గొడుగు
గొడుగు (Author: బి. వి. రమణమూర్తి)
‘‘మమ్మీ... పిల్లలందరికీ అమ్మానాన్నలు ఉండరా? ’’
పింకూ ప్రశ్నతో శ్రావణి ఉలిక్కిపడింది. ఆశ్చర్యంగా కొడుకువైపు చూసింది. ‘పింకూకు అటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందా!’ అని ఆశ్చర్యపోయింది.
‘‘ఛ.. ఛా, అదేం లేదు. అయినా అమ్మానాన్నలు లేకుండా పిల్లలు ఎలా వస్తారు?’’ తలమీద నిమురుతూ అంది.
‘‘లేదు మమ్మీ, చాలామంది పిల్లలకు అమ్మానాన్నలు లేరు. అవును నిజమే అని మా ఫ్రెండ్ షామిలి కూడా అంది. నేను కూడా చాలా మందిని చూశాను. ’’
శ్రావణికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పిల్లల మనసులోకి ఏదైనా ఆలోచన చొరబడితే అది అంతవేంగా మాసిపోదని ఆమెకు తెలుసు.
‘‘ఓ... నువ్వంటున్నది అనాథ పిల్లల గురించా! నువ్వన్నట్టు కొందరు పిల్లలకి అమ్మానాన్న లేకపోవడం నిజమే. కాకపోతే వారిని దేవుడు తీసుకుపోవడం వల్ల అనాథలవుతారన్నమాట’’ చింటూకు అర్థమయ్యేలా చెప్పింది శ్రావణి.
‘‘అంటే అటువంటి వారికి అన్నం పెట్టేవారు ఎవరూ ఉండరా? వారికి ఇల్లుండదా? మరి వారి ఆకలి ఎలాతీరుతుంది? ఎక్కడ పడుకుంటారు. ఎండా, వానల్లో ఎలా? ’’ పింకూ ప్రశ్నల పరంపర సాగుతోంది.
శ్రావణికి చికాకుగా ఉంది. కానీ కోపగించుకునే సమయం కాదని, ‘‘అసలు నీకు ఇన్ని సందేహాలు ఎందుకు వస్తున్నాయి? ఏమయ్యింది చింటూ…’’ అనునయంగా అడిగింది.
‘‘ఈ రోజు మా స్కూలు బస్సు సిగ్నల్ జంక్షన్లో అగింది. ఓ పిల్లాడు బస్సులో నేను కూర్చున్న వైపు వచ్చి నాకు అమ్మానాన్నలు లేరు, ఆకలేస్తోంది. ఏదైనా పెట్టవా? డబ్బులు ఇవ్వవా?’’ అంటూ ఏడుస్తూ అడిగాడు మమ్మీ.
‘‘అయ్యో అలాగా, పాపం వాడి అమ్మానాన్నను దేవుడు తీసుకుపోయాడేమో. ’’
‘‘అవును మమ్మీ, నాకూ అలాగే అనిపించింది. వాడే కాదు మమ్మీ, స్కూలుకు వెళ్లివచ్చినప్పుడు రోజూ ఏదో ఒక జంక్షన్‌లో వీడిలాంటి వారు ఒకరో ఇద్దరో కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా దూరం నుంచే చూశాను. ఇప్పుడు వాడు దగ్గరకు వచ్చి అడిగేసరికి నాకెంత జాలేసిందో…. వెంటనే నా బ్యాగులోని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను. వాడు సంతోషంగా వెళ్లిపోయాడు. ’’
‘‘మంచి పనిచేశావులే. ’’
‘‘కానీ మమ్మీ వాడి చేతులు నిండా మురికే. ఆ మురికి చేతులుతోనే బిస్కెట్లు తిన్నాడు. వాడికి నిక్కరు మాత్రమే ఉంది. షర్ట్ లేదు. చలివేయదా! జ్వరం కూడా వస్తుందేమో కదా... ’’
‘‘ఏం రాదులేగాని, ఇక వాడి గురించి వదిలేయ్. ఎల్లుండి నీ పుట్టిన రోజు కదా. డాడీ ఆఫీస్ నుంచి రాగానే మార్కెట్‌కి వెళ్దాం. నీకు కావాల్సినవి కొనుక్కుందువుగాని. అలాగే నీ ఫ్రెండ్స్ అందరినీ రమ్మని స్కూల్లో చెప్పావు కదా. డిన్నర్ మన ఇంట్లోనే’’ టాపిక్ డైవర్ట్ చేయాలని శ్రావణి అంది.
