చెవిలో పువ్వు!  (Author: వెంకట మణి)

గిరిజ - మహా వేడిమీద ఉంది మనిషి. పొయ్యిముందు నిల్చుని చారులోకి పోపు తాళింపు పెడుతోంది. కాగిన నూనెలో పోపులు చిటపట లాడుతూ వేగుతున్నాయి. నోరు విప్పడంలేదు గానీ తను కూడా ఆ పోపుల్లానే చిటపటలాడుతూనే వుంది మనిషి! ఉదయం నుండి తన మనసు కూడా కాగుతోంది మరి! ఊరకనే ఏదీ కస్సుబుస్సుమనదుగా; తన కోపానికీ ఓ కారణముంది.

         పొద్దున్న పక్కింటి పార్వతి జడలో నీలం వంకాయ రంగు గులాబీ పువ్వును చూసింది. అదిగో అప్పట్నుంచే ఆమెకీ కడుపు మంట! ఒకటే కుళ్ళిపోతోంది; కడుపుభారం తీరడానికి ఆ కుళ్ళు ఎవరి ముందూ కక్కలేకపోతోందాయె. చెప్పుకోడానికి మనుషులు లేరా, అంటే.. ఉన్నారు. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు; వచ్చి వాలిపోతారు అమ్మలక్కలు. కానీ ఆ విషయం చెప్పుకోవడానికి వాళ్లు కానివాళ్లు.

         ఆమె వంట చేస్తూ వుందిగానీ ధ్యాసంతా పక్కింటి పార్వతి జడపైనే వుంది.

         ‘‘ఆమెకు ఆ పువ్వు ఎక్కడిది? ’’

         ‘‘పెరట్లో మా మొక్కకి పూసిన పువ్వు ఆమె జడలోకి ఎలా వెళ్లింది? దొంగతనంగా గానీ కోసుకుపోయారా? ఎవరికంటా పడకుండా మొక్కని పెరట్లో పెంచుతున్నానే!’’

         ‘‘ఎప్పుడూ గేటు వేసే ఉంచుతాం.. అడగా బుడగాకుండా ఎవరూ లోనికి రారే.. పక్కగోడ ఎక్కి వాళ్లమ్మాయిగానీ వచ్చి తెంపుకునిపోయిందా? ’’

         ‘‘ఊహూ.. వాళ్లలా చెయ్యరు.. ’’అలా ఆమె ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి.

         మధ్యాహ్నం భోజనమయ్యాక మేడమీద గదికి వెళ్లి ఫ్యాను వేసుకుని సోఫాలో కూలబడింది.

         ఆమె పరధ్యానంగా బయటకు చూస్తూ వుండగా పక్కింటి మేడపై పార్వతి అటూ ఇటూ తచ్చాడుతూ మళ్లీ తన కంటబడిరది. ఆమె జడలోని గులాబీ పువ్వుపైకి తన దృష్టి సర్రున పోయింది. మనసు ఇంకాస్త మెలి తిరిగినట్టయ్యింది.

         ‘‘ఎంత కష్టపడి పెంచుకుంటున్నాను గులాబి మొక్కని..కన్యాకుమారి నుండి కొని తెచ్చుకున్నాను.. ఎవరికొచ్చిందో మాయరోగం.. తుపుక్కున తెంపుకెళ్లిపోయారు.. వీళ్ల చేతులు పడిపోను.. ’’

         అని కాసేపు సణుక్కుంది. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు ఆగి ‘‘ఒకవేళ పార్వతిగానీ ఆ పువ్వును బయట ఎక్కడినుంచైనా కొని తెచ్చుకుందా?.. ’’ అని ఆలోచించింది.

