రక్షాబంధనం
రక్షాబంధనం (Author: ఉప్పలూరి మధుపత్ర శైలజ)
రేపు రాఖీపండుగ గుర్తుందిగా! ఉదయానికల్లా నీవు వచ్చేస్తావుగా?” తమ్ముడికి ఫోనుచేసి అడిగింది రేఖ.
“అక్కా! నేను ఇప్పుడు రైల్లోనే ఉన్నాను. ఇంకో ఆరుగంటలు ప్రయాణం చేస్తే చాలు మీ దగ్గరకొచ్చేస్తాను. ఈ పండుగ కోసమేగా నేను గత ఆరునెలలుగా ఇంటికి రానిది? నీకు మంచి డ్రస్ కొనాలని డబ్బులు దాచి, నీకు నచ్చే డ్రస్ కూడా కొన్నాను. అమ్మకి చెప్పు నాకిష్టమైన జిలేబీలు చేసి పెట్టమని. నీదగ్గర రెండురోజులుండి తిరిగి వ్యాపారానికి వెడతాను. బై అక్కా!” అంటూ ఫోను పెట్టేశాడు ప్రదీప్.
ఓ సామాన్య స్కూలు టీచర్ మాధవరావుగారి పిల్లలే రేఖ, ప్రదీప్‌లు. భార్య రుక్మిణి కూడా ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్స్ చెపుతూ భర్తకి కాస్త ఆర్ధిక సాయం అందిస్తోంది. డిగ్రీ దాకా రేఖను చదివించారు. ఖాళీగా ఉండటం ఇష్టంలేక దగ్గర్లో ఉన్న టౌన్లో ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. వాళ్ళ ఊరినుండి షేర్ ఆటోలు, అప్పుడప్పుడూ వచ్చిపోయే పల్లెవెలుగు బస్సుల్లో జనాలు ఆ టౌన్‌కు వెళ్ళి తమ పనిపాటలను చక్కదిద్దుకుని వస్తూంటారు.
ఇక, ప్రదీప్ ఇంటర్ దాకా చదివి, పై చదువులు ఇష్టంలేక తన స్నేహితుడు చేస్తున్న బిజినెస్‌లో తానూ కొంత పెట్టుబడి పెట్టి పార్ట్‌నర్‌గా చేరాడు. చుట్టుప్రక్కల ఊళ్ళలోని చెత్తను సేకరించి రీసైక్లింగ్ ఫ్యాక్టరీలకు చేర్చే వ్యాపారం వారిది. రాష్ట్రంలోని పెద్దపెద్ద ఊళ్ళకేగాక ఇతర రాష్ట్రాలకు కూడా చెత్త సేకరణ గురించి తిరుగుతూ ఉంటాడు. పడిన కష్టానికి తగ్గ ఫలమే లభిస్తోంది ప్రదీప్‌కు ఈ వ్యాపారంలో. ఇంటికి నెలకోసారి అక్క పెళ్ళికోసం దాయమని డబ్బు పంపిస్తూంటాడు.
చిన్నతనం నుండి రేఖ, ప్రదీప్‌లు ఎంతో అన్యోన్యంగా ప్రేమ, ఆప్యాయతలతో పెరిగారు. చిన్నవయస్సులో చదువుకోకుండా, వ్యాపారంలో చేరి, తమ్ముడు ఇంటికి దూరం అయ్యాడని చాలా బాధపడేది రేఖ.“మీరైనా వాడికి నచ్చచెప్పాల్సింది కదా నాన్నా” అంటూ అమ్మానాన్నలతో వాదనకు దిగేది.
“మన ఆర్ధికస్థితిని గమనించి, నీ గురించి ఆలోచించే, వాడు చిన్న వయస్సులోనే ఈ పనిలోకి దిగాడు తల్లీ” అంటూ ఉస్సూరుమనేవాడు మాధవరావు.
“అమ్మా! నేను ఆఫీసు నుండి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలో లిస్ట్ రాసివ్వు. తీసుకువస్తాను” అంటూ తాను ఆఫీసుకు వెళ్ళటానికి తయారు అయ్యింది రేఖ. లంచ్‌బాక్స్ సర్దుకొని బస్‌స్టాప్‌లో బస్ ఎక్కి అఫీసుకు చేరి తన సీటులో కూర్చుంది.
