కాలాతీత మనషులు
కాలాతీత మనషులు (Author: జుజ్జూరి ఉమాదేవి)
కారు నక్కపల్లి దాటింది... ప్రయాణం బడలిక వల్ల బాగా నిద్రపోయాను. చిన్న కుదుపు కూడా లేకుండా కారు నడుపుతున్నాడు డ్రైవర్ జిలాని. అప్పుడు నేను క్రిమినల్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్నాను. ఇరవై ఏళ్ల క్రితం దొంగతనం కేసులో కోర్టులో ప్రవేశపెడితే ఆరు నెలలు జైలు శిక్షపడి విడుదలయ్యాక జిలానీని నా కారు డ్రైవర్ గా పెట్టుకున్నాను. ఇప్పుడు హైకోర్టు జడ్జిగా రిటైర్డ్ అయ్యాను. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఎవరైనా దొంగచేతికి తాళాలు ఇస్తారా అని. అతనికంటూ ఎవరూ లేరు. చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోవడంతో బాధ్యత లేకుండా పెరిగి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. నాకంటూ ఎవరు మిగలలేదు. ఈ డెబ్భై ఏళ్ల వృద్ధాప్యంలో నాకు తోడుగా అతన్ని దగ్గరకు చేరదీశాను, అప్పటినుండి నాతోనే నమ్మినబంటులా ఉన్నాడు. నలభై ఏళ్ల క్రితం ఈ రోడ్డుగుండా ప్రయాణించాను. చాలా మార్పులు జరిగాయి. రోడ్ల నిర్మాణంలో కొన్ని ఊర్ల రూపురేఖలు మారిపోయాయి. విశాలమైన రోడ్డు మీద అటూ ఇటూ వాహనాలు పరిగెడుతున్నాయి. చల్లని గాలి ముఖానికి తగిలింది. కారు అద్దం తీసిన వెంటనే, దూరంగా కొండమీద ఉపమాక వెంకన్న ఆలయం. రెండు చేతులెత్తి దండం పెట్టాను. చాలా మహత్తు గల ఎన్నో వందల ఏళ్ల నాటి దేవాలయం. అక్కడ ప్రతిఏటా సంబరాలు జరుపుతారు. ఐదు రోజులపాటు చుట్టుపక్కల డెబ్బై గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని అక్కడే వెంకన్న కొండ పక్క ఖాళీ ప్రాంతంలో నిద్రచేసి ఆఖరి రోజు బుద్ధరాజు వారి కోల (కాగడా) వెలిగిస్తే కానీ అక్కడి నుంచి ఎవరూ కదలరు. అలా వెలిగిన ఆ కాగడా రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది. ప్రజలంతా దానినే హారతిగా కళ్ళకు అద్దుకుంటారు. నాలుగు దశాబ్దాల కిందట పెళ్లి చూపులకు వచ్చిన రహదారి ఇప్పటికీ నాకు గురుతే. అప్పుడు అమ్మానాన్న, మామయ్య ఉన్నారు. ఇప్పుడు ఎవరూ లేరు. పెళ్లికూతురు పేరు శ్యామల అందమైన రూపంతో ఆరడుగుల పొడవు. సన్నజాజి తీగలా సన్నని నడుము. పెద్ద కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, సిరి జుట్టు, చిలిపి కళ్ళతో చలాకీగా ఉంది. మాకందరికీ నచ్చింది. మెజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా అప్పుడే జాయిన్ అయ్యాను. నన్ను ఆమె కుటుంబం అంతా చాలా గౌరవించారు. పెద్దగుమ్మలూరు.... దాట్ల వెంకటపతిరాజు గారి ఏకైక కుమార్తె శ్యామలాదేవి. మూడు వందలా ఎకరాలకు వారసురాలు. బి. ఏ చదువుకుంది. మా భావోజి (నాన్న) విజయనగరంలో ఆస్తులున్నా హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇంగ్లాండ్లో బారిష్టర్ లా పూర్తయిన తర్వాత ఇండియా వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. కోర్టు రాత పరీక్షలో ఉతీర్ణత పొందే వరకు భావోజీ పెళ్లి చేయనన్నారు. మాది ఉత్తరాంధ్ర అయినా మా ప్రాంతపు రాజ కుటుంబీకులతో మాకు సంబంధ బాంధవ్యాలున్నాయి. అప్పుడప్పుడు తాతయ్య పూసపాటి గణపతిరాజు గారు ఇక్కడ శుభకార్యాలకు హాజరయ్యేవారు. పెళ్లిచూపులంటూ పెద్ద విందును ఏర్పాటు చేశారు. పెద్ద గుబురు మీసాలతో ఏడు అడుగుల పొడగరి పెదవెంకటపతి రాజు.... చూడగానే భయం గొలిపే రూపం. మెడలో పులిగోరు, పది వేళ్లకు రత్నాలు పొదిగిన ఉంగరాలు. ముంజేతికి బంగారు కడియం. పౌరుషానికి, పట్టుదలకు పెద్దపీఠంటారు. ఇరువురు పెద్దలు అటూ ఇటూ కూర్చున్నారు. అన్ని విషయాలు ఆస్తిపాస్తులు, గుణగణాలు మాట్లాడుకున్నారు.
