వసంతం  (Author: కె. లక్ష్మి శైలజ)

కళ్యాణ మండపం లో రాత్రి ఏడు గంటల సమయం లో పెళ్ళి కుమార్తె, పెళ్ళి కుమారులకు ‘ఎదురుకోల’ కార్యక్రమం జరుగుతున్నది. పెళ్ళి పాటలు గట్టిగా వినపడుతున్నాయి. అటు చివర ఒకరు, ఇటు చివర ఒకరు పట్టు బట్టలతో మెడలో పూల దండలతో వధూవరులు నిలబడివున్నారు.

ఇద్దరి చుట్టూ బంధువర్గం హడావుడి పెడ్తూ, వధూవరులను“మనం కదలొద్దు, అవతలివారే రావాలని” పౌరుషాన్ని రేకెత్తిస్తున్నారు. కొంతమంది పెద్దలు అటూ ఇటూ తిరుగుతూ“దయచేసి ఒక్కడుగు వెయ్యండి” అంటున్నారు. సమయం గడుస్తున్నది గానీ ఎవరూ ముందుకు రావడం లేదు. చిరునవ్వులు చిందిస్తూ పదడుగుల దూరంలోనే నిలబడి వున్నారు. పిల్లలకు పెద్దలకు ఆకలికి కడుపులో కరకరలు మొదలయ్యాక అప్పుడు ఇంక హడావుడి చేసి ఇద్దరినీ నడిపించి పౌరోహితుల ఆధ్వర్యంలో మరొక పూల దండలను ఇద్దరితో వేయించి, మళ్ళీ మార్పించి, ఆశీర్వదించి వేదికపైన వరపూజ చేయించి భోజనాలకు లేచారు.

“పెళ్ళికొడుకు అందంగా వున్నాడే” అంటూ పెళ్ళి కూతురి బుగ్గలో పొడిచింది మేనమామ కూతురు. చిన్నగా నవ్వింది పెళ్ళి కూతురు సమీర.“మన సమీర మాత్రం అందంగా లేదా?” అంది వాళ్ళ పెద్దమ్మ.“ఆ… మరి…అమ్మాయి అందంగా లేకుంటే చేసుకుంటారా?” అని మరొకరు అనడంతో అందరూ“అంతేలే” అన్నారు.

మర్నాడు తెల్లవారుఝామున శ్రీకృష్ణతో పెళ్ళి జరిగి, సాయంత్రం భర్తతో అత్తవారింటికి వెళ్ళింది సమీర. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొన్నారు. మీరా చక్కగా పాటలు పాడింది.“పేరుకు తగ్గట్టు పాటలు కూడా నేర్చుకుంది” అన్నారు బంధువులు. మళ్ళీ పుట్టింటికి కృష్ణతో కలిసి వచ్చింది సమీర.

వాళ్ళమ్మ వరమ్మ తోడికోడలు సహాయంతో వధూవరుల మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తోంది. వాళ్ళ ఇంట్లోనే ఒక గదిని అలంకరించారు.

తెల్లని చీరలో ఉన్న సమీర అంతే తెల్లని మనసుతో తెల్లని మల్లెపూల బంతిని శ్రీకృష్ణకు వేసింది. అతను సమీరను పరిశీలనగా చూడటం లో నిమగ్నమై బంతిని పట్టుకోలేక పొయ్యాడు.

“అయ్యో… ఎంతసేపు అమ్మాయినేనా, బంతిని కూడా చూడవయ్యా” హాస్యమాడింది ఒక పెద్ద ముత్తైదువ. ఆ మాటకు అందరూ గలగలా నవ్వుకుంటూ లేచారు. వారిద్దరినీ రూము లోనికి పంపి వెళ్ళిపొయ్యారందరూ.

తెల్లవారుజామునే సమీరను పిలిచింది వరమ్మ. సమీరకు తలకుపోసి వేరే రూంలో పడుకొమ్మని చెప్పారు. ఆ తరువాత దోసెలు తిని అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా సమీర మనసు రాత్రి శ్రీకృష్ణ మాట్లాడిన మాటల చుట్టూనే తిరుగుతోంది.

“మొదటి రాత్రి ఇద్దరి కలయిక తరువాత రక్తస్రావమైతేనే అంత వరకూ ఆడపిల్ల కన్నెగా ఉన్నట్లు” అని శ్రీకృష్ణ అంటూ ఉంటే తికమకగా చూసింది సమీర.