“ఏంటే రేఖా! ఈరోజింత ఆనందంగా ఉన్నావు? పెళ్ళిచూపులేమైనా ఉన్నాయా?” ప్రక్క సీటులో ఉన్న రాధ వేళాకోళమాడింది.
“ఊరుకోవే రాధా! ఏం మాటలవి? అదీ ఆఫీసులో” అంటూ కసురుకొని, “రేపు రాఖీ పండుగ కదా. మా తమ్ముడొస్తున్నాడు. ఆరునెలలయ్యింది వాడిని చూసి. అందుకే కాస్త సంతోషంగా ఉన్నమాట వాస్తవం. ఈ ఆనందంతో కాస్త తప్పులతో పని చేసేస్తానేమోనని భయంగా ఉంది” అంటూ పక్కనున్న ఫైలు అందుకుంది రేఖ.
రాధ ఒక్కసారి రేఖ వైపు పరీక్షగా, పరిశీలనగా చూస్తూ “ఎంత అందంగా ఉంటుంది రేఖ. తన అన్నయ్యకు రేఖను ముడిపెడితే?” మనస్సులోనే తలచుకుని నవ్వుకుంది.
సాయంత్రం అయిదుగంటలకల్లా రాధకి బై చెప్పి, ఆఫీసు నుండి బయటకు వచ్చి బజారుకెళ్ళింది రేఖ. అమ్మ ఇచ్చిన లిస్ట్‌లోని సరుకులన్నింటినీ కొంది. ఎదురుగానున్న షాపులో రంగురంగు రాఖీలు వేలాడుతూ కనిపించాయి. తమ్ముడి పచ్చని పసిమి మేని ఛాయకి ఈ బంగారువర్ణంతో మిలమిలా మెరిసే రాఖీ ‘వెలుగులు వెదజల్లే సూర్యుని’లా చాలా బాగుంటుందని నాలుగు రూపాయలు ఎక్కువైనా తీసుకుంది. తమ్ముడికిష్టమైన స్వీట్ ‘కలాకండ్’ తీసుకుంది.
బ్యాగ్‌ని మోసుకుంటూ బస్‌స్టాప్‌కొచ్చి సమయం చూసుకుంటే దాదాపుగా ఏడుగంటలు కావొస్తోంది.“అమ్మో! అప్పుడే చీకటి పడిపోయింది. బస్సులు బాగా తక్కువగా ఉంటాయి. ఇక షేర్ఆటోలో సిగరెట్, మద్యం వాసనలను భరిస్తూ వెళ్ళాలి కాబోలు” అనుకుంటూ షేర్ఆటోలలో ఎక్కాలని ప్రయత్నించినా జనాలు కిక్కిరిసి ఉండటంతో ఎక్కలేకపోయింది.
ఇంతలో అక్కడికి ఓ టాక్సీ వచ్చి ఆగింది. దాంట్లోనుండి ఒకామె దిగి, “తల్లీ! ఎక్కడికి వెళ్ళాలి? బస్సులు వచ్చేటట్లుగా లేవు. మేం మీ ఊరి కామందుగారి బంధువులం” అంటూ ఆయన పేరు చెప్పి, “వారింటికే మేం వెడుతున్నాం. నీ కిష్టమైతే మా కారులో రామ్మా. ఖాళీ ఉంది” అంటూ పిలిచింది.
“కారులో డ్రైవర్ కాక ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. భయంలేదు ఎక్కవచ్చు” అనుకుంటూ ధైర్యంగా కారు ఎక్కి కూర్చుంది రేఖ.
కార్లో వెనుక సీట్లో కూర్చున్నామె అందంగా వుంది. కామందుగారింట్లో ఏమైనా ఫంక్షన్ ఉందేమో. అయినా పెద్దింటి వారి విషయాలు తనకెందుకని మౌనంగా కూర్చుంది రేఖ. ప్రక్కనే కూర్చున్నామె పలకరింపుగా నవ్వి వివరాలనడిగింది.