పింకూలో ఆనందం కనిపించలేదు. మౌనంగా లేచి తన గదిలోకి వెళ్లిపోయాడు.
రెండు మూడు రోజుల నుంచి పింకూలో మార్పును శ్రావణి గమనిస్తోంది. అనారోగ్యం ఏమోనని భయపడిరది. టీచర్ కొట్టడమో, తిట్టడమో చేసి ఉంటారని ఊహించింది. అవేం కాదని తెలిసి సంతోషించింది. ఈరోజు అనాథ పిల్లల విషయం ప్రస్తావించేసరికి ఆమెకు సమస్య అర్థమయ్యింది. బహుశా రెండురోజుల నుంచి జంక్షన్‌లలో పిల్లలను చూస్తూ ఉండి ఉంటాడు. ఈరోజు ఒకడు ఏకంగా దగ్గరకే రావడంతో మనసు గాయపడిందని ఊహించింది.
పింకూ ఏం చేస్తున్నాడా, అని గదిలోకి తొంగిచూసింది. బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటూ ఉంటే మామూలైపోయాడనుకుంది. డిన్నర్ సమయంలోనూ మార్పు లేకపోవడంతో కంగారుపడింది శ్రావణి.
‘‘ఇంకా ఆ పిల్లాడి గురించే ఆలోచిస్తున్నావా పింకూ? అయినా మనం ఏం చేయగలం. అది వాడి దురదృష్టం’’ నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.
‘‘మమ్మీ, ఆ కుర్రాడిని మనం పెంచుకుందామా? ’’
ఊహించని మాటతో శ్రావణి ఉలిక్కిపడింది. పింకూ ఎంత లోతుగా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాడో అప్పుడుగానీ ఆమెకు అర్థం కాలేదు. ఆ పరిస్థితుల్లో తానేం చెప్పినా పింకూ మరింత ఆలోచనల్లోకి వెళ్లిపోతాడని ఊహించింది.
‘‘సరిలే, డాడీ కంపెనీ నుంచి వచ్చాక నువ్వు చెబుదువు గాని. డాడీ ఎలా అంటే అలా చేద్దాం, సరేనా?’’
‘‘ఓకే మమ్మీ. యూ ఆర్ వెరీ గుడ్, ఐ లవ్ యూ మమ్మీ’’ అంటూ ఆనందంగా వాష్ బేషిన్ వద్దకు చేతులు కడుక్కునేందుకు వెళ్లాడు.
పింకూలో వచ్చిన ఉత్సాహం శ్రావణికి పెద్దగా ఆశ్చర్యపరచలేదు. అది ఆమె ఊహించిందే. అందుకే ముందుగానే భర్తకు విషయం చెప్పాలని ఫోన్ తీసి మరో బెడ్‌రూంను ఆనుకుని ఉన్న బాల్కనీలోకి వెళ్లిపోయింది.
```` ````
కారు దిగి హాలులోకి వస్తున్న కృష్ణచైతన్య సోఫాపై కూర్చునివున్న పింకూని చూసి ఆశ్చర్యపోయాడు. భోజనం కాగానే పడకగదిలోకి వెళ్లిపోవడం పింకూకు అలవాటు. సాధారణంగా అతను వచ్చేసరికే నిద్రపోతుంటాడు. కానీ ఈరోజు భిన్నంగా పరిస్థితి కనిపించడంతో శ్రావణి ఫోన్‌లో చెప్పిన విషయం గుర్తు చేసుకున్నాడు.
