డబ్బుకి లోకం దాసోహం
డబ్బుకి లోకం దాసోహం (Author: కాకు వెంకట శివ కుమార్)
యాభై అయిదేళ్ళ ముకుందం తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో చిన్న గుంట తవ్వుతూ ఉన్నాడు. తన పక్కనే చిన్న కుండీ ఉంది. అందులో చిన్న మొక్క. ఆ మొక్క వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు. మొక్కని చూస్తూ చిన్నగా నవ్వి ‘ఎంత మంచి దానివే మొక్క? ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నావు. ప్రతీ రోజూ కాసిన్ని నీళ్ళు పోస్తే సాలు నీకు, బారున పెరుగుతావు. బోలెడంత నీడ నిస్తావు. సాయంత్రం నీ పక్కనే కూర్చుంటే సల్లని గాలిని ఇస్తావు. కళ్ళకి ఇంపైన పూలనిస్తావు. కడుపు నింపే పండ్లనిస్తావు. అవసరం తీరాక నిన్ను కొట్టేసినా కూడా, కట్టెలను ఇస్తావు. నీ అంతంలో కూడా ఆదుకుంటావు. ఓ స్వార్ధం తెలియని మొక్క తల్లీ! నీకు వందనాలు! అందుకో! ’ అని అనుకుంటూ అడుగుల శబ్దం విని వెనక్కి తిరిగాడు. కొంచెం దూరంలో తన కూతురు శ్రావ్య నిలబడి వుంది. తన ముఖంలో ఏదో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది..
తన వైపు తిరిగి ‘ఏమ్మా శ్రావ్య. ఈ రోజు కాలేజీకి పోలేదా? ’ అని నెమ్మదిగా అడిగాడు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మౌనంగా అలానే బొమ్మలా నిలుచుంది. కొంచెం ముందుకు జరిగి ‘డబ్బు ఏమన్నా కావాలా బిడ్డా?” అని మళ్ళీ తానే అడిగాడు. ఈసారి కూడా తాను ఏం మాట్లాడడం లేదు. ‘ఏమైందో సెప్పు తల్లీ? అలా బొమ్మలా నిలుచుంటే ఎట్టా సెప్పు? నీ అయ్య కూడా ఈ సెట్టులాంటోడే. ఏం పర్లేదు సెప్పు బిడ్డా’ తన వైపే రెండడుగులు వేస్తూ అన్నాడు.
‘నా దగ్గరకి రావొద్దు’ అని కోపంగా అంది. కూతురు నుంచి అనుకోని మాట విని ముకుందం అక్కడే బొమ్మలా ఆగిపోయాడు. కాదు నిలబడిపోయాడు. అలానే తన వైపే చూస్తూ నిలుచున్నాడు. శ్రావ్య కూడా తన వైపే సూటిగా చూస్తూ వుంది. కాసేపటికి మౌనం వీడి ‘నేను ప్రేమించాను’ అని టక్కున అంది. ఆ మాటలు విని ముకుందంకి కాళ్ళు భూమ్మీద ఆనలేదు. నోట మాట కూడా రాలేదు. ఎలాగో కాసేపటికి తేరుకున్నాడు. ‘ఏంటి శ్రావ్య తల్లీ నువ్వు చెప్పేది? నువ్వు ప్రేమించావా? ఆ అబ్బాయి ఎవరు? ’ అని కంగారుపడుతూ గబగబా అడిగాడు.
తాను ఏం మాట్లాడడం లేదు.
‘నాతో ఎప్పుడూ చెప్పనే లేదు? వాళ్ళ అమ్మ, నాన్న ఎవరు? వివరాలు సెప్పు తల్లీ. నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి వస్తాను’ అని తనకి ప్రేమగా దగ్గరకి వెళ్లబోయాడు.
తను కోపంగా రెండడుగులు వెనక్కి జరిగింది. దగ్గరకి రావొద్దు అంటూ తన చేతులు రెండూ అడ్డం పెట్టింది. ‘నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజూ నుంచి నా పేరు శ్రావ్య కాదు. నేను ప్రేమించిన, నన్ను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ కుటుంబం, నాకు ఒక కొత్త మంచి పేరు పెట్టారు. ఈ రోజూ నుంచి నా పేరు రియా. నాకు కూడా ఈ పేరు చాలా నచ్చింది’ అని కఠినంగా చెప్పాల్సింది ఆగకుండా చెప్పేసింది.
