ఊతకర్ర  (Author: డా. జడా సుబ్బారావు)

       “ఒరేయ్... కుంటిదొచ్చింది..” అంటూ పెద్దగా అరిచాడొక పిల్లోడు. 

        వీథి అరుగుమీద కూర్చుని ఆటాడుకుంటున్న మిగతా పిల్లలంతా కుంటుకుంటూ వస్తున్న యాదమ్మని చూసి ‘హే కుంటిదొచ్చింది.. కుంటిదొచ్చింది’ అంటూ పెద్దగా అరుస్తూ యాదమ్మ చుట్టూ మూగారు. గుండెనెవరో గునపంతో పొడిచి, చేదవేసి రక్తమంతా తోడుతున్నట్లుగా అనిపించింది యాదమ్మకి. కుంటితనం తన కాలుకో, వాళ్ల మనసుకో అర్థంకాలేదు. వైకల్యాన్ని భరించడమే దినదినగండంగా ఉంటే; వేళాకోళాన్ని జీర్ణించుకోవడానికి ఇంకో జన్మెత్తాలేమో అనిపించింది. చూపుల్లో జాలీ, మాటల్లో ద్వంద్వార్థాలు, వెటకారాలూ వింటుంటే తన దేహాన్ని కుప్పగా పోసి తగలబెడుతున్నట్లుగా ఉంటుంది! ఏం చేయగలదు తను?                                                                   నేలమీద పూర్తిగా ఆనని కాలుతో నడవడానికి ఒక చేత్తో రెండో కాలును ఊతంగా పట్టుకుని నడిచే తనను ‘కుంటిది’ అని పిలవడంలో ఆశ్చర్యమేముంది? అయినా కుంటిదాన్ని కుంటిదాన్ని  అని పిలవకుండా ఇంకెలా పిలుస్తారు? ఎలా పిల్చినా మాటల్లో తన వైకల్యాన్ని ప్రతీక్షణం గుర్తుచేస్తుంటే దాన్ని దిగమింగడం కష్టంగానే ఉంటుంది!                   అద్దం చూసుకున్నప్పుడల్లా తన ఆకారం భయం పుట్టించేది.                     అవిటికాలు చూసుకున్నప్పుడల్లా ఆ భయమే దుఃఖాన్ని రెట్టింపు చేసేది! భయమూ, దుఃఖమూ కలగలిసిన బతుకెంత చేదుగా ఉంటుందో యాదమ్మకు అనుభవంలోనిదే!                                               

***

ఐదేళ్ల వయసప్పుడు యాదమ్మ తండ్రి చనిపోయాడు. తల్లి రమణమ్మని పలకరించడానికి వచ్చినవాళ్లు యాదమ్మను చూస్తూ పలికిన మాటలు ఆ వయసులో ఆమెకు అర్థం కాకపోయినా ‘తల్లి’ హృదయాన్ని గాయపర్చడం, తల్లి బాధతో కళ్లొత్తుకోవడం’ మాత్రం బాగా గుర్తుంది.

“తండ్రిని మింగి పుట్టింది ... దెయ్యం పిల్ల”                                    “అసలే మొగుడు పోయాడు. ఇది చూస్తే దెయ్యం పిల్ల! గెడకర్రకి కుండ బోర్లించినట్లుగా మొహం, బలవంతంగా బయటికి లాగి ముడేసినట్లుగా కనిపించే కళ్ళు చూడ్డానికే అసహ్యంగా ఉంటాయి. నేనైతే ఎక్కడో ఒకచోట పారేసి వచ్చి అసలు పిల్లలే పుట్టలేదని అనుకునేదాన్ని. ఏంటో ఆ దేవుడు కష్టాలన్నీ దీనికే పెట్టాడు”   

భర్తపోయిన దుఃఖాన్ని దిగమింగడానికి ఇబ్బందిపడుతున్న రమణమ్మకి ఆ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. చీరకొంగుతో కళ్లు తుడుచుకుని కూతురి వంక చూసింది. అయిదేళ్ల యాదమ్మకి ఈ లోకంతో పనిలేనట్లు చెట్టుమొదట్లో కూర్చొని తోచిన ఆట ఆడుకోసాగింది. చినిగిపోయిన గౌనుతో కారుతున్న ముక్కును తుడుచుకోవడానికి అవస్థలు పడుతూ కిందకీ పైకీ లేవసాగింది.             

