ఇక్కడ సలహాలు ఉచితం  (Author: చిరువోలు పార్థసారథి)

‘‘ఉసకే.. ’’

         ఆ పేరు మొదటిసారి వినబడినప్పుడు ఆశ్చర్యంగా అనిపించి నేను పెద్దగా పట్టించుకోలేదు. సిటీలో చాలా చోట్ల పోస్టర్లు, అక్కడక్కడ కొన్ని హోర్డింగులు చూశాను. సిటీ కేబుల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ దాని గురించి ప్రకటనలు కూడా వచ్చాయి.

         ‘ఉసకే’ అన్న పదమే చిత్రంగా అనిపించింది. ‘‘కొంపతీసి అదేమయినా ఫ్రెంచి పదమా? ’’ అర్థం కాలేదు.

         ‘‘మీకు కుటుంబ సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఇంకా ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులున్నా మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యలను క్షణాల్లో పరిష్కరిస్తాం. మా సేవలు ఉచితం’’ అని ప్రకటనలో ఉంది.

         అసలు వీళ్లు ఇక్కడ చేస్తున్నదేమిటో? ఈ మధ్య ప్రజల అమాయకత్వంతో ఆడుకునే నకిలీగాళ్లు చాలామంది తయారయ్యారు. మనుషుల్లో సమస్యలు లేనివాళ్లు ఎవరు? పిల్లలు పెళ్లి కాకపోవటం, ఉద్యోగం రాకపోవటం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, డబ్బు నిలవకపోవటం, అవసరాలకు తగినంత సరిపోకపోవటం, ఏ పని చేసినా కలిసి రాకపోవటం, ఆస్తులు సమకూర్చుకోలేకపోవటం.. ఇలా ప్రతి కుటుంబంలోనూ, ప్రతివ్యక్తికీ చిన్నదో పెద్దదో ఏదో సమస్య ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకునే వాళ్లు ఎక్కువయిపోయారు.

         మీ జాతకంలో దోషం ఉంది అని ముందుగా భయపెట్టే వాళ్లు కొంత మంది. ఫలానా పరిహారం చేయాలి సూచిస్తారు. అది హోమమో, భారీ ఎత్తున దానమో అయ్యుంటుంది. ఇందులో ప్రజల బలహీనతపైన ఆడుకునేవాళ్లే ఎక్కువమంది. పరిపూర్ణమైన జ్గానంతో చెప్పేవాళ్లు లేరని కాదు. ఎక్కువమంది మోసగాళ్లే రాజ్యమేలుతున్నారు. ఈ మధ్య యూట్యూబ్ లు, సోషల్ మీడియా వచ్చాక మరీ. ఏది నిజమో, అబద్ధమో అర్థం కావటం లేదు. ఎవరు మాయగాడో, ఎవరు మోనగాడో తెలియటం లేదు. మొబైల్ పట్టుకుంటే చాలు కళ్లముందు రకరకాల వ్యక్తులు ప్రత్యక్షం అవుతున్నారు. అనేక మాటలతో మాయచేస్తున్నారు.

         ఇక్కడ ఒక నకిలీగాడు తగిలితే... టీవీకి ఒక బ్లాస్టింగ్ స్టోరీ చేసి నా కెరీర్ గ్రాఫ్ ను పెంచుకోవచ్చు’’ రిపోర్టర్ గా మనసులో లెక్కలకు వేసుకుంటూ అక్కడకు బయలుదేరాను.

         నగరంలో బాగా రద్దీగా ఉండే ఏరియాలో ఒక అపార్టుమెంట్ కాంప్లెక్సులో తొమ్మిదో అంతస్థులో ఆ కార్యాలయం ఉంది. లిఫ్ట్ లో పైకెళ్లగానే ఎడమవైపున మెరుస్తున్న అక్షరాలతో కనిపించింది.