అది ఓ పెద్ద భవంతి... సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఊరికి దూరంగా కట్టిన భవంతి. దానికి ఎదురుగానే ఆయన పొలం భవంతి కిటికీలో నుండి చూస్తే, ఆయన మూడువందల ఎకరాలా పచ్చదనం కనిపించాలని అక్కడ భవంతి కట్టుకున్నారట. ఆ భవంతి లోపల ఎన్నో గదులు ఉన్నాయి. మట్టితో నిర్మించిన భవంతి లోపలి నేలంతా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టడం వల్ల ఎంతో అందంగా ఉంది. మా దూరపు బంధువు ఫణీంద్రవర్మ మాతోపాటు వచ్చాడు. అటూ ఇటూ నలుగురు బంధువులు మాత్రమే ఉండమని ఆంక్ష పెట్టి మిగతా వారిని బయటకు వెళ్ళిపోమన్నాడు. ఎందుకు బయటకు వెళ్ళమంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఆసీనులైన వారంతా ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. రాజుల కుటుంబాలలో ఆడవారు బయటకు రాకూడదు, కనిపించకూడదు. అప్పటికట్టుబాట్లు అవి. పెళ్లికూతురుని పెళ్లి రోజు మేనమామలు బుట్టలో కూర్చుండబెట్టి మేలి ముసుగు కప్పి తీసుకువచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెట్టి, జీలకర్ర బెల్లం తలపై పెట్టే వరకు పెళ్లికూతురును చూడకూడదు. ఫణీంద్రవర్మ అలా కుదరదు అన్నాడు. శ్యామల తండ్రి గారైన పెదవెంకటపతి రాజు గారితో, ఆయన ఒప్పుకోవడానికి సమయం పట్టినా చివరికి సుముఖత చూపించాడు. శ్యామలను చూపించడానికి సరే అన్నాడు. అయితే ఫణీంద్రవర్మ మరో నిబంధన పెట్టాడు. మీ అమ్మాయి శ్యామలాదేవి బయట వరండాలో కాళ్లు కడుక్కొని ఈ భవంతి నాలుగు దిక్కులా మేము చూస్తుండగా తలవంచి నడిచి లోపలికి వెళ్ళిపోవాలి.
