అసిధార
అసిధార (Author: మల్లారెడ్డి మురళీ మోహన్)
ప్రశ్నల్ని ప్రేమించేవాళ్లు
తర్జనిపై భూగోళాన్ని తిప్పుతూ
సమాజమనే సమాధిపై
జవాబుల కోసం జ్వలిస్తుంటారు
ప్రపంచాన్ని పంజరమనేవాళ్లు
కట్టుబాట్ల ఊచల వెనుక
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ
విముక్తిగీతాలకు
చీకటితో చెలిమిచేసేవాళ్లు
వెలుగు కపటానికి చీలిపోయి
సాయంత్రమయేసరికి
కాంతినంతటినీ పంచిపెట్టి
పెట్టెలో చీకట్లను సర్దుకుంటారు
గొంతు నులిమేయబడ్డవాళ్లు
రాబోయే తరాల నరాలనిండా
చైతన్యమై ప్రవహించేందుకు
గోడలపై రుధిర నినాదాలై పూస్తుంటారు
ఎడారి కాళ్ల పథికులు కొందరు
ఖర్జూర కలలు మోసుకుంటూ
కళ్లల్లో ఒయాసిస్సుల్ని దాచుకుని
కాంతిబోధ చేస్తూ సంచరిస్తుంటారు
దివారాత్రాల్ని జేబుల్లో కుక్కుకుని
కత్తి అంచుపై కవాతు చేస్తూ కొందరు
విస్మృత చరిత్రలో
అనామక శకలాలుగా మిగిలిపోతుంటారు
*** *** ***