‘‘హాయ్ పింకూ, ఇంకా పడుకోలేదా?’’ అంటూ పలకరించాడు.
‘‘లేదు డాడీ, మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే వేచి ఉన్నాను. ’’ అంటూ పరుగున వెళ్లి తండ్రిని అల్లుకుపోయాడు.
కృష్ణచైతన్యకు ఆ విషయం ఏంటో తెలిసి ఉండడంతో ‘‘అవునా? బాగా అలసిపోయి వచ్చాను. రేపు ఉదయం మాట్లాడుకుందామా? ’’ నవ్వుతూ అన్నాడు.
‘‘లేదు డాడీ, ఇప్పుడే మాట్లాడాలి. మీరు వచ్చాక ప్రామిస్ తీసుకున్న తర్వాతే పడుకుంటానని మమ్మీతో కూడా చెప్పాను’’ భర్త చేతిలోని బ్యాగు అందుకుంటూ పడక గదివైపు వెళ్తున్న తల్లివైపు చూస్తూ అన్నాడు.
‘‘అలాగా, అయితే నేను రిఫ్రెష్ అయి రానా?’’ అన్నాడు.
‘‘ఓకే, డాడీ’’ అని పింకూ అనగానే తన గదిలోకి వెళ్లిపోయాడు.
‘‘చూశారుగా వాడి పట్టుదల? ఎంతలా చెప్పినా వినడం లేదు. నాకేమో చికాకుగా, ఆందోళనగా ఉందండి’’ గదిలోకి వచ్చిన భర్తతో అంది శ్రావణి.
‘‘దానికే అంత ఆందోళన ఎందుకు? చిన్నపిల్లలు అంతే. వారు ఊహించని సందర్భం ఎదురైనప్పుడు వారి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. నేను మాట్లాడి పడుకోబెడతానులే. నువ్వేమీ ఆందోళన చెందకు’’ అంటూ వాష్‌రూంలోకి వెళ్లిపోయాడు.
కృష్ణచైతన్న రిఫ్రెష్ అయి హాలులోకి వస్తుండగానే సోఫాలో కూర్చున్న పింకూ పరుగున వెళ్లి తన చేతిలోని పుస్తకాన్ని అతని చేతిలో పెట్టి ఓ పాఠం చూపించాడు.
‘‘వీలైనంత వరకు ఆనాథ పిల్లల్ని అదుకోవాలి. వారికి ఆశ్రయం కల్పించాలి. డబ్బున్నవారైతే వారిని అనాథ ఆశ్రమాల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాలి. పిల్లల్లేని తల్లిదండ్రులు అటువంటి వారిని పెంచుకుని వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. ఇలాంటి అనాథ పిల్లల్ని కొందరు స్వార్థపరులు ఎత్తుకుపోయి వారిని చంపి అవయవాలను అమ్ముకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి నుంచి పిల్లల్ని కాపాడాలి... ’’ అదీ ఆ పాఠం సారాంశం.
తల్లికి చెప్పిన విషయమంతా తండ్రికి చెప్పి ‘‘ప్లీజ్ డాడీ, మనకు బోలెడు డబ్బుంది కదా. ఆ బాబును మనం పెంచుకుందాం. వాడి అవయవాలు ఎవరూ ఎత్తుకుపోకుండా కాపాడదాం’’ పింకూ ఆశగా చూస్తూ అన్నాడు.
కొడుకు డీప్ ట్రాన్స్ లో ఉన్నాడని కృష్ణచైతన్యకు అర్థమయ్యింది. ఎప్పటినుంచో ఆ పిల్లల్ని పింకూ చూసినా పెద్దగా పట్టించుకోలేదని, ఎప్పుడైతే టీచర్ ఈ పాఠం చెప్పారో, అప్పటి నుంచి వారి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడని, అదే సమయంలో ఆ పిల్లాడు జంక్షన్‌లో కనిపించడంతో ఒక్కసారిగా డీప్‌ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాడని అర్థం చేసుకున్నాడు.