అంటే తను కన్యకాదని అంటున్నాడా?

“అర్థం కానట్లు చూస్తావేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు నీకు రక్తం కనపడిందా లేదా?” అన్నాడు.“ఏమీ లేదే?” అంది సమీర.

“చిన్నప్పుడు నువ్వేమైనా చెట్లు ఎక్కి ఆటలు ఆడుకున్నావా?” అంటే“లేదు” అంది ఏమడుగుతున్నాడో అర్థం కాక.

ఇంక అతను రెట్టించలేదు. సమీర చదువుకున్నది గానీ ఇలాంటి పరిజ్ఞానం ఆ పిల్లకు లేదు. సంస్కారవంతుల కుటుంబం లోనుంచి వచ్చిన ఆమెకు ఇలాంటివి తెలిసే అవకాశం కూడా లేదు. ‘ఆడపిల్లలు ఆడుకునేటప్పుడు పరిగెత్తి పడిపోవడాలు, ఎగిరి దూకడాలు జరుగుతున్నపుడు కన్నెపొర చిరిపోయే అవకాశముందని, అంత మాత్రాన వారు కన్నెలు కాకుండా పోరు’ అని కూడా తెలియదు. అందుకే మౌనంగా ఉండి పోయింది.

ఇప్పుడు ఆలోచిస్తుంటే అతను కోపంగా ఉన్నాడని అనిపిస్తోంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎవరికీ ఏమీ చెప్పే విషయం కాదని మౌనంగా ఉండిపోయింది.

అలా మూడు రోజులు గడిపి శ్రీకృష్ణ వెళ్ళిపోయాడు. ఒక పది రోజుల తరువాత సమీరను కాపురానికి పంపించారు. ఎప్పుడూ పడకింటి విషయాలు ఏదో ఒకటి మాట్లాడుతూ, ఎవరెవరి గురించో అసహ్యంగా కూడా చెప్తుండేవాడు. సమీరకు అది ఇబ్బందిగా వుండేది. అయినా ఏమీ అనకుండా వుండేది.

ఒక పది రోజుల తరువాత అదే ఊర్లో బంధువుల పెళ్ళికి వెళ్ళారు. అక్కడ శ్రీకృష్ణ మేనమామ కనిపించారు వీళ్ళకు. అతను శ్రీకృష్ణ అవతలకు వెళ్ళినప్పుడు“అమ్మాయ్ మా కృష్ణుని లీలలు తెలిసే పెళ్ళి చేసుకున్నావా? వీడికి మా అమ్మాయిని ఇవ్వబోయి మానుకున్నాము. వీడు విజయవాడలో, చిత్తూరులో భోగం వాళ్ళ చుట్టూ తమతో కలిసి తిరిగాడని, తాగి తందనాలు ఆడే వాళ్ళమని వాడి స్నేహితులే చెప్తుంటే చూస్తూ చూస్తూ ఎలా పిల్లనిస్తాను? వాళ్ళ అమ్మానాన్నలకు కూడా తెలుసట. అందుకే త్వరత్వరగా పెళ్ళి చేశారు. తెలిసిన వాళ్ళెవరూ పిల్లనివ్వడం లేదట. మీరు దూరం వాళ్ళు కాబట్టి ఇవన్నీ తెలియదులే పాపం” అని రహస్యం చెప్తున్నట్లుగా చెప్పి, విచారం వ్యక్తం చేశాడు. వింటున్న సమీరకు కాళ్ళకింద భూమి కదుల్తున్నట్లయ్యింది.

‘అందుకేనా అతను పడకింటిలో విపరీతంగా ప్రవర్తిస్తాడు’ అని అనుకున్నది. ఈ విషయాలు తనకు వాళ్ళ మేనమామ తెలిపినట్లుగా చెప్పకుండా మాత్రం జాగ్రత్త పడింది. ‘వాళ్ళ తల్లి తండ్రులకు కొడుకు గురించి తెలిసే తనను కోడలిగా చేసుకున్నారా? ఎంత మోసం చేశారు? ’ అని మాత్రం కోపం వచ్చింది.

