చిన్ని చిన్ని ఆనందాలు
చిన్ని చిన్ని ఆనందాలు (Author: ఇవటూరి రాజ మోహన్)
"ఒరేయ్ చవటాయిల్లారా! ఇంతసేపూ మనకు పేకాటా మన ఆడాళ్ళకి చీరల చర్చలూ బాగానే జరిగాయి కనుక ఒక పసందైన కార్యక్రమానికి స్వీకారం చుడతాను" అన్నాడు స్ఫూర్తి.
"ఏమిటా కొత్త వినోదం?" చలపతి కుతూహలంగా అడిగాడు.
"చెప్తానుగా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వేడుకలా కన్నా మనందరికీ ఒక అవకాశమని మీరంతా త్వరలో గ్రహిస్తారు..." అని స్ఫూర్తి ఇంకా చెప్పబోతుంటే అప్పలరాజు గొంతు పెద్ద గొంతుతో 'ఒరేయ్ నీ ఓవరాక్షన్ ఇక్కడ అవసరం లేదు కనుక నేరుగా అసలు విషయానికి వచ్చెయ్. అసలే ఆటలో సరైన ముక్కలు రాలేదని తపించిపోతున్నాం' అన్నాడు.
స్ఫూర్తి ఒకసారి వాడికేసి కోపం నటిస్తూ చూసి 'అలాగే. కానీ ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకూ పేకాట ఆపమని కోరుతున్నాను.' అన్నాడు. 'అన్యాయం అన్యాయం' అంటూ కేకలు పెట్టారు. కానీ వాడి మాటలకి ఒప్పేసుకుని పేకముక్కలు మూసేశాము.
అందరూ వచ్చారని నిర్దారించుకున్నాక వాడు కొంచెం గంభీరంగా “మీ అందరి జీవితాలలో ఎన్నో వినోదాలూ కొన్ని విషాదాలూ జరిగి ఉంటాయి. అయితే మీరు మరిచిపోలేని ఒక మధురమైన అనుభూతిని ఒక్కొక్కరూ ఇక్కడ పంచుకోండి. ఇక మొదలెడదామా?" అన్నాడు స్ఫూర్తి.
తర్వాత భయంకరమైన నిశ్శబ్దం. ఎవరు మొదలు పెడతారో అనే కుతూహలంతో పాటు ఆ వ్యక్తి తనే అయితే ఎలా చెప్తామో అనే కొంత అలజడితో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
'సరే మీ అందరికీ కొంచెం తెరిపిగా ఉండటానికి నేనే ముందు ప్రారంభిస్తాను' అన్నాడు స్ఫూర్తి.
'హమ్మయ్య ఇంకొంచెం సమయం ఉంది' అని ఒక్కొక్కరం ఎంతో నెమ్మదిగా నిట్టూర్చినా, అందరి స్పందనా నిట్టూర్పే కావటంతో పెద్దగా వినపడింది.
స్ఫూర్తి ఒక బహుళ జాతి సంస్థలో ఉన్నత స్థానంలో పని చేస్తున్నాడు. ప్రతినెలా కనీసం రెండు మూడు దేశాలు తిరిగివస్తుంటాడు. అన్ని దేశాలు తిరిగినవాడికి చెప్పుకోతగిన ఎన్నో అనుభవాలు తప్పకుండా ఉంటాయి. కానీ మరిచిపోలేని ఒకే ఒక జ్ఞాపకాన్ని చెప్పుకోవటం అంత సులభం కాదు.
ఇలా ఆలోచిస్తుండగానే వాడు మొదలు పెట్టాడు.
స్ఫూర్తి చెప్పిన కథ
“నేను ఉద్యోగం లో చేరినప్పుడు నేను సేల్స్ లో ఉన్నాను. నేను ఓ మోస్తరుగా మా సంస్థకి అమ్మకాలు పెంచి అప్పుడే కొంచెం ఎదుగుతున్నాననే నమ్మకం కుదురుతున్నపుడు మా కంపెనీ చైర్మన్ ఆదాయం లెక్కలన్నీ తారుమారు చేసి తన సంస్థకి రాని లాభాలు చూపించాడనే అభియోగంతో చెరసాల పాలయ్యాడు. సంతకాల వరకూ వచ్చిన ఎన్నో కాంట్రాక్ట్స్ వెనక్కు వెళ్లిపోయాయి. కొంతమంది కస్టమర్స్ మా కంపెనీ పేర్లు నమ్మకస్తుల లిస్ట్ లొంచి తొలగించారు. నా తోటి ఉద్యోగులు కొంతమందికి పెళ్లి సంబంధాలు రద్దయ్యాయి. బ్యాంకులు అప్పులు వెంటనే చెల్లించమన్నారు. ఒకటి కాదు గానీ ఆ సమయంలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోకుండా ఉండటం కష్టమయిపోయింది.