కూతురి మొహం చూసిన రమణమ్మకి ప్రేమ పొంగుకొచ్చింది. అందరికీ అనాకారిగా కనిపిస్తున్న కూతురి మొహం ఆమెకి మాత్రం ఎంతో అందంగా కనిపించసాగింది. లోపలికి పోయిన కళ్లు, పెద్దగా సాగినట్లుగా ఉండే దవడలు, సన్నటి మెడమీద నిలబెట్టినట్లున్న తలను చూస్తూ అందరూ గేలిచేస్తున్నట్లు మాట్లాడతారు, కుంటిదని వేళాకోళం చేస్తారు. కానీ రమణమ్మకి మాత్రం ‘గొడ్రాలు’ అనే నిందనుంచి తప్పించడానికి వచ్చిన దేవత ప్రతిరూపంలా కనిపిస్తుంది యాదమ్మ. తల, కళ్లు, కాళ్లు, శరీరం... ఎలా ఉంటేనేమి? తన రక్తం పంచుకుని పుట్టిన కూతురి వంక తృప్తిగా చూసుకుంది. పెళ్ళైన సంవత్సరం తర్వాత రమణమ్మకి ఆమె అత్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘చూడూ... ఆడదానికి పెళ్లవడం ఎంత అవసరమో, పెళ్లైన ఆడదానికి సంతానం కూడా అంతే అవసరం. కొడుకు పుడతాడని ఎదురుచూసిన నాకు పుట్టిన ముగ్గురు అమ్మాయిలు పురిట్లోనే పోయారు. కొడుకును కనకుండానే పోతానేమో అనుకున్న సమయానికి ఏ దేవుడో వరమిచ్చినట్లుగా,  నా వంశం నాశనం కాకుండా నాకు వీడు పుట్టాడు. నిన్ను చూస్తుంటే నాకు అప్పుడప్పుడు భయమేస్తుంది. తొలికాన్పులో అబ్బాయిని కంటే ఏ దిగులూ ఉండదు. పెళ్లై సంవత్సరం దాటినా కడుపున ఒక కాయలేకుండా ఉన్న నిన్ను చూసి నలుగురూ నాలుగు మాటలు అనుకుంటుంటే నాకేదోలా ఉంది. నా వంశం నా కొడుకుతోనే నాశనమయ్యేలా ఉంది”, అత్త మాటలు వింటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది రమణమ్మ. మనసంతా దుఃఖం ఆవరించింది. పిల్లలు పుట్టక పోవడానికి లోపం ఎవర్లో ఉన్నా దానికి నిందలు మాత్రం స్త్రీనే భరించాలి. గొడ్రాలనే ముద్రవేసి ఏ శుభకార్యానికీ పిలవకుండా అందరూ చేసే అవహేళనలు తట్టుకోవాలి. అన్నిటినీ తట్టుకుంటూ జీవచ్ఛవంలా బతుకుతున్న రమణమ్మ జీవితంలోకి ‘యాదమ్మ’ కూతురిగా వచ్చింది.           

కాన్పు అయ్యాక పిల్లను చూసిన రమణమ్మ అత్తగారు “దెయ్యం పిల్లని కన్నావు, ఈ మాత్రం సంబడానికి అసలు కనకుండా ఉండాల్సింది” అంది. చూడ్డానికి వచ్చినవాళ్లంతా అదే అభిప్రాయంతో ఉన్నప్పటికీ బయటపడకుండా రమణమ్మను చూసి వెళ్లిపోయారు. గుండె పగిలిపోయింది రమణమ్మకి. అత్తగారి సూటిపోటి మాటలు, భర్త ఈసడింపులు భరించలేకపోయింది. అనాకారిగానూ, అంగవైకల్యంతోనూ పుట్టిన కూతుర్ని చూసి పొగిలి పొగిలి ఏడ్చుకుంది. జరిగినదానిలో తన తప్పు లేకపోయినా లోకం వేసే నిందల్ని తన కూతురు ఎలా భరించ గలదో అనుకుని తల్లడిల్లింది. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లన్నీ ఎడారిలో కురిసిన వానలాగా దేహంలోనే ఆవిరైపోయాయి. అనంతమైన దుఃఖానికి తోడు భర్త మరణం రమణమ్మను మరింత కుంగదీసింది. అత్తగారి పోరు తట్టుకోలేక యాదమ్మను  తీసుకుని మేనమామ ఇంటికి చేరింది రమణమ్మ.

