అమ్మ మనసు  (Author: కర్లపాలెం హనుమంతరావు)

         అనంతయ్య బాసుని భోజనానికి పిలిచాడా ఆదివారం. మొగుడూ పెళ్ళాలిద్దరూ కిందామీదా పడి ఇల్లంతా సర్దేవేళకి అపరాహ్ణం దాటనే దాటింది.

          'పనికిరాని సామాను ఇంట్లో ఇంతుందా!' ముక్కున వేలేసుకొన్నాడు అనంతయ్య. ఉన్నట్టుండి అతగాడికి తల్లి గుర్తుకొచ్చింది.

         'అమ్మను ఏంచెయ్యాలి? ఈ నైటుకి పక్క వీధి బామ్మగారింట్లో దింపొద్దామా?' అడిగాడు భార్య సుభద్రను.

         'తను ఊళ్ళో లేదిప్పుడు. కాశీయాత్ర కెళ్ళింది లాస్ట్ సండే' అంది సుభద్ర.

         'ఐతే ఓ పని చెయ్! పెందలాడే ఇంత తిని తన గదిలో కెళ్ళిపొమ్మను. గెస్టులెళ్ళే దాకా బైటికి రావద్దని చెప్పు!'

         'బాగుంది సంబడం. కోడలు చెప్పటం, అత్తగారు వింటం! అయేదేనా ఈ లోకంలో!' మూతి మూడు వంకర్లు తిప్పింది సుభద్ర.

         చిర్రెత్తింది అనంతయ్యకు''అసలిదంతా నీ వల్లే! ఊరికి పంపించేద్దామంటే అడ్డొచ్చావ్ ఎచ్చులకు పోయి. ఇప్పుడేం చెయ్యటం?'

         'ఏం చేసుకొంటారో మీ ఇష్టం. తల్లీ కొడుకుల మధ్య నేనెందుకూ?' చరచరా వంటింటిలోకి వెళ్ళిపోయింది సుభద్ర.

         బిక్క మొగమేశాడు అనంతయ్య. మరుక్షణమే తేరుకొని తల్లి గది ముందు కెళ్ళి లోపలికి తొంగి చూశాడు. గోడకు చేరగిలబడి కళ్ళు మూసుకుని జపమాల తిప్పుకొంటోందామె.

         అలికిడికి కళ్ళు తెరిచి చూస్తే తలుపు దగ్గర కొడుకు.

         ‘ఏం కావాలి నాయనా?' అడిగింది నెత్తి మీది కొంగు సర్దుకొంటూ.

         'అమ్మా! ఇంటికి అతిథులొస్తున్నారు.. తెలుసుగా! ఈ పూటకి నువ్వు పెందలాడే భోంచెయ్యాలి!'

         'ఆకలి లేదురా!'

         'అదేం?'

         'నీచు నాకు పడదు! మజ్జిగ చాల్లే ఈ పూటకి'

         అతిథులొస్తున్నారని చికెన్ వంటకాలు చేయించింది సుభద్ర.

         'మజ్జిగ తాగితే నిద్ర ఆగదు. నిద్రలో నీ గురకలు మైలు దూరం వినపడతాయే!. బైటవాళ్ళ ముందు బావుంటుందా?'

         బిక్కమొగమేసింది తల్లి. పట్టించుకొనే స్థితిలో లేడు కొడుకు.

         'అన్నట్లు నువ్వు షుగర్ పేషెంటువి కదూ! దా! అట్లా గది బైట వరండాలో కూర్చుందువు గానీ. గొంది నుంచి వెనక బాత్రూముకి వెళ్ళచ్చు సులువుగా. గెస్టులందరి ముందు తిరగటం బావుండదు కదా!' తల్లి చెయ్యి పట్టుకొని తెచ్చి వరండాలో ఓ మూల, చెక్క కుర్చీలో కుదేశాడు అనంతయ్య.