ఏమిటి ఈ పెద్దాయన చాదస్తం అని నాకు లోపల చాలా కోపంగా ఉంది. మా భావోజీ వైపు చూశాను. ఏమిటన్నట్లుగా ఆయన చిన్నగా తలాడించి కళ్ళతో నన్ను మాట్లాడవద్దన్నారు. అన్నింటికీ వారు మౌనంగా తలుపారు. సరేనన్నారు.... చివరికి శ్యామల మౌనంగా బయటకు వచ్చింది. నిశీధి ఆకాశంలో నక్షత్రంలా మెరిసింది. కళ్ళు తిప్పుకోలేకపోయాము. ఆకాశం నుండి నేలపై నెలవంక జారిపడిందా అన్నట్లుగా వుంది. బయట వరండాలో బావి దగ్గరకు వెళ్లి చేదతో నీళ్లు తోడి కాళ్లు కడుక్కొని లోపలికి అడుగు పెట్టింది శ్యామల. నలువైపులా నడుస్తూ చల్లగాలికి పురివిప్పి నాట్యం చేసే నెమలిలా తన గదిలోకి వెళ్లిపోయింది. మేమంతా ఆమె మోము వైపు చూస్తూనే ఉన్నాము. ఆమె అందాన్ని చూసి తన్మయం చెంది ఒక భ్రాంతికి లోనైన మత్తులో ఉన్నాము. నేను ఫణీంద్రవర్మ ముఖం వైపు చూశాను. ఆయన మాత్రం ఆమె నడిచిన నేలపై పడిన పాదముద్రలను పరిశీలిస్తున్నాడు. మాకేం అర్థంకావడం లేదు. ఆయనేం చెబుతారోనని, అప్పుడు పెదవెంకటపతిరాజుగారు నోరు తెరిచాడు. మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే మేము మిగతా విషయాలు తమకు తెలియజేస్తాం". నోటమాట రాని వెంకటపతి రాజు తన చేయిని వీధి గుమ్మం వైపు చూపించి... పని వాళ్లను ఇద్దరిని పిలిచి వీరిని ఊరి చివర వరకు సాగనంపి రండి అంటూ కన్నీటితో వెనుతిరిగాడు. భావోజీ కూడా ఏమీ మాట్లాడలేదు. విదేశాల్లో చదువుకున్న నాకు ఇది ఏమీ అర్థం కాలేదు. ఇంటికి వచ్చి చాలాకాలం బాధపడ్డాను. ఆమె మనసును ఎంతగా గాయపర్చానో అని నాకు నేనుగా శిక్ష వేసుకున్నాను. జీవితంలో పెళ్లి చూపుల పేరుతో ఏ స్త్రీ హృదయాన్నీ గాయపరచకూడదు. ఇకపై నేను పెళ్లి చేసుకొను అని గట్టిగా మా భావోజీకి చెప్పాను. అసలు కారణం ఏమిటి ఆ పెళ్లి జరగకపోవడానికి ఫణీంద్రవర్మను చాలా కాలం అడిగాను. ఆయన చివరి దశలో గుండె పగిలే నిజం చెప్పాడు."ఆమె కాలి వేళ్ళు సరిగాలేవు. అవి నేలను తాకలేదు. అలా నేలను తాకని వేళ్ళు గల స్త్రీని వివాహం చేసుకుంటే భర్త మరణిస్తాడు. ఆ స్త్రీ వైధవ్యప్రాప్తి పొందుతుంది. అందువల్ల ఆ వివాహం ఆనాడు రద్దుచేశాను" అని చెప్పి కాలంచేశారు. అప్పటికి నాకు ఏభై ఏళ్లు దాటిపోయాయి. కాలంతోపాటు జీవితం అందరికీ ఐశ్వర్యాన్ని ఇస్తుందేమో, కానీ ఆనందాన్ని మాత్రం ఇవ్వదు. గాజుపాత్రలో నీళ్లు బయటికి కనిపిస్తాయి. గుండెల్లో కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. ఆ రోజుల్లో జరిగిన ఒక చిన్న కారణానికి జీవితం నన్ను పరిగెత్తించింది. ఇప్పటికీ నా పరుగు ఆగలేదు. అన్నీ సంపాదించాను. నాతోపాటు ఉన్న వాళ్ళను మాత్రం కోల్పోయాను. ఏమిటీ విచిత్రం... ఆస్తి ఉన్నప్పుడు మరి అయిన వాళ్లు కూడా మనతోపాటు ఉండాలి కదా.... మరి ఉండరే... మనతోపాటు రారే... ఈ రెండూ మనతో పాటు వస్తే మనిషి మరణాన్ని మరిచిపోతాడేమో... కారు నెమ్మదిగా పోతుంది. అడ్డ రోడ్డు నుండి పక్కకు తిప్పాడు జిలానీ కారుని. ఊరు దగ్గర పడుతోంది... కొద్ది నిమిషాల్లో చేరుకోవచ్చు. ఆమె ఊరు దగ్గర అవుతున్న కొద్దీ నా గుండె బరువు పెరుగుతుంది. కారులో ఎదురుగా ఉన్న అద్దంలో నా ముఖాన్ని తడిమి చూసుకున్నాను. బాధగా ఉంది కారులో నలభై ఏళ్ల నా తప్పుకి కుచించుకుపోయి.... ముడతలు పడి క్షమించమని అడిగేలా ఉంది. ఆ ఊరు ఇప్పుడు అలా లేదు. పాతకాలం మండువా ఇళ్ల స్థానంలో పెద్దపెద్ద భవనాలు లేచాయి... చుట్టూ పొలాలు... పచ్చని ప్రకృతి... కారు ఆపి ఓ పెద్దాయన్ని అడిగాను వెంకటపతిరాజు గారి ఇల్లెక్కడా అని... దూరంగా పొలాల్లో సన్నని రోడ్డు వైపు చూపించాడు. కారు సన్నటి రోడ్డులోకి మళ్లింది. కళ్ళు మూసుకున్నాను కొన్ని క్షణాలు....