“చూడమ్మా... తల్లీదండ్రీలేని నిన్ను శాయశక్తులా పెంచి ఒక అయ్య చేతిలో పెట్టాను. కష్టమో నష్టమో... ఇన్నాళ్ళూ చుట్టం చూపుగా తప్ప ఎప్పుడూ నా దగ్గరికి రాలేదు. అవిటిది, అనాకారిదైన పిల్లను వెంటేసుకుని విధవగా నువ్వొచ్చి ఇక్కడే ఉంటానంటే చూసేంత ఆర్థిక స్థోమత నాకు లేదమ్మా... కావాలంటే ఒక నాలుగురోజులుండి ఇంకెక్కడి కైనా వెళ్లొచ్చు...” అన్నాడు.

బేలగా చూసింది మేనమామ వైపు.

ఆర్థికంగా బలంగా ఉంటే బలగమంతా మన వెనకాలే ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటామో తెలిసినవాళ్ళు కూడా తప్పుకుని వెళ్ళిపోతారు.  యాదమ్మతో పొరుగూరు చేరిన రమణమ్మ తెలిసిన వారిద్వారా చిన్న గది అద్దెకు తీసుకుంది. భర్త బతికుండగా కొనిచ్చిన చెవి దుద్దుల్ని అమ్మేయగా వచ్చిన డబ్బు కొంత ఇంటి ఓనరుకిచ్చి మిగతాది ఖర్చులకు ఉంచుకుంది. ఏ పని చేయాలో తెలియలేదు. ఆలోచించగా తనకొచ్చిన వంట పనే ఉపాయంగా తోచింది. టీ కాసి ఒక ప్లాస్కులో పోసి, ఇడ్లీలు వేసి తానున్న గదిముందు పెట్టుకునేది. అటూ ఇటూ వెళ్ళేవాళ్లు మొదట్లో అంతగా ఆసక్తి చూపించకపోవడంతో రెండు మూడు రోజులు ఇబ్బంది పడింది. తనలో తానే ఏడ్చుకుంది. అయినా ఆశ చావక మళ్ళీ మరుసటిరోజు కూడా అలాగే చేసి ఎదురు చూడసాగింది. ఆమె నిరీక్షణ  ఫలించింది. టీ కోసం, ఇడ్లీల కోసం వచ్చేవాళ్లను చూసి సంతోషపడింది.

నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుంటుందని స్కూలు వయసు దాటిపోయిన కూతుర్ని తీసుకుని ఒకనాడు స్కూలుకి బయల్దేరింది రమణమ్మ. దారిలో ఎదురైన ఒకావిడ రమణమ్మని చూస్తూ “చక్కనిదాన్ని బడిలో చేర్చాలని తీసుకెళ్తున్నావా?” అని అడుగుతూ “ఏమే చక్కని చుక్కా... ఈ వయసులో చదువుకుని కలెక్టరవుతావా? మీ అమ్మను బాగా చూసుకుంటావా?” అని అడుగుతున్న వాళ్లవంక బాధగా చూసింది.

లోపం ఉండడం తప్పుకాదు, కానీ ఆ లోపాన్ని పదేపదే గుర్తుచేసే వాళ్లతోనే ఇబ్బంది. బడిలో చేర్చిన తర్వాత “చూడమ్మా.. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, నువ్వెంత నేర్చుకోగలవో అంత నేర్చుకో. ఎవరితోనూ గొడవలు పడొద్ద”ని చెప్పింది. బడిలో వదిలి వెనక్కి వస్తూ “బాబూ పిల్లని కనిపెట్టుకుని ఉండండి. అసలే తండ్రిలేడు. దానికేమైనా అయితే తట్టుకోలేను” అంది అక్కడున్న మాస్టారితో.