         ‘‘దాని మొహం!.. ఆ రంగు పువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకదుగాక దొరకదు.. అది ముమ్మాటికీ నా గులాబీ మొక్కకు పూసిన పువ్వే.. అనుమానమే లేదు.. అయితే వీళ్లే కొట్టేసుంటారు.. ’’

         అలా బలంగా అనిపించిన వెంటనే ఉన్నపళంగా పక్కింటికి వెళ్లి ‘‘మీకు ఆ గులాబీ పువ్వు ఎక్కడిది?’’ అని పార్వతిని నిలదియ్యాలని అనిపించిందామెకు.

         కానీ అలా పోయి అడగలేదుకదా… పైగా పార్వతితో పెద్దగా పరిచయం కూడా లేదు గిరిజకు. ఎప్పుడైనా రోడ్డుపైన ఎదురుపడితే పక్క పక్క ఇళ్లవాళ్లంకదా అని ‘‘బాగున్నారా.. ’’ అంటే ‘‘బాగున్నారా.. ’’ అని పలకరించుకోవడం తప్ప ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకున్నదీ లేదు. చేతులు పిసుక్కుంటూ సోఫాలోనే చాలాసేపు కూర్చునుండిపోయింది ఆమె. కూర్చుని కూర్చుని విసుగెత్తి సోఫాలోనే నడుం వాల్చింది. ఆ విషయం తనను చాలా చికాకు పెడుతోందని చెప్పి ఇక వదిలేద్దామని అనుకుంది; కానీ ఆ పువ్వు ఆమెను వదిలిపెడితేనా!

         సరిగ్గా రెండు నెలల కిందట టూర్‌కి వెళ్లినపుడు కన్యాకుమారిలో తను ఆ నీలం వంకాయ రంగు గులాబీ మొక్కను ఓ మొక్కలమ్మే కొట్టు వద్ద చూసింది. కొనుక్కుంటానని ఎగబడి వెళితే ఆమె భర్త చలపతి ‘‘ప్రయాణంలో మొక్కను పట్టుకుని ఎక్కడ తిరగగలం.. వద్దు.. ’’ అని చెప్పి అడ్డుపడ్డాడు. ఎన్నడూ భర్త మాట విన్న పాపానపోని ఆమె అప్పుడూ చెవినబెట్టలేదు. ‘‘అటువంటి అరుదైన రంగు దొరకొద్దూ?’’ అంటూ ముచ్చటపడి బేరం ఆడకుండానే కొనేసింది. కొని జాగ్రత్తగా పట్టుకోమని భర్త చేతికే ఇచ్చింది. దానిని అతడు భద్రంగా ఓ బ్యాగులో పెట్టి మర్యాదగా భుజానికి తగిలించుకుని ఆమె వెనకమాలే తిరిగాడు. ఆ మొక్క అలా వాళ్ల వెంట ఊళ్లు తిరిగి తిరిగి మొత్తానికి సురక్షితంగా గిరిజ పెరటికి చేరింది.

         ఇంటికొచ్చాక కూడా గిరిజ ఆ మొక్కకోసం నానా హడావుడీ పెట్టింది చలపతిని. ‘‘ఈవిడతోటే చావలేకపోతున్నానంటే దీనికితోడు ఈ మొక్క ఒకటి నా ప్రాణానికి.. ’’ అని ఎన్నోసార్లు సణుక్కుంటూనే ఆమె చెప్పిన పనల్లా చేశాడు. కుండీ తెచ్చాడు; నల్లమట్టి తెచ్చాడు; ఆ తర్వాత రంపపు పొట్టు తెమ్మంటే కూడా తెచ్చిపెట్టాడు. ఈ పదార్ధాలన్నీ కలగలిపి ఓ శుభ ముహూర్తాన ఆమె కుండీలో పొయ్యబోతుంటే అంతలో పాలావిడ వచ్చి ‘‘ఆగమ్మా.. ఆగాగు.. ’’ అని ఆమెను ఆపి ‘‘కుండీ అడుగున కొబ్బరిపీచు వేసి ఆపైన మట్టీ పోశావంటే మొక్క బ్రహ్మాండంగా ఎదగడమే కాకుండా, పేద్ద పేద్ద పూలు కూడా పూస్తాయమ్మా.. ’’ అని చెప్పింది.

