడ్డ అడగలేదు. దొంగలు పడ్డాక వారం రోజులకు చిన్న కోడలు దావాఖాన నుండి ఇంటికి వచ్చింది. ఎవరి పాపం వారికే అనుకొని వరమ్మ చిన్న కోడలు ఇంటికి పోయింది.

"ఎట్లున్నది బిడ్డ పాణం. జెర మంచిగున్నదా ఇప్పుడు. ఏం గాదు. తాకతు పుట్టేదాక పండో పలమో జెర మంచిగ తినాలె. రోగాలు పాడుగాను కొత్త కొత్త రోగాలు రావట్టె. ఎనుకట జెరమత్తె గోలేసుకుంటె తక్కువయ్యేది. అసోంటిది లచ్చలకు లచ్చలే గుంజవట్టె దావాఖాన్ల. పైసలు పోతెమాయె గని పాణమైతె దక్కింది అంతేసాలు. నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ. పైసలు అటెంక సంపాయించుకోవచ్చు." అని కోడలుకు ధైర్యం చెప్పింది.

అన్ని మాటలన్నా కల్మషం లేకుండా ప్రవర్తించిన అత్త మంచి మనసును మనసులోనే మెచ్చుకున్నది నీలవేణి. మనసులో ఉన్న మాట బయటికి చెప్పాలని ఉన్నా మాట్లాడే సత్తువ లేకపోవడంతో సరే అన్నట్టుగా తల ఊపుతూ కళ్ళతోనే కృతజ్ఞతా భావాన్ని తెలుపుకున్నది. నెల తిరిగే సరికి నీలవేణి ఆరోగ్యం కుదురుకున్నది.

రోజులు గడిచినా కొద్దీ వరమ్మ పాణమంతా బిడ్డె మీదికే గుంజుతున్నది. సొమ్ము పోయిందన్న ఆవేశంలో వరమ్మ అన్న మాటలు పట్టుకొని ప్రమీల తల్లిగారింటికి రాకుంటయింది. అది తలచుకొని తనను తానే తిట్టుకుంట ఏడాదికోసారి వచ్చే బతుకమ్మ పండుగకు కూతురు లేకపాయెనని దొంగలు పడ్డ కాడికెల్లి ఏడ్సుకుంటనే కూసుంటున్నది వరమ్మ.

****

సద్దుల బతుకమ్మకు నాలుగు రోజుల ముందు… "అక్కా..! ఇగో మీ తమ్ముడు పండుగకు నీకో శీరె నాకో శీరె మీ అవ్వకో శీరె తెచ్చిండు. దీంట్ల నీకు నచ్చింది తీసుకో." అని చీరెలు తెచ్చి ప్రమీల ముందు పెట్టింది చిన్న మరదలు నీలవేణి.

"అవ్వ సొమ్ము దొంగలు ఎత్తుక పోయిండ్రని వచ్చేటికి రొండు తులాలంత బంగారం కొనిత్తనన్నడు తమ్ముడు నాకు. మల్ల గివ్వన్నెందుకు పిల్ల." అన్నది ప్రమీల.

"బంగారమే కాదక్కా. బంగారమసోంటి నా బిడ్డెను గుడ నీ కొడుక్కు ఇత్తంగనీ. ఇప్పటికైతె గీ శీరె కట్టుకోరాదు." అన్నది నవ్వుకుంట నీలవేణి.

వాళ్ళ మాటలు వింటున్న వరమ్మకు బతుకమ్మ పండుగ వాళ్ళింటికి ఈసారే కొత్తగ వచ్చినట్టుగా అనిపించింది.

"ఇగో అత్త..! ఈ శీరె నువు కట్టుకో. నీకు ఈ రంగు మంచిగ తేల్తది." అనుకుంట చిలుకపచ్చ చీర తెచ్చి వరమ్మ చేతికిచ్చింది నీలవేణి.

"ఆడుకునే బిడ్డెలు మీరు కట్టుకోవాలె. నాకెందుకు బిడ్డ." అన్నది వరమ్మ.

"నీ ఇంట్ల దొంగలు పడకపోతే నేను బతికేదాన్నే కాదు. నువ్వు గుడ అందట్ల మంచిగ కనబడాలె." అని మనసులోనే అనుకున్నది నీలవేణి.

"కన్న కడుపు నాది. కోడలైనా బిడ్డసోంటిదే. పాణం పోతాంటె పైసల మొఖం సూత్తనా. ఏ తల్లికీ కడుపు తీపి కంటె సొమ్మెక్కువ గాదు. కొడుకు సంసారం ఆగమైతాంటె ఎట్లూకుంట. నా సొమ్ము నా బిడ్డెకే అనుకున్న. కానీ దానికి బాకిలేదు. ఏం జేత్త మరి. మంచో చెడో తెగాయించిన. ఎట్లైతేంది నా కోడలు పానమైతె దక్కింది అంతేసాలు. నా కొడుకు కూరాడైతె పులిసింది. ఇంతకంటె ఇంకేం గావాలె నాకు." అని మనసులోనే అనుకుంట దేవునికి మొక్కుకున్నది చీరెను చూసుకుంట వరమ్మ. పెద్ద కోడలుకు మాత్రం ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంతో పాటు ఎందుకో అనుమానం కూడా కలుగుతున్నది.

添加评论