‘శ్రావ్య అనేది మీ అమ్మ నీకు ఎంతో ప్రేమతో వెతికి వెతికి పెట్టిన పేరు తల్లీ’ అంటూ విలవిలలాడి పోయాడు. అదేమీ పట్టించుకోని శ్రావ్య కోపంగా చూస్తూ ‘ఇంకో విషయం. నువ్వేమీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మొత్తం నేనే మాట్లాడుకున్నాను. మా పెళ్ళి కూడా నిశ్చయం అయిపోయింది. పెళ్ళి అయ్యాక మేము అమెరికా వెళ్లిపోతున్నాం. అక్కడే మీ అల్లుడికి వ్యాపారం ఉంది’ అని సునాయాసంగా చెప్పేసింది. ఆ మాటతో ముకుందం ముఖం పాలిపోయింది. తన ప్రాణం గాల్లో తేలినట్టయ్యింది. ‘తన ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు, ఇంత కఠినంగా, తన కన్నతండ్రితో ఎలా మాట్లాడగలుగుతోంది? ’ ఈ ఆలోచనలతో ముకుందం కళ్ళు చెమ్మగిల్లాయి. ఎర్రగా మారాయి.
‘ఇదిగో ముకుందం! నేను చెప్పేది జాగ్రత్తగా విను. అబ్బాయి వాళ్ళకి నేను మాత్రమే కావాలి. ఆయన ఎలాగో కష్టపడి, మాట్లాడి, పోట్లాడి, బ్రతిమాలి, తన కుటుంబాన్ని మా పెళ్లికి ఒప్పించాడు’ అని చేసుకోబోయే వాడి గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది. ముకుందం గుండెలనిండా బాధతో కూతురు చెప్పే చేదు వింటూ వున్నాడు.
‘ఇంకో ముఖ్యమైన విషయం. నేను వాళ్ళ కుటుంబంలోకి రావాలి అంటే, నా కుటుంబాన్ని నేను వదులుకోవాలి. అదే వాళ్ళు నాకు పెట్టిన షరతు’ అని అంటున్న కూతురు మాటలు విని ముకుందం అక్కడే జీవచ్ఛవం అయిపోయాడు. గుండెలనిండా అంతులేని దుఃఖం. నిలబడలేక పోతున్నాడు. తల తిరిగి పోతోంది. పక్కనే వున్న గోడని ఆసరాగా తీసుకొని ఎలాగో నిలుచున్నాడు.
కూతురు ఇంకా ఆగడం లేదు. ‘అయినా నా పిచ్చిగాని, నాకు ఒక కుటుంబం కూడా ఉందా? ఉన్నది ఒక్క నువ్వు. ఎందుకూ పనికిరాని పని చేసే, అదేలే.. ఆటో నడిపే తండ్రి. అసలు అందరూ ఆటో ముకుందం అని నిన్ను, ఆటో ముకుందం కూతురు అని నన్ను, అంటూ వుంటే, ఒంటి మీద తేళ్ళు జర్లు పాకుతున్నట్టు, తల కొట్టేసినట్టు ఉంటుంది’ అని నిట్టూర్చింది. గోడకి ఆసరాగా నిలుచున్నా కూడా ముకుందం నిలబడలేక పోతున్నాడు.
కూతురు ఏదో చెప్తూనే వుంది. అవి వింటున్న ముకుందానికి మాటలు రావడం లేదు. కూతురు మాత్రం సూటిపోటీ మాటలు ఆపడం లేదు. చిన్నప్పుడు తనకి త్వరగా మాటలు రాకపోతే ముకుందం ప్రతీ దేవుడికి మొక్కిన మొక్కులు గుర్తుకు వస్తున్నాయి. ‘ఏదో నా అదృష్టం బాగుంది. మంచి అబ్బాయితో ప్రేమ. పెళ్ళి. ఆ తర్వాత అమెరికా లో కాపురం. అత్తవారి రూపంలో మంచి కుటుంబం కూడా దొరికింది’ ఇది చెప్తున్న తన ముఖం వెలిగి పోతోంది.