ఇంట్లో ఉన్న ముఖచిత్రాలను (ఫోటోలను)చూస్తున్న సమీర రెండు మూడు చోట్ల ఒకావిడ వెనకాల కృష్ణ నిలబడి వుండటం గమనించింది.“ఈవిడెవరూ?” అంది. ఆవిడ రింగురింగుల జుట్టుతో అందంగా కనిపిస్తోంది. ఆ ఫోటో చూడగానే ఎంతో ఆత్మీయంగా చూసుకుంటూ, ఫోటోను తడుముతూ వదలలేనట్లుగా పట్టుకొని “గీత. పక్కవీధిలోనే ఉంటారు. వెళ్దామొకరోజు” అన్నాడు.

అన్నట్లుగానే ఒకరోజు“ఈ రోజు రమ్మంది గీత” అన్నాడు. అంటే ‘ముందుగానే వెళ్ళి వచ్చాడా? ’ అనుకుంది. వీళ్ళు వెళ్ళి వచ్చారు. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా వుంటున్నారు ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త వంటలకు వెళ్తాడట. ఇప్పుడు ఇంట్లో లేడు. ‘అతను లేనప్పుడు ఎందుకు రమ్మంది? ’ అనుకుంది సమీర. ‘కృష్ణకు కూడా ఆమె భర్త ఇంట్లోలేని సమయం లో రావడమే ఇష్టమా? ’ అనిపించిందామెకు. ‘అంటే ఎప్పుడూ వెళ్తుంటాడా? ’ అని కూడా అనుకుంది. కానీ అడగలేదు.

పండక్కు ఇద్దరూ పుట్టింటికి వెళ్ళినా అమ్మావాళ్ళతో తనకు తెలిసిన విషయాలు చెప్పలేదు సమీర. అతను మాత్రం ఆడవాళ్ళను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉండేవాడు.

అక్కడ కూడా“మీ అమ్మ నీలాగా ఒళ్ళు దాచుకునే లాగా బట్టలు వేసుకోవడం లేదు. నువ్వెందుకు అలా కప్పుకున్నట్లు కట్టుకుంటావు” అంటాడు. ఆ మాటలకు అత్తగారనే గౌరవం చూపించలేని పశువు అనుకుంది, మనసులో ఏడుస్తూ సమీర.

అలాగని విశాల హృదయమా అంటే ఒకసారి మాటల మధ్యలో“మీ కాలేజీలో కూడా పరీక్షల సమయంలో మగపిల్లలూ, ఆడపిల్లలూ ఒకే బల్ల మీద కూర్చొని పరీక్షలు వ్రాశారా?” అని అడిగితే“అవును. అప్పుడప్పుడూ అలా వ్రాసే వాళ్ళము” అని అమాయకంగా చెప్పింది.

అందుకని“అమ్మో…నువ్వు సామాన్యురాలివి కాదులే. మగపిల్లల పక్కన కూర్చొని పరీక్షలు వ్రాసిన దానివి” అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. ‘అంటే అతను పరీక్షలకు కూర్చొని చదువు గురించి కాకుండా పక్కనున్న అమ్మాయిని చూస్తూ ఉంటాడేమో? అందరూ అలాగే అనుకుంటాడు’ అని దిగులు పడింది.

ఒకరోజు“ఆడవాళ్ళు మొగుడు బైటికి వెళ్ళగానే వ్యభిచారానికి వెళ్తారు” అన్నాడు శ్రీకృష్ణ.

ఆ మాటలకు కళ్ళప్పగించి అతనివైపు చూసింది.“అందరు ఆడవాళ్ళు అలా చేస్తారా?” అంది, మనసులో కోపాన్ని బైటకు కనిపించనివ్వకుండా సమీర.

“ఆ…మూడు భాగాలు అందరూ అంతే” అన్నాడు తనకు అన్నీ తెలుసన్నట్లు. నిరసనగా అక్కడనుంచి లేచి వెళ్ళింది సమీర. ‘ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు? ’ అనుకుంది. ‘మీ అమ్మా, అక్క కూడా అంతేనా? ’ అని అడుగుదామని అనిపించింది. ‘ఛ…అతనితో పాటు మనమూ ‘సంస్కారం’ లేకుండా మాట్లాడటం ఎందుక’ నుకుంది.

