గెలుపు
గెలుపు (Author: సి. భవానీదేవి)
“ ఏం పాపా ! ఇవాళ స్కూల్ కి హాలిడేనా” అడిగాడు అంకుల్
బొమ్మపట్టుకుని పక్కింటి పాపతో ఆడుకోవటానికి వెళ్తున్న కల్పన ఆగిపోయి వెనక్కి తిరిగి పాలబుగ్గల నవ్వుతో అంకుల్ కేసి చూసింది.
“లేదు. హాలిడే అంకుల్” అంటూ మళ్ళీ పక్కింటివైపు అడుగులు వేసింది ఆరేళ్ళ కల్పన.
“ వాళ్ళు లేరమ్మా! ఇప్పుడే అంతా ఊరెళ్ళారు.” అంకుల్ మాటలు విని కల్పన ఆగిపోయింది.
అంకుల్ లో ఉత్సాహం పెరిగింది.
“ రామ్మా. కాసేపు మనం ఆడుకుందాం. జేజి లేదా?” అంకుల్ ప్రేమగా పిలిచాడు.
“ ఉంది. పడుకుంది.” వెనక్కి తిరగబోయింది.
అంకుల్ రెండడుగులు ముందుకు వేశాడు.
“ అమ్మ నాన్న ఆఫీసుకు వెళ్లారా”
అంటూనే కల్పన చేయిపట్టుకుని తన ఇంటికేసి నడిపిస్తున్నాడు.
“ఆ! వెళ్లారు.”
అంటూ అప్రయత్నంగా బొమ్మపట్టుకున్న ఆరేళ్ళ కల్పన తానూ బొమ్మలా అంకుల్ చేయిపట్టుకుని ఆయన అడిగే ప్రశ్నలకు తనకు తెలిసిన జవాబులు చెప్తూ అంకుల్ ఇంట్లోకి వెళ్ళింది.
లోపలికి వెళ్ళాక అలవాటుగా కాబట్టి ఆంటీ కోసం చూసింది.
కల్పన చూపులు అర్ధం చేసుకున్నట్లు చిన్నగా నవ్వాడు అంకుల్.
“ఆంటీ లేదు. వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళింది. రా ..”
అంటూ కల్పన చేతిలోని బొమ్మని తీసుకుని టేబుల్ మీద ఉంచాడు.
“ చాక్లెట్ కావాలా”
కావాలన్నట్లు తలూపింది.
అంకుల్ ఫ్రిజ్ లోంచి డైరీమిల్క్ చాక్లెట్ ఇచ్చాడు. అది ఓపెన్ చేయబోతున్న కల్పనను వారించి తానే ఓపెన్ చేసి ఇచ్చాడు. కల్పన చాక్లెట్ తింటుంటే ఆమాటా ఈమాటా చెప్తూ చనువుగా తన గదిలోకి నడిపించాడు.
“ అంకుల్ .. అన్న కూడా వెళ్లాడా”
“అవును. మనం ఇవాళ కొత్త ఆట ఆడుకుందాం రా”
అంటూ కల్పనను ఎత్తి మంచం మీద కూర్చోబెట్టాడు.
బాల్యం చాక్లెట్ లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. అంకుల్ కళ్ళకు మాత్రం కల్పనే పెద్ద చాక్లెట్ లా కనిపిస్తోంది.
“సరే! మనం ఒక కొత్త ఆట మొదలుపెడదామా?”
“ ఏం ఆట అంకుల్..” చాక్లెట్ తినటం ఒక్కక్షణం ఆపి ముందుకువంగి ఆసక్తిగా అడిగింది.
“తమాషా ఆట. పసిపిల్లల ఆట.”
“మరి మీరు..?” ఆపాప కళ్ళలో అంతులేని ఆశ్చర్యంతో కూడిన ప్రశ్న.
అంకుల్ నవ్వేశాడు.
“ఇవాళ నేను కూడా పసిపిల్లాడినే.. నీకోసం.” అంటూ పాప బుజం మీద చేయి వేశాడు.