ఇంకేముంది... గిరిజ తన భర్తవైపు ఆజ్ఞాపూర్వకంగా చూసింది. అతడు ఆమె కవి హృదయాన్ని అర్థం చేసుకుని కొబ్బరిపీచు కోసం ఎక్కడెక్కడో తిరిగాడు. కొబ్బరిచెట్లు కనబడిన ఒకట్రెండు చోట్లకు వెళ్లి ఎండిన బొండాలకోసం వెతికాడు. ఒక్క బొండామూ దొరకలేదు. ఆ మాటే పట్టుకెళ్లి గిరిజకు చెప్పాడు. ఆమె అతడిని కిందనుండి పైదాకా ఎగాదిగా ఓ చూపు చూసింది. చలపతికేమీ అర్థంకాక ‘‘విషయం చెప్పవే.. ’’ అని నొసలు చిట్లించాడు.

         ‘‘నాకు దాహంగా వుంది.. ’’ అని చెప్పిందామె. ఆమె అలా అడిగినప్పుడల్లా అతడు వెళ్లి కొబ్బరి బొండాలు తెస్తాడు. ఇప్పుడూ అలాగే తెచ్చిచ్చాడు. ఆమె తాగి ఓ బొండాన్ని అతడి చేతిలో పెట్టి పీచు తియ్యమంది. ఇక చేసేదేముందని చిన్న కత్తి పుచ్చుకుని పీచు తియ్యడం మొదలెట్టాడు. అది ఒక పట్టాన రాలేదు. ఎన్నడూ లేనిది పెళ్లాంమీద కోపమొచ్చేసింది; ఎంత కోపమంటే ఆమె తాట తియ్యాలన్నంత! అంతే... ఆ ఊపులో పీచు సులువుగా ఊడి వచ్చేసింది. దానిని ఆమెకిచ్చాడు. ఆ పీచును ఆమె కుండీ అడుగున పరిచి దానిపై మట్టిపోసి గులాబి మొక్కను నాటి నీరు పోసి శాంతించింది.

         అంతటితో అయ్యిందా? ఒకరోజు ఆకులమీద మచ్చలు కనిపిస్తే యూట్యూబ్‌లో చూసి ఆ తెగులుకి కారణం తెలుసుకుంది. అదొక రకమైన ఆకుమచ్చ తెగులట! పుల్లటి మజ్జిగ మొక్కపై పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందని ఆ యూట్యూబ్‌ మొక్కల డాక్టరమ్మ చెప్పింది. అప్పుడు చలపతి చేత పిల్లలు ఆడుకునే స్ప్రేయర్‌ నొకదాన్ని తెప్పించి అతడిచేతే మజ్జిగను బాగా చిలక్కొట్టించి మొక్కపై మస్తుగా స్ప్రే చేయించింది.

         అటుపైన ఓసారి మొక్కకు ఫంగస్‌ ద్వారా ఎండుతెగులు సోకింది. అప్పుడు కూడా యూట్యూబ్‌ వైద్యమే చేయించింది. పేరంటాళ్ల కాళ్లకు పసుపు రాయించినట్టు భర్తచేత పసుపు ముద్ద కలిపించి మొక్కకు రాయించింది.

         అలా ఎన్నో కష్టనష్టాలకోర్చి ఆమె ఆ మొక్కను పెంచుకుంది. అంత అల్లారుముద్దుగా పెరిగిన ఆ మొక్క అనతికాలంలోనే పూతకొచ్చింది. తొలిమొగ్గ తొడిగిన దగ్గరనుండీ ఆ మొక్కను కడుపుతో వున్న కన్నకూతుర్ని ఓ తల్లి ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటూ వచ్చింది. తీరా తెల్లారితే పువ్వు పూస్తుందనగా ఇదిగో ఈ ఘోరం జరిగిపోయింది! పువ్వు కనిపించలేదు. ఎవరు కోసుకుపోయారో పోయారు! చిత్రంగా ఆ జాతి పువ్వు పక్కింటి పార్వతి జడలో ప్రత్యక్షమైంది!! ఆ పువ్వు తనదో కాదోనన్న మీమాంసలో పడిపోయింది.