         రిసెప్షన్ డెస్కులో ఇరవైఏళ్ల యువతి స్వాగతం పలికింది. వయసు తెచ్చిన మెరుపుతో ఆకర్షణీయంగా ఉంది. ‘నేను మీకు ఎలా సాయపడగలను? ’అనడిగింది. నేను సమాధానం చెప్పేలోపే ఓ బరువైన దరఖాస్తును నా చేతిలో పెట్టింది. ఆరేడు పేజీలు ఉన్నాయి. దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తీసి టేబుల్ పక్కన పెట్టాను.

         నేను వచ్చిన పని ఆమెకి అర్థమయి అర్థం కాకుండా చెప్పాను.

         ‘‘ఎండీ గారి కోసం వచ్చారా? ఆయన బిజీగా ఉన్నారు. సోమ, మంగళవారం ఇక్కడ బాగా రద్దీగా ఉంటుంది. బుధవారం రండి’’ అంది. ఇలాంటి చోట్ల దూకుడుగా మాట్లాడినా, బెదిరించినా వ్యవహారం చెడిపోతుంది. ఆ విషయం అనుభవపూర్వకంగా తెలిసిన వాడిని కాబట్టి నేను తొందరపడలేదు. పక్కనే దరఖాస్తులు నింపటంలో సతమతమవుతున్న యువతీయువకుల్ని చూస్తూ ఆ పక్కగా నిలబడ్డాను. మరి కాసేపటికి తనే నన్ను పిలిచి మనిషినిచ్చి లోపలకు పంపింది.

         హాలు అధునాతనంగా అలంకరణతో ఉంది. గోడలమీద జీవితంపైన ఆశావాహదృక్పథాన్ని పెంచే రకరకాల సూక్తులు కనిపించాయి. సెంట్రలైజ్డ్ ఏసీ.. ఒంటికి చల్లగా తాకుతోంది.

         ఓ పెద్ద బల్ల.. దాని వెనక కుర్చీ.. పెద్ద సింహాసనంలా ఉంది. దానిలో సూట్ వేసుకున్న వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడగానే గుర్తుపట్టాను.

         ‘డీకే’

         ‘‘నువ్వా? ’’ అన్నాను ఆశ్చర్యానికి లోనవుతూ.

         నా ప్రశ్నకు సమాధానంగా సన్నగా నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం ఏమిటో తెలుసుకోలేకపోయాను.

         ‘‘ఏమిటీ కొత్త అవతారం? ’’

         మళ్లీ ప్రశ్నించాను. దానికీ అతని సమాధానం నవ్వే.

         ‘‘నేను జర్నలిస్ట్ ని అన్న విషయం అతనికి తెలుసు. ఏ మాత్రం కంగారుపడకుండా అతను నింపాదిగా ఎలా ఉండగలుగుతున్నాడు? తనేదో అధికుడిని, ప్రత్యేకమైన వ్యక్తిని అన్న భావన అతని ప్రవర్తనలో వ్యక్తం అవుతోంది.

         డీకే, నేను పదోతరగతి వరకూ పల్లెలో కలిసి చదువుకున్నాం. స్కూలు చదువు అయిపోయినా వాడు అక్కడే ఉండిపోయాడు. నేను కాలేజీ చదువులకోసం పట్నం వచ్చాను. చాలా కాలం నిరుద్యోగ జీవితం అనుభవించాక ఓ పత్రికలో చిన్న రిపోర్టర్ గా చేరాను. తర్వాత కొద్ది రోజుల్లోనే రిపోర్టర్ గా ఎదిగాను. పత్రిక కూడా తన స్థాయిని పెంచుకుంది. డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది, నాకు అవకాశాలు మెరుగయ్యాయి.

         ఏడెనిమిదేళ్ల తర్వాత అనుకుంటా. హఠాత్తుగా వాడు ఓ ప్రయివేటు రాజకీయ కార్యక్రమంలో తారసపడ్డాడు. ఓ రాజకీయ నాయకుని వెనకాల తిరుగుతూ. నేను అంతగా పట్టించుకోలేదు. చూస్తుండగానే వాడి స్థాయి పెరిగిపోయింది.