వ్యాపారం కొంచెం గాడిలో పడిందని సంబరపడుతున్న సమయంలో ఒకనాడు యాదమ్మ “అమ్మా! నేను రేపటి నుంచీ స్కూలుకెళ్లను” అంది. కూతురివంక ఆందోళనగానూ, అయోమయంగానూ చూసింది రమణమ్మ. “పిల్లలంతా నన్ను చూసి కుంటిది, పెద్ద తలకాయది అని ఏడిపిస్తున్నారమ్మా” అంది ఏడ్చుకుంటూ.

రమణమ్మకేమీ పాలుపోలేదు. లోపం ఆవ గింజంత ఉంటే ఎక్కడైనా దాయొచ్చు. అదే లోపం తాటికాయంత ఉంటే ఎలా దాయగలం? ఏం చెప్పి యాదమ్మని ఓదార్చాలో, తాను ఎలా స్థిమితపడాలో అర్థంకాలేదు రమణమ్మకి. కూతురి దిగులుతో సతమతమవుతున్న రమణమ్మకి సమ్మెట దెబ్బలాంటి సంఘటన ఎదురైంది. ఒకరోజు టీ తాగడానికి వచ్చిన ఒకతను “మోడులాగా ఎన్నాళ్ళుంటావు. పెద్ద వయసుకూడా కాదు. నాతో కలిసుండు, నీకు భర్తగా, నీ పిల్లకి తండ్రిగా తోడుంటాను” అనడంతో కంగారుపడింది. కొంచెం స్థిమితపడ్డాక “ఒంటరి ఆడదంటే అందరికీ లోకువే బాబూ... నాకిప్పుడు భర్త అవసరం లేదు. నా కూతురికి  ఇంతకాలం తల్లీదండ్రీ నేనే కాబట్టి దానికిప్పుడు తండ్రి అవసరం కూడా లేదు. నేను బతికి ఉన్నన్నాళ్ళూ ఏ లోటూ లేకుండా సాక్కుంటాను. ఆ పైన దేవుడే దిక్కు” అని చెప్పిన రమణమ్మను చూసి అతనేదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.               

ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని రమణమ్మ స్కూలు మానేసిన యాదమ్మని తనకు సాయంగా హోటల్లోనే ఉంచేసుకుంది. తను చేయదగిన పనులన్నీ చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్న కూతుర్ని చూసుకుని మురుసుకునేది రమణమ్మ. కాలం పరుగులు తీసింది. రెక్కల కష్టం మీదే తిండికీ, బట్టకీ లోటులేకుండా నెట్టుకొచ్చింది. అద్దె ఇంట్లో నుంచి చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంది. ఇంటికి పక్కనున్న చిన్న వసారాకి రేకులు వేయించి టిఫిన్లకి వచ్చేవాళ్లకి ఇబ్బంది లేకుండా చేసింది. లోపల రెండు గదులు, వంటిల్లు ఉన్నాయి గనుక ఉండడానికి దిగులు లేకుండా రోజులు బాగానే గడిచిపోతున్నాయి.

ఒకనాడు గల్లాపెట్టె దగ్గరున్న యాదమ్మని పిలిచి “అమ్మా.. ఈ టిఫిన్ తీసుకెళ్ళి జేజవ్వకిచ్చిరా” అంది. చేతికర్ర సాయంతో తల్లి ఇచ్చిన గిన్నె అందుకుని అందులోని చట్నీ ఒలికిపోకుండా జాగ్రత్తగా తీసుకుళ్లి జేజవ్వకిచ్చింది. ఆ గిన్నె తీసుకుంటున్నప్పుడు జేజవ్వ కళ్ళు ఆనందంతో మెరవడం యాదమ్మ దృష్టిని దాటిపోలేదు. చిన్న గదిలాంటి ఇంట్లో ఒక్కతే ఉంటుంది జేజవ్వ. ఆమెకు ఎవరూ లేరని, తాము చిన్నప్పుడు కొన్నాళ్ళు ఆ ఇంట్లో ఉన్నట్లు కూడా తల్లి చెప్పగా చాలాసార్లు విన్నది యాదమ్మ. తినడం పూర్తయ్యాక ఖాళీ గిన్నె తిరిగిస్తూ “ఏదో జన్మలో నేను పుణ్యం చేసుకున్నానే యాదమ్మా. ఆ దేవుడు మీ అమ్మను నాకొక వరంగా పంపించాడు. నువ్వు కూడా ఒకింటిదానివై పిల్లాపాపలతో సుఖంగా ఉండు” అంది చీరకొంగుతో కళ్ళొత్తుకుంటూ.