రేఖ చెప్పిన విషయాలకు స్పందిస్తూ రోజూ ఇంత దూరం ఉద్యోగానికొస్తావా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. పాపం లంచ్ తీసుకుని చాలాసేపయ్యుంటుంది. రమా! నీ బ్యాగ్‌లో బిస్కట్‌ప్యాకెట్స్ పెట్టాను దారిలో తినటానికి ఉంటాయని. రెండు బిస్కట్స్ నాకిచ్చి, నువ్వు తీసుకుని, ఆ అమ్మాయికి కూడా రెండివ్వు అందామె. అందరికీ బిస్కట్స్ ఇచ్చింది రమ. వాళ్ళంతగా బ్రతిమలాడుతూంటే, మొహమాటానికి ఆ బిస్కట్స్ తీసుకుని నోటిలో పెట్టుకుంది రేఖ. అంతే నిద్రమత్తు ఆమెను ఆవహించింది.
కారు మరునాటి మధ్యాహ్నానికి ముంబాయిలోని చాందిని బజార్ దగ్గర ఆగింది. ఆ స్త్రీలిద్దరూ రేఖ ముఖంపై నీళ్ళుజల్లి లేపి, ఓ గదిలోకి తీసుకెళ్ళి అక్కడున్న మంచంపై పడుకోమన్నారు.
రేఖకు అంతా షాకింగ్‌గా ఉంది. ఏమయ్యింది తనకు? తానెక్కడుంది? ఔను! తాను వారిచ్చిన బిస్కట్ తిని మత్తులోకి జారిపోయిన విషయం నెమ్మదిగా అవగతమయ్యింది. గది వాతావరణం చూశాక తాను మోసపోయానని తెలిసిపోయింది. నెమ్మదిగా లేచి తలుపు దగ్గరకు వచ్చింది.
ఓ అమ్మాయి కాపలాగా నుంచుని ఉంది.“క్యా చాహియే? పానీ, చాయ్ ఔర్ క్యా?” అంటూ హిందీలో అడిగింది.
కొద్దికొద్దిగా వచ్చిన హిందీలో “ఇది ఏ ఊరు?” అని అడిగింది రేఖ.“ముంబాయి” అంటూ చెపుతున్న ఆమెను ఒక్కతోపుతోసి గబగబా బయటకు పరిగెత్తింది.
ఎక్కడ చూసినా ముఖానికి రంగులద్దుకుని, నిర్జీవమైన కాంతితో రంగురంగుల జరీ చీరలతో పెదాల విషాదాన్ని దాచే లిప్‌స్టిక్‌లద్దుకున్న వన్నెచిన్నెల కన్నెపిల్లలు కనిపిస్తున్నారు. ఆవరణ దాటటానికి వీలులేకుండా పెద్ద ద్వారం తలుపులు వేసివున్నాయి. నిలబడిపోయిన రేఖ దగ్గరకు ఓ పెద్దామె వచ్చి, “ఎవరు నువ్వు? ఇక్కడికి కొత్తగా వచ్చావా? ఎందుకు హైరాన పడతావు? ఇది అంగడివీధి. అందాన్ని అమ్ముకునే వ్యాపారం జరుగుతుందిక్కడ. నీవిక్కడ మిగిలిన విషయాలను మరిచిపోయి నవ్వుతూ, తుళ్ళుతూ తిరిగావంటే మీ వాళ్ళకి నాలుగు డబ్బులు పంపుకోవచ్చు. కానీ ‘నీ శరీరం నీది కాదు’ అని అనుకునేంతవరకే. బాగా గుర్తుంచుకో. పారిపోవాలని చూస్తే కొరడా దెబ్బలు కొట్టడానికి రౌడీలుంటారు. జాగ్రత్త” అంటూ హెచ్చరించింది.
ఏడుస్తూ అక్కడే కూలబడింది రేఖ. పక్కనున్న గది నుండి ఓ పాపాయి “అమ్మా మనింటికి వెళ్ళిపోదాం. నాకు డాడీ కావాలి” అనే హృదయవిదారకమైన ఏడుపు వినిపించగానే రేఖ మనస్సు తల్లడిల్లింది.