         డీకేకి పెద్దగా చదువు అబ్బలేదు. మంచి మాటకారి. ఎవరినైనా తేలిగ్గా బుట్టలో వేసేయగలడు. తిమ్మిని బమ్మిని చేయగలడు. ఆ ప్రావీణ్యంతోనే రకరకాల రాజకీయ పార్టీల్లో తిరిగేవాడు. అతనికేం పదవి ఉండేది కాదు గానీ, ప్రతి పార్టీ అతన్ని పిలిచి ఏవో పనులు అప్పగించేది. ధర్నాల కోసమో, దొమ్మీల కోసమో మనుషుల్ని కూడగట్టం లాంటి పనులేవో చేసేవాడనిపించేది. సభలు, సమావేశాల్లోనూ అతని ఉనికి కనిపించేది. ఎవరి తరఫున అక్కడ ఉన్నాడు అనేది ఎవరికీ తెలిసేది కాదు. వేదిక పక్కనే నిలబడి కుర్చీలు సర్దుతూ, మెమెంటోలు, దండలు అందిస్తూ సందడిగా గడిపేవాడు. దినపత్రికల్లో రాజకీయనాయకుల మధ్య తరచూ అతని ఫొటో కనిపించేది.

         చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను. ఖరీదైన సూట్లో మెళ్లో గొలుసులు, రెండు చేతులకు ఉంగరాలతో ధగధగా మెరిసిపోతున్నాడు.

         నేను నా సహజమైన ధోరణితో వ్యవహరించి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించాను. ఇందుకు నా పాత స్నేహాన్ని బయటకు తీశాను.

         ‘‘డీకే.. ఏదో కొత్త సంస్థ పెట్టారని తెలిసి అదేమిటో తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ మీరు చేస్తున్నదేమిటి? ’’ అనడిగాను మాటల్లో ఏ మాత్రం కరుకుతనం లేకుండా.

         ‘‘ప్రజల సమస్యలకు మేం పరిష్కారాలను అందిస్తాం. ఉసకే.. అంటే ఇంకేమీ కాదు. ఉచిత సలహా కేంద్రం? ’’ అన్నాడు మళ్లీ తేలిగ్గా నవ్వుతూ.

         ఆ మాటలు హాస్యాస్పదంగా అనిపించాయి. ఏ మాత్రం ప్రయోజనం లేకుండా కేవలం ఉచిత సలహాలు ఇవ్వటం కోసమే ఇంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునికమైన హంగులతో కార్యాలయం ఏర్పాటు చేసి నడుపుతున్నారంటే నమ్మబుద్ధి కావటం లేదు. మనసులో అనుమానం తోలిచేస్తోంది.

         ‘కౌన్సిలింగ్ సెంటరేనా? ’’

         ‘‘కాదు’’.

         ‘‘రియల్ ఎస్టేట్ బ్రోకరేజా? ’’ చాలా మంది ఈ ముసుగులో బెట్టింగులు, సెటిల్ మెంట్లు, ఇంకా ఇంకా రకరకాల దందాలు చేయటం గురించి నాకు తెలుసు.

         అతను మాట్లాడలేదు. ‘‘జస్ట్ ప్రొఫెషనల్ క్యూరియాసిటీతో అడుగుతున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పు’’.

         నీకేం హాని చేయను అని పరోక్షంగా హింట్ ఇచ్చాక గానీ వాడు బయటపడలేదు.

         ‘‘ఇక్కడికొచ్చే వాళ్ల నుంచి వ్యక్తిగత వివరాలతో పాటు, ఆధార్, పాన్, బ్యాంకుల వివరాలు. స్థిర, చరాస్థులకు సంబంధించిన మొత్తం సమాచారం తీసుకుంటాం. దాని ద్వారా మా అవసరాలకి వాళ్లను వాడుకుంటాం’’ అన్నాడు.

         నాకేం అర్థం కాలేదు. ‘‘ కాస్త వివరంగా చెప్పి నా ఇబ్బంది తప్పించరా బాబూ’’ అని బతిమాలుకున్నా.

