విశ్వవిజేత  (Author: తొగట సురేశ్ బాబు)

ఉ.

మానవజన్మదుర్లభము మానితమైనది జీవకోటిలో

జ్ఞానముతో చరింపుమిక సర్వముమీకిల సిద్ధసాధ్యమౌ

మౌనమునాశ్రయింపుము సమాజహితమ్మును కోరుకొమ్ము, నీ

మేనుమనమ్ములం గల యమిత్రుల గెల్చి విముక్తినందుమా!   1

ఉ.

కన్నులుచూచు శాత్రవుల కల్మినిబల్మిని గెల్వవచ్చు, లే

కున్ననగోచరంబగుచు గుట్టుగమట్టుగ సాగవచ్చు, కా

కున్న విదారమనస్కులయి కుందుచు దాస్యము చేయవచ్చు గుం

డెన్నెలకొన్న శాత్రవుల ఢీకొన సాధ్యమె? యెంచి చూడగన్!   2

ఉ.

ఏమనమందునైన మరి యెయ్యదిచూచిన నిచ్ఛగించు యా

కామము వైరులన్ ప్రథమగణ్యము, మూలము భ్రష్టసిద్ధికిన్

కామము కాటు వేయ బ్రతుకర్పణ చేసెను కీచకుండు ము

న్నా మనభారతోపకథ నాత్మఁదలంచుము నిత్యమెల్లరున్!   3

ఉ.

క్రోధము పాపమూలమది క్షోభిలఁజేయు వివేకతత్త్వమున్ 

బాధలనిచ్చు ధారులకు, బాధితమూర్తులకెప్పుడున్ మనో

యోధులకైన కోపమది యోచనశక్తిని క్రుంగఁజేయు నా

క్రోధముతో పరీక్షితట కోల్పడె జీవముమున్ను దల్చగన్!   4

తే. గీ.  

ఆశ అత్యాశగా మార్పునందినపుడు 

లోభిగా మానవుడు తన రూపమెత్తు 

కురుపతి నశించెవంశవిలుప్తమౌచు 

లోభగుణమున మున్ను గుర్తుంచుకొమ్ము!   5

ఉ.

'లోకమునందు నేది తనలోచనముల్ గనినంత మాత్రమున్ 

నాకది కల్గుదాక మది నందదు శాంతత' యన్నభావ మా

లోకముఁజేయమోహమగు లుప్తముచెందెను రావణుండు త

న్నాకము గెల్చి, మోహవినాశము చెందక బంధుకోటితో!   6

కం.

కనజాలము నాకంటెను 

ఘనులెవ్వరినన్న తలపు కనగామదమౌ!

ధనకులబలాది మదములు 

మనగలరా తలకెక్కిన మానవులిలలో!    7

ఉ.

పచ్చగ పక్క వారలొక పాటుననుండగ బాధనిచ్చు నా

మచ్చరమన్న శాత్రవుడు మానసమెల్లను కాల్చు; నెందరో మచ్చర మంది సర్వజన మారణ కాండకు మూలమైరి; యా

మచ్చర మెప్డు నిల్చునిట మాయని మచ్చగ మానవాళికిన్!    8

ఉ.

నీదుబలమ్ము నీ కులము నీ యధికారము నీ ధనమ్ముతో

వాదనలందునైన మరి వంచన లందున నైననెల్లరిన్

బాధల బెట్టుచున్ తిరుగబట్టిన మానవ నేరవైతి నీ

మోదము కాదు సూనృతము ముప్పునుగూర్చును నీకునంతకున్!     9

తే. గీ.

నీహృదినియున్న రిపులను నిలువరించి 

గెలుపు సాధింప నిజమగు కీర్తి వచ్చు

నిన్ను నీవెప్డు గెలువక నీకు రాదు

శాశ్వతంబైన సుఖములు జయయశమ్ము!   10

ఉ.

నశ్వరమైన కాయమును నమ్ముచు దానిసుఖమ్ముకోసమై 

విశ్వవిజేతగా నిలువ ప్రీతిని యిచ్ఛచరించి ధూర్తతన్ 

శాశ్వతదుర్యశమ్ముగొన చాలదు నిన్నిట నీవుగెల్చుమా 

విశ్వవిజేతవై సతము విశ్వముకిమ్ము ప్రశాంతసౌఖ్యముల్!    11


0 Comments