భర్తకు దూరమైన భార్య, తండ్రికి దూరమైన చిన్ని పాపాయి ఈ పాపపు కొలిమిలో సమిధలు కాబోతున్నారు. ఓ సారి అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకుందామని వెళ్ళింది. లోపల నిర్ఘాంతపోయే సంఘటన ఆవిష్కృతమైవుంది.
ఆ గదిలో అలంకరించబడిన శయ్యపై ఓ మృగం కూర్చుని ఉన్నాడు. పాపాయి తల్లి కాబోలు పాపాయి చేతిలో ఐస్‌క్రీం కోన్ ఒకటి పెట్టి, “వెళ్ళి ఆంటీ రూంలో ఆడుకో. నేను త్వరగా వచ్చేస్తాన”ని నచ్చచెపుతోంది.
“ఇటు రా పాపా! నేను నీకు కథ చెప్తాను. కాస్సేపు మనం అట్లా తిరిగొద్దాం” అంటూ పాపను మాలిమి చేసుకొని తన గదికి తీసుకెళ్ళింది. పాపని వివరాలు అడిగితే ఏమైనా క్లూ దొరుకుతుందేమోనన్న ఆశతో, “మీదేవూరు పాపా?” అని అడిగింది రేఖ.
“మాది అమలాపురం, సినిమాకెళ్ళి వస్తూంటే ఈ బూచోళ్ళు నన్ను, అమ్మను కార్లో తీసుకొచ్చేశారు” అంటూ, “నాకు డాడీ కావాలి. నీ దగ్గర ఫోనుంటే మేమిక్కడున్నామని మా డాడీకి చెప్తావా ఆంటీ?” అంది జాలిగా.
ఇంతలో ఓ పనామె కాబోలు చపాతి, కూర తెచ్చిచ్చింది రేఖకు.“పాపా చపాతీ తింటావా?” అని అడిగింది రేఖ.
“నాకొద్దాంటీ! నాకు అన్నం ఇష్టం” అంది. వెంటనే వెళ్ళిపోతున్న పనామెను పిలిచి "ఏక్ కటోరి చావల్ లానా" అంటూ అడిగింది రేఖ ప్రాధేయపూర్వకంగా. పాపను చూసి జాలి కలిగిందేమో అన్నం తెచ్చిచ్చిందామె. పాపకి అన్నం తినిపించేసరికి ఓ గంట గడిచిపోయింది.
పాపను వెతుక్కుంటూ కంగారుగా పాప తల్లి రేఖ గదికి వచ్చింది. నిద్రపోతున్న పాప తల మీద చెయ్యివేసి నిమురుతూ, “పాపిష్టిదాన్ని. ‘పెళ్ళిరోజు’, సినిమా అంటూ ఆయన ప్రాణం తీసి సెకెండ్‌షోకి తీసుకెళ్ళమని గొడవచేశాను. అందుకే నాకు, పాపకు ఈ గతి పట్టింది. పాపం! ఆరోజు హాల్లో ఆయన మేమింకా వాష్‌రూం నుండి రాలేదని ఎంతగా వెతికుంటారో! దేవుడా! ఆయనకు మేమిక్కడున్నామని తెలిసేదెలా? ఈ నరకం నుండి మేం బయటపడేదెలా?” అంటూ ఏడుస్తున్న ఆమె పరిస్థితి రేఖను కదిలిస్తోంది.
అమ్మా, నాన్నా, తమ్ముడు తన కోసం ఎంతగా వెతుకుతున్నారో? అనుకుంటూ వస్తున్న ఏడుపును దిగమింగుకుని,“అక్కా! భయపడకండి. ఇది తప్పించుకోలేని సాలెగూడు. మనకేదో అవకాశం ఆ భగవంతుడు కల్పించబోడు. పాప జాగ్రత్త” అంటూ ఆమెకు ధైర్యం చెప్పింది.
“ఎంతగా ఎదురుచూసింది తమ్ముడికి రాఖీ కట్టడానికి? చిన్న తొందరపాటు నిర్ణయంతో నా జీవితం ఇలా నరకకూపంలోకి వచ్చి పడింది” అనుకుంటూ ఏమీ తినకుండా ఏడుస్తూ గడిపింది రేఖ.