          ‘‘ఉద్యోగం ఆశించి ఇక్కడకు వ్యక్తి వస్తే, ముందు అతని ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకుంటాం. లంచం ఇవ్వగలడా లేదా అనేది చూస్తాం. ఆర్థికంగా అంత బలంగా లేని వ్యక్తులయితే రాజకీయ పార్టీల సభలకు వాడుకుని, రోజుకు ఇంత అని ముట్టచెబుతాం. అదనంగా మనుషుల్ని తెస్తే కమిషన్ ఇస్తాం. డబ్బున్న వాళ్లకయితే కొత్త ఆస్తులను రుచి చూపించి, దాని వెనక వాళ్లు పరిగెట్టేలా చేసి మేం సొమ్ము చేసుకుంటాం. రిటైరయిన వ్యక్తుల సేవలను కూడా మేం వాడుకుంటాం. వాళ్లకు పదో, పరకో ఇచ్చి మా రియల్ ఎస్టేట్ బిజినెస్ కు టెలికాలర్లుగా ఉపయోగించుకుంటాం’’

         వాడు చెప్పుకుపోతున్నాడు.

         నేను లోపలకు రావాలన్న ఆత్రంలో వాళ్లిచ్చే దరఖాస్తులో ఏం వివరాలు అడుగుతున్నారో గమనించలేదు. ఈ నిర్లక్ష్యానికి నన్ను నేను తిట్టుకున్నాను.

         ‘‘కుటుంబ సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడి, ఇలా ఏ సమస్యకైనా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. పక్క ఇంటివాడితో ఇబ్బంది, ఈవ్ టీజింగ్ సమస్య, స్థలం కబ్జా వంటి వాటి విషయంలో బయటకు తెలియదు గానీ తెరవెనక మా మనుషులే అన్నీ చక్కబెట్టేస్తారు. అఫ్ కోర్స్ మేము పైకి చెప్పినట్టు అవేవీ ఉచితం కాదనుకో’’.

         ‘మరి ఉచితం అని ప్రచారం చేస్తున్నారుగా’’.

         ‘‘అవును. మొట్టమొదట అంతా ఉచితమే. ఓసారి మా దగ్గరకొచ్చిన వాళ్లని అంత తేలిగ్గా వదలం. మళ్లీ మళ్లీ ఫోన్లు చేసి వాళ్లను మా ఉచ్చులోకి లాక్కుంటాం’’.

         నేను శ్రద్ధగా వింటున్నాను.

         ‘‘నేను నిరుద్యోగిని. ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చాను అన్నాడనుకో. వాడిని ఓ రాజకీయ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి, అది ధర్నా కావచ్చు. బహిరంగ సభ కావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు. వాడిని పిలుస్తాం. టీలు, టిఫిన్లు, భోజనాలు, వీలయితే మందు. దానితో పాటు నాలుగయిదు వందలు చేతిలో పెడతాం. పిలిచి ఇవన్నీ చేసేవాళ్లు ఎవరు ఉంటారు. అందుకు వాడు మాకు విధేయుడిగా ఉంటాడు. మాకు ఏ పని కావాలన్నా చేసి పెడతాడు. ఆ మధ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ లో పెద్ద ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష నాయకుడు ఐదారువందల మంది కావాలని అడిగాడు. క్షణాల్లో సిద్ధం చేశాం. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ మనుషుల్ని పంపే పూచీ మీది అంటూ మాకు పెద్ద ఆఫర్ ఇచ్చాడు. ఆ మొత్తం ఎంత అని మాత్రం అడక్కు. ఆ అంకెను నేను బయటకు చెప్పలేను’’.

         వాడు చెప్పే విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయసాగాను.

         ‘‘రిటైర్డు వ్యక్తుల విషయంలో అంతే. ఇంట్లో ఏ పనీ లేకుండా కుటుంబ సభ్యుల నిరాదరణకు, అవమానాలకు గురవుతూంటారు. మా దగ్గర అతి తక్కువ వేతనానికి కూడా వాళ్లు సేవలందించటానికి సిద్ధమవుతారు.

