తప్పెవరిది..శిక్షెవరికి
తప్పెవరిది..శిక్షెవరికి (Author: కుంతీపురము కౌండిన్య తిలక్)
చాలారోజులుగా నేను మీకు ఈ విషయాలుచెప్పాలనుకుంటున్నాను.
ఇది నాకథ.
కాదు... కాదు... నాలాంటి వాళ్ళ చాలామంది కథ...
ఆ కథ పేరు తప్పెవరిది.. శిక్షెవరికి?
నాలాంటి వాళ్ళు ప్రతిరోజూ ఏదో ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకోకుండా ఉండరు.
నేను ప్రారంభించిన ఈ ఉపోద్ఘాతాన్ని మీకు బాగా అర్ధం చేయించాలి అంటే నాజీవిత గ్రంథం లోని కొన్ని అధ్యాయాలను మీతో పంచుకోవలసిందే.
..............
నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో...
ఫిజిక్స్ లాబ్ నుండి బయటపడ్డాను. అప్పటికే చాల చీకటి పడింది. ల్యాబ్ దాటుకొని కాలేజ్ కారిడార్ లో నడుస్తున్నాను. ఇంతలో బాట్నీ ల్యాబ్ నుండి సౌదామిని బయటికి వచ్చింది. ఆమెనుచూడగానే, నెల రోజుల కింద నేను ఆమెకు ప్రేమ లేఖరాయడం, ఆమె ఆ లేఖను ముక్కలు ముక్కలుగా చించి నా ముఖాన కొట్టడం గుర్తుకు వచ్చింది.
ఆమె- వెనుకగా వస్తున్న నన్ను చూసి, వేగంగా నడవసాగింది. అప్పుడే కరెంట్ పోయింది. ఆమె చెప్పుల చప్పుడు నాకు వినబడ సాగింది.
ఇంతలో నా వెనుక నుండి వచ్చిన సుదర్శన్ నన్ను దాటుకొని వెళ్ళాడు. అతను కూడా నాలాగే ప్రేమలేఖ రాసి ‘ఛీ” కొట్టించుకోవడమేకాక, ఆ లేఖలో ఉపయోగించిన భాష వల్ల చెంపదెబ్బ కూడా తిన్నాడు.
“ఇపుడు వీడెందుకు వచ్చాడురా” అనుకున్నాను. మేము ఆమెకు కనబడడం లేదు.
సుదర్షన్ ముందుగా వెళుతున్న సౌదామినిని చీకటిలో పోల్చుకున్నాడు. ఏదో స్ఫురించిన వాడిలా అడుగులో అడుగులు వేస్తూ వెనుక నుండి ఆమె వద్ద్దకు వెళ్లి, ఆమె అతడిని చూసేలోగా ఆమె చున్నీ ఆమె ముఖం పైన కప్పి, గట్టిగా వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె గింజుకొని అతడి నుండి విడిపించుకునే లోగా అతడు చీకటిలో మరొక దారి గుండా పారిపోయాడు.
ఇంతలో కరెంట్ వచ్చింది. లైట్లు వెలిగాయి. వెనుకనే ఉన్న నన్ను సౌదామిని చూసింది.
నేనే ఆ పని చేసాను అనుకున్నది. నేను జరిగినది ‘ఇది’ అని చెప్పేలోగా చరాచరా వెళ్ళిపోయింది. ప్రిన్సిపాల్ కు నా పైన కంప్లెయింట్ ఇచ్చింది. నన్ను కాలేజ్ నుండి సస్పెండ్ చేయించింది.
అప్పుడు నాకు అనిపించింది“తప్పెవరిది... శిక్క్షెవరికి?” అని.
..........................
ఇపుడు నా జీవిత గ్రంథం లో మరికొన్ని అధ్యాయాలను పరిచయం చేస్తాను.
నేను చాల కష్టపడి చదువుకున్నాను. స్వశక్తితో ఉత్తర, దక్షిణములతో సంబంధం లేకుండా మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను. అనతి కాలంలో మంచి ఉద్యోగిగా, పనిమంతునిగా పేరు తెచ్చుకున్నాను.