అటువంటి పరిస్థితిలో ఒక కంపెనీ ఒక ప్రాజెక్ట్ కోసం ఇతరులతో పాటు మా సంస్థని కూడా ప్రపోసల్ ఇమ్మని పిలిచింది. ఈ అవకాశం కనుక మా సంస్థకి వస్తే మాకు కొన్నాళ్ళు సమస్య ఉండదని నమ్మకంతో ఎంతో కష్టపడి ఒక ప్రపోసల్ ఇచ్చాను. వారం రోజుల్లోనే ఆ సంస్థ మమ్మల్ని పిలిచారు. అక్కడికి వెళ్ళగానే నాకు ఒక విషయం తెలిసింది. ఆ కంపెనీ అందరి ధరఖాస్తులనీ పరిశీలించి ఇద్దరిని మాత్రమే పిలిచారు. మా ఇద్దరిలో ఎవరు నెగ్గితే వారితో ఈరోజే కాంట్రాక్టు కుదుర్చుకుంటారట. పోటీలో ఉన్నది మరొకరు ఎవరో కాదు. సంక్షోభం తర్వాత మా సంస్థని వదిలి వేరొక సంస్థలో ఈ మధ్యే చేరిన వెంకటేష్. నిజానికి అతను వదిలేశాక అతని పొసిషన్ నేను తీసుకున్నాను. నేను లోపలికి వెళ్ళాక అజిత్ నేరుగా విషయానికి వచ్చాడు.
"స్ఫూర్తిగారూ! మీ ప్రతిపాదన మొత్తం చదివాము. మేము ఆశించినదానికన్నాసంతృప్తికరంగా ఉంది. కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు మేమొక ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాం. ఆ విషయాలు మీతోనే చర్చించాలనుకున్నాను. మీకు తెలుసుకదా మేము మరొక కంపెనీని కూడా చర్చలకు పిలిచాం. ఆ కంపెనీ ప్రతినిధి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కష్టాలలో ఉన్న మీ సంస్థతో ఒప్పందం చేసుకోవటం మాకే ప్రమాదకరమని చెప్పాడు."అన్నాడతను.
"వారి ప్రపోసల్ మీ ప్రపోసల్ తో సమానంగా ఉంది. మీ పరిస్థితి బావులేదు కాబట్టి వారితోనే వ్యాపారం చేసుకోవటం ఉత్తమమని మా సిబ్బందిలో కొంతమంది అభిప్రాయం." అని చెప్పాడు అజిత్.
నేను ముందే ఈ విషయం ఊహించాను. కొత్త కంపెనీ కి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్న వెంకటేష్ ని తప్పు పట్టలేను. కనుక నేనేమీ నొచ్చుకోకుండా వెంటనే "అజిత్! మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్ధమయ్యింది. మా మీద నమ్మకం రావటానికి ఏంచెయ్యాలో చెప్పండి" అన్నాను.
అజిత్ అంగీకారంగా తలాడించి 'ప్రస్తుతం రకరాల ఆరోపణలని ఎదుర్కుంటున్న తర్వాత కూడా మీతో మేము పని చేయటానికి బలమైన రెండు మూడు కారణాలు మీరు వివరించగలిగితే మా నిర్ణయం కొంచెం సులువవుతుంది' అని ఒక క్షణం ఆగి "మీరు వివరించబోయే ప్రతిపాదన నా సహచరులందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి." అని తన పక్కన కూర్చున్న మిగతా అధికారులని చూపించాడు.
మా చైర్మన్ చేసినది చాలా పెద్ద తప్పు. అందువలన ఆర్ధికంగా నైతికంగా మా కంపెనీ జవాబు చెప్పలేని స్థితిలో ఉందనే విషయం నిర్వివాదాంశం. వీరిని ఏ విధంగా ఒప్పించగలను. అందరూ వెలివేసిన పరిస్థితిలో వచ్చిన ఈ అవకాశం కూడా చేజారితే భవిష్యత్తు మరింత క్లిష్టం గా ఉంటుందనే వాస్తవం తెలుస్తున్న కొద్దీ చమటలు పట్టాయి.
నా మానసిక పరిస్థితి గమనించాడేమో "కావాలంటే గంట సమయం తీసుకోవచ్చు " అన్నాడు అజిత్.
నేను వెంటనే "లేదండీ. నాకు అదనంగా ఏసమయమూ అవసరమూ లేదు" అన్నాను.
ఎక్కువ సమయం తీసుకుంటే మరింత ఆందోళన పెరగటం తప్ప పెద్దగా ప్రయోజనమేదీ ఉంటుందని నాకు అనిపించలేదు. నా మనసులోనే ఏమి మాట్లాడాలో ప్రణాళిక వేసుకుంటూ ఆ గదిలో ఉన్న వైట్ బోర్డు దగ్గరికి వెళ్లాను. అప్పటికే నా మనసులో ఒక స్పష్టత వచ్చింది.
బోర్డు మీద రిస్క్ అని వ్రాసి ఆ పక్కనే "ఆన్సర్స్" అని పెద్ద అక్షరాలతో వ్రాసి ఆ రెండు పదాలకీ మధ్య నిలువుగా ఒక పెద్ద గీత గీసి చెప్పటం మొదలు పెట్టాను.