         బండ కత్తిపీటకు తెగని కూరగాయల్లా ఆమె ఆలోచనలూ ఒకపట్టాన తెగడంలేదు. ఎంత కాదనుకున్నా పార్వతి జడలోని పువ్వు తన పెరటి పువ్వేనని ఆమె మనసుకు తోస్తూ వుంది. అదే సమయంలో, తమ పెరట్లోకి జొరబడి పువ్వులు దొంగిలించే అవసరమూ, అవకాశమూ ఆ యింటివాళ్ళకు లేదని కూడా భావిస్తోంది. మరి ఆ పువ్వు ఏమైపోయినట్టో బోధపడక కుడితిలో పడ్డ ఎలుకలా ఒకటే కొట్టుకు ఛస్తోంది. ఉన్నట్టుండి తన భర్త చలపతి ఆమె బుర్రలో మెదిలాడు.

         ‘‘చలపతిగానీ కోసిచ్చాడా.. ’’

         ‘‘ఛ.. ఆయన ఎందుకు కోసిస్తాడు?.. పరాయి ఆడదానికి పువ్వు ఇవ్వడమంటే మాటలా.. ’’ అని మనసు నొక్కుకుంది.

         తర్వాత తన ఒక్కగానొక్క కొడుకు చరణ్‌ తలపులోకొచ్చాడు.

         ‘‘ఛ.. ఛ.. చరణ్‌కేం అవసరం?.. తొమ్మిదో తరగతి కుర్రాడు.. పసి పిల్లాడు.. ’’ అని ఓ నిర్లక్ష్యపు నవ్వు నవ్వి ఊరుకుంది.

         గిరిజ అలా ఆలోచిస్తున్నంతలోనే సాయంత్రమైపోయింది. చరణ్‌ స్కూల్‌ నుండి చలపతి ఆఫీసునుండి ఓ గంటా గడియలో తిరిగొచ్చేస్తారు. కింద ఇంటిపని వున్నా ఆమె మాత్రం సోఫాలోంచి లేవలేదు.

         మరి ఎవరూ చెయ్యి వెయ్యకపోతే ఈ యింటి పువ్వు ఆ యింటికి ఎలా వెళ్లినట్టు? గులాబీ ముళ్లు తగులుకుని చీర చెంగును లాగినట్లు ఆ ప్రశ్న ఆమె మనసును పట్టి గుంజుతూ వుంది.

         ఆ యింటివాళ్లు ఈ యింటికొచ్చే ప్రశ్నే లేదు. మొత్తానికి ఎలాగోలా ఈ యింటి నుండే పువ్వు ఆ యింటికి వెళ్ళుండాలి. అయితే అది ఎలా వెళ్లింది? చరణ్‌కి ఎంతసేపూ సెల్‌ఫోనూ, పుస్తకాలతోనే సరిపోతుంది. పైగా మగపిల్లాడు. వాడికి పువ్వులతో ఏం పని? మరి తనా… తెంపి ఎవరికీ ఇచ్చింది లేదు. ఇక మిగిలింది చలపతే. ఆయనే తెంపి పార్వతికిచ్చాడా? ఇక అలాగే జరిగి వుండాలి. ఆ పాయింటు దగ్గర ఆమె ఠక్కున ఆగిపోయింది. ఇక మరో ఆలోచన చేయలేదు.

