ఆకాశం వంగిన వేళ
ఆకాశం వంగిన వేళ (Author: ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి)
నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ముందు మోటార్ బైక్ ఆపాడు బిల్డర్ వెంకట రెడ్డి. బండి దిగి స్టాండ్ వేసి కొద్ది దూరంలో కనిపించిన దృశ్యం చూడగానే అతనికి కోపం వచ్చింది. వెంటనే ‘సింహాచలం’ అని గట్టిగా పిలిచాడు.
అప్పుడే పిల్లాడికి పాలిచ్చి వాడితో ముచ్చట్లు ఆడుతున్న సింహాచలం కంగారుగా పిల్లాడ్ని చెట్టుకి కట్టిన గుడ్డ ఉయ్యాలలో ఉంచి, అయిదేళ్ళ కొడుకుతో ‘తమ్ముడ్ని జాగ్రత్తగా చూడు’ అని చెప్పింది. గబ గబా నాలుగు అడుగులు వేసి వెంకట రెడ్డి ముందు నిలబడి ‘దండాలయ్యా’ అంది చేతులు జోడించి.
“పని ఎగ్గొట్టి పిల్లాడితో ముచ్చట్లు ఆడుతున్నావా? టైం ఎంత అయింది? అరగంట దాటింది.ఆ..పనిలోకి వెళ్ళవా? చెప్పు. నీకు రావాల్సిన డబ్బులు ఇచ్చి పంపించేస్తాను” గదమాయించాడు వెంకటరెడ్డి.
పనిలోంచి తీసేస్తా నని చెప్పగానే సింహాచలం గుండెలు జారిపోయాయి. “పొరపాటు అయ్యిందయ్యా. పిల్లాడు ఏడుస్తుంటే సముదాయించాను. అందరూ పనిలోకి వెళ్ళడం చూడలేదయ్య. అందరికంటే ఓ గంట ఎక్కువ పని చేస్తాను.
పనిలోంచి మాత్రం తీసెయ్యకండి” బాధగా వేడుకుంది సింహాచలం. ‘సరే వెళ్ళు. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం నేను ఊరుకోను. దూరాన్నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారని పనిలో పెట్టుకున్నాను. అది గుర్తు పెట్టుకో’ అని చేత్తో సైగ చేసాడు వెంకటరెడ్డి, పనిలోకి వెళ్ళమని.
అదురుతున్న గుండెలతో గబ గబా మెట్లు ఎక్కి మొదటి అంతస్తులోకి వెళ్లి మేస్త్రి రామస్వామి తో ‘ఆలీశం
అయిపోనాది అన్నా, మన్నించు’ అంది సింహాచలం. ‘సరేలే. మనోళ్ళు సిమెంట్ ‘మాలు’ కలిపినారు. అది గమేళాలో
పెట్టుకుని, ప్లాస్తింగ్ చేసే వాళ్లకు అందించు’ అన్నాడు రామస్వామి. అతను చాలా సౌమ్యుడు. అనవసరంగా కూలీలను ఏమీ అనడు. పని మానేసి కబుర్లు చెబితే మాత్రం ఊరుకోడు. గదమాయిస్తాడు. సింహాచలం అంటే అతనికి అభిమానం.
ఎక్కడో శ్రీకాకుళం నుంచి బతకడానికి ఇక్కడికి వచ్చారని సానుభూతి ఉంది రామస్వామి కి. సింహాచలం తన బాధ చెప్పుకుంటే, వెంకటరెడ్డితో చెప్పి ఆమెకి పని ఇప్పించాడు.
ఒక పావుగంట గడిచాకా వెంకటరెడ్డి పైకి వచ్చి పనులు ఎంత వరకూ అయ్యాయో పరిశీలించాడు. సింహాచలం సరిగా పని చేస్తోందో లేదో నని గమనించాడు. ఒక గంట ఉండి, రామస్వామి కి సూచనలు ఇచ్చి వెళ్ళిపోయాడు వెంకటరెడ్డి. సింహాచలం సాయంత్రం వరకూ పనిచేసి గబ గబా కిందకు వచ్చి చెట్టు దగ్గరకు వచ్చింది. అప్పటికే పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. పెద్దాడు ఊరుకోబెడుతున్నా పిల్లాడు ఏడుపు ఆపడం లేదు. ఉయ్యాల లోంచి పిల్లాడిని చేతులలోకి తీసుకోగానే ఏడుపు ఆపాడు. తల్లి స్పర్స వాడికి ధైర్యాన్నిచ్చింది. చెట్టుకి కట్టిన ఉయ్యాల విప్పేసి, పెద్దాడికి ఇచ్చి, చిన్న పిల్లాడిని భుజాన్న వేసుకుని ఇంటికి బయల్దేరింది. పావుగంటలో కాలనీ లో ఉన్న రేకుల షెడ్డుకి చేరుకుంది.