‘నువ్వు ఎలాగో పెద్దగా కష్టపడి, చిన్నప్పటి నుంచి, నాకు మంచి బట్టలు. మంచి బడి. పెద్ద కాలేజీ లో వెయ్యలేదు. అడిగినవన్నీ ఎలానో కొనివ్వలేదు. ఎప్పుడూ కార్లలో షికారు తిప్పలేదు. తిప్పలేవు కూడా! ఆ డొక్కు తుక్కు ఆటోలో తప్ప’ అని పెద్ద చిట్టానే విప్పింది. యముడి ముందు చిట్టా విప్పే చిత్రగుప్తుడిలా కనిపించింది కన్న కూతురు. కూతురు అంటున్న మాటల కన్నా యముడు వేసే మరణశిక్ష బాగుంటుందేమో అని మనసులోనే బాధ పడ్డాడు.
‘అది కాదు శ్రావ్య! ఏదో నాకు వున్న దాంట్లో, నిన్ను బాగానే చూసుకున్నా కదా? ’ అని బాధ పడ్డాడు. ‘అయ్యా తండ్రీ! నువ్వు బాగా చూసుకోవడం కాదు. నేను బాగా సర్దుకుపోయి బ్రతికాను. అది తేడా! తమరు గుర్తించాలి’ అని టక్కున అనేసరికి ముకుందం నోరు మూగబోయింది.
‘ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే. నన్ను మరచి పోవడం. ఈ రోజుతో నన్ను వదిలేయి తండ్రీ. నీతో పాటు నీ దురదృష్టాన్ని వెంట పెట్టుకొని వచ్చి, నాకు తగిలిన అదృష్టానికి అడ్డు రావొద్దు’ అని నిర్ధాక్షిణ్యంగా మాట్లాడింది. ఇంక ఒక్క క్షణం కూడా ఆగలేదు. ముకుందం కూతురు కాళ్ళ మీద పడి బ్రతిమాలాడు. ‘నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నన్ను వదిలి వెళ్లకు. వారంలో ఒక్క రోజు వచ్చి నిన్ను చూసుకుంటాను. అది చాలు తల్లీ’ అని ఏడుస్తూ వేడుకున్నాడు. ‘నా మాటలు కాదని మళ్ళీ నాకు కనిపించావో, నా శవాన్ని చూస్తావు’ అని బెదిరించింది. తన బట్టలు సర్దుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ‘అమ్మా శ్రావ్య! తల్లీ శ్రావ్య! ’ అని ఏడుస్తూ ముకుందం అక్కడే కూలబడి పోయాడు.
శ్రావ్య పెళ్లి చేసుకుంది. అమెరికా వెళ్ళి పోయింది. ఆ రోజు నుంచి ముకుందం ఒంటరి బ్రతుకు బండి లాగుతున్నాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత..
శ్రావ్య కుటుంబంతో సహా తిరిగి ఇండియా వచ్చేసింది. ఒంటరిగా కూర్చొని బాగా ఏడుస్తోంది. ఒక చేత్తో కన్నీళ్ళు తుడుచుకుంది. మరో చేతిలో మొబైలు ఫోన్ వుంది. కాంటాక్ట్ లిస్ట్ లో చాలా పేర్లు దాటుకుంటూ ఒక దగ్గర ఆగింది. తన స్నేహితురాలికి కాల్ చేసింది. ‘రమ్య! నాకు ఒక చిన్న సాయం కావాలి. నా కుటుంబం అమెరికాలో వ్యాపారంలో నష్టపోయింది. మాకు మొత్తం యాభై లక్షలు కావాలి. నలభై సర్ధుబాటు అయ్యాయి. నువ్వు మిగిలిన పది లక్షలు సర్ధుబాటు చేయగలవా? చాలా తొందరగా కావాలి. ఎలా చేయాలి అనుకుంటూ వుంటే, వెంటనే నా స్నేహితురాలివి నువ్వు గుర్తొచ్చావు’ అని చెప్తూ వుండగానే అవతల నుంచి కాల్ ఆగిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ‘తన ప్రాణస్నేహితురాలు ఇలా చేసింది ఏంటి? ’ అని తలచుకొని శ్రావ్యకి చాలా దుఃఖం కలిగింది.
మౌనంగా నిలుచొని రోదిస్తూ వుంది. ‘ఏంటి? నన్ను పెళ్లి చేసుకున్నాకే, వ్యాపారంలో నష్టం వచ్చిందా? ఉన్న ఆస్తులు ఊడ్చుకొని పోయాయా? రెండు రోజుల్లో పది లక్షలు తీసుకొని రాకపోతే నన్ను వదిలేస్తాను’ అని ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడి హెచ్చరిక. ‘ఇక నాకు విడాకులే’ అని ఏడుస్తూ కూర్చుంది.
