సారంగి
సారంగి (Author: పామర్తి వీర వెంకట సత్యనారాయణ)
టీచర్ తరగతికి రావడానికి ఇంకా ఐదు నిముషాల వ్యవధి ఉంది. అత్యవసరంగా వొంటేలుకు వస్తోంది నాకు. వెళ్ళి టీచర్ వచ్చేలోపున తిరిగివచ్చేయాలి. తాను తరగతి గదిలో అడుగు పెట్టేసరికి ఎవరు తమ చోటుల్లో లేకపోయినా తిడుతుంది. మరీ ఆలస్యంగా వెళ్ళితే ఆ పీరియడ్ అంతా బల్లమీద నిలుచోబెడుతుంది. అసలే నేనంటే అకారణ క్రోధం. ఎందుకో!
నిజానికి ఎప్పటినుంచో వొంటేలుకు వెళ్ళాలనిపిస్తున్నా వెళ్ళలేదు నేను, మరుగుదొడ్ల దగ్గర ఇతర విద్యార్థులు ఉంటారని! టీచర్ వచ్చే వేళకు అంతా తమ తమ తరగతులకు వెళ్ళిపోతారు. ఆ సమయంలో వెళ్ళొస్తుంటాను. దొంగలాగ!
ఒత్తిడి అధికం కావడంతో ఇక ఆగలేక లేచి తరగతి గదిలోంచి బయటకు పరుగెత్తాను నేను. తీరా మరుగుదొడ్డి దగ్గరకు వెళ్ళేసరికి నా కాళ్ళు బంధం వేసినట్టుగా హఠాత్తుగా ఆగిపోయాయి. అమ్మాయిల విభాగంలో పైన రాసివున్న అక్షరాలే అందుకు కారణం.
‘గాళ్స్ ఓన్లీ’…!
‘ఓన్లీ! ’ అన్న పదం పెద్ద అక్షరాలతో ‘గాళ్స్’ పక్కను రాయబడివుంది. కొత్తగా!
ముందురోజు ఆ పదం లేదు. ఇప్పుడు హఠాత్తుగా వెలసింది! పక్కనున్న విభాగం వైపు చూసాను. ‘బాయ్స్’ అని వుంది. ఎప్పటిలాగే. గాళ్స్ రూమ్ కి ‘ఓన్లీ’ అని జోడించింది ఎవరు…!? ఎందుకు?... నా కోసమేనా???
ఏం చేయాలో పాలుపోలేదు నాకు. లోపల ప్రవేశించవచ్చో లేదో బోధపడలేదు. నాకు గాళ్స్ యూరినల్స్ కి ప్రవేశం లేకుండా చేయడానికే ఎవరో అలా రాసారని అర్థమయింది. నేను లోపలికి వెళ్ళడం ఎవరైనా చూసారంటే పెద్దగొడవే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? బాయ్స్ వాష్ రూమ్ ని వాడనివ్వరు. గాళ్స్ ది కూడా నిషిద్ధం అంటే… ఏమయిపోవాలి నేను? నాలాంటి వాళ్ళు ఏమయిపోతారు? ఎక్కడికి పోతారు??
బాయ్స్, గాళ్సూ తప్పితే ‘ఇతరులు’ ఉండరా? వాళ్ళు మనుషులు కారా? మనిషన్నాక కాలకృత్యాలు, అవసరాలూ ఉండవా?? బ్లాడర్ నిండిపోయినట్టుంది. ఆపుకోవడం కష్టంగా ఉంది. మరోక్షణం ఆలస్యమయితే దుస్తులలోనే పోసేసుకునేలా వున్నాను… ఓసారి అటుఇటు దొంగచూపులు చూసాను. ఎవరూ లేరు. క్లాసులు ఆరంభం అవబోతున్నందున అంతా తరగతులకు వెళ్ళిపోయారు. లోపల కూడా ఎవరూ ఉండకూడదని మదిలోనే దేవుణ్ణి మొక్కుకుంటూ, చటుక్కున ‘గాళ్స్ ఓన్లీ’ వాష్ రూమ్ లో దూరేసాను…
*
నా పేరు సారంగి. పుట్టినప్పుడు ‘సారంగ్’ గా పుట్టాను. ఎదుగుతున్నకొద్దీ నాలో ఏవో మార్పులు కలగసాగాయి- మానసికంగా, భౌతికంగా. మగపిల్లలలో ఉండే చొరబాటుతనం, ధైర్యం కొరవడ్డాయి నాలో. అది మనిషియొక్క తత్వం అనుకునేవారు. కానీ, ఆడపిల్లలలో వుండే బెరుకు, సిగ్గు, బిడియం నన్ను వెనక్కి నెట్టేవి. మగదుస్తుల కంటే, ఆడపిల్లల బట్టలు తొడుక్కోవాలి అనిపించేది నాకు.