ఆఫీసులో అందరి బరువును మోస్తూ, తలలో నాలికలా ఉంటూ ఉద్యోగమే జీవితంగా గడుపుతున్నాను. నా వృత్తి లో బాగా డబ్బు తినే అవకాశం ఉన్నప్పటికీ నిజాయితీగా విలువలకు కట్టుబడి పని చేయసాగాను. నా చుట్టూ ఉన్నవాళ్ళలో ఇది కొందరికి నచ్చ లేదు.
ముఖ్యంగా చంద్రబాబుకు. అతను చాలా అవినీతిపరుడు. ప్రతి పనికి రేటు కట్టి ఫైల్స్ పైన సంతకాలు పెడుతుండే వాడు. అతను క్లియర్ చేసిన ఫైల్స్ నా దగ్గరికి వస్తే, అవి న్యాయ బద్దమైనవి కాకుంటే, నేను అడ్డుకునే వాడిని. దానితో అతను నా పైన కోపం పెంచుకున్నాడు.
అదే సమయం లో ఒక వ్యక్తి నాసిరకం వస్తువులు హాస్టల్స్ కు సప్లై చేస్తునాడని తెలిసి అతని బిల్స్ ఆపాను. అతను చంద్రబాబు మిత్రుడు. అతని పేరు భిక్షపతి.
అతను నాపై కక్ష పెంచుకున్నాడని నేను ఊహించలేదు.
ఒకరోజు నేను లంచ్ అవర్ కువెళ్ళేముందు నా దగ్గరికి భిక్షపతి వచ్చాడు. కాసేపు కూర్చోమని చెప్పి లంచ్ కు వెళ్ళాను.
నేను క్యాబిన్ నుండి వెళుతూ నా బీరువాకు లాక్ చేయడం మరిచాను. నేను లంచ్ నుండి తిరిగి వచ్చేసరికి, అవినీతి నిరోధక శాఖ వాళ్ళు నాకోసం ఎదురు చూస్తున్నారు.
“నా బిల్స్ సాంక్షన్ చేయాలంటే ఈ సార్ లంచం అడిగాడు. తప్పని పరిస్థితిలో యాభై వేలు ఇచ్చాను” అంటూ యే యే నంబర్లు గల నోట్లు ఇచ్చాడో వాని వివరాలు కూడా ఇచ్చాడు భిక్షపతి.
“నేను అలాంటి పని చేయను” అన్నాను.
“నిజం సార్! నేనుడబ్బు ఇచ్చాను” అన్నాడు.
వాళ్ళు“సోదాచేయాలి” అన్నారు.
నేను“చేసుకోవచ్చు” అన్నాను.
వాళ్ళు కాసేపు అక్కడా ఇక్కడ వెదికినట్లు చేసి, బీరువా నుండి భిక్షపతి చెప్పిన నంబర్లు గల రూపాయల కట్టనుతీసి చూపించారు.
నన్ను వాళ్ళు ఇరికించారు అని అర్ధం అయింది. నా వాదనలు చెల్లలేదు. నేను సస్పెండ్ అయ్యాను. విచారణలు జరిగినతరువాత నాకు రెండు ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ, నన్ను వేరేఊరికి బదిలీ చేసారు.
అపుడు అనిపించింది“తప్పెవరిది... శిక్షెవరికి?” అని.
...............
నాకు పెళ్లి అయింది. నేను మా పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాన్ని చేసుకున్నాను. నాకు మా అమ్మానాన్నలంటే ప్రాణం, వాళ్ళను సంతోష పెట్టాలి, బాగాచూసుకోవాలి అనుకునేవాడిని.
కానీ నా భార్యకు వారంటే ఇష్టం లేదు. వారిని నానా ఇబ్బందులు పెట్టింది. వారి మధ్య పోట్లాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. నేను నా భార్యకు ఎన్నో రకాలుగా నచ్చ చెప్పిచూసాను. ఇద్దరినీ సమానంగా చూసుకుంటూ వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చాలా కృషి చేసాను.