చిన్న పిల్లాడిని మంచం మీద పడుకోబెట్టి, పెద్ద పిల్లాడికి తినడానికి మరమరాల ఉండ తీసి ఇచ్చింది. తను టీ పెట్టుకుని తాగుతోంది. “అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు?” అడిగాడు పెద్ద పిల్లాడు.
“రేపు సాయంత్రానికి వస్తాడు. నానమ్మని చూసి, మందులు కొని ఇచ్చి వస్తాడు”అంది సింహాచలం.
సింహాచలం భర్త అప్పల నాయుడు, వాళ్ళ అమ్మ పైడి తల్లికి వంట్లో బాగుండలేదని కబురు వస్తే శ్రీకాకుళం దగ్గర ఉన్న వాళ్ళ ఊరు వెళ్ళాడు. తల్లిని తమతో వచ్చెయ్యమని అంటే ‘నేను రాను. ఇక్కడే పుట్టాను. ఇక్కడే ఉంటాను’ అంది. పెళ్ళాం, బిడ్డల్ని తీసుకుని బతకడానికి గోదావరి జిల్లా వచ్చాడు అప్పల నాయుడు. అతనికి ఎడమ చెయ్యి పోలియో.
అందుకని బరువు పనులు చెయ్యలేడు. సింహాచలం కూలి పనికి వెళ్తే, అప్పల నాయుడు సినిమా హాలు సెంటర్ లో సమోసాలు అమ్ముతూ ఉంటాడు.
సింహాచలానికి రోజుకి కూలీ ఐదు వందల ఏభై రూపాయలు ఇస్తారు. అందుకే ఎంత కష్టమైనా భరిస్తోంది.
తమ ప్రాంతంలో రోజూ పని ఉండదు, పైగా అంత డబ్బులు ఇవ్వరు. ఇక్కడ పని బాగా దొరుకుతుంది. డబ్బులు కూడా బాగా వస్తాయి. పెద్ద పెద్ద కాలువలు, పుష్కలంగా నీరు, పచ్చటి చేలు, పండ్ల తోటలు ఉన్న గోదావరి ప్రాంతం అంటే సింహాచలానికి చాలా ఇష్టం ఏర్పడింది. తన కుటుంబానికి రెండు పూటలా తిండి దొరుకుతోంది. వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పొదుపు సొమ్ము లోంచే మూడువేలు భర్త చేతికి ఇచ్చి పల్లెకి పంపింది సింహాచలం.
****
అనుకున్న దాని కన్నా ఇంకో రెండు రోజులు ఉండి, తల్లికి ఆరోగ్యం కుదుటపడ్డాకా శివపురం వచ్చాడు అప్పల నాయుడు. ఆ రెండు రోజులూ పిల్లలు ఇద్దరితో ఇబ్బంది పడుతూనే ఉంది సింహాచలం. అప్పల నాయుడు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఇంటి దగ్గర ఉండి పిల్లలు ఇద్దర్నీ చూసుకుంటాడు. అప్పుడు వస్తుంది పక్కింటి రాములమ్మ. ఆమె ఉదయం నలుగురు ఇళ్ళల్లో పనిచేసి వస్తుంది. మధ్యాహ్నం ఇంటి దగ్గరే ఉంటుంది. చిన్న పిల్లాడి పాల సీసా ఇతర వస్తువులు రాములమ్మ కి ఇచ్చి పిల్లలు ఇద్దర్నీ చూస్తూ ఉండమని చెప్పి, సమోసాల బుట్ట తీసుకుని సినిమా హాలు సెంటర్ కి వెళ్తాడు అప్పల నాయుడు. సాయంత్రం ఐదున్నర, ఆరు గంటలకు సింహాచలం, పని ముగించుకుని ఇంటికి వస్తుంది. రాములమ్మ దగ్గర నుండి పిల్లల్ని తెచ్చుకుని వంట చేసుకుంటుంది. రాత్రి ఎనిమిది గంటలకు
అప్పల నాయుడు సెంటర్ నుండి ఇంటికి వస్తాడు. రోజూ లింగాల వీధిలోని షావుకారు గారి దగ్గర సమోసాలు తీసుకుని
సినిమా హాలు సెంటర్ లో వాటిని అమ్ముతాడు. రోజూ వందా, నూట ఏభై రూపాయల వరకూ సంపాదిస్తాడు. అతనికి ఏ దురలవాటు లేదు. సాయంత్రం ఒక టీ మాత్రం తాగుతాడు. సమోసాలు కొద్దిగా మిగిలితే ఇంటికి తెస్తాడు, నలుగురూ తింటారు. అదీ వాళ్ళ దినచర్య.