ఎంతో చక్కని కుటుంబంలో పుట్టిన సమీరకు ఇలాంటి అసహ్యపు మాటలు వింటుంటే కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. ‘తను ఇలాంటి మనిషితో సంసారం చేయవలసి వచ్చింది కదా’ అని మనసు ముడుచుకు పోతోంది.

అందుకే తను కూడా ఇంట్లొవుండటమెందుకూ ఉద్యోగం చేస్తానని ఒకసారి అడిగింది.“ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళందరూ కార్యాలయాల్లో మగవాళ్ళతో ఇక ఇకఇకలూ, పక పక పకాలూ చేస్తుంటారు. వద్దు” అన్నాడు. ‘ఈ మాట ఉద్యోగం చేసే ఆడవాళ్ళెవరైనా వింటే ఇతనికి చెప్పులతో సన్మానం చేస్తారేమో? ’ అనుకుంది అతన్ని అసహ్యంగా చూస్తూ సమీర. అతను బైటకు వెళ్తూ పరిమళపు నూనె (సెంటు)వ్రాసుకుంటూ సమీరను గమనించలేదు.

అలా గడుస్తున్న కాలంతో పాటు సమీరలో కూడా ప్రకృతి మార్పును సూచించింది. ఐదవ నెల గర్భం రాగానే పుట్టింటివారు శ్రీమంతం చేశారు. ఒక కూతురు కూడా పుట్టింది.“కూతుర్ని కన్నావా? నాకు నష్టం” అన్నాడు నామకరణానికి వచ్చి. ‘ఏం లెక్కలు వేస్తున్నాడు? లక్షణంగా పిల్ల పుట్టిందని సంతోషం లేదు’ అనుకుంది సమీర.

మూడవ నెల రాగానే శ్రీకృష్ణ వెళ్ళి ఒక వారం రోజులు ఉండి అత్తగారితో సహా భార్యా, పిల్లలను పిలుచుకొని వచ్చాడు. ఒక పదిరోజులు ఉండి పిల్లకు ఎలా చేసుకోవాలో అన్నీ వివరించి వెళ్ళింది వాళ్ళమ్మ.

వాళ్ళమ్మ ఉన్నప్పుడే ఒక సంఘటన జరిగింది. వీళ్ళు ఊరినుండి రాగానే శ్రీకృష్ణ కార్యాలయానికి వెళ్ళి పోయాడు. వాళ్ళమ్మ లోపల పనిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ కార్యాలయపు సేవకుడు (అటెండర్) వచ్చి ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. ‘ఉత్తరాలు కార్యాలయానికి వ్రాసేవారెవరూ? ’ అనుకొని తీసుకుంది. ఈ లోపు వంటింట్లో నుండి వాళ్ళమ్మ పిలవగానే అటు వెళ్ళింది. మాట్లాడుతూ వంటింటి గూట్లో పెట్టింది. ఆ తరువాత మరిచి పోయింది.

ఇప్పుడు వాళ్ళమ్మ వెళ్ళిన తరువాత ఒకరోజు కృష్ణ బైటికి వెళ్ళినప్పుడు వంటింట్లో పనిచేసుకుంటూ ఉండగా ఆ ఉత్తరం కనిపించింది. తీసి చదివింది. చదవగానే పట్టరాని కోపం వచ్చింది సమీరకు. ‘ఎంత నాటకం జరుగుతోంది తన వెనుక? ’ అనుకుంది. ఇవతలికి వచ్చి కుర్చీలో కూర్చొని మళ్ళీ మళ్ళీ చదివింది. చదువుతూండగా ఏడుపు కూడా వచ్చింది.

తను ఉద్యోగం చేస్తానంటే ‘ఆడవాళ్ళు మగవాళ్ళతో ఇకఇకలు పోతారన్నాడు. మగపిల్లల పక్కన కూర్చొని పరీక్షలు వ్రాసిన గొప్పదానివి’ అని ఎద్దేవా చేశాడు. మరిదేమిటి? అనుకుంది.

‘ఏమిటిది? ఇలా అవుతోంది తన జీవితం. మనసుకు ఎంత కష్టం వచ్చినా తను సర్దుకొని పోతూనే వుంది. కానీ ఇప్పుడు తనెవరూ? తన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా? ’ అనుకుంటోంది. 'తను తల్లి తండ్రులకు కూడా తన ఇబ్బందిని చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సి వస్తుందేమో’. అలా ఆలోచిస్తున్న సమీర ముందుగా అత్తమామలకు చెప్దామనుకుంది.