ఆ ఇంటి ముందు కారు ఆగింది.
కిందకు దిగి తలుపు తట్టిన వెంటనే తలుపు తెరుచుకుంది. వూదారంగు వెలుతురులో పొడవాటి కురులతో బంగారు మేనిఛాయతో మెరిసిపోతుందామె.
రెండు చేతులెత్తి నమస్కరించాను...
"ఎవరు కావాలి అంది గుమ్మం ఆవల తలుపుచాటుగా నిలబడి...
పెదవెంకటపతిరాజుగారు.
""ఆయన లేరు కాలం చేసి చాలా కాలమయింది".
"వారి అమ్మాయి శ్యామలాదేవి గారు ఉన్నారా...."
"లోపల ఉన్నారు మీరు ఎవరో వివరాలు చెబితే వారికి తెలియజేస్తాను".
ప్రేమో.... దుఃఖమో.... శరీరం లోపల దహించుకుపోతూ... కన్నీరు బొట్లుబొట్లుగా రాలుతోంది. ఆమె కంగారుపడి. అయ్యో అంటూ లోపలికి వెళ్లి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అన్యమనస్కంగా అక్కడ వున్న పాతకాలం నాటి చెక్క కుర్చీలో కూలబడ్డాను. ఆమె మరో తలుపు చాటుకు వెళ్లి నిలబడింది. ఇంతలో కాఫీ తెచ్చి ఇచ్చింది ఓ అమ్మాయి.... కాఫీ కడుపులో పడిన తర్వాత కాస్తంత స్థిమితపడ్డాను. ఆమె మౌనంగా తలుపువారగా నిలబడి నన్ను చెప్పమన్నట్లుగా చూస్తుంది. నేను ఇదే ఇంటికి ఓ నలభై ఏళ్ల క్రితం పెళ్లిచూపులకొచ్చాను. నా పేరు ఆదిత్య వర్ధన్ వర్మ.... శ్యామలాదేవి గారిని పెళ్లిచూపులు చూడడానికి.... పెళ్లి సంబంధం ఎందుకు చెడిపోయిందో నిజం తెలియడానికి ముఫ్పై ఏళ్లు పట్టింది. ఆనాటి ఆ కారణం తెలిసిన పెద్దాయన ఇప్పుడు లేరు. ఛాందసమో.... చాదస్తమో.... నాకు తెలియదు. కానీ నా జీవితంలో అన్నీ కోల్పోయాను. ఆ రోజుల్లో జరిగిన ఒక చిన్న తప్పిదానికి శ్యామలాదేవి గారి కుటుంబం ఎంతగా బాధపడిందో ఇప్పటికీ క్షమించమనే అర్హత నాకు లేదు. అయినా ధైర్యం చేసి ఇన్నేళ్లకు ఆమెను చూసి రెండు చేతులు జోడించి మనసారా క్షమించమని వేడుకుంటే నా గుండె బరువు తగ్గి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను. మా వాళ్ళు చేసిన ఆ తప్పుకు నేను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉన్నాను. ఎన్నో దుర్భిక్ష వసంతాలను చూశాను. ఆనాడు ఇక్కడకు నవ్వుతూ వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మా కాళ్లు నరుక్కున్నట్లయింది. మేము ఇంటికి వెళ్లిన తర్వాత మా భావోజీ నన్ను పెళ్లి చేసుకోమని చాలా వత్తిడి తెచ్చారు. ఇకపై పెళ్లి మాటెత్తకండి భావోజీ...."అనేసరికి చాలాకాలం మంచం పట్టి కాలం చేశారు. ఆమె వైపు చూడకుండా కంటి చెమ్మతో ముఖం కిందికి దించుకున్నాను. నిలువెత్తు గుమ్మం పక్కన నిలుచున్న ఆమె కన్నీటిబొట్లు గడప మీద ఒక్కొక్కటిగా రాలిపడుతున్నాయి.... జరిగినదంతా విన్న తర్వాత ఆమె నోట మాట రాలేదు. లోపలికి వెళ్లి శ్యామలగారిని తీసుకుని వస్తాను అన్న ఈమె అక్కడే నిలబడిపోయింది. కదలడం లేదేమిటన్నట్లుగా చూశాను. ఇంకా గడప మీద కన్నీళ్లు రాలుతూనే ఉన్నాయి చూరు కింద వర్షపునీరులా...