ఏదోలా నచ్చచెప్పి కొడుకు మనసు మార్చేందుకు చాలాసేపు, చాలా మార్గాల్లో ప్రయత్నించి విఫలమయ్యాడు.
‘‘అవును సరేగానీ, వాడు మనం పిలిస్తే వస్తాడంటావా, వాళ్ల మమ్మీడాడీ కోప్పడరా? ఇంతకీ వాడు మనకు మళ్లీ కనిపిస్తాడంటావా? ’’ కృష్ణచైతన్య పింకూను చూస్తూ అన్నాడు.
‘‘తనకు అమ్మానాన్నలేరని వాడే చెప్పాడు డాడీ. బహుశా వాడు అదే జంక్షన్‌లో ఉంటాడు. నేను గుర్తుపడతాను’’
‘‘సరేలే, నువ్వెళ్లి పడుకో. రేపు ఆ కుర్రాడు ఉన్న జంక్షన్‌కి వెళ్లి కనిపిస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓ.కేనా?’ అనడంతో ఎక్కడలేని సంతోషంతో పింకూ తన గదిలోకి వెళ్లిపోయాడు.
కొడుకు ఆ కుర్రాడి గురించి తాను ఊహించిన దానికంటే తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అర్థమయ్యింది కృష్ణచైతన్యకు.
```` ````
ఆలస్యంగా లేచాడు కృష్ణచైతన్య. రిఫ్రెష్ అయి హాలులోకి వచ్చాడు. అప్పటికే తయారై సోఫాపై కూర్చున్న కొడుకును చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఓ కంపెనీ అధిపతి అయిన కృష్ణచైతన్య ఇండస్ట్రియల్ సైకాలజీ చదివాడు. పిల్లల మనస్తత్వంపైనా కొంత అవగాహన ఉంది. ఏడో తరగతి చదువుతున్న పింకూ వారి ఏకైక సంతానం. పేరు ప్రీతం కుమార్. పింకూ నిక్ నేమ్.
‘‘గుడ్‌మార్నింగ్ పింకూ, ఏంటి అప్పుడే రెడీ అయిపోయావు?’’
‘‘వెరీ గుడ్‌మార్నింగ్ డాడీ. ఏంటి మర్చిపోయారా? జంక్షన్‌కి వెళ్లి ఆ పిల్లాడితో మాట్లాడుదామన్నారు కదా…. ’’
‘‘ఓ... అదా, గుర్తుంది... గుర్తుంది. రాత్రి చాలాసేపటి వరకు మమ్మీ, నేను అదే విషయం చర్చించుకున్నాం. ఇదిగో ఓ గంటలో తయారై వస్తాను. అమ్మకూడా రెడీ అవుతుంది. టిఫిన్ చేసి ముగ్గురం ఆ జంక్షన్‌కి వెళ్దాం. ’’
‘‘థాంక్యూ డాడీ, థాంక్యూ సోమచ్. యూ ఆర్ మై లవింగ్ డాడ్’’ పింకూలో ఎక్కడలేని ఉత్సాహం చూసి నవ్వుకున్నాడు కృష్ణచైతన్య.
గంట తర్వాత పింకూతోపాటు కారులో చెప్పిన జంక్షన్‌కి వెళ్లారు. జంక్షన్ నాలుగు రోడ్లలో ఎక్కడా ఆకుర్రాడు కనిపించలేదు. అసలు ఏ కుర్రాడూ కనిపించలేదు.
ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని అడిగితే ‘‘వారు ఒకే జంక్షన్‌లో ఉండరు సార్. ఒక్కోరోజు ఒక్కో జంక్షన్‌కి వెళ్తిపోతుంటారు. వారంతా... ’’ అంటూ అతను ఏదో చెబుతున్నాడు. కావాల్సిన సమాచారం లభించడంతో మిగిలిన దానిపై కృష్ణచైతన్య పెద్దగా ఆసక్తిచూపకుండా వెనుదిరిగాడు.