"ఒక సంస్థకి వ్యాపారం ఇచ్చేటపుడు మీరు పరిశీలించే విషయాలు ఈ నాలుగు: ఆ సంస్థ ఆర్థిక స్థాయి, ఆర్థిక స్థిరత్వం, సామర్ధ్యం, అనుభవం" అని ఆ నాలుగు ముక్కలూ రిస్క్స్ అన్న పదం కింద వ్రాసాను.
"ఈ నాలుగు అంశాలలో రిస్క్ ఉందా తెలియాలంటే ఇప్పుడు ఒక్కొక్క విషయమూ పరిశీలిద్దాం" అని కొనసాగించాను. అజిత్ అంగీకార సూచనతో తలాడించాడు.
"మీకున్న మొదటి చింత మా ఆర్ధిక పరిస్థితి - మా యజమాని అవకతవకల వలన కలిగిన సంక్షోభం తర్వాత ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మా సంస్థని స్వాధీనం లోకి తీసుకుంది. మా ఆర్థిక పరిస్థితికి ఏ ఢోకా ఉండదని పత్రికాముఖం గా ప్రకటించింది. అంటే ఇక్కడ మీకు ఏ ప్రమాదమూ లేదన్న మాట" అంటూ ఆర్థికపరిస్థితి అనే పదం పక్కన "నో రిస్క్ (ప్రమాదం లేదు)" అని వ్రాశాను.
అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. ఈ ఒప్పందం గెలుచుకోవటానికి మేమే అర్హులమని నేను ఏ విధంగా సమర్ధించుకుంటానో వినాలి అనే కుతూహలం అక్కడ ఉన్న సభ్యులందరికీ ఉంది.
మీకున్న రెండవ సందేహం "స్థిరత్వం"" అని రెండో వివరణ ప్రారంభించాను.
ప్రస్తుత సంక్షోభానికి కారణం కేవలం ఒక నాయకుడు! ఆయన ఒకరిద్దరి సహాయంతో ఈ తప్పు చేసాడు తప్ప మిగిలిన అధికారులకి, ఉద్యోగులకీ ఇందులో జోక్యం లేదు. ఆ నాయకుడు పదవిలోంచి తొలగిపోయాక ప్రభుత్వం నియమించిన అధికారి ఇప్పుడు మా సంస్థ పగ్గాలని తీసుకోవటం జరిగింది. అంటే అపరాధులు మా కంపెనీలో లేరు. కనుక ఇక్కడ కూడా ఏప్రమాదమూ లేదు అని "స్థిరత్వం" పక్కన కూడా "ప్రమాదం లేదు" అని వ్రాశాను.
"మీ మూడో సందేహం మా పనితనం గురించి."
మా సామర్ధ్యం వివరాలు నేను మీకు సమర్పించిన దరఖాస్తులో ఉన్నాయి. జరిగిన అవకతవకల వలన మేము సమర్పించిన వాస్తవాల్లో మార్పు ఉండదు. ఎందుకంటే మాకున్న వనరులు, ఉద్యోగులకిచ్చే అత్యుత్తమ శిక్షణ వంటి అంశాలు ఏ మార్పూ లేకుండా కొనసాగుతూ ఉన్నాయి.
కనుక..." ఏప్రమాదం లేదు అని అక్కడ కూడా వ్రాశాను.
"ఇక ఆఖరి సందేహం మా అనుభవం గురించి. మా నైపుణ్యానికి రుజువులు మేము ఇతర సంస్థలతో పని చేసిన వివరాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇంతకు ముందు మేము వేరే సంస్థలకి ఇటువంటి పనులు చేసిన అనుభవాన్ని ఆయా సంస్థలు ధ్రువీకరించిన పత్రాలు కూడా మేము సమర్పించిన ప్రతిపాదనలో ఉన్నాయి. వాటిలో కూడా ఏ మార్పు లేదు కనుక...."
"ప్రమాదం లేదు" అని నాలుగో అంశం (అనుభవం) పక్కన కూడా వ్రాసి చివర అతి పెద్ద అక్షరాలతో "నో రిస్క్ (మీకే విధంగానూ ప్రమాదం లేదు)" అని వ్రాశాను.
నా వివరణ పూర్తయ్యిందని సూచనగా అక్కడ పాత్ర లోని నీళ్లన్నీ గటగటా తాగేసి నుదుటి మీద చమట రుమాలు తో తుడుచుకున్నాను.
ఒక క్షణం ఎవరూ మాట్లాడలేదు.
మరొక క్షణం నిశ్శబ్దం తర్వాత గదంతా మారుపొంగిపోయేలా కంపెనీ అధికారులు చప్పట్లు చరిచారు. అజిత్ లేచి "మీరు సమర్పించిన ప్రతిపాదన కన్నా ఇప్పుడు మీరిచ్చిన వివరణకి మా అందరి నుంచి ఆమోదం కలిగింది. మీతో పని చేయబోతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము" అని కరచాలనం చేసాడు.
కంపెనీతో ఒప్పందం తర్వాత నాకు నా యాజమాన్యం నుంచి అతి పెద్ద పురస్కారం లభించింది. ఇది నేనెప్పటికీ మరిచిపోలేని అనుభూతి” అని ముగించాడు స్ఫూర్తి. నిజంగానే ఇది అపూర్వమైన అనుభవం. వాడు చెప్పిన విధానం కూడా బావుండటంతో అందరం చప్పట్లు చరిచాం.