"ఎందుకలా బాధపడుతున్నారు మీరు.... నా గత జీవితపు విషాదాన్ని వినా... ఇది ఎవరి జీవితంలో జరగదని ఆశ్చర్యంగా ఉందా మీకు...."
"ఆ కన్నీటి తడిపై నా పేరు మీకు కనిపించడంలేదా.... శ్యామలాదేవిని నేనే.... ఇన్నాళ్లూ గుండెల్లో మరుగుతున్న కన్నీళ్లు ఇప్పుడు చిట్లిపోయి రాలిపడుతున్నాయి.
"ఏమన్నారు ఆదిత్య వర్ధన్ మీరు.... నలభై ఏళ్లుగా ఈ బాధను నా గుండెలో మోస్తూనే ఉన్నాను అనే కదా..... అదే నలభై ఏళ్లుగా మీరు వెళ్లిన తర్వాత మళ్లీ వస్తారని ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నాను ఏ ఊహను నా మదిలోకి రానీయకుండా, మళ్లీ ఏ మగాడ్ని పెళ్లిచూపుల నిమిత్తం చూడకూడదని ఆనాడే నిర్ణయించుకుని. ఇలా జీవచ్ఛవంలా ఇంకా బ్రతుకుతూనే ఉన్నాను".
మీరు నాకంటే కఠోర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలా జరుగుతుందని ఆనాడు ఊహించలేదు. అప్పటి కట్టుబాట్లు వల్ల మా పెద్దలను ఎదిరించలేకపోయాను. నన్ను క్షమించండి" అన్నాను గుండె భారంతో.....
మీ క్షమాపణ ఖరీదు గడిచిన నలబై ఏళ్ల జీవితాన్ని వెనక్కి తీసుకురాలేదుగా..... మీరేం చేస్తారు. అప్పటి తరం అది కట్టుబాట్లకు తలవొగ్గి మౌనంగా మోడుల్లా ఇద్దరం మిగిలిపోయాము. జరిగిన కారణం ఏదైనా ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం అంత సంస్కారం కాదు. వయస్సును బట్టి మన స్థానం మారుతుంటుంది. మన ఇరువురి కుటుంబాల వల్ల ఇరువురి జీవిత వైభవం అంతరించిపోయింది. గడిచిన జీవితం వెనక్కి రాదు. రాలిన పూవు వాడిపోతుంది. ఇన్నేళ్లూ వయసు పెరిగిందని మనసుకి తెలియలేదు.... ఇదిగో మీరు వచ్చిన తర్వాత తెలిసింది. జీవితంలో నాలుగు వసంతాలు మిమ్మల్ని ప్రేమించడంలోనే గడిచిపోయింది. మిగతా సమయం వెండి వెంట్రుకలు లెక్కించడానికి మిగిలిపోయింది. ఏమో.... ఇప్పుడు మీరు నేనూ శూన్యమే. రెండు శూన్యాలు కలిస్తే మళ్ళీ సమాంతర రేఖలో ప్రయాణిస్తాయా.... మీరు ఇక్కడ గడిపిన క్షణాలను ఏరుకుంటూ అస్తిత్వం అంటే మరిచిపోయాను. ఇంతకాలం ఈ చీకటి రాత్రులను వెలివేసి మనసులో అన్ని ఆలోచనలను నిలిపివేసి మిమ్మల్ని మాత్రమే కళ్ళ కింద నింపుకొని ఇప్పటిదాకా జీవించాను. మీరు మళ్ళీ వస్తే ఆ క్షణమే మరణించి, మీ దగ్గర ప్రాణం పోసుకోవాలని ఉండేది. ఆగిపోయిన జీవితంలో మళ్ళీ ఆనందంగా జీవించాలని ఉండేది. నా జీవితంలో మళ్లీ ఇవన్నీ జరుగుతాయా.... ఈ ప్రపంచం నుండి నిష్క్రమించాలని ఆలోచించేదాన్ని. బయటకు వెళ్లిన ప్రతిసారి మీరు మళ్లిన మలుపు నన్ను భయపెడుతూనే ఉంటుంది ఇప్పటికీ...."