పింకూకి ఎలా సర్దిచెప్పాలో ఇప్పుడతనికి అర్థం కావడం లేదు. కనీసం ఆ కుర్రాడు కనిపిస్తే పింకూని అతనితో మాట్లాడించి, ఆ తర్వాత కొడుకుని ఏదోలా కన్విన్స్ చేయొచ్చనుకున్నాడు. ఇప్పుడేం చేయాలో అతనికి తోచడం లేదు.
‘‘పింకూ... ఆ కుర్రాడు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు. వాడి అమ్మానాన్న తీసుకువెళ్లిపోయి ఉంటారు. వాడు తనకు అమ్మానాన్నలు లేరని నీకు అబద్ధం చెప్పి వుంటాడు. ’’
‘‘ఇక్కడే ఉండేవాడు డాడీ. మా స్కూలు బస్సు వచ్చేటప్పుడు ఈ రోడ్డులోనే ఆగుతుంది. బస్సు దగ్గరకు వచ్చాడు. నేను చాలాసార్లు వాడిలాంటి వాడిని ఈ జంక్షన్‌లో చూశాను. ఈ రోజు ఎందుకో వాడు... ’’ పింకూ చెప్పుకుపోతున్నాడు.
ఆ కుర్రాడు కనిపించలేదని పింకూకు అర్థమైనందుకు కృష్ణచైతన్య కొంత స్థిమితపడ్డాడు.
‘‘సరే, ఆ బాబు కనిపించడం లేదు. అసలు అలాంటి వారు ఎవరూ లేరిక్కడ. మరి ఇప్పుడేం చేద్దాం. ’’
కాసేపు ఆలోచనల్లోకి వెళ్లిపోయాడు పింకూ.
‘‘ఆ డాడీ, నాకో అయిడియా వచ్చింది. ఇలా వెళ్దాం. మా స్కూలు వరకు నాలుగైదు జంక్షన్‌లు ఉన్నాయి. ఏదో ఒక జంక్షన్‌లో వాడు కచ్చితంగా దొరుకుతాడు. కనీసం వాడి ప్రెండ్స్ అదే మరికొందరు ఉన్నారని చెప్పాను కదా, వారైనా దొరికితే అడుగుదాం. ’’
‘‘ఎక్కడని వెతుకుతాం చెప్పు పింకూ! వాడు ఎక్కడి వాడో, ఇక్కడ నిన్న నీకు ఎందుకు కనిపించాడో, అసలు వాడు అనాథో, కాదో మనకెలా తెలుస్తుంది చెప్పు. నేనో ఐడియా చెప్పనా? నేను మన కంపెనీలో పనిచేసే వారితో మాట్లాడి ఏ జంక్షన్‌లో ఆ కుర్రాడు కనిపించినా, అతనితోపాటు అటువంటి వారిని పట్టుకోమని చెబుతాను. ఏమంటావు? ’’
‘‘వారికి ఎలా తెలుస్తుంది? వారికి కనిపిస్తారంటావా? అయినా కాసేపు మనమే వెతికితే ఏం పోయింది డాడీ….’’ ఆవేదనగా అన్నాడు పింకూ.
