నెత్తుటి గాయాల సంపుటి  (Author: పొత్తూరి సీతారామరాజు)

వాడు రాత్రిని నిద్ర పోనివ్వడం లేదు..

నీడకు అడ్డంగా ఉంటాయని చెట్లను నరికేసాడు...

ప్రకృతి విపత్తుకు అడ్డమని, కొండల్ని కొట్టి మట్టి అమ్మేసాడు...

నదుల్ని తవ్వేసి, ఇసుకను తోలేసి, నీటిని నగరాల మీదికి వదిలేసాడు.

 

ఋషులు తిరిగిన నేలపై రాచరికపు నాటి విలాస భవనాలు కట్టాడు చూడు...

రెక్కలు తొడుక్కున్న వాడి మాటలు, గాలిలో ఎగురుతున్నాయి.

గుండెల్ని పిండింది చాలు...

ఓ చీకటి వాడిని దూరంగా తీసుకుపో.

 

ఇప్పుడు దగాపడ్డ రైతు మాసిపోయిన బట్టలతో...

ఏ బస్టాండ్ ముందో తిరిగుతున్నాడు చూడు...

వల తెగిన జాలరి పాట..

దుఃఖపు లోయల్లో ఉరేసుకుంది చూడు.

 

నేతన్న తెగిన మగ్గం కిందే నడుము విరిగి, గూడు కిందే కూలిపోయాడు చూడు..

కష్టాలు నీళ్లతో కలిసి పారుతున్నాయి చూడు.

 

కన్నీళ్లు సుడులు తిరిగి పుట్టెడు దుఃఖంతో రోదిస్తున్నాయి చూడు...

నాడు నీవు చేసిన గాయాలు, మానని వ్రణాలై ఇప్పుడు మనిషిని కాలుస్తున్నాయి ఓసారి చూడు..

మనం ఎన్నో తరాల నుండి కాపాడుకుంటున్న ఈ దేశ సంపదను ప్రైవేటీకరణ పెత్తందార్లకు నిత్యావసర సరకులా అమ్మేస్తున్నాడు చూడు.

 

వాడికి చెప్పండి చనుబాలు ఇచ్చే మా అమ్మ స్థన్యాన్ని కోయొద్దని...

ముక్కలైన మా మనసులను మళ్లీ ఏరి కుట్టలేడని...

పగిలిన గుండెలను ఓదార్చలేడని....

 

వాడికి చెప్పండి కాలం కన్నీరు కారిస్తే ఏదో ఒక రోజు నెత్తుటి గాయాల చరిత్రతో సరికొత్త సంపుటి రాస్తోందని.

0 Comments