మృత్యోర్మా అమృతంగమయ
మృత్యోర్మా అమృతంగమయ (Author: గన్నవరపు నరసింహ మూర్తి)
తమిళనాడు యాత్ర చేద్దామని నా శ్రీమతి అనుపమ ఎప్పట్నుంచో చెబుతున్నా నేనే నా ఆఫీసు పనుల వత్తిడి వల్ల వాయిదా వేస్తూ వచ్చాను. ఇన్నాళ్ళకు నాకు తీరిక దొరకడం వల్ల ఈ వారం తమిళనాడు యాత్రకి శ్రీకారం చుట్టాము. మా పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళైపోయి దూరంగా ఉండటంతో పాటు శెలవుల సమస్య వల్ల వాళ్ళు రామన్నారు. అందువల్ల నేను, నా భార్య అనుపమ ఇద్దరమే బయలుదేరాము. నాక్కూడా ఎప్పట్నుంచో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలు చూడాలని ఉంది. మరీ ముఖ్యంగా మహాబలిపురంలోని శిల్పాలు, కంచి, అరుణాచలం, చిదంబరం, శ్రీరంగం లాంటి ప్రసిద్ధ దేవాలయాలతో పాటు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, అక్కడికి దగ్గర లోని త్యాగయ్య పుట్టిన ఊరైన తిరువాయూరు చూడాలని నా కోరిక. అనుపమకు మాత్రం రామేశ్వరం, మధుర వెళ్ళి అక్కడి దేవాలయాలను దర్శించుకోవాలనే కోరిక.
ఏదైతేనేం ఇన్నాళ్ళకు హౌరా మెయిల్లో బయలుదేరి చెన్నై చేరుకొని మా రైల్వే గెస్ట్ హౌస్ లో దిగాము. ఆ మర్నాడుదయాన్నే ట్రావెల్ ఏజన్సీ వాళ్ళ కారు వచ్చి మా ఇద్దర్ని పికప్ చేసుకుంది. మొదటిరోజు మహాబలిపురం బయలుదేరాము. చెన్నై నుంచి అక్కడికి గంటన్నర ప్రయాణం. మహాబలిపురం చాలా పురాతనమైన చారిత్రిక ప్రదేశం. అక్కడ బ్రహ్మాండమైన శిల్పాలు ఉన్నాయి. అలాగే బీచ్ దగ్గర ఉన్న షోర్ టెంపుల్, పాండవుల ఏకశిలా రథాలు, శ్రీకృష్ణుడి బట్టర్ బాల్ చాలా బాగున్నాయి. నా భార్య అనుపమకు ఆ శిల్పాలు బాగా నచ్చాయి. ఆ తరువాత అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాము. అక్కడ శివుడి గుడిచాలా పురాతనమైనది. అరుణాచలేశ్వరుడి దర్శనం తరువాత అక్కడికి దగ్గర్లోని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. ఆ ఆశ్రమంలో రమణ మహర్షి 1922 నుంచి 1950 వరకు ఉన్నారని అక్కడివాళ్ళు చెప్పారు. అక్కడ ధ్యానమందిరంలో నేను, అనుపమ కాసేపు యోగా చేసాము.
ఆ తరువాత మేము కంచి బయలుదేరాము. అప్పటికి సమయం సాయంత్రం అయింది. ఆ రాత్రి అక్కడే బస చేసి ఆమర్నాడు కామాక్షి దేవిని దర్శించుకొని కంచి పీఠానికి వెళ్ళాము. ఆ పీఠం చాలా విశాలంగా ఉంది. ఈ పీఠాన్ని కూడా ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారనీ అక్కడ వ్రాసి ఉంది.