అదే విషయం ఓసారి అక్కతో అంటే,“చిన్నప్పుడు అమ్మ ముద్దుకొద్దీ నా గౌన్లు తొడిగి, జడవేసి పూలు పెట్టేది నీకు. బొట్టు, కాటుక పెట్టేది. అమ్మాయిలా తయారుచేసి మురిసిపోయేది. అదే నీకు వాటిమీద మక్కువ కలిగేలా చేసుంటుంది” అని నవ్వేసింది.
అక్క ఇంటి దగ్గర లేనప్పుడు ఎవరూ చూడకుండా అక్క బట్టలు తొడుక్కుని ఆనందించేవాణ్ణి. అక్కకూ, నాకూ మూడేళ్ళ తేడా వుంది. నేను ఎనిమిదో తరగతికి వచ్చేసరికి నా మనోభావాలలోనే కాదు, భౌతిక ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. నా తోటి పిల్లలతో కలవబుద్ధి వేసేదికాదు. ఆడపిల్లలతో జతకట్టి ఆడుకునేవాణ్ణి. ‘ఆ ఆడారి ఆటలు ఏమిట్రా నీకు? వెళ్ళి మగపిల్లలతో కలిసి క్రికెటో, ఫుడ్ బాలో ఆడుకోవచ్చుగా? ’ అంటూ మందలించేది అక్క. నాలో వస్తూన్న మార్పును ఎవరూ గమనించినట్టు లేదు. ఒకవేళ గమనించినా పెద్దగా పట్టించుకోలేదు.
ఓసారి ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను అక్కబట్టలు తొడుక్కుని, కళ్ళకు కాటుక పెట్టుకుని, పెదాలకు రంగు పూసుకుని, అమ్మ కొనుక్కున్న కనకాంబరం పూలను తలకు రిబ్బన్ తో కట్టి పెట్టుకుని… ఆడపిల్లలా ఒళ్ళంతా త్రిప్పుకుంటూ… అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ నృత్యం చేస్తూంటే- గుడికి వెళ్ళిన అమ్మ తిరిగిరావడం, నా వేషం చూడడం జరిగాయి. బుగ్గలు నొక్కుకుంటూ,“ఇదేం పనిరా?” అంది విస్మయంతో.
నాలో వచ్చిన, వస్తూన్న మార్పులను గురించి చెప్పడంతో నిశ్చేష్టురాలయింది అమ్మ. చాలసేపు నోటమ్మట మాట రాలేదు. తేరుకుని,” నీ ప్రవర్తన చూసి ఏదో ఆకతాయితనంతో అక్కను అనుకరిస్తున్నావు అనుకున్నానే కానీ, నీ పరిస్థితిని గుర్తించలేకపోయానురా నాయనా!” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ సంగతులేవీ ఎవరితోనూ చెప్పవద్దంది.
అనంతరం నాన్నగారితో చెప్పినట్టుంది, ఓ మానసికవైద్య నిపుణుడి వద్దకు తీసుకువెళ్ళారు నన్ను. ఆయన ఏం చెప్పారో తెలియదు, కొద్దిరోజులపాటు ఇంట్లో భయంకర స్థబ్ధత నెలకొంది. అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారడాన్ని ఓపట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరూను. సామాజికంగా, ఇతరత్రా ఆ పరిణామం వల్ల కలిగే ఫలితాలను ఊహించడానికే భయపడుతున్నట్టు కనిపించేవారు…
ఎలా పొక్కిందో, స్కూల్లో అందరికీ నా విషయం తెలిసిపోయింది. నా ప్రవర్తనలో కనిపిస్తూన్న మార్పు కూడా అందుకు ఓ కారణం కావచ్చును. దాంతో నా అవస్థలు మొదలయ్యాయి. ఇటు మగపిల్లలు, అటు ఆడపిల్లలూ కూడా నన్ను తమ బల్లల మీద కూర్చోనివ్వడంలేదు. దానికి తోడు పిల్లల తల్లిదండ్రులు కూడా నన్ను బళ్ళోంచి బహిష్కరించమనీ, నన్ను చూసి వాళ్ళ పిల్లలు చెడిపోతారనీ అంటూ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి గొడవ చేసారు. ఎటూ చెప్పలేని ఆయన వారికి ఎలాగో సర్దిచెప్పి, నాకు తరగతి గదిలో చివరలో ప్రత్యేకంగా ఓ బల్ల వేయించి కూర్చోబెట్టాడు.