కాలక్రమేణా నా ముఖం పైన ముడుతలు పెరిగాయి, నా కంటి లో కాంతి తగ్గింది. కాని నా సమస్య మాత్రం తీరలేదు.
ఒకరోజు మాఅమ్మ నాన్నలు వృద్ధాశ్రమం లో చేరారు. అక్కడ వారు మానసికంగా కృంగిపోయి మరణించారు. నా బంధువులు నన్ను ‘భార్య చేతిలో కీలుబొమ్మ’ అని, ’భార్యను అదుపులో పెట్టలేని అసమర్దుడిన’ని తిట్టిపోశారు. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా నా బంధువర్గం నన్ను వెలి వేసారు. నా ఇంటికి రావడం మానివేశారు.
అప్పుడు నాకనిపించింది“తప్పెవరిది... శిక్షెవరికి?” అని.
.......................
నా భార్య నెల తప్పినపుడు మా ఇంటిలో ఎన్ని రకాల గొడవలు ఉన్నా పుట్టబోయే బిడ్డ కోసం నా భార్యను చాలా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేసాను. నా భార్య కడుపుతో ఉన్నపుడు బిడ్డ తల్లీ క్షేమంగా ఉండాలని పూజలు చేసాను.
కానీ వైద్య శాలలో ఉన్న దారుణ పరిస్థితులవల్ల, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ వికలాంగుడుగా పుట్టాడు. విచిత్రం ఏమిటంటే ఆ బిడ్డ అలా పుట్టడానికి కారణాలు అనేకమైనా నా భార్య నన్నే దోషిగా భావించి నిందిస్తుండేది.
ఒక పక్క నా భార్య మూర్ఖత్వం, నీచత్వం, ఇంట్లో గొడవలూ, నాకు ఒక ఊరు నుండి మరొక ఊరికి బదిలీలు కావడం...
అయినా పిల్లవాడి పెంపకంలోజాగ్రత్త వహిస్తూ... ఒత్తిళ్లను ఎదుర్కుంటూ ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా బాగా కృంగిపోయాను.
ఆ పిల్ల వాడిని చూస్తున్నప్పుడల్లా నాకనిపించేది“తప్పెవరిది.. శి క్షెవరికి?” అని
---------
నా తదనంతరం ఆ పిల్ల వాడిని చూసుకోవడానికి తోడు కావాలని ఇంకొక పిల్లవాడిని కన్నాను. వాడు పెరిగి పెద్ద వాడయ్యాడు. వాడికి విద్యా బుద్ధులు, నైతిక విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు అబ్బేందుకు చాల కృషి చేసాను. ఇంజనీరింగ్ చేయించాను. వాడు ఒక పక్క నాపర్య వేక్షణలో నా కనుగుణంగా పెరుగుతున్నాడు అనుకున్నాను.
కానీ నాకన్నా మారుతున్న సమాజం, సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం, మిత్రులు వాడిని మరింత ప్రభావం చేసాయి. తద్వారా చెడు సహవాసాలకు మరిగి చెడు దారిలో పోతూ అన్నీ దురలవాట్లకు బానిసయ్యాడు.
నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా ఉద్యోగం సక్రమంగా చేయకుండా
బలాదూర్ గా తిరుగుతూ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఊరంతా అప్పులుచేసాడు. వడ్డీల మీద వడ్డీలకు అప్పులు తెచ్చి విలాసాలకు ఖర్చు పెడుతుండడం తో అప్పులు వేలల్లో నుండి లక్షల్లోకి వెళ్ళాయి. అప్పులవాళ్ళు నా ఇంటి మీదికి వచ్చారు. నన్నూ, నాభార్యను, నా కోడలిని అల్లరి పెట్టారు. నా కొడుకును, మనవడిని చంపేస్తామని బెదిరించారు.