ఆ తరువాత చిదంబరం వెళ్ళాము. అది కూడా చాలా పురాతనమైన నటరాజస్వామి దేవాలయం. అక్కడ దేవాలయ రాజగోపురాలపై ఎన్నో పురాతన శిలాశాసనాలు ఉన్నాయి. అక్కడ నుంచి కుంభకోణం వెళ్ళాము. అది దేవాలయాల నగరం. అక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. ఆ రాత్రి కుంభకోణంలో బసచేసి మర్నాడుదయాన్నే కుంభేశ్వరస్వామి, సారంగపాణి ఆలయాలను దర్శించుకున్నాము. ఇవి కూడా చాలా పురాతనమైన ఆలయాలు. ఇవన్ని చోళరాజులు నిర్మించారు.
ఆ తరువాత మేము తంజావూరు వెళ్ళాము. అక్కడ ఉన్న బృహదీశ్వర ఆలయం చాలా పురాతనమైనది. నాకు అక్కడి ఆలయ శిల్పసంపద బాగా నచ్చింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు రాజరాజు చోళుడు నిర్మించాడనీ స్థల పురాణంలో వ్రాయబడింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ ఆలయంలో ప్రధాన ఆలయం రాజగోపురాల కన్నా ఎత్తుగా ఉండటం విశేషం. మా దర్శనం పూర్తయ్యేసరికి 12 గంటలైంది. అక్కడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి జన్మస్థలమైన తిరువాయూరు వెళ్ళి అతని సమాధిని చూసాము.
అక్కడ నుంచి తిరుచురాపల్లి బయలుదేరాము. అక్కడికి శ్రీరంగం 5 కిలోమీటర్లు. అక్కడి శ్రీరంగనాథుడి ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈ ఆలయం కావేరినది ఒడ్డున ఉంది. ఇక్కడ శ్రీ రంగనాథుడు శయనించే భంగిమలో ఉంటాడు. ఈ ఆలయం మాకు బాగా నచ్చింది. ఆ రాత్రి అక్కడ బసచేసి ఆ మర్నాడుదయాన్నే రామేశ్వరం బయలుదేరాము.
చెప్పాలంటే అనుపమ వచ్చింది రామేశ్వరం చూడాలనే. రామేశ్వరం భారతదేశానికి చివర ఉన్న ఒక ద్వీపం. ఇక్కడ రామనాథ స్వామి ఆలయం చాలా గొప్ప పురాతన ఆలయం. ఈ రామేశ్వరం ద్వీపాన్ని పంబన్ సముద్ర పాయ మిగతా దేశం నుంచి విడదీస్తోంది. ఇది బంగాళా ఖాతం యొక్క చిన్న పాయ. దీని మీదే పంబన్ వంతెనని నిర్మించారు. రామేశ్వరం వెళ్ళాలంటే ఈ వంతెన మీద నుంచే వెళ్ళాలి. రామేశ్వరం మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జన్మస్థలం. అక్కడ అతని మ్యూజియం, ఇల్లు కూడా వున్నాయి. మేము అతని సమాధిని, ఇంటినీ చూసి, తరువాత అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి చివరి భూభాగమైన ధనుష్కోడి వెళ్ళాము. ధనుష్కోడి దగ్గర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల సంగమ స్థలం చాలా బాగుంది. ప్రతీ రోజూ ఆ ప్రదేశాన్ని చూడటానికి వేలమంది వస్తుంటారు. ధనుష్కోడి, శ్రీలంకల మధ్య ఉన్న ప్రాంతాన్ని పాక్ జలసంధి అంటారు. అక్కడే శ్రీరాముడు లంకకు వెళ్ళి సీతను విడిపించడానికి