"చాలా బావుందిరా. పేకాట మానేసినందుకు ఏ మాత్రం బాధ పడక్కర్లేదు." అన్నాడు అప్పలరాజు.
అందరికీ వారివారి అనుభవాలు చెపుకోవాలనే ఉత్సాహం మొదలయ్యింది.
తర్వాత చీటీ మోహన్ కి వచ్చింది. మోహన్ ఒక క్షణం ఉలిక్కిపడి 'తప్పదా?" అని ఒకసారి నవ్వి "సర్లే స్ఫూర్తి గాడు మొదలెట్టాక ఎలా ఆపుతాం?" అని ప్రారంభించాడు.
మోహన్ కథ
"నాది ప్రేమ వివాహమని మీకందరికీ తెలుసు. కానీ మా పెళ్లి పెద్దల సాయం తోనే జరిగిందని చాలామందికి తెలియదు. నేను, సుందరి చిన్నప్పటినుంచి ఒకే వీధిలో ఆడుకుని ఆ తర్వాత కలిసి చదువుకున్నాక ఒక విషాదకరమైన రోజు నేను ఆమె ఇంటిలోనే దొరికిన కొన్నిక్షణాల ఏకాంతం లో నేను తనని పెళ్లి చేసుకోవాలకుంటున్నానని చెప్పాను. చిన్నప్పటినుంచి ఒకరికొకరం తెలుసు కనుక ఆమె కాదంటుందనే అనుమానమే నాకు లేదు. కానీ నా నెత్తిన పిడుగు పడేలా ఆమె తనకిష్టం లేదని ఒకే మాటలో చెప్పేసింది. నేను ఊహించని ఆ మాట వినగానే నాకు మరి మాటలు లేక ఆగిపోతే, సుందరి గబగబా ఇంట్లోకి వెళ్ళి పోయింది..." కథని కొంచెం రక్తి కలిగించటానికి కొంచెం ఆగాడు మోహన్.
మోహన్ సుందరి ని వివాహం చేసుకున్నాడని అందరికీ తెలుసు కనుక కథ ముగింపు విషయంలో అనుమానం లేకపోయినా ఈ వివాహం చివరికి ఎలా జరిగింది? ముందు కాదన్న సుందరి తర్వాత పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అనే విషయాలమీద ఉత్కంఠతో నలిగిపోతున్న మా మనోభావాలని సంతృప్తిగా చూసి కథ కొనసాగించాడు మోహన్.
"అప్పుడు మా మావగారు... అప్పటికి కాబోయే మావగారులే. ఆయన కలగజేసుకుని నా అద్భుతమైన లక్షణాలన్నీ సుందరి కి కథలు కథలుగా చెప్పి ఇటువంటివాడు మళ్ళీ దొరకడనీ, వదులుకోవద్దనీ ఆమెని పాపం పెళ్ళికి ఒప్పించారు.
కథ సుఖాంతమైందనే ఉత్సాహంతో సుందరిని కలుసుకున్నాను. కానీ సుందరి ఏమీ ఉత్సాహంతో లేదు.
'ఈ పెళ్ళికి మా నాన్నఒప్పిస్తే ఒప్పుకున్నాను తప్ప నీలాంటి పనికిమాలిన ప్రేమికుడిని ఏ ఆడదీ ఇష్టపడదు" అంది.
నేను నిర్ఘాంతపోతుంటే "నన్ను కలిసినప్పుడు ఎప్పుడైనా ఒక గులాబీ పువ్వు తెచ్చావా? శిల్పారామాలూ గాంధీగారి మ్యూజియం కాకుండా ఒక మంచి రొమాంటిక్ సినిమాకి తీసుకెళ్ళావా? ఒక పుట్టినరోజున అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకము ఇస్తావా? ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున కూడా మిగతా రోజుల్లాగే ఇంటికి వస్తావా?" అని చెడామడా తిట్టేసింది.
ఊహించని ఆ ఉధృతానికి నేను ఉక్కిరిబిక్కిరవుతుంటే, "మీ కస్టమర్ ని, బాస్ నీ సంతోషపెట్టటానికి రకరాల విన్యాసాలు చేస్తావ్? కానీ నన్ను ఆకట్టుకోవటానికి నువ్వు ఒక్క పని చేసావా? అసలు నన్ను పెళ్లి చేసుకోమని అడిగిన విధానం ఎంతో ఛండాలంగా ఉంది " అంది సుందరి ఉక్రోషంగా.
నేను వెంటనే తల వంచుకుని "క్షమించు సుందరీ! నిజంగా ఇది తప్పే. కానీ నేననుకున్న విషయం విను." అన్నాను.
"ఇప్పుడేం చెప్పినా నా మనసులో ఈ గాయం మానదు. పైగా నేను వద్దని ఖచ్చితంగా చెప్పేశాక మా నాన్నని మధ్యవర్తిలా వాడుకుని పెళ్ళికి ఒప్పిస్తావా?" అని అరిచింది సుందరి.