నాలుగు నెలలు గడిచాయి. ఒక రోజు సాయంత్రం చీకటి వేళ కరెంటు పోయింది. వెంకట రెడ్డి మార్టేరు నుండి శివపురం వస్తున్నాడు. బజారు నుండి మలుపు తిరిగి శివాలయం వీధిలోకి వచ్చాడు. లైట్ లేకుండా స్పీడ్ గా వచ్చిన ఆటో, వెంకట రెడ్డి బైకు ని గుద్దేసి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న సిమెంట్ స్తంభం మీద పడిపోయాడు వెంకట రెడ్డి.
తలకు బలమైన గాయం అవడంతో స్పృహ కోల్పాయాడు వెంకట రెడ్డి. పది నిముషాలు అలాగే ఉండిపోయాడు. తర్వాత కరెంటు రావడం, ఎవరో అతన్ని చూసి హాస్పిటల్ లో చేర్చడం జరిగింది.
మర్నాడు మేస్త్రి రామస్వామి హాస్పిటల్ కి వెళ్లి వెంకట రెడ్డి ని చూసి వచ్చాడు. వెంకట రెడ్డి చాలా నీరసంగా ఉన్నాడు, మాట్లాడలేక పోతున్నాడు. రెండు రోజులకు వెంకట రెడ్డి కొద్దిగా కోలుకున్నాడు. డాక్టర్ రామచంద్ర రాజు ని అడిగాడు, ‘తనని హాస్పిటల్ లో ఎవరు చేర్చారని?’
“ఆ మనిషి ఎవరో తెలియదండి. ఆటో మీద తీసుకువచ్చి చేర్చారు. మీకు ట్రీట్మెంట్ జరిగాకా, మీ ఫోన్, పర్సు నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఫోన్ లో మీ మిసేస్ గారి నెంబర్ చూసి ఆవిడకి ఫోన్ చేసాం. కానీ మిమ్మల్ని సకాలంలో ఇక్కడికి తీసుకు రాబట్టి, మీరు కోమాలోకి వెళ్ళకుండా కాపాడగాలిగాం ” అన్నారు డాక్టర్ రాజు. తనని ఎవరు హాస్పిటల్ లో చేర్చారా? అని చాలా సేపు ఆలోచించాడు వెంకట రెడ్డి. తనకి బాగా తెలుసున్న వాళ్ళు అయితే వాళ్ళే తన ఇంటికి ఫోన్ చేసి ఆక్సిడెంట్ గురించి చెప్పేవారు. ఎవరో కొత్త వాళ్ళు అన్నమాట. ఏభై వేల ఖరీదైన తన ఫోన్, పర్సు డాక్టర్ గారికి ఇచ్చి వెళ్ళారంటే చాలా మంచివారన్నమాట. ఆ వ్యక్తీ గురించి తప్పకుండా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంకటరెడ్డి. బాగా తగ్గాకా డాక్టర్ రాజు కి థాంక్స్ చెప్పి వస్తుంటే అప్పుడు చూసాడు రిసెప్షన్ లో సి. సి. కేమేరాలు.
గబ గబా అతని దగ్గరకు వెళ్లి, తనకి ఆక్సిడెంట్ జరిగిన రోజు ఉన్న దృశ్యాలు చూపించమని అడిగాడు వెంకట రెడ్డి. రిసెప్షన్ లో ఉన్న అతను, అప్పటి దృశ్యాలని లాప్ టాప్ లో వెంకట రెడ్డి కి చూపించాడు. కంపౌండర్ సాయంతో తనని లోపలకి తీసుకువచ్చి, డాక్టర్ గారికి తన ఫోన్, పర్సు ఇచ్చి కన్నీళ్ళతో వెళ్ళిపోతున్న వ్యక్తి ని చూడగానే వెంకట రెడ్డి నిర్ఘాంత పోయాడు. నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి కారు ఎక్కి ఇంటికి వెళ్ళాడు వెంకట రెడ్డి
వారం రోజులు గడిచాయి. వెంకట రెడ్డి బాగా కోలుకున్నాడు. సాయంత్రం అపార్ట్ మెంట్ దగ్గరకు వస్తానని, కూలీలు, తాపీ పనివారు, అందర్నీ ఉండమని రామ స్వామి కి కబురు చేసాడు వెంకట రెడ్డి. అలాగే అన్నాడు రామస్వామి. సాయంత్రం ఐదు గంటలు అయ్యింది. వెంకట రెడ్డి కారు దిగి నెమ్మదిగా వచ్చాడు. డ్రైవర్ పళ్ళూ, స్వీట్ పాకెట్లు తెచ్చి ఒక పక్కగా ఉంచాడు. రామస్వామి, మిగతా వాళ్ళు ‘ఎలా వుంది అయ్యా?’ అని అడిగారు. బాగానే ఉన్నాను, అన్నట్టు తలాడించాడు వెంకట రెడ్డి.