తెల్లవారింది. అక్కడ అందాల ప్రదర్శనలు, అమ్మకాలు అన్నీ యథావిధిగా జరిగిపోతున్నాయి. డబ్బులు చేతులు మారుతున్నాయి. వారానికో ఆడపిల్ల ఈ నరకానికి మేకపిల్లలా బలి ఇవ్వబడుతోంది. రేఖకి కూడా ఈ నరకయాతన తప్పలేదు. ఓ నెలరోజులు గడిచిపోయాయి.
ఓ రోజు మొదటి అంతస్థు బాల్కనీలో నిలబడి వీధిలోకి తొంగి చూస్తోంది రేఖ. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ కనిపించారు. అతణ్ణి పరీక్షగా, పరిశీలనగా చూసింది. ఉలిక్కి పడింది. ఆనంద పడింది.“ప్రదీప్..” చప్పట్లు కొట్టి పిలిచింది.
అక్కడున్న వీధులన్నింటిలో ఇలాంటి ఆడవారి చప్పట్లని అలవాటు పడి ఎవరూ పట్టించుకోరు. కానీ తనకు తెలిసిన కంఠధ్వని వినబడటంతో తలపైకెత్తి చూసి అక్కని పోల్చుకున్నాడు ప్రదీప్. ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళి మరీ చూశాడు. కన్నీటి సంద్రంతో అక్క సైగలు చేసింది. ఆ సైగలకి అర్ధం తెలిసిందతనికి.
వెంటనే లోపలినుంచి ఓ కాగితం తెచ్చి ఎవరూ చూడకుండా ఓ ఉండలా చుట్టి ప్రదీప్ పైకి విసిరేసింది. ఆమె ఆ కాగితంలోని విషయాలను ఎప్పుడో రాసి ఉంచింది. ఇప్పుడు దేవుడిలా అవకాశం కల్పించాడు. రేపు వస్తానని సైగ చేసి వెళ్ళిపోయాడు ప్రదీప్.
ఇన్నాళ్ళకి రేఖ మనస్సులో తెలియని ఆనందం. ఆ రోజు ఆకలనిపించింది.“దీదీ నాకు చాలా ఆకలేస్తోంది” అంటూ అడిగి మరీ గబగబా తింది రేఖ. ఇంతలో తన రూంకి ఎవరో కష్టమర్ వస్తున్న అలికిడి. ఆలోచనలకు చుక్క పడింది. ఇంకా ఎప్పుడు తెల్లవారుతుందోనన్న ఆనందంలో నిద్రలేని రేయి మరొకటి గడిచిపోయింది.
ఓ సారి పాపాయిని చూసొద్దామని వాళ్ళ గదికి వెళ్ళింది రేఖ.“నిన్న రాత్రి కష్టమరొచ్చినప్పుడు బయటకు వెళ్ళనని పాప గొడవచేస్తే, మత్తుమందు కలిపిన పాలనిచ్చి ఇక్కడే చాపపై పడుకోబెట్టారు. ఇలాగైతే పాప ఆరోగ్యం ఏమవుతుందో? నాకెందుకీ దుర్భర నరకం” అంటూ రేఖ చేతులు పట్టుకుని ఏడ్చింది పాప తల్లి.“ఒక్క వారం ఓపిక పట్టు అక్కా” అంటూ చెవిలో విషయం చెప్పి, “ధైర్యంగా ఉండు” అంటూ తన గదికి వచ్చేసింది రేఖ.
ఆ సాయంత్రం మంచి డ్రస్ వేసుకుని, పెర్ఫ్యూం రాసుకుని ఓ కష్టమర్లాగా వచ్చాడు ప్రదీప్. ఆడపిల్లలనందరినీ పరీక్షగా చూస్తూ రేఖ దగ్గరకొచ్చి,“ఈ అమ్మాయి కావాలి” అని "ఘర్‌కిరాణి" పెద్దామెకి డబ్బులిచ్చి, రేఖ వెంట ఆమె గదికొచ్చి తలుపులు, పరదాలువేసి, రేఖ కాళ్ళమీద పడి, “నేనెంత దురదృష్టవంతుణ్ణి. ఇలాంటి స్థితిలో నా అక్కను చూడవలసి వచ్చింది. నేనిలా ప్రవర్తించవలసి వచ్చింది. నన్ను క్షమించక్కా!” అంటూ రోదించాడు.