రామసేతువు నిర్మించారనీ రామాయణ పురాణ కథనం. ఆ రాత్రి రామేశ్వరంలోని హోటల్లో బసచేసి మర్నాడు తెల్లవారి 5 గంటలకు రామనాథస్వామి ఆలయానికి వెళ్ళి శివుడి స్ఫటిక లింగాన్ని దర్శించుకున్నాము. ఆలయం లోపల ఆలయ శిల్పసంపద అద్భుతంగా ఉంది. అంతటి విశాలమైన నడవ ఉన్న ఆలయం ఇంకెక్కడా లేదు. రావణున్ని జయించిన తరువాత శ్రీరాముడు ఇక్కడ శివుడి ఆలయం నిర్మించడాని చెబుతారు. ఆ తరువాత మేము సముద్ర స్నానానికి వెళ్ళాము. అప్పటికి సమయం ఆరు గంటలైంది. అప్పుడే సముద్రంలోంచి సూర్యుడు సిందూర వర్ణంతో బయటకు వస్తూ కనిపించాడు. బాలభానుడి కిరణాలు సముద్రం మీద పరావర్తనం చెంది సింధూర వర్ణంలోకి మారిపోతున్న దృశ్యం అద్భుతంగా కనిపించసాగింది. ఆ సముద్రం ఒడ్డున చాలామంది తమ పితృ దేవతలకు పిండ ప్రధానం చేస్తూ కనిపించారు. అక్కడ మన తెలుగు పురోహితులు చాలామంది తెలుగు యాత్రికుల పితృదేవతలకు పిండ ప్రధానం చేస్తూ కనిపించారు. ఆ దృశ్యాలను చూడగాన నాకు కూడా నా తల్లిదండ్రులకు కూడా పిండ ప్రధానాలు చెయ్యాలనీ అనిపించింది. ఇంతలో నా దగ్గరకు 40 ఏళ్ళ వయసున్న ఓ పురోహితుడు వచ్చాడు. నల్లగా నుదుట విభూతి నామాలు, బొట్టు, పంచె, ఉత్తరీయంతో ఉన్న ఆ వ్యక్తిని చూడగానే తెలుగువాడిలా అనిపించాడు.
``సార్! నమస్కారం! నా పేరు రామేశ్వర శర్మ. పితృకర్మలు చేయమంటారా? `` అనీ అడిగాడు.
``ఆంధ్రాలో ఎక్కడ మీ ఊరు? `` అనీ అతన్ని అడిగాను.
``మాది రాజమండ్రి బాబూ! నేను పదేళ్ళ కిందట ఇక్కడికి వచ్చేసాను`` అని చెప్పాడతను.
``ఇక్కడ పితృకర్మలు చాలామంది చేస్తున్నారు. కారణం ఏమిటి? `` అని అడిగాను అతన్ని.
``రామేశ్వరం ఓ గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీరాముడు రావణునిపై విజయం తరువాత ఇక్కడ శివుడి లింగాన్ని ప్రతిష్టించి పూజించాడు. అందుకే ఇది దివ్యమైన ప్రదేశం. చాలామంది భక్తులు మొదట కాశీ వెళ్ళి, అక్కడ శివుణ్ణి దర్శనం చేసుకొని, తమ పిత్రుదేవతలకు గంగా నదిలో పిండ ప్రదానం చేసి, అక్కడి గంగను రామేశ్వరం తెచ్చి ఇక్కడి సముద్రంలో కలుపుతారు. అప్పుడే వాళ్ళ యాత్ర సంపూర్ణమవుతుంది. కాశీలో తమ పితృ దేవతలకు పిండ ప్రదానం చేసినవాళ్ళు ఇక్కడ కూడా చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతునాయి. అందుకే ఇక్కడ కొచ్చి ఈ సముద్రం ఒడ్డున తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు`` అని చెప్పాడతను.
``ఇంతకీ పితృకర్మలు ఎలా చేస్తారు? `` అని అతన్ని అడిగాను.
నేను ప్రశ్నిస్తుంటే అనుపమ ఆసక్తిగా మా సంభాషణలను వింటోంది.