అంతవరకూ ఆమె తిట్లు మౌనంగా వింటున్న నేను మొదటిసారి నోరు విప్పి, "ఆ ఒక్క విషయంలో నన్ను వదిలిపెట్టు. మావగారిని మాట్లాడి ఒప్పించమని నేను అడగలేదు. ఆయనే గ్రహించి నీతో మాటాడినట్టున్నారు" అని చెప్పాను.
సుందరి ముఖంలో మార్పు లేదు. "అంటే నేను వద్దనగానే సరే అనేసుకున్నావా?" అంది.
"లేదు. నేను ఎంతో కుంగిపోయాను. కానీ నీకు నాతో పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేశావు కనుక బలవంతం పెట్టకూడదనుకున్నాను. ఎందుకంటే ఏదయినా మనస్ఫూర్తిగా జరగాలి. సిఫార్సులతో, లేదా బెదిరింపులతో జరిగితే ఆ పెళ్లి నిలబడదు కదా!" అన్నాను.
"నిన్ను ఆకట్టుకోలేదన్నావు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా తయారు అయ్యి, ప్రతిసారీ కానుకలు తెస్తూ నిన్ను సంతోష పెట్టలేదు. నిజమే! కానీ పెళ్లయ్యాక కూడా ఇవన్నీ చెయ్యలేను కదా!" అన్నాను.
నేను ఏ కోణంలోంచి మాటాడుతున్నానో ఇంకా తెలియని సుందరి మౌనంగా వింటోంది.
"నా వృత్తిలో ఎంతోమందిని సంతోషపెట్టి నా పనులు జరిపించుకుంటానన్నది నిజమే. కానీ వాళ్లెవరితోనూ నేను కలిసి బతకను సుందరీ! అవన్నీ వ్యాపార సంబంధాలు. ఇద్దరు ప్రేమికుల మధ్య నిజమైన ప్రేమ ఉండాలంటే నేను నేనుగా నీకు తెలియాలి నువ్వు నువ్వుగా నాకు తెలియాలి. మనలోని గొప్పలూ, లోపాలు తెలిసాక కూడా నచ్చితేనే ఆ పెళ్లి ఫలిస్తుంది అనే భావంతో నేను నీ ముందు ఎప్పుడూ నేనుగానే ఉన్నాను. ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నాను. నా ప్రమేయం లేకుండా మావయ్య నీతో మాట్లాడిన తర్వాత కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావనే సంబరపడ్డాను. కానీ నేను నీకు నచ్చకపోతే మావయ్యకి చెప్పి ఈ సంబంధం రద్దు చేసేస్తాను." అని ఎంతో నిజాయితీ గా చెప్పాను.
నేను మాటలు పూర్తిచేసి తలెత్తేసరికి సుందరి కళ్ళల్లో నీళ్లు! నా వైపు ఎంతో ఆరాధనగా చూస్తూ మా చూపులు కలవగానే మొదటిసారి నా చెంప మీద ముద్దు పెట్టుకుంది. మరేమీ మాటాడకుండా వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే కవులు వర్ణించినట్టు ఆ రోజు నాకు గాలిలో తేలుతున్నట్టు అనిపించింది" అన్నాడు మోహన్.
అందరూ నవ్వేశారు. స్ఫూర్తి అందుకుని "పెళ్ళికి ముందు నాటకాలు ఆడలేదు కానీ మోహన్ గాడు ఇప్పుడు మా మరదలితో ఆడుతున్నదంతా నాటకమే" అన్నాడు. మళ్ళీ సుందరితో సహా అందరూ నవ్వేశారు.
తర్వాత చీటీ బలరాం కి వచ్చింది. బలరాం కొంచెం ఇబ్బందిగా "అన్నీ చెప్పుకోవటం కష్టంరా" అన్నాడు. నేను వెంటనే "ఒరేయ్ ఇక్కడ ఎవరూ పరాయివాళ్ళు లేరు నువ్వు చెప్పినవేవీ బైటికి వెళ్లవు" అన్నాను.
"అదేం కాదులే చెప్తాను. ఈరోజు నేను చెప్పచ్చు." అని బలరాం మొదలెట్టాడు.
బలరాం చెప్పిన కథ
చిన్నప్పుడు మనలో చాలామంది లాగానే మేము కూడా ఒక దిగువ మధ్యతరగతికి చెందిన వాళ్ళం. ఇల్లంతా పేదరికం తాండవించేది. ఇల్లు గడవాలంటే నాన్నకి రెండు ఉద్యోగాలు చెయ్యటం తప్పని సరి. ప్రతిరోజూ పొద్దున్న మొదటి ఉద్యోగం ప్రభుత్వ కార్యాలయంలో చేసి సాయంత్రం ఒక్క పది నిముషాలు ఆరుబయట చుట్ట పీల్చుకుని మళ్ళీ వీధి చివర కిరాణా కొట్టులో లెక్కలు చూసే రెండో ఉద్యోగానికి వెళ్లిపోయేవాడు మా నాన్న.
