సంస్కృతి
సంస్కృతి (Author: శానాపతి (ఏడిద) ప్రసన్నలక్ష్మి)
నిఖిల అమెరికాలో పుట్టాక, ఒకసారి మాత్రమే ఇండియా వెళ్ళింది. అది కూడా తనకు రెండేళ్ల వయసప్పుడు. అయినా, అస్తమానూ ఇండియాను తలుస్తూనే ఉంటుంది.
బాల్యం నుంచీ తనతో తల్లిదండ్రులు తెలుగులోనే మాట్లాడుతూ ఉండడం వల్ల మాతృభాష చక్కగా మాట్లాడుతుంది. తనకు ఊహ తెలిసాక, ఆసక్తి కొద్దీ తల్లి దగ్గర తెలుగు రాయడం, చదవడం కూడా కొద్దికొద్దిగా నేర్చుకుంది. దానివల్లే అప్పుడప్పుడు వస్తూ పోయే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో తెలుగులోనే ముచ్చట్లు చెప్తూ, ప్రేమ, ఆప్యాయతలను కురిపించేది.
ఇంట్లో వినిపించే రామాయణ మహాభారత కథలను ఎంతో భక్తిగా వినేది. తల్లిదండ్రులతో పాటూ, తెలుగు సినిమాలు చూసేది. సోషల్ నెట్వర్క్ ద్వారా మారుతున్న కాలంలో నేటి యువత జీవనవిధానాలు కూడా గమనిస్తూనే ఉండేది.
భారతదేశం గురించి విదేశాల్లో కూడా ఎంతో గొప్పగా చెప్తుంటే... తాను పుట్టింది అమెరికాలోనే అయినా భారతదేశంపై గౌరవాన్ని పెంచుకుంటూ తన మాతృభూమిగానే భావించుకుంది.
ఆమెకిప్పుడు పదహారేళ్లు. తనకు రెండేళ్లప్పుడు ఇండియా వెళ్లాక, ఆ తర్వాత వీసా ఇబ్బందులు వస్తున్నాయని ఇండియా వెళ్ళడమే మానేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీసా ఇబ్బందులేమీ లేకపోవడంతో కుటుంబమంతా ఇండియాకు వెళ్లి రావాలనుకున్నారు.
అలా అనుకోవడమే తరువాయి నిఖిల మనసు మనసులో లేదు. ఎప్పుడైనా ఫొటోస్ లోనూ, వీడియో కాల్స్ లో మాట్లాడినప్పుడే తన కజిన్స్ అందరినీ చూసేది. త్వరలో ఇండియా వెళ్లి బంధువులందర్నీ ప్రత్యక్షంగా చూడబోతున్నానన్న సంతోషంతో తల్లిని ప్రేమగా హత్తుకుంది.
తండ్రి ముకుందం అయితే కూతురు కుతూహలాన్ని చూసి ఎంతగా మురిసిపోయాడో. 'దీనికి తప్పకుండా ఇండియా అబ్బాయినే చూసి పెళ్లి చేయాలి' అనుకున్నాడు మనసులో నవ్వుకుంటూ.
ఒక్కగానొక్క కూతురికి తోడనే వారు ఎవరూ లేకపోవడంతో... ఇండియాలోని ఆమె పుట్టింటివారికి, అత్తింటి వారికీ కూడా ఫోన్ చేసి, పలకరించేలా భాగ్యం అలవాటు చేసింది కాబట్టే... బంధువులంటే అంతలా ప్రేమాభిమానాలు పెంచుకుంది నిఖిల.
ఇండియా ప్రయాణం దగ్గర పడుతుంటే... పట్టుకెళ్ళాల్సిన బట్టలూ, బంధువులకివ్వాలనుకున్న బహుమతులు సిద్ధం చేసుకుంటూ పెట్టలన్నీ సర్దుకుంటున్నారు.
ప్రయాణమవ్వాల్సిన రోజు రానే వచ్చింది.. న్యూయార్క్ నుంచి బయలుదేరిన వాళ్ళు స్వస్థలమైన హైద్రాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. తల్లీ తండ్రీ చెకిన్లో వేసిన సూట్కేసులు తీసుకోడానికి నిరీక్షణలో వుండగా... వెనుక తగిలించుకున్న బ్యాగ్ తో రెస్ట్రూం వైపు అడుగులేసింది నిఖిల.