అందుకని ఉత్తరం వ్రాయడానికి తన పెట్టెలో అప్పుడప్పుడూ అమ్మావాళ్ళకు వ్రాయడం కోసం తెచ్చుకున్న ఖాళీ ఉత్తరాన్ని తీసుకుంది.

అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరాన్ని వాళ్ళ సహాయకుడు ఇంట్లో ఇచ్చానని చెప్తే తను అప్పుడు ఇవ్వవలసి వస్తుంది. అలా తను వెంటనే ఇవ్వలేదని అనిపించుకోవడం కంటే తనే ఇస్తే బాగుంటుంది అనుకుంది. అయినా ఆ ఉత్తరాన్ని ఇంకొక పేపర్ లో పూర్తిగా ఉన్నదున్నట్లు వ్రాసి పెట్టింది. నకలు (zerox) తీసిపెడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు శ్రీకృష్ణ భోజనానికి వస్తాడు. మధ్యాహ్నం చూడాలి అనుకుంది.

ముందుగా అత్తమామలకు ఉత్తరం వ్రాసింది. మధ్యాహ్నం బియ్యం పిండి పట్టించుకు రావడానికి సంచిలో బియ్యం, ఉత్తరం తీసిపెట్టుకుంది. పాప ఇంకా నిద్ర లో ఉంది. లేవగానే శ్రీకృష్ణకు పాపను ఇచ్చి ‘పిండి సంచీ తీసుకొని వ్రాసిన ఉత్తరం ఉత్తరాల డబ్బాలో వేసి, వచ్చిన ఉత్తరాన్ని నకలు తీసుకొని రావాలి’ అని ఆలోచించి డబ్బులు కూడా తీసి పెట్టుకుంది. కృష్ణ వచ్చిన తరువాత కూడా మనసులో కోపం కట్టలు తెంచుకుంటూ ఉన్నా బయట పెట్టకుండా శాంతంగా ఉంది. అనుకున్నట్లుగానే అతను భోజనం చేసిన వెంటనే తను పిండికోసం వెళ్ళినట్లుగా వెళ్ళింది. పని పూర్తి చేసుకొని వచ్చింది.

అతను మళ్ళీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు నకలు ఉత్తరాలను జాగ్రత్త చేసి పెట్టింది. అసలు ఉత్తరాన్ని మళ్ళీ ఒకసారి చదివింది.

“ప్రియమైన శ్రీవారికి, మీరు వారం నుంచి ఇంటికి రావడం లేదు. నేను మిమ్ములను చూడకుంటే ఉండలేకుండా ఉన్నాను. ఊరినుంచి రాగానే మీరు రావాలి. ఇట్లు.. మీ భార్య గీత” అని సంతకాన్ని కూడా వయ్యారంగా పెట్టింది. ‘వీళ్ళిలా ఎవరికీ తెలియకుండా ఎప్పటినుండి ఉత్తరాలు వ్రాసుకుంటూ ఉన్నారో? ’ అనుకుంది సమీర.

ఉత్తరం జాగ్రత్తగా లోపల పెట్టింది. మూడు రోజులకు అత్తమామల నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం వచ్చేటప్పటికి కృష్ణ ఇంట్లో లేడు. సమీరకే వ్రాశారు మామగారు. ‘మీ మేనమామ కూతురి గురించి మాకు తెలుసులే. నువ్వు మమ్ములనేంటి అనేది? ’ అని వ్రాశారు. తన కొచ్చిన కష్టాన్ని తల్లి తండ్రులకు కూడా చెప్పకుండా ముందు అత్తమామలతోనే ‘ఇక్కడ గీత అనే ఆవిడ మీ కొడుకు భార్యంటూ ఉత్తరం వ్రాసింది. నేనేం చెయ్యాలి? ’ అని కష్టాన్ని చెప్పుకుని వ్రాస్తే వాళ్ళ సమాధానం అది.