నేను పదవతరగతికి వచ్చేసరికి బడిలో లెక్కలకి సరైన గురువు లేకపోవటంతో ట్యూషన్ తప్పనిసరి అయ్యింది. నా తోటి విద్యార్థులు దాదాపు అందరూ వేరే టీచర్ ఇంట్లో ట్యూషన్ తీసుకోవటం మొదలు పెట్టారు.
పదవతరగతి ఫలితాలని బట్టి మా భవిషత్తు ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో ఈ సమస్య నా ఆందోళన మరింత పెంచింది. రెండు ఉద్యోగాలు చేసి వళ్ళు హూనం చేసుకుని కూడా బొటాబొటీ గా ఇల్లు నడిపిస్తున్న నాన్న పరిస్థితి నాకు తెలుసు కనుక ఈ అదనపు ఖర్చులకి అడగటానికి మొహమాటపడి ట్యూషనుకి వెళ్తున్న మిత్రుల సహాయం తీసుకునేవాడిని.
ఎంత సాయం చేసినా నా మిత్రులకి కూడా వారి చదువు వారు చదువుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో వారి నుంచి వచ్చే సాయం అప్పుడప్పుడు సమయానికి దొరికేది కాదు. నేను నాన్న తో చెప్పకపోయినా మా స్నేహితుల మధ్య రోజూ జరిగే మాటలు విని ఒకరోజు నాన్నఏమిటి విషయమని అడిగారు.
నాన్న దగ్గర పరిష్కారం ఉండదని నా ఖచ్చితమైన నమ్మకం. ఇప్పుడు నేను నా సమస్య గురించి వివరించినా నాకు సాయం చేయలేక ఆయన కుమిలిపోతాడనీ నాలో నేనే మథనపడుతూ విషయం చెప్పాను.
మధ్యలో ఆపకుండా అంతా వినగానే నాన్న ఆలోచిస్తూ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఏదో తట్టినట్టు తలెత్తి "రేపటి నుంచి ట్యూషన్ లో నువ్వు కూడా చేరిపోరా" అన్నాడు.
ఇంత భారం భరించటం తనకి కుదరదనో నన్ను సద్దుకుపొమ్మనో చెప్తాడని ఊహిస్తున్న నేను ఆశ్చర్యపోయి "ఎలా నాన్నా? ప్రతినెలా ఇంత డబ్బు ఎలా ఏర్పాటు చేస్తావు? " అని అడిగాను.
నాన్న నవ్వి "చిన్నపిల్లలు ఇవన్నీ అడగకూడదు. మీ మాస్టారికి డబ్బులు నెలాఖరు నుంచి ఇస్తానని చెప్పు" అన్నాడు.
గురువు గారు మంచి వారు కనుక నెలాఖరు ఏర్పాటుకి ఒప్పుకున్నారు. సమస్య తీరిపోయింది.
కానీ నా అనుమానం అలాగే ఉండిపోయింది. ఇదంతా ఎలా చేస్తున్నావు? అప్పు చేస్తావా? చేసినా నెలనెలా ఇంత డబ్బు అప్పు ఎవరిస్తారు?' అని నేనడిగినప్పుడల్లా నాన్న చిరునవ్వే సమాధానమయ్యింది.
కొన్ని రోజుల తర్వాత సమాధానం నాకే దొరికింది.
ప్రతిరోజూ సాయంత్రం ఉద్యోగం నుంచి వచ్చాక నాన్న మా చిన్న ఇంటి బైట రోడ్డుమీదున్న తుప్పు పట్టిన ఇనప కుర్చీలో కూర్చుని ఎంతో విశ్రాంతిగా ఒక చుట్ట కాల్చేవాడు. దాదాపు పది నిముషాలు చుట్టని ఆస్వాదిస్తూ తాగాక రెండో ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఆ దృశ్యం నాకు గత నెల రోజులనుంచీ కనబడటం లేదని గమనించాను. నాన్న తన జీవితమనే సంకుల సమరంలో ప్రతిరోజూ తనకంటూ కేటాయించుకున్న పది నిముషాలలో కొంతయినా ఉపశమనం కలిగించే ఆ చుట్ట మాయమయ్యిందనీ అదే నేను కలిగించిన అదనపు బరువుని భరించటానికి ఉపయోగపడిందనీ తెలిసింది.
అప్పుడే నిర్ణయించుకున్నాను. చాలా మంది నడిచే బాటలో కాకుండా పదవ తరగతి తర్వాత నేను పాలిటెక్నిక్ లో చేరిపోయాను. చదువుల గురించి తెలియని నాన్న అది కూడా మంచిదే అనుకున్నాడు. మూడేళ్లు దీక్షగా చదివి చదువు పూర్తవుతూ ఉండగానే ఉద్యోగం తెచ్చుకున్నాను. నా మొట్ట మొదటి జీతంతో నాన్నకిష్టమైన చుట్టల పొట్లాలతో పాటు మంచి పడక కుర్చీ కొని ఇంటికి తీసుకెళ్ళాను. నాన్నని నేనే ఇంటి బైటికి తీసువచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి చుట్టలూ అగ్గిపెట్టె చేతికిచ్చాను.