         ‘‘నిజమే! ఇది ఆయన పనే అయ్యుంటుంది. అనుమానమే లేదు. ఆయనే కోసి పార్వతికి ఇచ్చుంటారు. అసలు పార్వతికి పువ్వు ఇవ్వాల్సిన అవసరమేమిటి.. కొంపదీసి చాటుమాటు వ్యవహారమేదైనా ఇద్దరి మధ్యా సాగుతోందా? అమ్మో!.. ’’ ఆమె గుండె గతుక్కుమంది. దెబ్బతో పువ్వు పోయిందే అన్న బాధ కాస్తా తుస్సుమని ఎగిరిపోయింది. గబుక్కున లేచి కూర్చుంది. చెదిరిన తలను సరిచేసి ముడివేసుకుని బాల్కనీలోకి వెళ్లింది. అక్కడ నిలబడి పక్కింటివైపు చూసింది. పార్వతి మేడమీదే వుంది. ఉయ్యాలలో కూర్చుని చిన్నగా ఊగుతూ ఏదో పుస్తకం చదువుతూ వుంది. ఆమె జడలోని నీలం వంకాయ రంగు గులాబీ పువ్వు కూడా ఆమెతో పాటూ లయబద్ధంగా ఊగుతోంది. గిరిజ మనసు మరింతగా లయ తప్పింది.

         ఇక ఉండబట్టలేక పక్కింటామెను ‘‘పార్వతిగారూ.. పార్వతిగారూ.. ’’ అని పిలిచింది.

         పార్వతి ఉయ్యాల ఊగడం ఆపి ‘‘ఎవరూ.. ’’ అంటూ వెనక్కి తిరిగి చూసింది.

         ‘‘ఏం లేదండీ.. ఊరకనే పిలిచాను.. ఏం చేస్తున్నారు? ’’ అని ఆమెను పలకరించింది గిరిజ.

         పార్వతి పుస్తకం పక్కనబెట్టి ఉయ్యాల్లో ఇటు తిరిగి కూర్చుంది.

         ‘‘ఏం పుస్తకమండీ చదువుతున్నారు?” అని ఆమె నడిగింది తను.

         ‘‘ఒంటిజడ సీత నవల చదువుతున్నానండి.. ’’ చెప్పిందామె.

         ‘‘మీరు నవలలు కూడా చదువుతారా? ’’

         ‘‘సెల్‌ఫోన్‌ చూడ్డం కంటే పుస్తకం చదవడం మంచిదికదాని... ’’

         అలా ఆమెను మాటల్లోకి దింపి మధ్యలో ‘‘మీ జడలో పువ్వు భలే ఉందండీ.. ఎక్కడిదేమిటి?’’ అని ఆరా తీసింది.

         ‘‘అదాండీ.. భలే కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ? ఈ కలర్‌ నేను ఇక్కడ ఎక్కడా చూడలేదు.. ’’ అని సంభ్రమంగా చెప్పిందామె.

         ‘‘అవునవును.. మంచి కలర్‌.. ఎక్కడిదండీ.. ’’ అనడిగి ఆమె సమాధానంకోసం ఆత్రంగా చూసింది గిరిజ.

         ‘‘ఏమోనండీ మరి.. మా పాపకి తన ఫ్రెండు ఇచ్చిందట.. నేను పెట్టుకుంటాను ఇవ్వమంటే ఇచ్చింది, అదీ ఎంతో బతిమాలితే ఇచ్చింది లెండి.. ’’ అని ఆ సంగతంతా చెప్పింది.

         గిరిజ మరి కాసేపు ఆ ఊసూ ఈ ఊసూ మాట్లాడి ‘‘సరేనండి.. వస్తాను.. ఆయన వచ్చే వేళయ్యింది.. ’’ అనిచెప్పి కింద కొచ్చేసింది.

         ఇంటిపనిలో పడిందిగానీ ఆ పువ్వు సంగతి మర్చిపోనే లేదు. ఇల్లు ఊడుస్తున్నా, అంట్లు తోముతున్నా అదే సంగతి ఆమెను వెంటాడుతూ వచ్చింది. పార్వతి నిజమే చెబుతోందా, లేక నంగనాచిలా కబుర్లాడుతోందా అని మరోపక్క తర్జనభర్జన! ఆమె మాటలను ఎంతకీ నమ్మబుద్ధి కాలేదు గిరిజకు. నిజం చెప్పలేక విషయం తన కూతురి మీదకు నెట్టేసిందన్న సందేహం కలిగిందామెకు. అప్పుడు తనకున్న అనుమానం కాస్తా మరింత బలపడింది.