సమీర మేనమామ చిన్న కూతురు పదవ తరగతి చదువుతూ ఒక క్రిస్టియన్ ను ప్రేమించి, వాళ్ళన్నయ్య సాక్షి సంతకంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అందులో సమీర చేసిందేముంది? కానీ ఇక్కడ కొడుకు చేసే తప్పుకు తల్లితండ్రులు బాధ్యత వహించాలి కదా? ‘కోడలికి ఎంత కష్టం వచ్చిందో? ’ అని అనుకోకుండా కోడలినే నిందిస్తున్నారు.

ఇంత బాధ్యతా రహితంగా ఎంతమంది తల్లితండ్రులు అంటారు? అనుకొని పెదవి విరిచింది సమీర. ఇక అక్కడనుండి ఏ సహాయమూ రాదని అర్థమైంది. తప్పు చేసిన కొడుకును వెనకేసుకొని వస్తున్న వారి దౌర్భాగ్యానికి వాళ్ళను వదిలేయాలి అనుకుంది.

అయితే సాయంత్రం అనుకోకుండా శ్రీకృష్ణ వస్తూనే“నాకు ఉత్తరం వచ్చిందటగా. మా సేవకుడు ఈరోజే సెలవు నుంచి వచ్చి చెప్పాడు. నాకు ఇవ్వలేదే” అన్నాడు.

సమీర ఉత్తరం ఇద్దామని లేవబోతుండగా“ నా కొచ్చిన ఉత్తరాన్ని నాకివ్వకుండా ఇన్ని రోజులు దాచిపెట్టావా? నీ కెంత ధైర్యం? ఏం చూసుకొని అంత పొగరు?“ అంటూ దగ్గరకొచ్చి విసురుగా జబ్బ పట్టుకొని తోశాడు. పడబోయి నిలదొక్కుకుంది సమీర. చంటిపాప ఏడుస్తోంది ఈ అరుపులకు.

కృష్ణ ఇవేమీ పట్టించుకోకుండా బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు. సమీరకు రోషమొచ్చింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. తను ఉత్తరం ఇద్దామనే అనుకుంది. కానీ అతని ప్రవర్తన చూసి ఆ నిర్ణయం మార్చుకొని ఎదురుగా గూట్లోనే ఉన్న ఉత్తరాన్ని తీసి ఇంట్లోనే అతను వెతకలేని ప్రదేశంలో పెట్టింది.

పిల్లను తీసుకొని సముదాయించింది. అతను వచ్చి“ఉత్తరమెక్కడా?” అన్నాడు.

 సమీర పలకలేదు. అతనివైపు చూడలేదు. వళ్ళో పిల్లతో అలాగే కూర్చుంది సమీర. అతను ఆమె బట్టల పెట్టెలో బట్టలన్నీ చెల్లా చెదురు చేసి వెతికాడు. ఉత్తరం దొరకలేదు. ఇంట్లో గిన్నెలు, బట్టలు అన్ని విసిరేశాడు. చలించలేదు సమీర. మళ్ళీ వచ్చి ఆమె వీపున, మొహం మీద పిడికిలితో గుద్దాడు, ‘ఉత్తరం ఇస్తావా, లేదా? ’ అని. అయినా సమీర కూర్చున్న చోటనుంచి లేవలేదు.

 కొద్ది సేపటికి అన్నం పెట్టుకొని తిని బయటకు వెళ్ళాడు.

 పక్కవీధిలో ఉండే గీత ఇంటికే వెళ్ళి ఉంటాడు అనుకొని గోడకు జారిగిలబడింది. మనసులో వెయ్యి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అన్నం తినాలని అనిపించలేదు. కడుపులోనుంచి ఉండలు చుట్టుకొని దుఃఖం వస్తోంది సమీరకు.

 పిల్లకోసమైనా అన్నం తినాలనుకుంది కానీ తినలేకపోయింది. ఆ రాత్రి పక్క మీద నరకం చూపించాడు సమీరకు. అయినా సమీర తొణకలేదు.

తన దగ్గరున్న జ్వరం మాత్ర వేసుకొని పడుకుంది.

 ఉదయాన్నే జ్వరం వల్ల లేవలేకపోయింది. ఎప్పుడో నిధానంగా లేచింది. పిల్లకు పాలు కలిపి పట్టించి, మళ్ళీ పడుకుంది. పక్కనే పాప కూడా నిద్ర పోతోంది.