అతను నా ప్రశ్నకు కొద్దిసేపు మౌనం వహించి తరువాత చెప్పడం మొదలు పెట్టాడు. ``పితృ దేవతలంటే కేవలం గతించిన మన పెద్దలు కారు. మనందరి పుట్టుకలు , గతులను నియంత్రించే దేవతలు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలగు దేవతలను పితృ దేవతలంటారు. కర్మక్షయం కాని జీవుడు మరణించిన తరువాత మళ్ళీ పుడతాడు అనేది నిజం. కానీ ఎప్పుడు పుడతాడో తెలియదు. అది తను చేసుకున్న కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి వారికి మనం చేసే పితృకర్మల ఫలితం అందుతుంది. వారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే మనం పెట్టేది వారికి ఆహారం రూపంలో అందుతుంది. అలా చేస్తే పితృదేవతలు సంతోషించి మనకు మంచి చేస్తారు. గతించిన వారికి తన పూర్వీకులతోను, తన తరువాత తరం వారితోను సంబంధం ఉంటుంది. వారు మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తారు. పెళ్ళై, పిల్లలు ఉన్నవారు పితృకర్మలు సరిగ్గా చేస్తే పున్నామనరకబాధలు తప్పుతాయనని శాస్త్రాలు చెబుతునాయి`` అని వివరంగా చెప్పాడు అతను. నాకు అతను చెప్పిన సమాధానం నచ్చింది.
``సరే! మా పితృదేవతల పిండ ప్రదానానికి ఎంత తీసుకుంటారు? `` అని అడిగాను. ``రెండువేల రూపాయలు. సామగ్రి అంతా నాదే. గంటసేపు క్రతువు ఉంటుంది. స్నానం చేసి మీరొక్కరే కూర్చోవాలి`` అని చెప్పాడు.
ఇంతలో అనుపమ ``పంతులుగారూ! నేను మా తల్లితండ్రులకు పిండ ప్రదానం చెయ్యవచ్చా? `` అనీ అడిగింది.
``అమ్మా! సాధారణంగా కొడుకులే చెయ్యాలి. స్త్రీలు చెయ్యడం నిషిద్ధం. ఏం మీకు అన్నదమ్ములు లేరా? `` అని అతను అడిగాడు.
ఆ ప్రశ్నకు పరిమళ సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చింది.
``పంతులు గారూ! ఈమె అన్నయ్య అమెరికాలో ఇంకో మతానికి చెందిన విదేశీ అమ్మాయిని పెళ్ళాడాడు. అది వీళ్ళ కుటుంబానికి నచ్చక అతన్ని దూరం పెట్టారు`` అనీ ఆతనితో చెప్పాను.
``అలా అయితే అల్లుడైన మీరు మీ అత్తమామలకు పిండ ప్రదానం చెయ్యవచ్చు. అప్పడు ఆ ఫలం వారికి దక్కుతుంది`` అని నాతో చెప్పాడతను. అతని మాటలు విన్న పరిమళ నావైపు కోపంగా చూస్తూ ``ప్రతీ సంవత్సరం మా అమ్మ నాన్నలకు తద్దినం పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా ఈయన వినటం లేదు`` అంది కోపంగా.
``కొడుకు ఉండగా నేనెలా పెట్టగలను చెప్పండి? అనుపమ! ఇప్పుడవన్నీ ఎందుకు చెప్పు? మీ అమ్మ నాన్నలకు కూడా నేను పిండ ప్రదానం చేస్తానులే`` అన్నాను ఆమెను సముదాయిస్తూ.
ఆ తరువాత అతను ఓగంట సేపు ఆ క్రతువుని సముద్రపు ఒడ్డున జరిపించాడు. నా చేత పూజానంతరం నా తల్లితండ్రులకు, నా అత్తమామలకు పిండ ప్రదానం చేయించి, సముద్రంలో వాటిని నిమజ్జనం చేయించాడు. ఆ క్రతువు పూర్తైన తరువాత నేను, అనుపమ సముద్రంలో స్నానం చేసి బట్టలు మార్చుకొని రామేశ్వర శర్మ గారికి రెండు వేల రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి ఆ తరువాత అతని కాళ్ళకు దండం పెట్టాము. అతను ఆ డబ్బులు తీసుకొని నన్ను ఆశీర్వదించాడు.
``శర్మ గారూ! మీ దయ వల్ల నా తల్లితండ్రిలకూ, అత్తమామలకూ పిండ ప్రదానం చెయ్యగలిగాను. అవి వారికి చెందుతుందా లేదా అన్నది అప్రస్తుతం. కానీ దీని ద్వారా వాళ్ళను స్మరించుకునే అవకాశం కలిగింది. అందుకు మీకు కృతజ్ఞతలు`` అనీ చెప్పాను.
