భగవద్గీత!  (Author: కుంతి (కౌండిన్య తిలక్))

ప్రాభాత సమయాన పరమాత్మ సుముఖాన

గానమైనట్టిది కాదు గీత!

పూజాగృహంబున   పూలగుట్టలలోన

పాదుగొలుపునది కాదు గీత!

ప్రవచన కర్తల  భాషణ మందు నా

మోదితమయినది కాదు గీత!

స్రష్టల వాక్కులన్ ద్రష్టల దృక్కులన్

గర్విత భావము కాదు గీత!

మైకు సెట్టులో  వినిపించు మాట కాదు!

స్వర్గ పురిరథమున పెట్టు పాట కాదు!

వయసు మీరినపుడు వేయు వల్లె కాదు!

మరణ  పై శయ్య చేసెడు   స్మరణ కాదు!

మనిషిని మార్చగా మానవతా ద్వార

బంధముదెంచునుద్గ్రంథ మదియె!

వ్యక్తి వ్యవస్థగా శక్తిగా మారగా

              ధృతిని గూర్చెడునట్టి కృతియునదియె!

వక్ర  వ్యవస్థను సక్రమంబుగ మార్చు

                 రమణీయమగు మంత్ర రాజమదియె!

వర్ణ సమన్వయ వ్యవసాయమును నేర్పు

సత్సంగ జీవన సారమదియె!         

మదినిచంచలతను మాన్పు మార్గమదియె!

దుఃఖ సుఖములకును  తోడునదియె!

            సర్వభూత దయను చాటువాక్కు నదియె!

గీత మార్చు చరమ  గీత యదియె!

0 Comments