‘‘చూడు పింకూ, నీకు హామీ ఇచ్చాకదా… ఆ కుర్రాడిని పట్టుకుంటానని, డాడీ మాట తప్పరు కదా? వారందరినీ పట్టుకుందాం, నువ్వనుకున్నట్టే వారందరికీ మమ్మీ, నేనే అమ్మానాన్నలు అవుతాం. ’’
‘‘అంటే, వారందరినీ మన ఇంటికి తెచ్చుకుందామా? ’’
‘‘మన ఇంటికి కాదు, మన ఇంటిలాంటి అనాథాశ్రమంలో చేర్పిద్దాం. వారిని చదివిద్దాం. అలా చేస్తే వారు ఇలా జంక్షన్‌లలో తిరగాల్సిన అవసరం ఉండదు కదా. యాచించాల్సిన పనిలేదు కదా? ఏమంటావు. ’’
‘‘అది సరే కానీ, మన వర్కర్లు వారిని పట్టుకోగలరా అని. మనమే వెతికితే బాగుంటుంది కదా డాడీ. ’’
‘‘నేను చెబుతున్నాను కదా. వారంలోగా వాడిని పట్టుకుని నీకు చూపించే బాధ్యత నాది. నేను యువర్ లవింగ్ డాడీ కదా. నన్ను నమ్మవా? ’’
అంటే... అది కాదు... అని ఆలోచిస్తూ ‘‘ఒకే డాడీ... ’’ అని అయిష్టంగానే కారెక్కి కూర్చున్నాడు పింకూ.
‘‘తాత్కాలికంగా కొడుకును ఒప్పించగలిగినా ఇప్పుడేం చేయాలని అని ఆలోచిస్తూ ఇంటివైపు కారు కదిలించాడు కృష్ణ చైతన్య. ’’
````` ````
సభ చప్పట్లతో మారుమోగింది. చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి.
‘‘శ్రావణి ఇండస్ట్రీస్ అధినేత కృష్ణచైతన్యగారి గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సంపాదనలో కొంత అనాథ పిల్లలకోసం వెచ్చించాలన్న ఆయన సత్సంకల్పంతో ఏర్పడిందే ఈ ‘‘అర్పాన్స్ అంబరిల్లా (అనాథల గొడుగు)’’ ఆశ్రమం. ఐదేళ్ల క్రితం ఐదుగురు పిల్లలో ప్రారంభమైన ఈ కేంద్రంలో ప్రస్తుతం వందమంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. తల్లిదండ్రులు దూరమై, ఆదుకునేవారు లేక యాచన చేస్తూనో, చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్న ఆనాథలకు ఆశయ్రం కల్పించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ఏ జంక్షన్‌లోనూ పిల్లలు యాచిస్తూ కనిపించకూడదన్నది చైతన్యగారి సంకల్పం.
అటువంటి వారు ఎవరికి కనిపించినా, మా ఆశ్రమం నంబర్‌కి ఫోన్ చేస్తే మేమే స్వయంగా వచ్చి వారిని ఆశ్రమంలో చేర్పిస్తాం. ఇది కృష్ణచైతన్య గారిచ్చిన ఆదేశం. సంపాదన, ఆస్తులు ఉన్నవారు మన సమాజంలో కోకొల్లలమంది ఉన్నారు. కానీ విశాలమైన మనసు, జనహితాన్ని కోరుకునే ఆలోచన ఉన్న కృష్ణచైతన్యగారిలాంటి వారివల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుంది అనేందుకు మా ఆశ్రయం ఒక ఉదాహరణ. వారానికి ఒక్కసారైనా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ బాగోగులు చూడడం ఆయనలోని శ్రద్ధకు తార్కాణం. ఆయనకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ ముగించాడు ఆశ్రమం నిర్వాహకుడు బహుదానంద.
‘‘ఇప్పుడు కృష్ణచైతన్యగారు మాట్లాడుతారు’’ అని నిర్వాహకులు ప్రకటించగానే చిరునవ్వుతో లేచి నిల్చున్నాడు.
డయాస్‌వైపు అడుగులు వేస్తూ వేదికకు ఎదురుగా భార్యతోపాటు కూర్చున్న పదహారేళ్ల కొడుకు పింకూవైపు గర్వంగా చూశాడు కృష్ణచైతన్య.
‘‘పిల్లల అల్లరి ఒక్కోసారి ఎంతమంచి ఆలోచనకు నాంది పలుకుతుందో అనేందుకు తన ‘అర్ఫాన్స్ అంబరిల్లా’ ఏర్పాటు ఒకటని కృష్ణచైతన్య గర్వంగా ఫీలయ్యాడు.
````````````````