పదవ తరగతికి వచ్చేసరికి సారంగిగా మారిపోయాను నేను. స్కూల్ రికార్డ్స్ లో కూడా పేరు మార్పిడి జరిగింది. స్కూల్ యూనిఫాం అమ్మాయిలది ధరించనారంభించాను. బాబ్డ్ హెయిర్ కి తోడు, కళ్ళకు కాటుక పెట్టుకోవడం ఆరంభించాను. అమ్మాయిలా తయారయి స్కూల్ కి వెళ్ళడం, మగపిల్లలను చూసి సిగ్గుపడడం అందరికీ వింతగా తోచేది.
క్లాస్ లో పిల్లలంతా నాతో మాట్లాడడం మానేసారు. అన్ని విషయాలలోను నన్ను వెలివేసినట్టుగా ప్రవర్తించేవారు. నా అంతట నేనుగా కల్పించుకుని మాట్లాడబోతే, ఛీత్కరించుకునేవారు. చివరికి, అంతవరకు నాతో సన్నిహితంగా ఉండే నా స్నేహితులు కూడా! బళ్ళో అందరూ, సిబ్బందితో సహా, నా వంక అదోలా చూసేవారు. ‘తేడాగాడు’ అన్న బిరుదు ఇచ్చారు నాకు. ఎవరినైనా ఏడ్పించాలంటే, ‘సారంగివేషాలు వెయ్యకు’ అని వెక్కిరించడం ఆరంభించారు. అదీ, నాకు వినిపించేలా!
బళ్ళో మరుగుదొడ్లు వాడనిచ్చేవారు కాదు నన్ను. అందువల్ల ఉదయం బడికి వస్తే, మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగివెళ్ళేవరకు ఉగ్గబెట్టుకుని ఉండవలసివచ్చేది నేను. దాంతో తరచు అనారోగ్యపు పాలవడం జరుగుతోంది. అందుకే ఒకోసారి ఆపుకోలేకపోయినప్పుడు, ఎవరూ చూడకుండా దొంగలా గాళ్స్ టాయ్లెట్ లో ప్రవేశించి నా అవసరం తీర్చుకోవడం జరిగేది.
అంతకు మునుపు స్కూల్ స్పోర్ట్స్ లోను, ఎక్స్ ట్రా-కరిక్యులర్ యాక్టివిటీస్ లోనూ చురుకుగా పాల్గొనడం జరిగేది. కానీ, ఇప్పుడు నన్ను దేనిలోకీ తీసుకోవడం మానేసారు. గేమ్స్ పీరియడ్ లో వేర్పాటుగా పెట్టేవారు. నేను శ్రద్ధగా చదువుకుని ఫస్ట్ మార్క్ లు తెచ్చుకోవడం అందరికీ కంటగింపుగా కూడా వుండేది.