ఆ హింసను భరించలేక నేను కష్ట పడి కట్టుకున్న ఇంటిని అప్పుల వాళ్ళ పేరు మీద రాసి, నేను కట్టుకున్న ఇంటికి ఎదురుగ ఉన్న మరొక ఇంటిలో అద్దెకు మారాను. నా పిల్లవాడికి బాధ్యత తెలిసి రావాలని కొడుకును వాడి కుటుంబాన్ని ఇంటి నుండి బయటికి పంపి వేసాను. దానితో నా కొడకు కోడలు నాపై కోపం పెంచుకొని, నాతో మాట్లాడటం మానివేశారు.
కాని నా ఇంటిని చూస్తూన్నాప్పుడల్లా నాకనిపించేది“తప్పెవరిది.. శిక్షెవరికీ?” అని
....................
ఇవీ నాజీవిత గ్రంథం లో కొన్ని అధ్యాయాలు.
నాకు తెలుసు మన గురించి పక్కవారికి చెబుతుంటే వాళ్ళు టీవీ సీరియల్ చూస్తున్నట్లు చూస్తారని, ఆ తరువాత వెనక్కి తిరిగి నవ్వుకుంటారని లేదా అసహ్యించుకుంటారని.
అయినా వాళ్లకు పనులు లేవా? మన జీవితాల్లోకి తొంగి చూడడానికి, పరిష్కారాలు చెప్పడానికి.
అయితే నేను ఎందుకు చెప్పాను?
సాంత్వన పొందాలనా...?
సానుభూతిని ఆశించా...?
నేను చాలా మంచివాడిని, ఎవరికీ అపకారము చేయలేదు. అయినా జీవితాంతం కష్టాలు పడ్డాను... నా అపజయాలు, అసహ్యపు జీవీతపు వెనుక కథ ఇదీ అని చెప్పుకోవడానికా...?
... కాదు.
మరి ఎందుకు..?
ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని..... కానీ దొరకలేదు.
మిత్రులారా!
నేను ఎప్పటిలా“తప్పెవరిది... శిక్షెవరికి?” అని ఆలోచిస్తూ...
మీకు చెప్పినట్లే నాకెందు కిలా జరిగిందని పెద్దలను ప్రశ్నించాను.
కొందరు“దైవ కృతమునకిల సాధ్యముకలదే” అన్నారు.
కొందరు” స్వయంకృతాపరాధం” అన్నారు. కొందరు ‘విధిలిఖితము’ అన్నారు. మరి కొందరు‘పూర్వ జన్మ లో చేసుకున్న పాపం’అన్నారు. కొందరు ‘ఎవరికి యే ద్రోహంచేసావో, ఇపుడు అనుభవిస్తున్నావు’అన్నారు.
కొందరు“నీ జీవితానికి నీవే నిర్మాతవు” అన్నారు
“ నీవు ఎలా ఆలోచిస్తావో...... నీవు ఎలా ఉంటావో... ఆలాగే నీజీవితం ఉంటుంది“ అన్నారు.
కొందరు“నీకు జీవించడం రాదు... అసమర్దునివి.... నీది అసమర్ధుని జీవన యాత్ర” అన్నారు.
..................
నేను ఒక పక్క అసహ్యకరమైన, అవమానపూరితమైన, గ్లామరు, గ్రామరు లేని జీవితాన్ని
గడుపుతూ....
మరొక ప్రక్క ఓటమిని అంగీకరించకుండా, దైన్యత దరిజేరకుండా…
ముఖ్యంగా ఓడిపోయాను అన్న భావన... ఆత్మా త్యాగం అన్న భావన దగ్గరికి రానీయకుండా…
ధర్మాన్నీ, న్యాయాన్ని నమ్ముకొని, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకొని జీవితాన్ని గడుపుతున్నాను.
ఒక రోజు పొరుగూరుకు ఆఫీస్ పని మీద వెళుతున్నాను, నేను బైక్ డ్రైవ్ చేస్తున్నాను.
సాధారణమైన వేగంతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం చేస్తున్నాను. ఇంతలో ఒక లారీ వాడు ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ, రాంగ్ సైడ్ లో వచ్చి నన్ను ఢీకున్నాడు.