“ మరి మీరు ఇంత పెద్దగా ఉన్నారు.. ఎలా” సందేహిస్తూ కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్లు అడిగింది.
“నీతో ఈఆట ఆడటానికి చిన్నపిల్లాడిని అయిపోతాను. నువ్వు కూడా
పసిపాపాయి కావాలి.. .. జరుగుమరి ”
“నేను చిన్నపిల్లనేగా అంకుల్..” నవ్వింది చంద్రవంకలా.
“ ఇంకా చిన్నగా అవ్వాలి. ఇది భలే తమాషా ఆట తెలుసా.” కుతూహలం పెంచాడు.
“ఇంకా చిన్నగానా.. ఎలా?” ఆ కళ్ళలో అమాయకబాల్యం తాలూకు ప్రశ్న.
“ఎలాగో నేను చూపిస్తానుగా. కానీ ముందు ఒక ప్రామిస్ చేయాలి. ఈ ఆటగురించి ఎవ్వరికీ కొంచెంకూడా చెప్పకూడదు.” అంకుల్ కల్పనను ఒళ్ళో కూ ర్చోబెట్టుకున్నాడు.
సందేహంగా తలూపింది. అతనే మళ్ళీ సీరియస్ గా అన్నాడు. పాపకు అంకుల్ ని అలా చూస్తుంటే కొంచెం భయంవేసింది.
“ అలా ఎవరికైనా పొరపాటున చెప్పావంటే దేవుడికి నీమీద కోపం వస్తుంది. శాపం పెడతాడు. అప్పుడు మీ అమ్మ, నాన్న చచ్చిపోతారు.” కళ్ళు పెద్దవి చేసి తనే మళ్ళీ చెప్పాడు.
కల్పన అంకుల్ కేసి ఏదో తెలీని ఇబ్బందితో ఉంది.
“చెప్పను అంకుల్. ప్రామిస్.”
అంకుల్ కల్పనని మంచంమీద పడుకోబెట్టాడు. చాక్లెట్ మెల్లగా పనిచేస్తోంది.
“నువ్వు బేబీవి. అలాగే పడుకొని .. నిద్రపోవాలి.”
అంటూ అంకుల్ కూడా బెడ్ మీద కల్పన పక్కన పడుకున్నాడు.
“ఈ ఆట చాలా తేలిక.” వింతగా నవ్వాడు.
పాప కూడా నవ్వుతోంది. అసహజంగా... చాక్లెట్ లోని డ్రగ్ మత్తు కల్పన కళ్ళల్లో కమ్మేస్తోంది.
“గుడ్ గాళ్! చిన్నపిల్లలు పడుకున్నప్పుడు ఇవి తీసేస్తారు తెలుసా” కల్పన గౌన్ , అండర్వేర్ తొలగిస్తున్నాడు అంకుల్. కల్పన నీరసంగా అతని చేతులు నెడుతోంది. కానీ అవి పసిచేతులు .. అతనిది మృగత్వం.
అతని ప్యాంట్ కూడా మోకాళ్ళవరకు జారిపోతోంది. కల్పనకు అంకుల్ ని అలా చూస్తుంటే వింతగా ఉంది. సడన్ గా మంచంమీదినుండి జారబోయింది.
“వద్దు అంకుల్. నాకు బాగాలేదు. ఈ ఆట వద్దు.” అంటూ తన వంటి మీద పారాడుతున్న అతని చేతిని తొలగిస్తూ నెట్టేస్తూ గింజుకుంటోంది.
“అంకుల్ కితకితలుగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను. వదులు.. వదులు..”
తన శరీరంలో ప్రైవేట్ పార్ట్శ్ ఎవ్వరూ ముట్టుకోకూడదని అమ్మ చెప్పిన మాటలు కల్పనకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి.
నిస్సహాయంగా మత్తులోకి జారిపోతున్న కల్పన ఆక్రందనలు ఆ గదిలోనే బందీ అయ్యాయి.