“నీకే పాపం అంటదురా! నేనే కదా నీకు ఈ ప్లాన్ చెప్పింది” అంటూ తమ్ముణ్ణి ఓదార్చింది రేఖ. జరిగిందంతా ప్రదీప్‌కు చెప్పి, నీవు ఓ పని చేసి, ఇక్కడున్న ఆడపిల్లలనందరినీ నీ అక్కచెల్లెళ్ళుగా భావించి కాపాడాలి. ప్రతిరోజూ మాకు మధ్యాహ్నం పూట చదువుకోవటానికి దినపత్రికలనిస్తారు. వాటిల్లో ముంబయి సౌత్‌కి కొత్తగా ఓ లేడీ కమీషనర్ వచ్చారనే వార్త వుంది.
ఈ ఘర్‌వాలీలు కానిస్టేబుల్స్ నుండి DGPల వరకు లంచాలను ఇచ్చి ఇక్కడి వార్తలను, రౌడీల అకృత్యాలను పై అధికారులకు తెలియకుండా మేనేజ్ చేస్తారు. అందుకే నువ్వు ఏదో విధంగా ఆ కమిషనర్‌గారిని కలిసి, మా గురించిన సమాచారాన్ని అమెకు తెలియపరచాలి. లోకల్ పోలీసు స్టేషన్‌కు అసలు వెళ్ళకు. ఇక్కడ ఎవరికీ ఏ అనుమానమూ రాకుండా నీ ప్రవర్తన ఈ పరిసరాలకి, వాతావరణానికి తగ్గట్టుగా ఉండాలి” అని చెపుతూ, “ఇక్కడ నీ అక్కే కాదు చాలామంది సోదరీమణులు నికృష్టజీవితాలను నెట్టుకొస్తున్నారు. వీరందరి జీవితం నీ చేతుల్లో ఆధారపడి వుంది. రక్షాబంధనం కడుతూ, "నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, దేశానికి మనం రక్ష" అని చెప్పుకుంటాం కదా! ఆ దేశంలోనే వీరంతా ఉన్నారని బాగా గుర్తుంచుకొని, చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ప్రవర్తించి, ఈ మురికి కూపం నుండి మా అందరినీ కాపాడాలి నువ్వు" అంటూ తలుపు తీసి పంపేసింది ప్రదీప్‌ను.
చెదిరిన జుట్టుతో, తూలుతూ బయటకు వెళ్ళిపోయాడు ప్రదీప్. తమకు కావలసింది డబ్బేగా, అది అందింది. అందుకే మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోలేదు అక్కడున్న వాళ్ళు.
ఓ వారం గడిచింది. తన బిజినెస్‌లో బాగా స్నేహపాత్రంగా ఉండే అతని ద్వారా కమీషనర్ ‘మీనాదీప’ దగ్గరకి ఓ రోజు ముందుగా అప్పాయింట్‌మెంట్ తీసుకుని వెళ్ళాడు ప్రదీప్. తన అక్క, మిగిలిన స్త్రీల మనోవేదననంతా చెప్పి, స్ధానిక పోలీసుల అసమర్ధత కారణంగా చాందినీ బజార్ అరాచకాలు, స్త్రీలపై జరిగే అకృత్యాలు బయటకు రావటంలేదని, ఆ క్రిమినల్స్‌పై సైలెంట్‌గా దాడిచేసి, ఆ బాధాతప్త హృదయాలకు లేపనమద్దాలని, వాళ్ళను వాళ్ళ ఊళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయాలని విన్నవించాడు ప్రదీప్.
కమీషనర్ మీనాదీప చొరవతో విముక్తులైన స్త్రీలందరూ తమతమ ఊళ్ళకు పయనమయ్యారు.“తల్లీ! పాత రోతను వదిలేసి, కొత్త జీవితాలను ప్రారంభించండి” అంటూ తనకు రక్షాబంధనం కట్టిన అందరికీ వీడ్కోలు పలికాడు ప్రదీప్.
—--