పదినిమిషాల తర్వాత తమ ముందుకు వచ్చిన కూతుర్ని చూసి... అక్కడ నుంచి వచ్చిన కూతురేనా? అన్నట్టు తల్లిదండ్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతుంటే... 'నా ఉద్దేశ్యం వేరులే' అన్నట్టు పెదాలపై చిరునవ్వు పులుముకుంది నిఖిల.
కూతుర్ని ఒక్కమాటుగా దగ్గరకు తీసుకుని భాగ్యం గుండెలకు హత్తుకుంటుండగా... ఆ మధురమైన దృశ్యాన్ని తన సెల్ఫోన్లో బంధించాడు ముకుందం.
***. ****. ****
అమెరికా నుంచి చాన్నాళ్ళకు ఇండియా రావడంతో... అక్కా, బావ, మేనకోడల్ని ఎయిర్పోర్ట్ కి వచ్చి సాదరంగా ఆహ్వానించాడు ఈశ్వర్. అక్కా బావలను పలకరించాక, వారి వెనుకే వున్న మేనకోడలు పదహారణాల తెలుగు పిల్లలా కనిపించేసరికి... "భలే ఉన్నావే" అన్నాడు మెచ్చుకోలుగా.
పెద్దయ్యాక మావయ్యను కలుసుకోవడం అదే మొదటిసారి యైనా... ఏమీ కొత్తదనమన్నది లేకుండా "థాంక్స్ మావయ్యా!" అంది నిఖిల.
అందరూ కలసి ఇంటికి చేరగానే... వీరి కోసమే ఎదురు చూస్తున్న బంధువులంతా చుట్టుముట్టారు. వచ్చిన వారిలో అత్తలు, పిన్నిలు వారి పిల్లల్నీ గుర్తుపట్టినా, ఇంకా తెలియని వారు వుండటంతో... తనకు వరుసకు ఏమవుతారో తల్లి చెప్తూ పరిచయం చేయగానే ఎంతో వందనంగా నమస్కారం చేసింది నిఖిల.
"మీ అమ్మాయి అమెరికాలో పుట్టినా... ఆడపిల్లగా చక్కగా తీర్చిదిద్దావు సుమా!" అంటూ నిఖిలను చూసిన ప్రతి ఒక్కరూ... అదంతా భాగ్యం గొప్పతనమే అని తెగ పొగిడేసరికి చిరునవ్వే సమాధానం ఇచ్చేది భాగ్యం.
తెచ్చిన బహుమతులు, చాక్లెట్లు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వడంతో... బంధువుల ముఖాలు ఎంతో వెలిగిపోయాయి.
వారి ముగ్గురికీ జెట్లాగ్ ముసరడంతో... విశ్రాంతి తీసుకుని, మూడు నాలుగు రోజుల తర్వాత ఇల్లు కదిలారు. ఇంచుమించు కజిన్స్ అందరూ తన తోటి వారే అవ్వడంతో... వారితో బాగా కలిసిపోయి అక్కడ తాము చూడాలనుకున్న ప్రదేశాలు, గుళ్ళూ గోపురాలు తిరుగుతూ ఆనందంగా గడుపుతుంది నిఖిల.
వారందరి వేష భాషల్లో నిఖిల ప్రత్యేకంగా ఉండేసరికి... పెద్దవాళ్ళంతా ఎవరి పిల్లలను వాళ్ళు సున్నితంగా మందలించారు కూడా. అమెరికాలో పుట్టి పెరిగినా నిఖిలను చూసి నేర్చుకోమని. ఆ మాటకు అవమానంగా చిన్నబుచ్చుకొని బుంగమూతి పెట్టినవారు లేకపోలేదు. అక్కడ పెరిగిన అమ్మాయికి ఇక్కడి పద్దతులు, తీరుతెన్నులు ఏమొస్తాయిలే అని అపోహపడిన వారంతా ఆ పిల్లను చూసి అవాక్కయిన వారే. భారతీయ సంస్కృతికి అద్దం పట్టినట్టుగా నడుచుకున్న నిఖిల అందరి మన్ననలూ పొందుతుంటే... భాగ్యం, ముకుందం ఎంతో మురిసిపోయారు.
అక్కడున్నన్ని రోజులు ఇట్టే గడిచిపోయాయి. తిరుగు ప్రయాణమయ్యే రోజు రావడంతో... అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో పాటూ, పెద్దలందరి కాళ్ళకు దణ్ణం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకుని, వీడ్కోలు పలుకుతూ అతిభారంగా తల్లిదండ్రులతో వెనుదిరిగింది నిఖిల.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్! సూట్కేసులన్నీ చెకిన్ అయిపోవడంతో... వీడ్కోలు పలకడానికొచ్చిన కజిన్స్ అందరికీ ఆఖరిసారిగా చేయి ఊపి, బోర్డింగ్ గేట్ దగ్గరకు చేరగానే... రెస్ట్రూంకెళ్ళి వస్తాను" అంటూ తన బ్యాగ్ తో తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళింది నిఖిల.