నేను బండి మీద నుండి కొంత దూరం వెళ్లి గడ్డి కుప్పలో పడ్డాను. లేచి చూసుకున్నాను. అదృష్ట వశాత్తు నాకు ఏమీ కాలేదు. అక్కడక్కడా కొంచం చర్మం రాసుకు పోయింది. ఒంటికి అంతా దుమ్ము ధూళి అంటుకుంది. బండి కూడా బాగానే ఉంది. వెంటనే బయలు దేరాలని అనిపించలేదు. దాహంగా అనిపించింది.
ఆకాశం సంధ్యారంగులను పులుముకుంటున్నది. ఇంతలో దగ్గరలో ఉన్న గుడినుండి గంటల శబ్దం వినిపించింది. నేను అటువైపు వెళ్లాను.
అది జగద్గురువు, గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణుని ఆలయం.
వెహికిల్ దగ్గరలో పార్క్ చేసి, గుడిలోకి వెళ్లాను. గర్భ గుడి ముందు కూర్చుని మంత్రాలు చదువుతున్నపూజారి నన్ను చూసాడు.
అమాంతంగా నా వైపువచ్చి” ఏమి జరిగిందండి” అన్నాడు ఆదుర్దాగా. జరిగినది చెప్పాను.“భగవంతుడు కృపామయుడు, ఎవరికీ అన్యాయం చేయడు. అతను మిమ్మల్ని గండం నుండి గట్టెంకించాడు” అంటూ నన్ను కుళాయిదగ్గరికి తీసుకు వెళ్లి, రాసుకు పోయిన చోట, ముఖానికి, కాళ్ళూ చేతులకు నీళ్ళను ఇచ్చి,
నేను శుభ్రం చేసుకున్నాక, తుడుచుకోవడానికి, తన ఒంటి పైన ఉన్న ఉత్తరీయం ఇచ్చి సాంత్వన పరిచాడు. నేను వెళ్లి స్వామిని దర్శనం చేసుకునేలోపు, పూజారి గుడి పక్కన ఉన్న ఇంటిలోకి వెళ్ళి, ఒక చెంబులో పాలు, మరొక దొప్పలో ప్రసాదం తెచ్చి ఇచ్చాడు.
నేను ప్రసాదం తిని, పాలు తాగాను.
ఒంటిలో శక్తితో పాటు, ఏదో తెలియని ఉత్తేజం వచ్చింది.
అతనికి కృతజ్ఞతలుతెలిపి వెళ్ళబోతుండగా పక్కనే ఉన్న మండపంలో ఎవరో ప్రవచనం చెబుతున్నట్లుగా అనిపించడంతో అటువైపు వెళ్ళాను. అక్కడ ప్రవచన కారుడు చూడబోతే కుర్రాడిలాఉన్నాడు. ఎక్కువ మందిలేరు. అతడిని చూసాను.
ఎందుకో అతని ముఖంలో ఇంతకు ముందు గుడిలో చూసిన కృష్ణ భాగవానుని రూపం గోచరించింది.
అతని మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అతని స్వరం మాధుర్యం గా ఉంది.
అతను చెబుతున్నాడు.
“ భగవంతుడిని నమ్ముతూ, ఉత్తమమైన, ధర్మబద్దమైన, నీతి నిజాయితీ తో కూడిన జీవితంతో గడుపుతూ ఉండే మనుషులు, అనేక కష్టాలకు, దుఃఖాలకు గురి అవుతుంటారు. వారి జీవితంలో ఆనందం ఉండదు. ఎప్పుడూ యేవో సమస్యలు వాళ్ళను బాధ పెడుతుంటాయి. లేని కష్టాలు వచ్చి పడుతుంటాయి.
వాళ్లకు తరుచుగా ఒక సందేహం వస్తుంది.“ నేను యే పాపం చేయలేదు. ఋజు మార్గంలో జీవిస్తున్నాను. అయినా నాకే ఇన్నికష్టాలు ఎందుకు? యే తప్పు చేయకుండా ఇన్ని శిక్షలు ఎందుకు? అని.
అంతేకాదు వారు భగవంతుని సృష్టి పైన కోపాన్ని, ఆయన ఉనికి పైన అనుమానాన్ని తెచ్చుకుంటారు.