 ఎప్పటికో మెలుకువ వచ్చింది. కడ్డీల తలుపు బైట గడియ పెట్టీ వెళ్ళినట్లున్నాడు అనుకొని తనవి, పాపవి కొన్ని బట్టలు తన బంగారు, డబ్బు సంచీ లో సర్దుకుంది. రాత్రి మిగిలిన అన్నం కొంచెం తిన్నది. లేకుంటే శక్తి వుండదని ఆలోచించింది. సమీర ఇంటికి తాళం వేసి తాళం చెవి కూడా తనే తీసుకొని బైటికొచ్చి సాయంత్రానికి తన వూరికి వచ్చేసింది పాపతో సహా.

 ఒళ్ళు తెలియని జ్వరంతో ఉన్న కూతురిని చూసి కన్నీరు మున్నీరయ్యారు తల్లి తండ్రులు. రెండు రోజులకు నెమ్మదిగా తేరుకొని పెళ్ళి అయినప్పటి నుంచి శ్రీకృష్ణ విశ్వరూపాన్ని వివరంగా వివరించింది తల్లితండ్రులకు. గీత వ్రాసిన ఉత్తరాన్ని కూడా చూపించింది. నకలు ఉత్తరాలు కూడా ఇచ్చింది. అత్తమామల జవాబు కూడా చూపించింది.

“ఇంత కష్టాన్ని మనసులో ఉంచుకుని ఎంత బాధపడ్డావు తల్లీ?” అని బాధ పడ్డారు తల్లి తండ్రులు.

“ఇంక నువ్వు అక్కడికి వెళ్ళవద్దమ్మా. ఇక్కడ నీకేమీ ఇబ్బంది లేదు. నువ్విక్కడే వుండు. ఏవైనా పరీక్షలు వ్రాసి ఉద్యోగం తెచ్చుకుందువు గానీ” అన్నారు వాళ్ళు, పాపను ఎత్తుకొని ఆడిస్తూ.

 విషయం తెలిసి సమీర అన్నా, వదినా వచ్చి చూసి, ధైర్యంగా ఉండమని ముగ్గురికీ చెప్పి వెళ్ళారు.

 రెండురోజుల తరువాత తెలిసిన వకీలు దగ్గరికి వెళ్ళారు, విడాకుల విషయం మాట్లాడటానికి.

 సమీర కొంచెం వెనుకంజ వేస్తోంది. ‘విడాకులు తీసుకున్నామంటే బంధువులు చిన్న చూపు చూస్తారేమో ’నని.

 అసలే చిన్న చిన్న విషయాలకు విడాకులు తీసుకుంటూ మానవ సంబంధాలు తరిగి పోతున్న రోజులు. ‘మనమూ అలాగే నని అందరూ అనుకుంటా’ రని భయపడుతోంది.

“అలాగనుకోకు. బజారు తిరుగుళ్ళు తిరిగిన కొడుకును వెనకేసుకొచ్చి, విలువలు లేకుండా కొడుకును పెంచారు వాళ్ళు. పెళ్ళై, పిల్లలున్నా ఇతర ఆడవాళ్ళ దగ్గరకు వెళ్ళే ఇలాంటి వాళ్ళ వల్ల మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోందీ రోజుల్లో” అని వాళ్ళ నాన్న ధైర్యం చెప్పాడు.

“మీకు న్యాయం జరుగుతుంది. పాప మీ దగ్గరే ఉంటుంది. భరణం కూడా ఇప్పిస్తాన” ని చెప్పారు వకీలు గారు.

“కానీ ఆ డబ్బు నాకు వద్దు” స్థిరంగా అంది సమీర.

“అలా అనొద్దు. వాడికి భార్య విలువతెలిసి రావాలి. డబ్బు కొంచెమైనా వదలాలి. ఆడవాళ్ళను గౌరవించడం తెలియని దరిద్రుడు. భార్యను చిత్ర హింసలు పెట్టిన వాడికి తగిన శాస్తి జరగాలి. నీకు తీసుకోవడం ఇష్టం లేకుంటే, పాప పేరున వేద్దాం. లేదా ఏదైనా శరణాలయానికి ఇవ్వు” అన్నాడు వాళ్ళ నాన్న. అప్పుడు అంగీకరించింది సమీర.

 కూతురి నిజమైన కష్టాన్ని గుర్తించి ఆసరాగా ఉన్నారు తల్లితండ్రులు.