‘ఇప్పుడు ఇంత డబ్బు ఎవరిని అడగాలి? మా దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు స్నేహంగా ఉన్నవాళ్ళు కూడా, ఇప్పుడు మా పరిస్థితి చూసి దూరం నుంచి ముఖం చాటేస్తున్నారు’ అని బాధపడుతోంది. ‘అంతా నీ వల్లే. నువ్వు ఏ రోజూ మా ఇంట్లో అడుగుపెట్టావో, ఆ రోజునుంచే మొత్తం ఊడ్చిపెట్టుకు పోయింది’ అనే అత్త సూటిపోటీ మాటలు పదే పదే గుర్తుకు వస్తూనే వున్నాయి. ‘ఎలాగో అలా నువ్వు మిగిలిన పది లక్షలు తీసుకొని రా, నేను మా అమ్మా నాన్నకి సర్ది చెప్తాను’ అని భర్త చెప్పిన మాటలు కూడా పదే పదే గుర్తొచ్చి వేధిస్తున్నాయి.
తన మొబైలులో బంధువులు, మిత్రుల నంబర్స్ చూస్తూ ‘నాన్న ఆటో ముకుందం’ అనే కాంటాక్ట్ దగ్గర ఆగి పోయింది. వెంటనే నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు మదిలో మెదిలాయి. ‘బంగారు తల్లీ! నువ్వు పుట్టాకే నేను కొత్త ఆటో కొన్నాను. నీ చదువు, పెళ్ళి కోసం ప్రతీ రోజూ ఆటోపై సంపాదించిన దాంట్లో, వంద రూపాయలు తీసి బ్యాంక్ లో దాచేస్తున్నాను’
ఆ మాటలు గుర్తుకు రాగానే నాన్న నెంబర్ కి కాల్ చేసింది. ముకుందం కూతురు ఫోటో చేతిలో పెట్టుకొని దిగులుగా కూర్చొని వున్నాడు. ఇంతలో తన ఫోన్ మ్రోగింది. ఇన్నాళ్ళకి కూతురు ఫోన్ రావడంతో, ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ఫోన్ ఎత్తాడు. అవతల నుంచి ‘హలో నాన్న’ అంది. ఏం తెలియనట్టు ‘ఎవరు? ’ అని అన్నాడు. ‘నాన్న! నేను శ్రావ్య’ అని అంది. ‘శ్రావ్య నా? లేదా రియా నా’ అని వస్తున్న ఏడుపు ఆపుకుంటూ అన్నాడు. శ్రావ్యకి కూడా బాగా ఏడుపు వచ్చింది.
‘మళ్ళీ ఈ ఆటో ముకుందం, నీ నాన్న అని గుర్తుకు వచ్చాడు అంటే, ఏదో అవసరం పడే ఉంటుంది. ఎంత డబ్బు కావాలి తల్లీ? ’ అని నేరుగా అడిగేశాడు. ‘అది కాదు నాన్న’ అని తాను ఏదో చెప్తూ వుంటే మధ్యలో ఆపి ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాన్న అని ప్రేమగా నోరు తెరిచి పిలిచావు అంటే, డబ్బు అవసరం ఉన్నప్పడే. బడి ఫీజు లేదా కాలేజీ ఫీజు. స్నేహితులతో సినిమానో లేదా కొత్త బట్టలు అవసరం ఉన్నప్పుడో’ అని తన మనస్సులో మాట దాచకుండా అనేశాడు.
ఆ మాటలు విన్న శ్రావ్య చాలా బాధ పడింది. ‘ఇక్కడ కూడా డబ్బు దొరక్కపోతే ఏం చేయాలి? ’ అని ఆలోచనలో పడింది. అదే తన బాధ. నాన్నని వదిలి వెళ్లినందుకు కాదు.
‘నాకు పది లక్షలు కావాలి. లేదంటే మా ఆయన నన్ను వదిలేస్తా అంటున్నాడు. మా కుటుంబం నన్ను వీధిలోకి గెంటేస్తా అంటోంది’ అని ఏడుపు అందుకుంది. కూతురి ఏడుపు విని ముకుందం గుండె కరిగింది. ‘నువ్వు అలా ఏడవకు తల్లీ. నేను ఏదో విధంగా పది లక్షలు సర్దుతాను’ అని మాట ఇచ్చేసాడు.