నాన్న కాళ్ళకు నమస్కారం చేసి, ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ చూస్తున్న నాన్నతో "నాన్నా! ఈ రోజు నుంచి నీ రెండో ఉద్యోగం మానేసి సాయంత్రాలు హాయిగా విశ్రాంతి తీసుకో. భగవంతుడి దయ వలన నాకు ఉద్యోగం దొరికింది. ఇంకొన్ని నెలలలో మీరు అసలు ఉద్యోగమే మానెయ్యచ్చు" అన్నాను.
విషయమంతా మళ్ళీ మళ్ళీ నా దగ్గరనుంచి విని కొడుకు ప్రయోజకుడయ్యాడనే చెప్పలేని సంతోషంతో కించిత్తు గర్వంతో నాన్న ఆరోజు గడిపిన ఆ సాయంత్రం, ఆ తర్వాత వీధిలో రోజూ కొత్త ఉత్సాహంతో విశ్రాంతి తీసుకున్న ఎన్నో అటువంటి సాయంత్రాలు నా జీవితంలో ఎంతో మధురమైన అనుభూతిగా ఇప్పటికీ ఉన్నాయి,
"తర్వాత ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్ చదివి పట్టభద్రుడినయ్యాను. ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరాను. కానీ తలిదండ్రుల ముఖాలలో వెలుగు నింపినప్పటి ఆనందానికి ఇవేవీ సాటిలేనివి" ముగించాడు బలరాం.
ఈసారి ఎవరూ చప్పట్లు కొట్టలేదు. అందరూ ఒకరకమైన దిగ్బ్రాంతిలో ఉంటే, ఎలాంటి వాతావరణాన్ని మార్చగలిగిన స్ఫూర్తి కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
కొంచెంసేపటికి స్ఫూర్తిగాడే తేరుకుని "బలరాం గాడు ఒక మంచినిజాన్ని చెప్పాడురా. నాకు ఉన్నతపదవి వచ్చిందనో విదేశం పోతున్నాననో, నాకేతో అవార్డు వచ్చిందనో ఉద్రేకపడిపోయి అవే మన ఘనకార్యాలుగా చెప్పుకుపోతున్నాం. రోజూ వీటికన్నా ఎంతో గొప్పవైన ఎన్నో మధురమైన అనుభూతులు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి." అన్నాడు.
అప్పుడు చలపతి అందుకుని "సరిగ్గా చెప్పావురా. మనకి ఏది ముఖ్యం ఏది కాదు తెలియదు" అన్నాడు.
చలపతి చెప్పిన అనుభవం
చలపతి వాడి పద్దతిలో క్లుప్తంగా మొదలెట్టాడు.
"ఒకరోజు నేను ఆఫీస్ కి పొద్దున్నేవెళ్ళిపోతున్నాను. అప్పుడే నా కొడుకు పరీక్షాఫలితాలు తెలిసాయి. ఫలితాలు బావున్నాయి. కానీ తను ఎంతో కష్టపడి వ్రాసిన ఒక పరీక్షలో ఫలితం అనుకున్నంత బాగా రాకపోవటంతో వాడు నిరాశ పడిపోయి తట్టుకోలేక వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. వాడిని దగ్గరికి తీసుకుని పది నిముషాలు ఓదార్చాలనిపించింది. కానీ మీటింగ్ ఉందని నేను గుండె రాయి చేసుకుని వెళ్ళిపోయాను. ఆ సాయంత్రం నేను వాడి కోసం మంచి మంచి కానుకలు తెచ్చి పరీక్ష ఫలితం వాడనుకున్నంత చెడ్డగా ఏమీ లేదనీ మన దగ్గరలోనే ఉన్న కొన్ని మంచి కాలేజీ లలో చదువుకోవటానికి ఆ ఫలితం సరిపోతుందనీ వాడిని ఉత్సాహపరిచాను.
కానీ ఆరోజు, మరెన్నో ఇలాంటి రోజులు నేను కోల్పోయినదేమిటో నాకు తెలుసు. కాలం వెనక్కి రాదు. వాడు ఊరటకోసం ఎదురుచూసిన ఆ క్షణంలో నేను పక్కన లేను. మరి ఆ క్షణం మళ్ళీ కావాలంటే వస్తుందా? ఇకముందు అటువంటి పొరపాట్లు మళ్ళీ చేయకూడదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను" అన్నాడు.
అందరూ ఆ మాటలు విని కొంచెం ఉద్వేగానికి లోనవుతున్న సంగతి గుర్తు పట్టి నేను అందుకున్నాను.
"చలపతి గాడు చెప్పినట్టు ఎన్నో చిన్నవనుకున్న లెక్కలేనన్ని విషయాలలో మనకు కలిగే ఆనందం ఎంతో పెద్దది. నేను మాట్లాడేటప్పుడు కావాలని "అద్భుత కథలు, బ్రహ్మాండ వంటలు" అని విచిత్రమైన పద ప్రయోగాలు చేసినప్పుడల్లా శాంత "అది తప్పు. అద్భుతమైన కథలు, బ్రహ్మాండమైన వంటలు అనాలి" అంటూ నా భాషని సరి చేస్తుంది. ముఖ్యంగా అందరిముందూ నన్ను సరి చేస్తున్నపుడు ఆమె ముఖంలో వెలుగు చూస్తే ఎన్నిసార్లయినా అలా తప్పుగానే మాటాడాలని అనిపిస్తుంది. ఆ ఆనందం ఎన్ని కేజీల నగలు కొన్నా వస్తుందా?