కొన్ని బంధాలంతే… మనవాళ్ళు అనుకున్నవాళ్లు దూరమవుతుంటారు, కానివారెవరో వచ్చి అల్లుకుపోతుంటారు. కాలానికి అప్పుడప్పుడు జాలి కలిగితే తప్ప పరిచయాలుగా మొదలైన కొన్ని బంధాలు ఆత్మీయబంధంగా మారలేవు. జేజవ్వతో బంధం కూడా అలాంటిదే అనుకుంటూ ముందుకు నడుస్తున్న యాదమ్మ ఒక్క నిముషం ఆగి వెనకున్న జేజవ్వ వైపు అయోమయంగా చూస్తూ తన దేహం వంక జాలిగా చూసుకుంది.

శరీరంలోని వంకర్ల గురించిన ఆలోచనలతోనే సరిపోయింది ఇన్నాళ్లూ. తనకు పెళ్ళీడొచ్చిందన్న సంగతే మర్చిపోయింది. అయినా చూడగానే కళ్లు తిప్పుకోలేనంత అందం కాదు తనది.. కళ్లు మూసుకుని వెన్ను తట్టుకునే భయంకర రూపం! తల్లి కాబట్టి తనని ఇన్నాళ్ళూ భరించింది. జేజవ్వ చెప్పినట్లు పెళ్ళిచేసుకుంటే వచ్చేవాడు తనను భరించగలడా? తనవంక జాలిగానో, అసహ్యంగానో చూస్తే తను తట్టుకోగలదా? ఆలోచనలతోనే ఇంటికి చేరుకుంది. తిరిగొచ్చి ఏమీ మట్లాడకుండా నుంచున్న కూతుర్ని చూసి “ఏమందమ్మా మామ్మా?” అంది రమణమ్మ.

“ఏమంటుంది...రోజూ అవే కళ్ల నీళ్ళు, అవే దీవెనలు, ఈరోజు మాత్రం పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా ఉండమని దీవించింది” అంది పెద్దగా నవ్వుతూ యాదమ్మ.  రమణమ్మ కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. అయినా అవేమీ కూతురికి కనిపించకుండా యాదమ్మకు దగ్గరగా జరిగి “నువ్వు చిన్నప్పుడు కొన్నాళ్ళు అక్కడే పెరిగావు. ఎవరూ లేక తెలిసిన వాళ్ల ద్వారా ఈ ఊరొచ్చాను. దేవతలా ఆదుకుని తన ఇంట్లోనే ఉండమంది. కానీ దగ్గరగా ఉండి బంధాల్ని బలహీన పరుచుకోవడం కంటే, దూరంగా ఉండి అనుబంధాన్ని పెంచుకోవడం మంచిదని నేనే కాదన్నాను. నా బలవంతం మీదే చిన్న అద్దె ఇల్లు చూపించింది. ఆవిడ చలవ వల్లే ఇలా ఉన్నామని కృతఙ్ఞతగా...”

