ప్రకృతి నా జీవన కావ్యం  (Author: రేపాక రఘునందన్)

ఉదయకాలం 

 

హృదయ రాగాన్ని ఆలపిస్తూ పక్షులు.  

తేజోవంతమైన లేలేత నవ్వుల కిరణాలతో సౌందర్య దీపం ఆకాశాన్ని అలంకరిస్తుంది.  

ఒక ప్రశాంత జీవన మాధుర్యమేదో 

ఆత్మ సంగీతమై అల్లుకుంటుంది.

 

తెరలు తెరలుగా జ్ఞాపకాలు కవిత్వమై చిగురుస్తాయి.  

నా ప్రాణ నేస్తాలై

ఊపిరి సిరులై తేట గాలిని వీస్తూ 

ఆ ఆకు పచ్చని నీడల 

దీవెనలై విరబూస్తాయి.

 

నా నడకకు స్వాగత గీతమౌతాయి.

నాతో ప్రయాణిస్తున్న 

ఉదయాన్ని ఎవరో ఆకాశంలో 

అందమైన చిత్రాలుగా 

గీస్తున్న సుందర దృశ్యం.

 

ప్రతి ప్రభాతాన

ఒక కవిత్వం...  ఒక సంగీతం... ఒక చిత్రలేఖనం జుగల్బందీ రాగంలా 

పెనవేసుకుంటాయి.  

 

ప్రకృతి గొప్ప ఆరోగ్య శాల.  

సుగంధిత సంతోషాల పూలమాల.  

అమ్మ ఊయల జోల.  

 

ఎవరు ఉండగలరు?  

ప్రకృతిని ఇష్టపడకుండా!

ఎవరు నిరాకరించగలరు?  

స్వేచ్చా రెక్కల 

స్వచ్ఛ జీవన లాలసను.

 

నిన్ను నీవు దర్శించుకోగలిగే 

ధ్యాన సమయాల్ని,  

నిన్ను నీవు తీర్చిదిద్దుకునే 

అపురూప క్షణాల్ని 

నీకు ఇచ్చే మహోదయాన్ని -

ఈ తెల్లవారుజాముని 

వృధా కానీయకు.  

 

విడువకు.  

నీ ప్రాణ దీపమై వెలిగే 

సుందర సుమధుర దరహాస శాంతి క్షేత్రాన్ని -

ప్రకృతి ఓ  జ్ఞాన శాస్త్రం.  

ఓషది గుణాల జీవన చైతన్య సూత్రం.

                 ----------

添加评论