ఇరవై ఏళ్ల క్రితం నేనొక 48 గంటల రైలు ప్రయాణం నా మేనత్త ఊరు మీదుగా చేస్తున్నాను. చరవాణుల సౌకర్యం లేని ఆ రోజుల్లో ఎవరి ద్వారానో నా ప్రయాణం విషయం తెలుసుకుని నేను ఏ రైల్లో వెళ్తున్నానో తెలియక స్టేషన్ లో ప్రతి రైలూ వెతికి నేను కనిపించాక నాకు ఫలహారం అందించిన నా బావమరుదుల ప్రేమ నాకొక గొప్ప జ్ఞాపకం.
మరి ఇలా నాకెన్నో జ్ఞాపకాలూ అనుభూతులూ ఉన్నాయి. మీకూ ఉంటాయి. వాటిని చాలా ప్రేమగా భద్రపరుచుకోండి" అని ముగించాను.
అప్పుడు అప్పలరాజు అందుకుని "మనం ఎందుకో మన ఉద్యోగాలకి వ్యాపారాలకీ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తాం. ఎందుకంటే వాటికి డబ్బుతో లంకె. తరిచి చూస్తే ఎన్నో చిన్నచిన్న విషయాల మీద మనం సరైన ధ్యాస పెట్టకపోవడం వలన ఎన్నెన్ని అనుభవాలు కోల్పోతున్నామో తెలుస్తుంది. పదోన్నతులూ, జీతాలు పెరగటం లాంటివి జరిగినా కొన్నిరోజులకి మరిచిపోయి మరో పదోన్నతి కోసం, మరికొంత జీతం పెంపు కోసం ఎదురు చూస్తాం. కానీ మనం కోల్పోయే ఈ చిన్న చిన్న అనుభూతులని సేకరించుకుని రోజూ ఎంతో సంతోషంగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకుంటాం." అన్నాడు.
"మనకందరికీ భోజనం పెట్టి పిల్లలు ఆకలిగా అన్నీ తినేస్తే తనకేమీ మిగలకపోయినా వాళ్ళు తృప్తిగా తిన్నారనే సంతోషంతో పడుకునే అమ్మలకి రోజూ గొప్ప అనుభూతే."
"నా పిల్లకి కొత్త రిబ్బన్లు కొన్నపుడు రాత్రంతా తెల్లారటం కోసం ఎదురు చూసి, మర్నాడు పొద్దున్నే వాళ్ళమ్మని విసిగించి ఆ రిబ్బన్లు జడకి వేసుకుని పిల్ల చిందులేసే దృశ్యం ఎప్పటికీ మరుపురాని అనుభవమే."
"నీ బిడ్డని ఎత్తుకుని దానికిష్టమైన కాకులు ఎగురుతుంటే చూపించి అది బోసినవ్వులు నవ్వుతుంటే కలిగే పరవశం ఎలా మరిచిపోతావ్?" అన్నాడు.
"చదువుకుని బడినుంచి వచ్చిన పిల్లాడిని వళ్ళో కూర్చోబెట్టుకుని, వాడు ఆరోజు ఏమేం చేశాడో విని, వాడిని అభినందనగా ముద్దు పెట్టుకుని, వాడు అమాయకంగా నవ్వే నవ్వు చూడు. నాన్నా మా పిక్నిక్ కి రెండు రకాల స్నాక్స్, ఇంకా ఏవేవో తీసుకెళ్ళాలి అన్న మీ కూతురితో చూద్దాంలే అని నిర్లక్ష్యంగా అనకుండా పిల్ల మర్నాడు నిద్ర లేచేసరికి దానిపక్కన ఆ వస్తువులు చూపించి దాని కళ్ళల్లో వెలిగే మెరుపు చూడు. రోజూ పొద్దున్నే నాలుగు గంటలకి లేచి మంచి నీళ్లు నింపుకోవటంతో రోజు ప్రారంభించే నీ శ్రీమతి కన్నా ముందు నిద్రలేచి ఆ పనులన్నీ చేసేసి ఆ ఒక్క రోజుకైనా నిశ్చింతగా మరో రెండు గంటలు ఎక్కువ నిద్రపోయే నీ భార్యని చూడు. ఎపుడూ ఏమీ అడగకుండా పిల్లలకోసమే జీవితం గడిపిన మీ తలిదండ్రులకి వారికి నచ్చే మిథునం సినిమా చూపించు. ఇవన్నీ చూపించి చూడండ్రా." అని వాడి శైలిలో అప్పలరాజు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు.
"మనం ఈరోజు తెలుసుకున్న ఈ అద్భుతమైన అవగాహనతో మనం పంచరంగులతో మిగిలిన జీవితాన్ని ఆస్వాదిద్దాం" అనుకుంటూ అందరం మా వినోదాలు కొనసాగించాం.
—----