స్కూల్ యూనియన్ ఎన్నికలలో అంతకుముందు ప్రచారంలో నన్ను కలుపుకునేవారు, ఇప్పుడు కనీసం ఓటు అడగడానికి కూడా నా దగ్గరకు రాకపోవడం విచారం కలిగించింది నాకు. ఈసారి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి పదవులకు అమ్మాయిలు ఎంపిక కావడం సంతోషం కలిగించింది నాకు. ఐతే నా సమస్యను వాళ్లకు చెప్పుకుని ఉపశమనం పొందవచ్చని ఆశించిన నాకు నిరాశే కలిగింది. వాళ్ళు ముగ్గురూ కూడా, అభినందనలు తెలపడానికి వెళ్ళిన నన్ను చూసి ముఖాలు త్రిప్పుకున్నారు…
నా సమస్యలు ఒక్క బడితోనే పోలేదు. బయట ఎక్కడికి వెళ్ళినా అదే అనుభవం. నగరంలో పెయ్డ్ టాయ్లెట్స్ రెండే రకాలు. మూడో రకానికి ప్రవేశం లేదు, డబ్బులు చెల్లించినా. సినిమాకు వెళ్ళితే, తమ పక్క సీటులో కూర్చోనివ్వరు ఎవరూ. ఫలితంగా థియేటర్ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించేవారు. ఆన్ లైన్ లో టికెట్ కొనుక్కుని వెళ్ళితే, లోపలికి వెళ్ళనివ్వరు. ఇది కొంత అతిశయంలా తోచవచ్చును. కానీ, ఇది నా అనుభవం!
షాపింగ్ మాల్స్ లోనూ అంతే! అంటరాని మనిషిలా దూరంగా ఉండడమే కాక నా వంక అనుమానంగా, అదోలా చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా హేళనలు, అవమానాలు, సూటిపోటి మాటలూ. బెంబేలెత్తిపోతోంది నాకు. నాది చిన్నవయసు అన్న జాలి కూడా లేదు ఎవరికీను. తప్పనిసరయితే తప్ప బయట తిరగడం మానుకున్నాను. ఓ విధమైన ఆత్మన్యూనతాభావం ఏర్పడిపోయింది నాలో.
ఓసారి అక్కతో కలసి ఎక్కడికో వెళుతూంటే, కొందరు నన్ను చూసి నవ్వడం, మాట్లాడుకోవడంతో అక్క ఇబ్బందిగా గురయింది.“ఇక వీడితో- సారీ, వీడు అనాలో ఇది అనాలో కూడా తెలియడంలేదు నాకు. తనతో ఇంకెక్కడికీ కలసి వెళ్ళమనకు నన్ను. నాకు తలవంపులుగా ఉంటోంది” అని అక్క అమ్మతో ఫిర్యాదు చేస్తూంటే, నిర్ఘాంతపోయాను నేను. అమ్మ అక్కను తిట్టింది కానీ, నా మనసు మాత్రం గాయపడింది- తోడబుట్టినదే అలా అంటూంటే.
అబ్బాయిగా పుట్టినా, కాలక్రమాన అమ్మాయిగా మారడం నా తప్పా!? అందుకు కారణమయిన హార్మోన్స్ నియంత్రణ నా చేతుల్లో ఉందా!? మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులూ నన్ను ఓ వింత జంతువులా చూస్తూ, వెక్కిరింపుగా చూపులు పరపుతూ వుంటే నాకు కంపరం ఎక్కినట్టుంటుంది.
“వేరే ఎక్కడైనా పెడితే మంచిది. లేకపోతే రేపు మీ అమ్మాయికి పెళ్ళిసంబంధాలు రావడం కష్టమే!” అంటూ వాళ్ళు ఉచితసలహాలు ఇస్తూంటే… నా మనసు విలవిలలాడిపోతుంటుంది. నాలో కోపం రగిలిపోయేది. అక్కడ నుంచి నిశ్శబ్దంగా తప్పుకునేవాణ్ణి. కన్నవారు కావడంతో అమ్మ, నాన్న ఎటూ మాట్లాడలేక, కన్నప్రేగును త్రెంపుకోలేక సతమతమయ్యేవారన్న నిజం నేను గ్రహించకపోలేదు. వారి వదనాలలో బాధ, నిస్సహాయత ద్యోతకమయ్యేవి.
‘ఎవరి బతుకులు వారిని బతకనివ్వక, ఓ నేరస్థుడిలా నన్ను పరిగణిస్తూంటే’- వాళ్ళను చంపడమో, నేను చావడమో చేయాలి అన్నంత కక్షగా వుండేది నాకు.
ఓసారి పల్లెటూళ్ళో వుంటూన్న మానాన్న పెద్దమ్మ మా ఇంటికి వచ్చింది. ఎనభయ్ పైనే వుంటుంది ఆవిడ వయసు. రాగానే పెద్దగొడవే చేసింది. నన్ను ఇంట్లో పెట్టుకుని వంశాన్ని సంకరం చేస్తున్నాం అంది. కుటుంబపు పరువుప్రతిష్ఠలు కాలరాస్తున్నాం అంది. నాలాంటివాళ్ళు ఉండే చోటుకు నన్ను వెంటనే పంపించేయమంది.