పది నిమిషాల తర్వాత తిరిగొచ్చిన నిఖిలను చూసి, "అంతలోనే మళ్ళీ నీలో ఇంత మార్పేమిటే?" అంది కూతుర్ని ఎగాదిగా చూస్తూ భాగ్యం. ముకుందం ముఖంలో కూడా అదే ప్రశ్నార్థకం తొంగి చూసేసరికి... "అదంతే అమ్మా!" అంటూ చిన్నగా నవ్వేసింది తప్పించి మనసులోని ఉద్దేశ్యం చెప్పనే లేదు.
****. *****. ****
న్యూయార్క్ చేరిపోయాక... మూడు రోజులు జెట్లాగ్ తో గడిపి ఎవరిపనులు వారు యదావిధిగా చేసుకుంటున్నా... ఇంకా ఇండియాలో బంధువుల మధ్య గడిపిన ఆత్మీయతా పరిమళాలు గుభాళిస్తూనే వున్నాయి.
తల్లీ కూతురూ అక్కడ విషయాలు నెమరేసుకుంటూ వుండగా... ఉండబట్టలేక కూతురి మనసులోని ఉద్దేశమేమిటో తెలుసుకోవాలనుకుంది భాగ్యం.
"ఒసేయ్ నిఖిలా బంగారం! మనం ఇండియాలో కాలు పెట్టినప్పుడు నిన్నలా చూసేసరికి అమెరికాలో పెరిగిన పిల్లవేనా అనిపించింది. ఇప్పుడిక్కడ ఇలా చూస్తుంటే...'ఇండియాలో చూసిన నిఖిలవేనా' అనిపిస్తోంది. ఇండియా వెళ్లే ముందు నీకు కొరియర్లో ఏవో అట్టపెట్టెలు వస్తుంటే నేను గమనించలేదు కానీ... అవన్నీ ఇండియా ప్రయాణానికే సిద్ధం చేసుకుంటున్న బట్టలని నేనసలు అనుకోలేదు. ముందుగానే అక్కడ వాళ్ళందర్నీ ఆకట్టుకోవడానికి నువ్వు చేసుకున్న ప్లాన్ అన్నమాట. నీ వేషధారణతో అక్కడ ఫోజు కొట్టడం కాకపోతే మరేంటి? ఇక్కడ నేనెంత కోరినా అలా కనిపించడానికి ఎప్పుడూ ఇష్టపడే దానివి కాదు కదా? ఒకవేళ బావలెవరినైనా లైన్లో పెట్టడానికా...?" అంటూ ఆ చివరి సందేహాన్ని సాగదీస్తూ మరీ అడిగింది కూతుర్ని.
తల్లి మాటలను తల్చుకుని తల్చుకుని నవ్వింది నిఖిల. "భలే దానివమ్మా నువ్వు. బావల్ని బుట్టలో వేసుకోవాలనుకునే ఆలోచనైతే నాకసలు లేదు. నాకిక్కడ పెళ్లే కాదంటావా? నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ మనిషినే చేసుకుంటాను కానీ అక్కడ వాళ్లను కాదు. ఇక నీ సందేహం... ఇక్కడలా ఉన్నట్టు అక్కడ, అక్కడలా ఉన్నట్టు ఇక్కడ నేను లేననే కదా. నేను భారతీయ సంస్కృతీసాంప్రదాయాల్ని అర్థం చేసుకున్నాను కాబట్టే... ఆ దేశం మీద గౌరవంతో అక్కడికి వెళ్ళినప్పుడు అచ్చమైన తెలుగుపిల్లలా కనిపించాలనుకున్నాను. భారతదేశంలో పుట్టి కూడా అక్కడ వేషభాషల్ని మర్చిపోయి పాశ్చాత్య దేశాల నడవడికను అనుసరిస్తున్నారు నేటియువత. బహుశా సాఫ్ట్వేర్ ఉద్యోగాల నియమాలకు కట్టుబడి కావచ్చు. కానీ అదే ఫ్యాషన్ గా మారిపోతుంటే... చిన్నపిల్లలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఓ విధంగా తల్లి భారతిని అవమానించినట్టే కదా? మన భారతదేశం ఔన్నత్యం ఎప్పటికీ గొప్పగానే వుండాలి గానీ దిగజారిపోకూడదు. కనీసం మన బంధువుల్లో నన్ను చూసైనా... నేటి ఆడపిల్లల్లో మార్పు వస్తుందేమోనన్న చిన్న ఆశతో... అందరికీ మన సాంప్రదాయంలో తీరుగా కనిపించానంతే తప్ప... అదే విధంగా ఇక్కడ కూడా ఉండమంటే నేనుండలేను. కారణం... నేను పుట్టిందీ పెరిగిందీ అమెరికాలో. ఇక్కడ వాతావరణం, మనుషులకు తగ్గట్టుగానే నా వేషభాషలు వుండాలని నేననుకోవడం ఏమీ తప్పు కాదు కదమ్మా!" అంటూ ఎక్కడి వారు అక్కడిలా ప్రవర్తించాలన్నట్టు తన ఉద్దేశ్యాన్ని తల్లికి వివరించింది నిఖిల.