``అయ్యా! మీరు చెప్పింది నూరుపాళ్ళూ నిజం. పితృకర్మలు చేస్తే అది వాళ్ళకు చెందుతాయా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆ రూపంలో మనకు జన్మనిచ్చిన తల్లితండ్రుల్ని, పూర్వీకుల్నీ తలచుకునే అవకాశం మనకు కలుగుతుంది. అదే ముఖ్యం. పాప పుణ్యాలు అన్నది ముఖ్యం కాదు`` అని చెప్పాడు. ``శర్మగారూ! మీరు ఆంధ్రా లోని మీ ఊరు రాజమండ్రికి వెళుతుంటారా? అక్కడ మీ తల్లితండ్రులు ఉన్నారా? `` అని అడిగాను.
అతను నా మాటలకు కొద్దిసేపు మౌనం దాల్చి చెప్పడం మొదలు పెట్టాడు.
"మాది అపర కర్మలు చేసే పురోహిత కుటుంబం. నేను మా వారసత్వమైన ఈ అపర కర్మల్ని నేర్చుకుంటూనే ఇంటర్ చదువుకున్నాను. అప్పుడు నాతో పాటు చదువుకున్న అపర్ణని ప్రేమించాను. కానీ ఆమెది మన బ్రాహ్మణ కులం కాదు. అందువల్ల మా నాన్నగారు మా వివాహానికి ఒప్పుకోలేదు. అయినా నేను మా కుటుంబాన్ని ఎదిరించి అపర్ణని వివాహం చేసుకున్నాను. అక్కడే ఉంటే వేరే కులం అమ్మాయిని పెళ్ళి చేసుకున్న నాచేత బ్రాహ్మణులెవరూ కర్మకాండలు చేయించుకోరనీ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నా గురించి ఎవ్వరికీ తెలియదు. నా జీవితం హాయిగా గడిచిపోతోంది. నాకిద్దరు పిల్లలు. వాళ్ళు బాగా చదువుకుంటునారు. ఇక్కడే నేను ఇల్లు కూడా కట్టుకున్నాను. ఈ కులాలు, మతాల పట్టింపులు మనుషుల్ని వేరు చేస్తునాయి. మనిషికి ధర్మగుణం, సత్ప్రవర్తన, సజ్జన సాంగత్యం ఇవి ముఖ్యం. ఎంతటి గొప్ప పండితుడైనా సరియైన నడవడిక లేకపోతే అతను మనిషి కాడు. ఈ ధర్మం తెలుసుకుంటే ఏ విధమైన రాగద్వేషాలూ ఉండవు``.
``చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః`` అనీ పురాణాల్లో చెప్పబడింది. నాలుగు వర్ణాలు అన్నవి మానవుల గుణములు, కర్మలననుసరించి సృష్టించబడ్డాయి. అలాగే ``అశోచ్యా నన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతా సూంశ్చ నాను శోచంతి పండితాః " అనీ గీతలో చెప్పబడింది. పండితులైన వాళ్ళెవరూ బతికున్నవాళ్ళ గురించి గాని, మరణించినవారి గురించి కానీ ఏ మాత్రం దుఃఖించరు. "మృత్యోర్మా అమృతంగమయ", ఇదే దీని పరమార్థం” అనీ చెప్పి అతను నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు రామేశ్వర శర్మ.
అతను వెళ్ళిన చాలా సేపటి వరకూ నేను మనిషిని కాలేకపోయాను. ఆతను వెళ్ళిపోయినా అతను చెప్పిన "మృత్యోర్మా అమృతంగమయ" అన్న వాక్యం నాకు పడే పదే పదే గుర్తుకు రాసాగింది. ఆ మర్నాడు మేము మదురై వెళ్ళి కామాక్షిని దేవిని దర్శించుకొని విశాఖపట్నం తిరిగి వచ్చేసాము.
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)