మొలకెత్తనున్న అంకురం  (Author: అవ్వారు శ్రీధర్ బాబు)

‍‍కళ్ళు ఏంటి అలా ఉన్నాయ్....!

స్వచ్ఛత వాడిన పూలు రా అవి 

నీకులా ఉండవు చెప్పా...   బుడ్డోడితో.....

 

నా నవ్వులు కొన్ని నీకు ఇచ్చేదా...! అన్నాడు వాడు. నవ్వడమే బ్రహ్మవిద్య అయిపోయిన నాతో...

అవన్నీ లాభం లేదని అడ్డంగా  తలూపాను.

 

కనుబొమ్మలు ఎందుకలా ముడుచుకుని ఉంటాయ్..! సందేహపడ్డాడు వాడు.

విచ్చుకుంటే సీతాకోకచిలుకలు 

ఎగురుతున్నట్లు ఉంటాయి కదా  

మళ్లీ వాడే అన్నాడు.

కోర్కెల తాళంతో బంధింపబడి ఉన్నాయవి

నీలా విప్పారవు...... చెప్పాను.

 

సాయంత్రం అలా సరదాగా 

గాలితో గాలిపటమాట ఆడదాం రమ్మన్నాడు.

డబ్బులాటలో పడి అవన్నీ మర్చిపోయానన్నాను.

 

అది సరే ఆటల్లో నన్ను ఎప్పుడు గెలవవేంటి 

ఆలోచిస్తూ అడిగాడు వాడు.

సమాజ పద గమనంలో

ఓటమి మింగిన వాడిని....  

గెలుపుమాటెక్కడిది అన్నాను.

అర్థం కానట్లు చూశాడు

చిన్ని కళ్ళను టపటపలాడిస్తూ....

 

సముద్రపు ఒడ్డున గవ్వలేరుకొద్దామని 

చొక్కా పట్టుకు లాగుతూ మారం చేశాడు.

సున్నితత్వపు గవ్వలెన్నో పగిలిపోయాయి 

అతికే దారి లేదురా అన్నాను.

 

ప్రశాంతంగా నిద్రపోతున్న వాడి తల నిమిరుతూ కోల్పోయిన ప్రశాంతతతో.... అనుకున్నాను...

నిజమే.... స్వచ్ఛమైన నవ్వు కోసమో...

ముసుగులు లేని ముఖం కోసమో...

అలలై చెలరేగే ఉత్సాహం కోసమో..

మల్లెతనపు నిర్మలత్వం కోసమో...

ఇప్పుడు ఇలా నేలలో ఇంకిపోయి

పసి మొగ్గై ఉదయించాలని ఉంది.

             ---------

添加评论