“వాడింకా పసివాడే, అమ్మా! చదువుకుంటూన్న కుర్రాడు. ఇంటి నుంచి గెంటేయమనడం ఏం సబబు? ఇందులో వాడి తప్పిదం ఏముందని?” అన్నారు నాన్న బాధగా. పిన్న వయసులోనే తల్లి పోతే, ఆవిడే పెంచిందట నాన్నను. అందుకే ఆమెను గట్టిగా ఎదిరించలేరాయన.
“ఆ చదువుకాస్తా పూర్తయితే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని తన బతుకు తాను బతుకుతాడు” అన్నారు మళ్ళీ.
“ఇలాంటి వాళ్ళకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరట. ఇలాంటి వాళ్ళకు ప్రత్యేకంగా సంఘాలో సమాజాలో ఉన్నాయని ఆలకించాను. వీళ్ళ బాగోగులు అవే చూసుకుంటాయట…” చెప్పింది ఆవిడ.“కావలిస్తే కాసిన్ని డబ్బులు కూడా ఇచ్చి పంపించు, చందాగా”.
అమ్మ, అక్క కొయ్యబారిపోయి చూస్తూ వుండిపోయారు. నాన్న తన అసహనాన్ని ఆపుకోవడానికి చేస్తూన్న ప్రయత్నం నాకు తెలుస్తూనే వుంది.
“చివరగా ఓ మాటరా, అబ్బాయ్! నువ్వింకా వీణ్ణి… ఖర్మ, ఖర్మ! వీడు అనాలో, ఇది అనాలో కూడా తెలిసిచావడంలేదు నాకు… నువ్విలాగే ఇంట్లో పెట్టుకుని ఊరేగావంటే బంధువులు ఎవరూ నీ గుమ్మం తొక్కరు. ఆ విషయం గుర్తుంచుకో!” అంది ఆవిడ దృఢస్వరంతో. నిర్ఘాంతపోయాం మేము.
ఆ విషయం హెచ్చరించడానికే వచ్చినట్టు, రెండు రోజులుండి వెళ్ళిపోయిందావిడ. ఉన్న రెండు రోజులూ నా నీడ కూడా తనవైపు పడకూడదన్నట్టు ప్రవర్తించింది- అంటు తగులుతుందన్నట్టు.
అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చేసాను నేను- “ఇలా నాకే ఎందుకు జరగాలమ్మా? నా కజిన్స్ అందరూ నార్మల్ గానే ఉన్నారుగా? నాలో ఏర్పడిన మార్పు నేను కోరితెచ్చుకున్నది కాదుగా? అందువల్ల ఇతరులకు వచ్చిన నష్టం ఏమిటి?” నన్ను ఓదార్చే ప్రయత్నంలో, అమ్మ కూడా భోరున ఏడ్చేసింది,“అంతా మన తలరాత!” అంటూ.
అక్క నా వంక జాలిగా చూసింది. “సారీరా! తెలియక ఆ రోజు నీతో బయటకు వెళ్ళడానికి సిగ్గుగా ఉందంటూ నిన్ను బాధపెట్టాను… నిన్ను తమ్ముడు అనాలో, చెల్లి అనాలో కూడా తెలియడం లేదు నాకు…”
“సారంగి…” అందించాను. “సారంగీ! తమ్ముడైనా, చెల్లి అయినా నువ్వే నాకు. మనం తోడబుట్టినవాళ్ళం. ఎవరు ఏమన్నాసరే, నిన్ను దూరం చేసుకోలేను నేను. నిన్ను ఇంట్లోంచి పంపించేయడానికి నేను ఒప్పుకోను. నాకు పెళ్ళి అవకపోయినా పరవాలేదు…” ఏడుస్తూ ప్రేమతో నన్ను కావలించుకుంది. నాకు దుఃఖం ఆగలేదు.