‘అప్పుడు నువ్వు నా పెళ్ళి కోసం దాచాను అని చెప్పేవాడివి కదా’ అని దాచిన డబ్బు గురించి గుర్తు చేసింది. ‘పోనీలే తల్లీ! నాన్న గుర్తు లేకపోయినా, నాన్న చెప్పిన డబ్బు మాటలు గుర్తు ఉన్నాయి. అయినా నీ పెళ్లి అయిపోయింది కదా? ఆ డబ్బుతో ఏం పని? ’ అని చెప్పే లోపే ‘పెళ్లి అయిపోయింది. కానీ డబ్బు అలానే ఉంటుందిగా’ అని తన ఆశ బయట పెట్టేసింది.
ముకుందం బాధ పడుతూ ‘ఉంది తల్లీ. ఆ డబ్బు జాగ్రత్తగా ఉంది. అది నీ పెళ్లికోసం దాచిన డబ్బే. ఆ డబ్బు మీద హక్కు నీదే. మీ ఇంటి చిరునామా చెప్పు చిటికెలో వచ్చి ఇచ్చేస్తాను. నిన్ను కూడా చూసి చాలా కాలం గడిచింది. ముసలి ప్రాణం ఎప్పుడు పోతుందో? పోయే ముందు ఒక్కసారి కూతుర్ని కూడా చూసినట్టు ఉంటుంది’ అని తన కోరిక సిగ్గు విడిచి చెప్పాడు.
‘వద్దు వద్దు. ఇక్కడ పరిస్థితులు ఏం బాగో లేవు. నా అకౌంటు నెంబర్ పెడతాను. ఆ డబ్బు అందులో వేసేయి’ అని చాలా సులువుగా చెప్పేసింది. ‘నేను వద్దు. కానీ నా డబ్బు మాత్రం కావాలి’ అని మనస్సులో అనుకుని బాధ పడ్డాడు. ‘సరే డబ్బు త్వరగా పంపించేయ్’ అని ఫోన్ పెట్టేసింది. ముకుందం ఫోన్ పెట్టేసి కూతురు ఫోటో చూస్తూ విలపించాడు.
తన పక్కనే తన హాస్పిటల్ ఫైల్ వుంది. సరిగ్గా అప్పుడే అదే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ‘హలో సర్! మీరు ఈ రోజూ అడ్మిట్ అవుతున్నారు కదా? ’ అని రిసెప్షన్ నుంచి ప్రశ్న. ‘లేదమ్మా’ అని ముకుందం సమాధానం.
‘అదేంటి సర్? మీకు ఇంకా రెండు రోజుల్లో సర్జరీ చేయాలి. లేదంటే మీ ప్రాణానికి ప్రమాదం’ అని రిసెప్షన్ నుంచి ఒత్తిడి. ‘నా దగ్గర డబ్బు పోయింది. ఆ డబ్బు లేకుండా మీరు సర్జరీ చేస్తారా? ’ అని వాళ్ళనే తిరిగి అడిగి రిసెప్షన్ ని ఒత్తిడిలో నెట్టాడు ముకుందం. ‘ఎలా చేస్తాం సర్? పది లక్షలు డబ్బు కడితేనే సర్జరీ’ అని చెప్పి ఫోన్ టక్కున పెట్టేశారు. ముకుందం చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.
ముకుందం ఇచ్చిన డబ్బులతో శ్రావ్య కుటుంబం వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. సంసారం కూడా చక్క బడింది. పోయిన బంధువులు. మిత్రులు మళ్ళీ వెనక్కి వచ్చారు. శ్రావ్య ఎప్పటిలాగే తండ్రిని మరచిపోయింది. తండ్రి చేసిన సాయాన్ని మరచిపోయింది.
కొన్నాళ్ళకి శ్రావ్య స్నేహితురాలు ఫోన్ చేసింది. ‘మీ నాన్నగారు కాలం చేశారు. ఆ విషయం తెలిసిందా? ’ అని అడిగింది. ‘ఏదైనా మంచి కబుర్లు చెప్పవే’ అని కఠినంగా మాట మారుస్తూ అంది శ్రావ్య. తన సమాధానం విని ‘డబ్బుకి లోకం దాసోహం’ అని మనస్సులోనే అనుకుంది స్నేహితురాలు.
—-