“మీ అందరికీ ఒక విషయం చెప్పాలనే ఉండమన్నాను. ఇన్నాళ్ళూ, నా వలనే మీరు అందరూ బతుకుతున్నారని, నేను లేక పోతే మీకు జీవితమే లేదు అని భ్రమ పడ్డాను. అది తప్పు అని మొన్న నాకు జరిగిన ఆక్సిడెంట్ వలన తెలిసింది. నిజానికి మీరు అందరూ ఉంటేనే నేను బాగుంటానని నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను అస్తమానం గసురుకునే మనిషి, అవేమీ మనసులో పెట్టుకోకుండా నాకు ప్రాణ దానం చేసింది. నేను ఈరోజు ఇలా మీ ముందు ఉన్నానంటే కారణం ఆ మనిషే” వెంకట రెడ్డి గొంతు గాద్గిదమయ్యింది. ఒక నిముషం ఆగాడు.
“సింహాచలం, ఇలా రా అమ్మా ఒకసారి” నెమ్మదిగా పిలిచాడు వెంకట రెడ్డి. భయం భయంగా ముందుకు వచ్చి నిలుచుంది సింహాచలం. “ఆరోజు నాకు ఆక్సిడెంట్ అయి రోడ్డు పక్కన పడివుంటే, నన్ను ఆటోలో తీసుకువచ్చి హాస్పిటల్ లో చేర్చి, నన్ను కాపాడిన మనిషి సింహాచలం. నేను చాలా సార్లు ఈమెని విసుక్కున్నాను, పనిలోంచి తీసేస్తానని బెదిరించాను. కానీ అవేమీ మనసులో పెట్టుకోకుండా సకాలంలో నన్ను హాస్పిటల్ కి తీసుకు వచ్చి నాకు ప్రాణదానం చేసిన గొప్ప మనసున్న మనిషి సింహాచలం. ఏభై వేల రూపాయల నా ఫోన్, నలభైవేల రూపాయల్లతో ఉన్న నా పర్సు డాక్టర్ గారికి ఇచ్చి వెళ్ళిపోయింది. నేను ఇంత పనిచేసానని ఎవరికీ చెప్పలేదు. ఆటో డబ్బులు కూడా తనే పెట్టుకుంది.ఈ తల్లి ఋణం ఎలా తీర్చుకోను?” అని చటుక్కున ఆమె పాదాలకు నమస్కరించాడు వెంకట రెడ్డి.
అందరూ ఆశ్చర్యపోయారు అతని చర్యకి. “ఆయ గారూ, ఇదేంటి బాబూ?” అని కంగారుగా వెంకట రెడ్డికి దణ్ణం పెట్టి దూరంగా జరిగిపోయింది సింహాచలం. జేబు లోంచి కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు వెంకట రెడ్డి.
“ఈ రోజు నుండి మనందరం ఒకటే. పేదా, గొప్పా తేడాలు లేవు. కల్సి పని చేద్దాం’ అని సైగ చేయగానే డ్రైవర్ పళ్ళు, స్వీట్ పేకెట్లు తెచ్చాడు. అవి అందరికీ ఇచ్చిన వెంకటరెడ్డి, సింహాచలం కి ఒక కవర్ ఇచ్చాడు. అందులో ఎభైవేలు ఉన్నాయి “నీ పిల్లల చదువుకు ఉపయోగించుకో ఆ డబ్బు“ అన్నాడు వెంకటరెడ్డి సింహాచలంతో. ఏడాది తిరిగేసరికి నాలుగు గదుల డాబా కూడా కట్టించి ఇచ్చాడు సింహాచలానికి. వెంకట రెడ్డి లోని మార్పుకి అందరూ సంతోషించారు.