దేశ భాష లందు తెలుగు లెస్స!
దేశ భాష లందు తెలుగు లెస్స! (Author: మొక్కరాల కామేశ్వరి)
అ. వె. ముత్యములను బోలు ముద్దుటక్షరములు
ముద్ద బంతి పూలు ముగ్ధలట్లు
వర్ణ మాల చూడ వైజయంతియె తాను
దేశ భాష లందు తెలుగు లెస్స!
అ. వె. వర్ణ చయము పలుకు వ్రాసి నట్టి పగిది
ప్రణవ మట్లు మ్రోగు ప్రభల చిందు
తనరు చుండు మిగుల తానజంత మగుచు
దేశ భాషలందు తెలుగు లెస్స!
అ. వె. భక్తి రసము కొరకు యుక్త మయిన భాష.
రక్తి కూడ నిందు రమ్య మగును
రసము యేది యైన రాణించు నీభాష
దేశ భాషలందు తెలుగు లెస్స!
అ. వె. అన్య భాష లెన్నొ నలవోకగా హత్తి
సరళ రీతి సాగు స్యందనమ్ము
నవ్య గతుల కృతికి సవ్యమౌ సాధనం
దేశ భాష లందు తెలుగు లెస్స.!
అ. వె. దిశల దిశల యందు దీప్తి నొందుచు తాను
వృద్ధి చెందు గాక! వెల్లువగుచు.
విబుధ వరులు మెచ్చి వినుతించి యనగ
దేశ భాష లందు తెలుగు లెస్స!
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)