“రోజూ వండి పంపించాలా? అప్పుడప్పుడూ పంపిస్తే సరిపోతుంది కదా!” అంది నవ్వడం ఆపి తల్లిని చూస్తూ. కూతుర్ని  చూసి నవ్వింది రమణమ్మ. కాసేపయ్యాక “జీవితంలో మనకి సాయం చేసిన వాళ్లని మర్చిపోకూడదు. మనం నిలబడడానికి కారణమయిన వాళ్లని అసలు మర్చిపోకూడదు,  జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. పిల్లల్లేక, నా అన్నవాళ్లు లేకుండా ఒంటరిగా బతకడం ఎంత దుర్భరంగా ఉంటుందో తల్చుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. నాకంటే.. మంచీ చెడుకీ నువ్వున్నావు. పాపం మామ్మకెవరున్నారు? ఇలాంటివాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? పక్షులకు నాలుగు గింజలేసి లోకాన్నంతా మనమే ఉద్ధరిస్తున్నామన్న ఆలోచన మనకు రాకూడదు. మనం చేయగలిగినంత సాయం అవసరంలో ఉన్నవాళ్లకి కూడా మనం చేసినప్పుడే మన బతుక్కొక అర్థం పరమార్థం ఉంటాయి! నేనున్నా లేకపోయినా ఆవిడ బతికున్నంత కాలం  చూసుకోవాల్సిన బాధ్యత నీదే..” ఆగి కూతురి కళ్లల్లోకి చూసింది రమణమ్మ.

“బాగుంది వరస.. నేను నీకు కూతుర్ని. జేజవ్వ నాకు కూతురు” ఈసారి ఇంకాస్త పెద్దగా నవ్వింది యాదమ్మ. రమణమ్మ కూడా కూతురితో పాటు నవ్వింది. ఆనందమో దుఃఖమో తెలియని కన్నీళ్ళు ఆమె చెంపలపై జారాయి.

లోటు లేకుండా సాగిపోతున్న యాదమ్మ జీవితంలో ఒక్కసారిగా కుదుపు మొదలయింది. కళ్లముందు కనిపించే విలువైన వస్తువేదో హఠాత్తుగా మాయమైనట్లుగా, తన కలల్లోనూ, కళ్లల్లోనూ నడిచే దేవతగా కనిపించిన రమణమ్మ నిద్రలోనే చనిపోయింది. అకాశం విరిగిపడినట్లు, భూమి పాతాళంలోకి కుంగిపోయినట్లుగా విలవిల్లాడిపోయింది యాదమ్మ.

***

“ఏంటమ్మా... లైటుకూడా వేసుకోకుండా చీకట్లోనే కూర్చున్నావు?” అంది జేజవ్వ లైట్ వేస్తూ.

నడవలేకపోయినా తనకోసం అవస్థ పడి వచ్చిన జేజవ్వను చూస్తూ “నా జీవితంలో చీకటి తప్ప ఏం మిగిలింది జేజవ్వా! అందరూ వెక్కిరిస్తుంటే నేనెక్కడ బాధపడతానో అని ఎంతో ధైర్యం చెప్పేది. నన్ను నడిపించిన దేవత నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతుందని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను బతికుండి ఎవర్ని ఉద్ధరించాలో అర్థం కావట్లేదు” అంది యాదమ్మ నీళ్లు నిండిన కళ్లతో. యాదమ్మ వంక ఆప్యాయంగా చూసింది జేజవ్వ.

కాసేపయ్యాక “చూడమ్మా! నిన్ను ఇలా పుట్టించడం వెనుక దేవుడికేదో ఆలోచన ఉంటుంది. నీవల్ల కొంతమంది కైనా ఉపకారం జరగాల్సి ఉండి ఉంటుంది. అన్నీ బాగున్నవాళ్లు ఎలాగైనా బతికేస్తారు. కానీ నీలాంటివాళ్లు బతకాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం గుండెల్లో ఉండాలి. అయినా.. సహాయం చేసే మనసు లేనివాళ్లు చూడ్డానికి బాగుంటే మాత్రం ఉపయోగమేంటి? నీ చేత సాయం పొందిన వాళ్ళే నీ కాళ్లకు ఊతకర్రలా మారతారు. మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా తల్లిపోయిన దిగులునుంచి బయటపడు. అనాథలైన పిల్లలకి నువ్వే ఒక తల్లిగా మారి వాళ్లను చేరదీసి ఆదరించు” ప్రేమగా తల నిమిరి ముందుకు సాగింది జేజవ్వ.

తన తల్లే జేజవ్వగా వచ్చి దీవించినట్లుగా అనిపించింది యాదమ్మకి!

 

0 hozzászólás