నాన్న మనసులో ఏముందో… బయటపడలేదు ఆయన. గంభీరంగా ఉండిపోయారు. పెదనాన్నమ్మ వచ్చి వెళ్ళినప్పట్నుంచీ రాత్రులు పీడకలలు రావడం ఆరంభించాయి నాకు- నన్ను ఇంట్లోంచి గెంటేసినట్టూ, నాలాంటివాళ్ళ మధ్య ఒంటరిగా మసలుతున్నట్టూను…
*
నేను వాష్ రూమ్ లోంచి బైటకు రావాలనుకుంటున్నంతలోనే… అమ్మాయిలు ఎవరో లోపల ప్రవేశించడంతో నా గుండె గుభేలుమంది. వాళ్ళు వెళ్ళేంతవరకు నేను ఆ గదిలోంచి బయటపడలేను. నా ఉనికి తెలియకూడదని ఊపిరి బిగబట్టి చప్పుడు చేయకుండా బిగుసుకుపోయాను.
వాళ్ళు వాష్ బేసిన్ దగ్గర చేరినట్టు వారి మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రిన్సిపాల్ గురించీ, టీచర్స్ గురించీ మాట్లాడుకుంటూ ఏవేవో కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు, పెద్దగానే. అక్కడ ఎవరూ లేరన్న ధీమా! వారి స్వరాలను గుర్తుపట్టిన నాకు ముచ్చెమటలు పట్టాయి. వాళ్ళు ఎవరో కాదు- యూనియన్ ప్రెసిడెంట్, వైస్-ప్రెసిడెంట్, సెక్రెటరీను! ఇప్పుడు నేను వారి కంటపడ్డానంటే ఎంత రభస జరుగుతుందో… ఆ ఊహే భయం గొలుపుతోంది నాకు. వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు బయటపడకూడదని ఒదిగి నిల్చున్నాను.
ఎంతసేపటికీ వాళ్ళు వెళ్లుతూన్న సూచనలు లేవు. వాళ్ళమీదా వీళ్ళమీదా మాట్లాడుకుంటూనే వున్నారు. వాళ్ళు క్లాసులకు వెళ్ళకపోయినా అడిగేవాళ్ళు ఉండరు. కానీ నేను ఆలస్యమైతే నాకు శిక్ష తప్పదు. బల్ల మీద నిలుచోబెట్టడమే కాక, నన్ను ఎత్తిపొడుస్తూ మాటలతో హింసిస్తుంది క్లాస్ టీచర్.
వాళ్ళు ఎంతకూ వెళ్ళకపోవడంతో, ధైర్యం చేయక తప్పలేదు నేను. చప్పుడు చేయకుండా గెడ తీసి, తలుపు మెల్లగా తెరచి తొంగిచూసాను. వాష్ బేసిన్ దగ్గర గుంపుగా నిలుచుని చేతులు కడుక్కుంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వారి వీపులు నా వైపు ఉండడం నా చొరవకు ఊపిరి పోసింది. నెమ్మదిగా బయటకు వచ్చి, వారి వైపు చూడకుండా తల వంచుకుని పిల్లిలా మెల్లగా గుమ్మం వైపు అడుగులు వేసాను.
“ఏయ్, సారంగీ!” అన్న పిలుపుతో ఉలిక్కిపడి ఆగిపోయాను. గుండెదడ ఆరంభమయింది. వాళ్ళు నన్ను చూసేసారు. అమ్మాయిల గదిని ఉపయోగించినందుకు ఇప్పుడు ఎంత గొడవచేస్తారోనన్న భయం నిలువెల్లా క్రమ్మేసింది నన్ను.
“సారీ! బ్లాడర్ నిండిపోయి ఆపుకోవడం కష్టంగా ఉంటే… వేరే దారిలేక…” దోషిలా తల వంచుకుని మెల్లగా సంజయిషీ చెప్పుకున్నాను. ఓ క్షణం అక్కడ భయంకర నిశ్శబ్దం ఆవరించుకుంది… వాళ్ళు ఇప్పుడు అందరినీ పిలచి గోల చేస్తారా? ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకువెళ్ళి నాకు టీసీ ఇచ్చి పంపించేయమని గొడవ చేస్తారా?
“ఎంత ధైర్యం!? గాళ్స్ ఓన్లీ అని రాసున్నా లోపలికి వచ్చిందంటే…” అంది సెక్రెటరీ కోపంగా.“ఔను” అంటూ వత్తాసు పలికింది వైస్-ప్రెసిడెంట్.