కూతురు అలా చెప్తున్నంత సేపూ... మధ్యలో అడ్డు రాకుండా మురిసిపోతూ విన్నది భాగ్యం. ఇండియాలో కూతురి నడవడిక చూసి... తన దిష్టే తగిలేలా ఉందని చాలాసార్లు అనుకునేది. ఆ విషయం గుర్తొచ్చి మరేం మాట్లాడకుండా... గుప్పెడు నిండా ఉప్పు తీసుకుని కూతురు తల చుట్టూ మూడుసార్లు తిప్పి బయటపడేసి... ఇక అందరి దిష్టి పోతుందని.. హమ్మయ్య అనుకుంది మనసులో.
ఆ విషయాన్ని ఎంతో సంతోషంగా భర్తకు చెప్పడం మొదలెట్టింది భాగ్యం... "చూశారా మనమ్మాయి గొప్పతనం? మనం చెప్పుకోకూడదు గానీ... దాని మాటలు వింటే నాకెంత ముచ్చటేసిందో! మాట్లాడిన ప్రతి మాటలో ఎంతో పరిపక్వత ఉంది. భారతదేశ సంస్కృతినీ, సాంప్రదాయాన్ని మర్చిపోయి ఆచారవ్యవహారాలు పాటించకుండా నేటి యువత ఎటు పోతుందా అనిపిస్తుంది. మనం ఇండియా వెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఎలా ఉన్నారో చూశారు కదా! ఏ ఒక్కరూ బొట్టు పెట్టుకున్నది గానీ, జడలు వేసుకున్నది గానీ, పరికిణీ ఓణీలు వేసుకున్నది గానీ లేదు. అందరూ జీన్స్ పాంట్లు, టీ షర్ట్లు, బిగుతైన చుడీదార్లు, పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని జుట్టు విరబోసుకున్న వారే. తెలుగుదేశంలో ఉండి తెలుగు మాట్లాడింది కూడా లేదు. ఏం మాట్లాడినా గొప్పగా ఇంగ్లీష్లో చెప్పేవారు. నిజానికి అది వారి సంస్కృతి కాదు కదా. వేషభాషలన్నీ మార్చేశారు.
కానీ... నిఖిల ఇక్కడ పుట్టి పెరిగినా, అసలు ఇంగ్లీష్ నే మరిచిపోయి, అక్కడ వారందరితో తెలుగులోనే మాట్లాడింది. చక్కగా జడ వేసుకొని, పూలూ, బొట్టూ పెట్టుకొని పరికిణి ఓణీలను ధరించింది. అచ్చం బాపూ గారి బొమ్మలా ఉండబట్టే... అందరి మనసులూ దోచుకుంది.
నిఖిల ఆశించినట్టు... మునుపటిలా అక్కడ ఆడపిల్లల వేషభాషల్లో మార్పువస్తే నాక్కూడా చూడాలని ఉందండీ " అంది ఆశగా భాగ్యం కూడా!
కూతురు గురించి ఎంతో గొప్పగా చెప్తున్న భార్య మాటలు విన్నాక... స్వయంగా నిఖిలలో చూసిన సభ్యతాసంస్కారాలు మరోసారి కళ్ళముందు కదలాడాయి. మంచిభావాలు గల కూతుర్ని కన్నందుకు తండ్రిగా ఎంతగానో హర్షించాడు ముకుందం.
*****. *****. *****