ధాతువు
ధాతువు (Author: దివాకర్ల రాజేశ్వరి)
హిమ ధవళ సేచనాల
తొలిప్రొద్దుల చలి ముఖం
తృణ బిందువులలో తేలి ఆడింది.
బంతి చామంతి సుమ దళాల
సొగసు రంగు తొణికిస లాడింది.
గడి దాటిన రంగవల్లి
రథమెక్కి కదిలింది.
అలికి దిద్దిన వాకిట
గుమ్మడి పూల గొబ్బెమ్మ సౌరు అమరింది.
సౌరమాన రాశి వంపు తిరిగింది
కృషికి ఫలితమిచ్చిన పంట
బస్తాలకెత్తింది.
పనికి రాని సరుకు
భోగి మంటకు సరకు చేసింది.
చుట్టు చేరిన కుటుంబానికి
సరసమైన కాపు కాచింది.
వెలుగు జిలుగుల రవ్వ ఉరకలేసింది.
దేవళాల మార్గశిరాన
పాశురాల కృతి శృతిని మీటింది .
హరి దాసరి పాట
చిడతల రాగ మెత్తింది.
పొంగు లెత్తిన పాల పొంగలి
సిరులు కురిసింది.
గంగిరెద్దుల ఆట
పుణ్యకోటి ప్రభలనెత్తింది
అంచెలంచెల కొలువు బొమ్మల వరుస
పురాణ కథలను ప్రోది చేసింది.
బరికి దిగిన కోడి పందెం
స్పర్థ రగిలింది.
గడిని దాటిన గాలి పటం తోక విప్పింది.
నగర మూలం జానపదాలను
మరువనంటుంది.
చిలగడ దుంపల గ్రామీణం
కండ బలం తెలిపింది.
నువ్వులను పంచడం
నవ్వులను రువ్వ మంటుంది.
చక్కిలాల బిరుసు
పంటికి చురుకునిచ్చింది.
వ్రతాలు, నోములు, గరిమ మెరిసింది.
ఈడొచ్చిన అమ్మాయిలు
పరికిణీలు, ఓణీలు,
కాలేజీ అబ్బాయిలు
జుబ్బాలు, పంచెలు, అబ్బా .......
అబ్బరాల పండుగ అదిరింది.
ఇక్షు రసాల కలిమి ;
చక్కెర పోతల చెలిమి ,
తరరతరాల ఆయనాల
సంస్కృతి శాస్త్ర వైదుష్యాలను
కలగలుపుకొచ్చింది.
సంక్రాంతి సంబరాల పండుగ
చదువులన్నింటికి
సేద్య మూలం వెన్నెముకగ
తలను ఎత్తింది.
వేరు శనగ కాయ గుత్తి
మట్టిని పెకలించుకొచ్చి
పులిన ధమనుల చెలిమి కలిమికి
ఆరోగ్య ధాతువుల నిచ్చింది.
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)