“ఏయ్, ఆగండే…” అంటూ వాళ్ళను వారించి, నా వైపు అడుగులు వేసింది ప్రెసిడెంట్.“సారంగీ! ఎమర్జెన్సీయా?” అనడిగింది. ‘ఔనన్నట్లు’ తలుపాను నేను.
“దీనికి ఎంత పొగరు కాకపోతే అమ్మాయిల వాష్ రూమ్ లో ప్రవేశిస్తుంది! నేను ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపాల్ సార్ ని తీసుకొస్తాను” అంటూ వెళ్ళబోయింది సెక్రెటరీ.
ప్రెసిడెంట్ ఆమె చేయి పట్టుకుని ఆపింది.“ఎందుకే? సారంగి ఏం చేసిందని? అర్జెంటుగా టాయ్లెట్ కి వస్తే ఏం చేయమంటావ్? తానూ మనిషేగా? తాను చేసింది నేరమా, ఘోరమా? ఏం తప్పు చేసిందని ఫిర్యాదు చేస్తావు?...” ఆమె పలుకులకు తలెత్తి సంభ్రమంతో చూసాను నేను.
“ఏమిటే నువ్వంటున్నది?” అన్నారు మిగతా ఇద్దరూ ఒకేసారి విభ్రాంతితో.
“అవునే. పాపం, సారంగి తప్పేముంది? అటు బాయ్స్ రూమూ, ఇటు గాళ్స్ రూమూ కాదంటే తాను ఎక్కడికి పోతుంది? అటూ ఇటూ కానివాళ్ళు మనుషులు కారా? అంతగా అభ్యంతరం ఉంటే, వాళ్ళకు ప్రత్యేకంగా వాష్ రూమ్స్ కట్టించవలసిన బాధ్యత స్కూల్ ది. అంతవరకు సారంగి గాళ్స్ రూమ్ నే వాడుతుంది…” దృఢస్వరంతో చెప్పిందామె.“నేను ప్రెసిడెంటుగా ఉన్నంత వరకు తనను ఎవరూ అడ్డుకోలేరు. ఇది నా మాట!”
“ఏమిటే, నీకేమైనా మతిపోయిందా?” అని అరచారు వైస్-ప్రెసిడెంట్, సెక్రెటరీలు కోరస్ గా.
“లేదు. సారంగి అవస్థ చూసాక పోయిన మతి తిరిగి వచ్చింది నాకు. రేపే మన యూనియన్ లో చర్చించి సారంగిలాంటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక వాష్ రూమ్ కట్టించేందుకు తీర్మానం చేయిస్తాను” అంది.
కృతజ్ఞతతో చేతులు జోడించి చటుక్కున ఆమె కాళ్ళ మీద పడబోయాను నేను. ఆపి, ఆప్యాయంగా కౌగలించుకుందామె.
“ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన మార్పుకు సారంగిలాంటి వాళ్ళను శిక్షించడం అమానుషం. మనలాంటి చదువుకున్న అమ్మాయిలే అర్థంచేసుకోకపోతే ఎలా? థర్డ్ జెండర్ పట్ల సమాజం యొక్క దృక్పథాన్ని మార్చడానికి పూనుకోవాలి మనం. అది మన స్కూల్ తోనే ఆరంభం కావాలి” అందామె కించిత్తు ఆవేశంగా.“ఇంకో రెండేళ్ళు ఇక్కడే ఉంటాం మనం. సిన్సియర్ గా ప్రయత్నం చేద్దాం”.
మిగతా ఇద్దరూ చప్పెట్లు కొట్టారు.“నిజమేనే. అందరిలాగే మేమూ ప్రెజుడిస్ తో ప్రవర్తించాం. నీ పలుకులు మాలో మార్పు తెచ్చి ఉత్తేజపరుస్తున్నాయి…” అన్నారు మిగతా ఇద్దరూ నిజాయితీగా.
“సారీ, సారంగీ! ఇకనుంచి నువ్వూ మాతోనే…” అంటూ ఆప్యాయంగా వాళ్ళు నా చేతులు పట్టుకుంటూంటే- నా ఆనందానికి అలవి లేకుండాపోయింది. అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి.
***********
2025 సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)
ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)
స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)
యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)
పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)
అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)
మనసు తలుపు గడియ పడితే ... (కథలు)
మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)
నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)