         భార్యలపైన అనుమాన పడే భర్తలు, భర్తలపైన సందేహపడే భార్యలు కూడా మా దగ్గరకు వస్తున్నారు. మా మనుషులు నిఘా పెట్టి ఆయా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం సేకరించి వాళ్లకు అందిస్తాం’’

         ‘‘అంటే వీళ్లు చేస్తున్నది మనుషులతో వ్యాపారం అన్నమాట’’ అనుకున్నాను.

         ‘‘చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీ దీని నిర్వహణ బాధ్యత చూస్తోంది. ఈ కార్యాలయం, ఉద్యోగుల జీతాలు అంతా దానివే. నేను కేవలం ఇక్కడ ఉద్యోగిని మాత్రమే. మెడికోలు, లాయర్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, పేరుపొందిన బిజినెస్ మ్యాన్ లు చాలా మందే ఉన్నారు’’ అన్నాడు.

         ‘ఇది మోసమా? ఇతరుల బలహీనతలను అడ్డం పెట్టుకుని తెలివిగా చేస్తున్న వ్యాపారమా? ’ నాకు అంతుచిక్కలేదు. నేను ఆలోచనల్లో ఉండగానే, డీకె పక్క నున్న సొరుగులో నుంచి కొత్త డెయిరీ, కంపెనీ ఎంబ్లమ్ ఉన్న ఓ బ్యాగు టేబుల్ మీద పెట్టి ‘‘జస్ట్. మా కాంప్లిమెంటరీ’’ అన్నాడు.

         ఆ రాత్రి పడుకోబోయే ముందు ఎందుకో బ్యాగ్ తెరిచి చూసుకున్నాను ఉలిక్కిపడటం నా వంతయ్యింది. అందులో రెండు వేల నోట్ల కట్టలు బుసలు కొడుతూ కనిపించాయి.

         ‘‘ఇప్పుడు అన్నింటి కంటే శక్తివంతమైనది ఏమిటో తెలుసా? డేటా? వ్యక్తిగత సమాచారం. అదే మా పెట్టుబడి. ఇప్పడేదీ రహస్యం కాదు. మీ కదలికలన్నీ రికార్డవుతూ ఉంటాయి. మీరు ఫోన్ లో మాట్లాడేది ఎవరో ఒకరు వింటూ ఉంటారు. మీ అభిరుచులను గుర్తిస్తారు. యూట్యూబ్ లో మీరు ఓ అంశానికి సంబంధించిన వీడియో ఏదైనా చూస్తే అలాంటి అంశాలే మీ ముందు ప్రత్యక్షం అవుతూంటాయి. మీరు ఏదైనా అంశానికి సంబంధించిన వివరాలు కోరుతూ గూగుల్ చేస్తే పదే పదే అందుకు సంబంధించిన అంశాలు మీ ముందుకు వస్తాయి. ఆఖరికి ప్రకటనలు కూడా. మీకు ఆయా సంస్థల పేరు చెబితే వాళ్ల ఫోన్ నెంబరు, చిరునామా ఓ చిన్న ఫోన్ కాల్ తో అందించే సంస్థల గురించి ఇంతకు ముందు విన్నావు కదా. దాని కంటే మేం ఒక అడుగు ముందుకు వేశాం. వాళ్లు మీరడిగితే సమాచారం ఇస్తారు. కానీ మేం అడిగి మరీ సమాచారం తీసుకుంటాం. అదీ తేడా మా దగ్గరకొచ్చే వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారం కంప్యూటర్లో రికార్డవుతుంది. అందరినీ మేం ఉపయోగించుకుంటాం. అందుకు కార్పొరేట్ స్థాయిలో ఓ వ్యవస్థ నిరంతరం పనిచేస్తూంటుంది’’ అన్న డీకె మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి.

         ఆ మాటలకు కొత్త అర్థం వెతుక్కునే పనిలో పడ్డాను.

         --------------------------------------------------

添加评论