**** ****
“ మళ్ళీ పాలు పారపోశావా. గ్లాస్ పగల గొట్టావా..” గాజుగ్లాస్ పగిలిన శబ్దానికి అమ్మ పరుగున వచ్చింది.
“ఏంటి పాపా .. ఇలా నాలుగవ గ్లాస్” మెత్తగా కోప్పడింది.
ఏమీ చెప్పకుండా అమ్మ బుజంమీద తల ఆనించింది కల్పన.
అమ్మకేమీ అర్ధం కావటం లేదు.
“ఏంటమ్మా స్కూల్లో ఎవరైనా ఏమన్నా అన్నారా?”
ఎన్నిసార్లు అడిగినా కూతురినుండి ఎటువంటి జవాబు రావటంలేదు. నాలుగైదు రోజులుగా కల్పన కొత్తగా ప్రవర్తిస్తోంది. సరిగా తినటం లేదు. మాటిమాటికి వాష్ రూమ్ కి వెళ్తుంది.
అంతకు ముందురోజు జరిగిన విషయం గుర్తుకొచ్చింది అమ్మకు.
అమ్మ, నాన్న, కల్పన టీవి చూస్తున్నారు. కూతురు డల్ గా ఉన్నదని క్రికెట్ ఆట చానెల్ మార్చి ఏదో సినిమా పెట్టాడు నాన్న. సడన్ గా ఏదో శృంగార సన్నివేశం.
అంతలోనే కల్పన ముఖ కవళికలు మారిపోయాయి. పెదవులు , బుగ్గలు మళ్ళీ మళ్ళీ తుడుచుకుంటూ ఏహ్యంగా చూస్తోంది. అమ్మకి భయమేసి చానెల్ మార్చింది.
కల్పన విసురుగా లేచి గదిలోకి వెళ్ళిపోయింది. మంచంమీద బోర్లా పడుకుని ఏడుస్తోంది.
తలుపు దగ్గర నిలబడి చాలాసేపు పరిశీలనగా చూసి అమ్మ కల్పనని అడిగింది
“ఏమైందమ్మా! నాకు చెప్పు’” స్వాంతనగా పదే పదే అడిగింది.
కూతుర్ని అలా చూస్తుంటే అమ్మకు కూడా దుఃఖం ముంచుకొస్తోంది. ప్రాణప్రదంగా చూసుకునే కూతురు ఎందుకిలా అయిపోతోంది. అన్నం తినటంలేదు. ఏదో వంకపెట్టి స్కూల్ కి మానేస్తోంది. ఎంత అడిగినా ఏమీ చెప్పటం లేదు. ఏమై ఉంటుంది.....
కూతుర్ని వళ్ళోకి తీసుకుని తలనిమురుతూ కళ్ళు తుడిచి బుజ్జగించి మరీ మరీ అడుగుతున్నది అమ్మ. కల్పనకు కొంచెం ఓదార్పు దొరికినట్లుంది.
“ అమ్మా.. అంకుల్ “ ఆగిపోయింది కల్పన.
అమ్మకి ఏదో అనుమానం వేసింది. కానీ అర్థం కాకుండా ఉంది.
“ రాజు అంకుల్ వాళ్లా.. ట్రాన్స్ఫర్ అయ్యారమ్మా. దిగులు పడకు. మళ్ళీ వస్తారుట”
“కాదమ్మా పక్కింటి అంకుల్ .. నాతో కొత్తఆట ఆడారు. నాకు చాలా నొప్పిగా ఉందమ్మా” అండర్ వేర్ వైపు చూపించింది.
అమ్మ కళ్ళముందు అగ్ని కురిసింది. కాళ్ళకింద నేల కుంగిపోయింది. కర్తవ్యం కాలరాత్రిలా ఎదుట నిలిచింది. ధైర్యం తెచ్చుకుంటూ కూతురు తలమీద నిమురుతూ లాలనగా అడిగింది.