         ఇక లాభం లేదు విషయం తేల్చుకోవాలని ఆ రాత్రికి మంచమెక్కిన భర్తను ‘‘ఏవండీ.. మీరేమైనా మన గులాబీ మొక్కకు పూసిన పువ్వునుగానీ కోశారేమిటండీ.. ’’ అని గుట్టుగా అడిగింది.

         అతగాడు ఆమె ముఖంలోకి వెకిలిగా చూస్తూ ‘‘ఆ.. కోశానే.. ’’ అని ఒత్తి మరీ చెప్పాడు.

భూకంపానికి అదిరిన భూమిలా ఆమె గుండె అదిరింది. ఆ కంపం తగ్గకముందే ‘‘అయితే ఏదీ ఆ పువ్వు.. ’’ అనడిగింది అక్కసుగా.

         ‘‘నీకే ఇచ్చానుగా పెట్టుకోమని.. ’’

         ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘నాకెక్కడ ఇచ్చారూ...? ’’ అని కరకుగా కళ్లు పెద్దవిచేసింది.

         అతడు నవ్వి ‘‘ఏంటే మరి! పువ్వు కోశావా.. పువ్వు కాడ కోశావా? అని నన్ను అడుగుతావేంటీ? నేనేమైనా కాలేజీ కుర్రాడినా.. ఏ అమ్మాయికైనా పువ్వు ఇవ్వడానికి.. ’’ అని తను కాలేజీ చదివే రోజుల్లో గిరిజ పువ్వు ఇచ్చిన సంగతిని గుర్తుచేసుకుని మురిసిపోయాడు అతడు.

         అతగాడి ఆ మురిపెపు ముఖం చూడలేక ‘‘చాల్లెండి సంబడం.. ’’ అని విసుక్కుందామె.

         ‘‘దీనికి మూడెందుకో బాలేదు.. ’’ ఎందుకొచ్చిందని చెప్పి ముసుగు తన్ని పడుకుండిపోయాడు చలపతి.

         ఆ రాత్రి ఆ గులాబీ పువ్వు, పక్కింటి పార్వతి జడ, మొగుడు చలపతే గిరిజ కళ్లల్లో ఆడారు. తెల్లారి లేచీ లేవంగానే ఆమె గులాబిమొక్క వద్దకు పోయింది. పువ్వు తెంపగా మిగిలిన మోటుక వంక నిస్తేజంగా చూస్తూ ఉండిపోయింది. అలా చూస్తుండగా రెండు కొమ్మలకి రెండేసి చొప్పున తొడిగిన నాలుగు చిన్నపాటి మొగ్గలు ఆమె కంటబడ్డాయి. దగ్గరకంటా ముఖంపెట్టి చూసింది. ఆమె కళ్లు మెరిశాయి. మొక్కను ఆర్తిగా నిమిరింది. వాటినైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంటూ ప్రేమతో నీళ్లు పోసింది.

         ఆ రోజుకి ఆలోచనల నుంచి తేరుకున్నా ఆమెను పట్టుకొన్న అనుమానం మాత్రం వదిలిపోలేదు. తన భర్తకూ, పార్వతికీ మధ్య ఏదైనా కథ నడుస్తోందా? అన్న అనుమానం ఆమెను చెదపురుగులా డొలుస్తూ వుంది.