జ్ఞాపకం ముల్లులాంటిది. అది మనసులో మెదిలినప్పుడల్లా గుచ్చుకుంటుంది.
ఇకనైనా మన జీవితం ఫలవంతం కాదా.... అన్నాను గద్గద స్వరంతో.
ఫలం పండకుండా రాలిపోయిన తర్వాత దానికి జీవితం ఉండదు.... మట్టిలో కలిసిపోవడం తప్ప" అంది.
"వర్ణం కోల్పోయిన చిత్రపటానికి మళ్లీ రంగులేసినా అది పూర్వపు అందానికి నోచుకోదు... అంటూ నిట్టూర్చింది.
"అందానికి నోచుకోకపోయినా అనుభూతులు ఉంటాయిగా...."అన్నాను.
అవును... కొన్ని అనుభూతులు మరణించవు. ఇన్నేళ్లూ దిగులు గూడు కింద తలదాచుకొని కనురెప్పలను తెరిచే ఉంచాను. గడ్డిపువ్వు గాలితో జతకడుతుంది. నేను శిథిలమైన ఈ భవంతి గోడలతో ఒంటరిగా ఊసులాడాను. నా కన్నీటి బరువును ఇన్నాళ్లు నా కనురెప్పలు మోసాయి. నా తలుపులూ మూయలేదు. ఈ వీధి గుమ్మం తలుపులూ మూయలేదు. అలికిడి లేని ఈ భవంతిలో ప్రాణం ఉన్న బొమ్మలు ఎప్పుడో ఎగిరిపోయాయి. చావు భయాన్ని దూరంగా తరుముతూ ఒంటరిగా నేనే మిగిలిపోయాను. నాకంటూ ఇప్పుడు కోరికల మంటలు లేవు. నిన్న కాలిన ఆనవాళ్లు తప్ప...."అంటూ భారంగా తలదించుకుంది.
"మరి నేను వెళ్ళొస్తాను. నా జీవితంలో అత్యంత విలువైనది మీ హృదయంలో ఇన్నేళ్లూ స్థానం సంపాదించడం" అంటూ సన్నటి కన్నీటి తెరతో వెనుతిరిగాను.
మనసులో మబ్బుతెరలు తొలగి గుండె బరువుని దించుకొని చేయి కలపకుండా వెళ్లిపోతున్న నా జీవిత మిత్రుని చివరి చూపు ఇదే అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరే చలనం లేకుండా అలా కూలబడిపోయింది.
-----------------------------
కారులో వెనక్కి జారిపడి కంటి చెమ్మ తుడుచుకుంటున్న ఆయన దుఃఖాన్ని చూసిన డ్రైవర్ జిలానీ మనసు కలిచివేసింది.
"అయ్యగారూ.... మిమ్మల్ని చాలాకాలంగా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను ఒక దొంగను. నా శిక్షకాలం పూర్తయిన వెంటనే మీరు డ్రైవర్ గా నన్ను ఎందుకు పెట్టుకున్నారు...." అన్నాడు.
ఇన్నేళ్లుగా అడగని జిలానీ ప్రశ్నకు తను బాధతో ఉన్నా నవ్వురాని కన్నీటి మధ్య జవాబివ్వాలనుకున్నాడు.
"చూడు జిలానీ.... నువ్వు దొంగవో కాదో నాకు తెలియదు. కోర్టుకు కావలసినవి సాక్ష్యాలు. సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని జడ్జి స్థానంలో కూర్చున్న నేను శిక్ష వేయక తప్పలేదు. అది తప్పని తెలిసినా సాక్ష్యాన్ని బట్టి ఒక్కోసారి తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. నీలో పరివర్తన కలిగి ఉంటుందని విశ్వసించి, విడుదలయ్యాక పనిలో పెట్టుకున్నాను".
కొంతమంది దురదృష్టవంతులు చేయని తప్పులకు కూడా శిక్షింపబడతారు.
కారు ముందుకు సాగిపోతుంది...