“ఏం ఆట పాపా అది.”
పాప మాట్లాడలేదు. చెప్తే దేవుడి శాపం. అమ్మ నాన్న చచ్చిపోవటం. కల్పనకి బాధగాఉంది. చాలాసేపు పాపకి స్వాంతననిస్తూ అడిగితే చెప్పింది.
ధైర్యం తెచ్చుకొని అమ్మ స్పర్శలో కరిగిపోయి కల్పన చెప్పిన కొత్తఆట విషయం అర్ధమైన అమ్మకి గుండె ఆగిపోయినంత పనయింది.
అలాగే కూతుర్ని గుండెలకు హత్తుకుని ఎంతసేపు ఏడ్చిందో అమ్మకు తెలియదు. అమ్మకు చెప్పేశాక కల్పనకు బరువు కొంత దిగింది. కానీ అంకుల్ చెప్పినట్లు అమ్మ నాన్న చచ్చిపోతారా..
కన్నీటి చారికలతో వడిలిపోయిన లేత మొక్కలా పడుకున్న కల్పనను చూస్తుంటే అమ్మ మనసు అగ్నిగుండం అవుతోంది. జాగ్రత్తగా కల్పనను పడుకోబెట్టి దుప్పటికప్పి లేతవేళ్ళు బిగించి పట్టుకున్న కొంగును మెల్లగా వదిలించుకుని లైట్ తీసి బయటికి వచ్చిన భార్యకేసి ప్రశ్నార్ధకంగా చూశాడు నాన్న.
అమ్మ నాన్న కల్పన జీవితంలో జరిగిన అన్యాయం గురించి కన్నీళ్లపర్యంతమయ్యారు.
మర్నాడు కల్పనను స్నేహితురాలయిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించి
విషయాన్ని నిర్ధారించుకున్న అమ్మ నడుంబిగించి కల్పన కోలుకునేదాకా వెంటే ఉండి చేయవలసినవి చేస్తున్నా పాప భవిష్యత్తు గురించి దిగులు పడుతూనే ఉన్నారు. కల్పన మెల్లగా సాధారణ స్థితికి వచ్చినట్లు అనిపిస్తున్నది.
పాత జ్ఞాపకాలను మళ్లించటానికి కల్పన తండ్రి దూరంగా బదిలీ చేయించుకున్నాడు.
*** ***
కాలప్రవాహంలో పదిహేను సంవత్సరాలు దొర్లిపోయాయి.
కల్పన ఇప్పుడు ఒక లాయర్. ఆ మనసులో చిన్నప్పటి గాయం తాలూకు మచ్చ ఉన్నట్లు అమ్మ నాన్నలకు కూడా తెలీదు. కూతురు పోక్సో చట్టం గురించిన కేసులు చేస్తుంటే వాళ్ళు కాదనలేకపోయారు.
తల్లిదండ్రుల మనసు తెలిసి వాళ్ళ అండతో ధైర్యంగా నిలబడిన ఇప్పుడు దూసిన కత్తిలా కనిపిస్తుంది. ఆ అమ్మాయిలోని పరిణతినే వాళ్ళు కోరుకున్నది.
ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి కల్పన తండ్రి వాకిట్లోకివచ్చి చూశాడు.
ఎనిమిదేళ్ళ పక్కింటి పాప ప్రీతి.
“ఎవరమ్మా” అడిగాడు
”నేనే! పక్కింట్లో ప్రీతిని” ఆరిందాలా చెప్తున్న అమ్మాయి అచ్చం చిన్నప్పటి కల్పనలా అనిపించింది.
“కొత్తగా వచ్చినట్లున్నారు” అనుకున్నాడు
క్రమంగా వివరాలు తెలిసాయి. ఆ ఇంట్లో చేరింది ఎవరోకాదు.. అంకుల్ రాజు కొడుకు కుటుంబం.