         పార్వతికి భర్త లేడు. లేడంటే ఈ లోకంలో లేడని కాదు; ఉన్నాడు. అయితే తాగుబోతు. ఇద్దరూ ఎన్నో గొడవలు పడ్డారు. ఆమె అతగాడిని వదిలేసి కూతురుతో ఆ యింట్లో ఉంటోంది. కూతురు శ్రీజ తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే, అంత పెద్ద కూతురిని ఇంట్లో పెట్టుకుని పార్వతి అలా చెయ్యదనీ, చలపతి కూడా అలాంటి పని ఎన్నటికీ చెయ్యడనీ గిరిజకు మరోపక్క నమ్మకంగా అనిపిస్తూ వుంది. అన్నీ బానే వున్నాయి. అందరూ నీచు ముట్టనివారే! మరి గంపలో కోడిపెట్ట ఎలా మాయమైనట్టు? అంతుచిక్కడం లేదామెకు! అందుకే కథ మళ్లీ మళ్లీ మొదటికే వస్తోంది.

         ఎందుకైనా మంచిదని ఆరోజు నుండి చలపతిని ఓ కంట కనిపెడుతూ వుంది. అతగాడు పార్వతికి చాటుమాటుగా ఏమైనా సైగలు గట్రా చేస్తున్నాడేమోనని అటో కన్ను ఇటో కన్ను వేస్తూ ఉంది. ఒకసారి ఉండబట్టలేక ‘‘మీరు పువ్వు కోసి పార్వతికి ఇచ్చారు కదూ...? ’’ అని అడిగేద్దామనుకుంది. కానీ అలా తొందరపడి అడగడం తొందరపాటని గ్రహించి ఆగిపోయింది. తన అనుమానమే నిజమైతే ఈసారి పూచే పువ్వుల్లోంచి కూడా అతగాడు ఒకటో రెండో తెంపి ఆమెకు చాటుగా ఇస్తాడు కాబట్టి అప్పుడు కనిపెట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చని ఓ పథకం పన్నింది.

         కొన్ని రోజులు దొర్లాయి. మొగ్గలు పెద్దవయ్యాయి. ఒకరోజు సాయంత్రం మొగ్గల్ని చూసుకుంది గిరిజ. మరుసటి రోజుకి రెండు మొగ్గలు విడుస్తాయి అనుకుంది. అలాగే విడిచాయి. అయితే అందులో ఒక పువ్వు మాయమైంది. ఆ పువ్వు పార్వతి జడలో ఎంతటెంతట ప్రత్యక్షమవుతుందా అని పక్కింట్లోకి తొంగి తొంగి చూసింది గిరిజ. కానీ ఆరోజు ఆ పువ్వు ఆమె జడలో కాక ఆమె కూతురు శ్రీజ జడలో మెరిసింది. ఇదేమిటి కథ ఇలా అడ్డం తిరిగింది అని డైలమాలో పడిపోయిందామె.

         ఇది జరిగిన మూడోరోజు తెల్లారు ఐదింటికి పెరటి తలుపు చిన్నగా శబ్ధమైతే గిరిజ లేచి పిల్లిలా నడుచుకుంటూ బయటకు వెళ్లింది. అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయింది. కోపం ఘాటు మషాళాలా ఒక్కసారిగా నషాళానికి అంటుకుంది.

         ‘‘ఏం చేస్తున్నావురా అక్కడ?’’ అని గద్దించిందామె.

         అక్కడ గులాబి మొక్కవద్ద చేతిలో పువ్వుతో చరణ్‌ వణుకుతున్నాడు.

         సతీమణి కేక విని బయటికొచ్చిన చలపతి ‘‘ఆ పువ్వు ఎందుకురా కోశావ్‌? దేనికి నీకా పువ్వు?’’ అని విస్తుపోయి అడిగాడు కొడుకుని.

         గిరిజ మళ్లీ భర్తను పైనుంచి కిందిదాకా ఓ చూపు చూసి ‘‘ఆఁ... చెవిలో పెట్టుకుందామని కోసుకున్నాడు.. ’’ అని అంటూ చరణ్‌ వద్దకు వెళ్లింది. వెళ్లి వాడిని పైనుంచి కింది దాకా ఓ చూపు చూసి ‘‘వేలెడంత లేవు.. ఏమిట్రా నీకీ పని??’’ అంటూ వాడి చెవి పట్టుకుని మెలితిప్పింది.

0 Comments