 మొదట విడాకులకు కృష్ణ వప్పుకోలేదు. కానీ కోర్టు లో ఆ ఉత్తరమే సాక్ష్యమయ్యింది. సమీర అతను మాట్లాడిన మాటలన్నీ వ్రాయించింది లాయర్ తో. కృష్ణ కాదనలేక పొయ్యాడు. అప్పుడు ఇద్దరి అంగీకారం తో కోర్ట్లో ఎటువంటి వాదనలు లేకుండా ఒక ఆరు నెలలకు విడాకులు శాంక్షన్ అయ్యాయి.

 తరువాత స్నేహితురాలైన మేనమామ పెద్ద కూతురుకు వివరంగా ఉత్తరం వ్రాసింది. తన కలలు కల్లలు అయినందుకు విచారిస్తూ, ఇన్ని రోజులూ తానీ విషయం చెప్పనందుకు క్షమించమని కోరుతూ వ్రాసింది. నాలుగు రోజుల తర్వాత రెక్కలు కట్టుకొని వాలారు అన్నా చెల్లెళ్ళు (మేనమామ కొడుకు, కూతురు) సమీరను చూడటానికి. ‘తన అన్న కొడుక్కు ఉద్యోగం లేదని ఆరోజు కాదనుకుని, కూతురిని ఉద్యోగమున్న వానికోసం ఎక్కడి వానికో ఉద్యోగస్తుడికి ఇచ్చినందుకు తన కూతురికి ఎంతకష్టమొచ్చింది? ’ అనుకొని బాధ పడింది సమీరా వాళ్ళమ్మ. వాడి మనసులో ఇంత విషముందని అప్పటికే పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నాడని తెలుసుకోలేక పోయాము కదా!? అని ఆక్రోశించిందామె మనసు.

 ఇంకా ఆరోజు సాయంత్రం అన్నా చెల్లెళ్ళు వాళ్ళత్తయ్యతో చెప్పిన సంతోషకరమైన వార్త విని అందరూ సంతోషించారు.

“ఇప్పటికీ నేను సమీర అంటే ఇష్టపడుతున్నాను. మీకభ్యంతరం లేకుంటే విడాకులు రాగానే సమీరను నేను పెళ్ళి చేసుకుంటాను. తన కష్టాన్ని నేను పంచుకుంటాను పాపతో సహా. ఈ విషయం అమ్మా నాన్న తో చెప్పే వచ్చాము మేము. ఇంకొక విషయం కూడా ఏమిటంటే నాకు ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. ఈ వార్త మీకందరికీ సంతోషాన్నిస్తుందని అనుకుంటున్నాను. రేపు వారం చేరాలి” అన్నాడు ఆమె అన్న కొడుకు వసంత్.

“కానీ నాకొక కూతురు కూడా ఉంది. అభ్యంతరం లేదా?” అన్నది దీనంగా.

“ఏమీ లేదు. నువ్వంటే ఇష్టమైతే నీకూతురంటే కూడా నాకు ఇష్టముండాలి కదా” అన్నాడు వసంత్ పాపను ఎత్తుకుంటూ.

“నాయనా…వసంత్, పెద్దమనసుతో నువ్వు పెళ్ళి చేసుకుంటానన్నావు. కానీ రేపు సమాజం నిన్ను ఎగతాళి చేయవచ్చు. అప్పుడు సమీర మీద కోపం వస్తుందేమో?” సందేహంగా అన్నాడు సమీర వాళ్ళ నాన్న.

“ లేదు మామయ్యా. నేను పాపకు తండ్రి నవ్వాలని అనుకున్నప్పుడే నేను వయసుకు మించిన మనసును

కలిగి ఉన్నట్లనిపించింది. సమీరకు వచ్చే భరణం నాకు కూడా అవసరం లేదు. మీరు ధైర్యంగా, పూర్తి నమ్మకంతో సమీరను నాకివ్వండి. ప్రశాంతంగా ఉండండి” అన్నాడు వసంత్ అత్తయ్య, మామయ్య కాళ్ళకు నమస్కారం చేస్తూ.

 వింటున్న సమీరకు పెద్దమనసుతో బావ వసంత్ వంటరి అయిన తన ఎడారి జీవితంలోనికి వసంతం తీసుకొస్తున్నట్లనిపించింది.

Lisää kommentteja