కల్పన తండ్రికి న్నకి కళ్ళు కళ్ళు ఎరుపెక్కాయి. ఆనాడు ఆశక్తుడు. కానీ ఇప్పుడు ఆ రాజు లేడు. అతడు చనిపోయినా పగ తీర్చుకోమన్నట్లు రాజు మనవరాలు ప్రీతిని చూస్తుంటే రోజు రోజుకూ ఆలోచనలు వెర్రి తలలు వేస్తున్నాయి. తమ కుటుంబం ఎంత బాధ పడింది. న్యాయ స్థానం లో శిక్ష వేయించలేక పోయారు. మరి .. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశం వదులుకోవాలా.. భార్యతో మాత్రం ఏమి తెలీనట్లు ప్రవర్తిస్తున్నాడు.
ప్రీతి అప్పుడప్పుడు కల్పన కోసం వస్తున్నద. ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు కల్పనని చూసినట్లే అనిపిస్తుంది. అలాగే మాట్లాడుతుంది. బాల్యం ఏ పిల్లల విషయంలోనైనా ఒక్కలాగే ఉంటుంది. దాన్ని దోచుకోవాలని చూడటం ఎంత దారుణం.
కల్పన తండ్రికి రాజు మనవరాలు ప్రీతిని చూస్తుంటే తెలియని కోపం కసిగా కూడా ఉంటున్నది.
“అంకుల్ అక్క ఉన్నదా..” వాకిట్లో ప్రీతి.
“లేదమ్మా.. ఆఫీస్ కి వెళ్ళింది”
“ఆంటీ ?” ప్రశ్నార్ధకం
“ఆంటీ బంధువుల ఇంటికి వెళ్ళింది. సాయంత్రానికి ఇద్దరూ వస్తారు.”
“లేరా.. నాకు సెలవు” అంటూ పాప వెనుదిరగబోతున్నది.
“నేనున్నాగా..మనం కొత్త ఆట ఆడుకుందామా”
అమాయక లేడి పులిబోనులోకి వచ్చేస్తోంది. వచ్చేసింది . .
ప్రీతిని మంచం మీద కూర్చోబెట్టి చెప్పాడు.
“ ఈ ఆట గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్తే మీ అమ్మ నాన్న చచ్చిపోతారు.”
కళ్ళు పెద్దవిచేసి చూసింది.
“రాజు తాతలానా?”
ప్రీతితో అలా మాట్లాడుతూనే బుజంమీద చేయివేసి ఫ్రాక్ తొలగించబోయాడు. ఆరోజు టీవి చూస్తూ పదే పదే చెంపలు, పెదవులు తుడుచుకుంటూ ఏహ్యపడిన చిన్నారి కల్పన కనిపిస్తోంది. ఏడుస్తూ వేదన పడిన తమ కుటుంబం.. దాని నుండి బయటపడతానికి చేసిన చేస్తున్న ప్రయత్నం ..
“అంకుల్ .. కొత్త ఆట అన్నారుగా.. ఏంటది..”అడుగుతోంది ప్రీతి.
“ఏం లేదమ్మా. మీ అమ్మ పిలుస్తున్నట్లుంది.. పద..” అంటూ ప్రీతి చేయి పట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళింటి తలుపు దగ్గర వదిలేసి వచ్చాడు.
ప్రీతిని వాళ్ళమ్మ లోపలికి పిలిచింది. ప్రీతి బై చెప్పి లోపలికి వెళ్తుంటే కల్పన తండ్రి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఎంత పొరబాటు.. ఎవరో అన్యాయం చేశారని అదే తప్పు నేను చేస్తే .. ఏమీ తెలియని ఆ పాప నా కూతురిలా జీవితకాలం..
అంతకుముందు కొన్ని నిముషాలు తనలో రేగిన తుఫాను ఉపశమించినట్లయింది.
కొత్త వెలుగు మొహం నిండా నింపుకుని లోపలికి నడుస్తున్నప్పుడు యుద్ధంలో గెలిచిన వీరునిలా అనిపిస్తున్నాడు కల్పన తండ్రి.