నేను వాళ్లకు ఒకటేచేబుతాను. పురాణాలు, ఇతిహాసాలు లోతుగా అర్ధం చేసుకోవాలి. పరమాత్ముని అవతారాలలో అంతరార్ధం అవగాహన చేసుకోవాలి.
యే తప్పు చేసాడని రామయ్య తండ్రి అడవుల పాలయ్యాడు. యే తప్పుచేసిందని సీతమ్మతల్లి నిందలపాలై, నిండు చూలాలుగా ఉన్నప్పుడు అడవి పాలు అయింది. యే తప్పు చేసాడని లక్ష్మణుడు అన్నతో వనవాసం చేసాడు.
అంతః పుర రాజకీయాలతో యే సంబంధం లేని ఊర్మిళ భర్తకు పదునాలుగు సంవత్సరాలు ఎందుకు దూరమయింది. భరతుడు ఎందుకు నందిగ్రామం లో నారచీరలు కట్టుకొని పాదుకలను
పెట్టుకొని రాజ్యం చేసాడు.
యే తప్పు చేసిందని అహల్య రాయిగా మారింది. యే తప్పు చేసిందని ద్రౌపదికి నిండు సభలో అవమానం జరిగింది. యేతప్పు చేశాడని రాధేయుడు జీవితాంతం సూత పుత్రుడంటూ అవమానాలు పడ్డాడు.
యే తప్పు చేసాడని కృష్ణుడు పుట్టగానే కంసుని చేతిలో అనేక సార్లు హత్యా ప్రయత్నాలకు గురయ్యాడు. దొంగతనం చేసాడని నిందల పాలయ్యాడు. కుంతీదేవి చేత శాపాన్ని పొందాడు. కిరాతుని చేతిలో బాణం దెబ్బ తిన్నాడు... ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు లేనన్ని ప్రశ్నలు మనకు ఉదయిస్తాయి.
ఇక్కడ మనం ఒక్కటే అర్ధం చేసుకో వాలి.
అవతార పురుషులకే కాలం ఎన్నో సవాళ్లు విసిరి, జీవితం లో ఉన్న కష్టాలు చవి చూపిస్తే మనబోటి వాళ్ళకు ఎంత.
మనం చేయవలసినదల్లా సమస్యలు, బాధలు వచ్చినప్పుడు నిరాశా, నిస్పృహలకు క్రుంగకుండా, అఘాయిత్యాలకు చేసుకోకుండా, అసంబద్ధమైన ఆలోచనలు తావీయకుండా, ఋజుమార్గాన్ని, ధార్మిక చింతనను వీడకుండా జీవితాన్ని జీవించేయడమే.
నీకు కష్టాలు వచ్చినపుడు నాకు దేవుడు“ఈ అన్యాయం చేసాడు” అని ఆలోచించకుండా,
నీకు చిన్నదో పెద్దదో సుఖం, అనందం కలిగినపుడు“నాకు దేవుడు ఈ సుఖాన్ని ఇచ్చాడు” అని ఆలోచించ గలిగినపుడు...
పడిన ప్రతి దెబ్బకు నీవు ఒక అనుభవాన్ని ప్రోది చేసుకోగలిగినపుడు...
ప్రతి అవమానాన్ని గుణ పాఠంగా మార్చుకోగలిగినపుడు...
నీకు జీవితం పట్ల, విశ్వాన్ని సృష్టించినప్రభువు పట్ల వైరాగ్య భావముండదు.
రాపిడి పెట్టిన వజ్రంలా, పుటం పెట్టిన బంగారం లా నీ జీవితం మరింత అర్ధవంతం అవుతుంది.... అంటూ అందరి వైపు నవ్వుతూ చూస్తూ ఒక్కసారి
‘శ్రీమద్రమారమణ గోవిందో’అనండి” అన్నాడు.
నా ప్రశ్నలకు ఎక్కడో సమాధనం దొరుకుతున్నట్లు అనిపిస్తుండగా....
ఆ ప్రవచనాకారుడికి దండం పెట్టి, భక్తులతో పాటు నేనూ గొంతు కలిపాను.
.............