ఆనందీభవ
ఆనందీభవ (Author: మహీధర శేషారత్నం)
తల్లి గర్భమునుండి తన్నుకుతన్నుకు
బయటికి రావడంతో యుద్ధమారంభం
వార్ధక్యంలో రుజాగ్రస్త దేహాన్ని
కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంతో యుద్ధం అంతం
రెండు యుద్ధాలమధ్య కాస్తంత శాంతిని
కోరుకోవాలికదా! మరి ఎందుకీ ఘర్షణ?
అమ్మపొత్తిళ్ళ మెత్తదనాన్ని ఆస్వాదించకుండానే పరుగులు ప్రారంభం
ఆశించింది అందకపోతే అసంతృప్తి, ఆర్తనాదాలు
మెత్తని అమ్మ చేతులు కూడా కరెన్సీ కంపు కొడతాయి
సూర్యోదయాలకు కనురెప్పలు తెరుచుకోవు
సూర్యాస్తమయాలు పనివేళలు మింగేస్తాయి
కోడికూతలు లేవు, కోకిలల పలకరింపులు లేవు
ప్రపంచవిజేత శూన్యహస్తాలతో మరణించేడు
ఏమీ పట్టికెళ్లలేమని తెలిసీ, మరి ఎందుకీ పరుగులు, ఆవేశాలు, ఆక్రోశాలు, కులమత ఘర్షణలు?
శాంతి పవనాలు లేవు ఏ మూల చూసినా చావు కంపులే కాని
మనుగడకు, మరణానికి కూడా కాసింత
మాధుర్యము ఉండాలి కదా!
ఒక అస్తమయం ఒక ఉదయానికి పునాది
ఒక ఉదయం ఒక అస్తమయానికి నాంది
భూభ్రమణం జీవిత భ్రమణానికి సంకేతమే కదా
భృకుటిముడి విడదీయండి
పెదాలపై నవ్వుల పువ్వులు విరజిమ్మండి
కాలంతో కలిసి నడవండి
కాలధర్మాన్ని నవ్వులతో వాయిదా వెయ్యండి
బాల్యాన్నిస్మృతి పథంలో నిలవనీయండి
ప్రశాంతతను పెనవేయండి