         'అతిథులొచ్చేదాకా ఇక్కడే వుండాలమ్మా! మేం బైటికొచ్చినప్పుడు చూసి గొంది గుండా నీ గది కెళ్ళిపో!' అన్నాడు డోర్ పక్కనున్న స్విచ్ ఆన్ చేస్తూ.

         సందులో బల్బు వెలిగింది. ఆ వెల్తుర్లో తల్లి ఆకారం అనంతయ్య కళ్ళకు వికారంగా కనిపించింది. మొహం చిట్లించాడొక్క క్షణం.

         'వచ్చేవాళ్ళు పెద్దాఫీసర్లు. ఇట్లాగేనా కనిపించటం? ఇది బెంగుళూరమ్మా.. మన చుట్టుగుంట కాదు. మా బాసు ముందు నా గాలి తీసేస్తావా ఏంటీ?'

         పెద్దావిడ గుండె దడదడలాడింది. కట్టెపుల్లల్లాంటి చేతుల్తో చీరె కొంగు సరిచేసుకొని ఒద్దికగా కూర్చుంది కుర్చీ మీద.

         అయినా కొడుకు మొహంలో మార్పులేదు. తల్లి చేతుల వంక తీక్షణంగా చూస్తూ 'ఆ మొండి చేతులేంటమ్మా? కాస్త మంచి గాజులేసుకోవచ్చుగా.. చూట్టానికి బాగుంటుందీ!'

         'మంచివా? అన్నీ నీ చదువుసంధ్యలకే అర్పించాను గదయ్యా!'

         అగ్గిరాముడయిపోయాడు అనంతయ్య. 'కొడుక్కోసమేగా నువ్వు ఖర్చుపెట్టిందీ! నీ సొమ్ముతో నేనేమన్నా బేవార్సుగాడిగా తయారయ్మానా? మంచి ఉద్యోగమే చేస్తున్నాగా! ఇదిగో! ఈసారి ఈ ప్రమోషను రానీ.. అణా పైసల్తో సహా నీ బాకే తీర్చేస్తా'

         కొడుకు నిష్టూరం విని తల్లడిల్లిందా ముసలితల్లి. 'అయ్యయ్యో! నా ఉద్దేశం అదికాదురా నాయనా! ఏ బిడ్డకైనా తల్లి అప్పిస్తుందా లోకంలో? మంచి గాజుల్లేవు. ఉంటే వేసుకోనా.. అన్నానంతే'

         డిన్నర్ టైం దగ్గర పడ్డంతో సంభాషణ అక్కడికి ఆగిపోయింది.

         'అమ్మా! మా బాసొచ్చి ఏమన్నా అడిగితే.. అడిగినంత వరకే జవాబు చెప్పాలి. మనూళ్ళోలాగా లొడలొడా వాగద్దు. ఏం చెప్పాలో సందర్భాన్ని బట్టి నేను చెప్తా గానీ.. నీ సొంత తెలివి ప్రదర్శించొద్దు! సరేనా?' తయారవటానికి పోతూ పోతూ హెచ్చరించాడు అనంతయ్య.

         కొడుకు మాటల్తో ముసలమ్మకు కంగారు మరింత ఎక్కువయింది. అసలే ఆఫీసర్లంటే చచ్చే భయం. అందులోనూ ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళెదుట మాట పడిపోతుంది. వచ్చే ఆయన అబ్బాయి పై ఆఫీసర్ట. తన మూలకంగా వాళ్ళ విందువినోదాలు భంగమయితే! అనంతయ్య ఇహీ జన్మకు తనను క్షమించేనా!

         'ఏడుకొండలవాడా! ఈఆపదల నుంచీ నువ్వే నన్ను గట్టెక్కించాలి తండ్రీ!'

         వరండా మూల మసక వెల్తుర్లో కొయ్యకుర్చీ మీద కాళ్ళు వేలాడేసుకొని బేలగా వేడుకొంటోందా ముసలితల్లి.

         ...

         లోపల డిన్నరు ఆరంభమయినట్లుంది. గలగలా మాటలూ.. మధ్య మధ్య నవ్వులూ! గంటల కొద్దీ సందళ్ళే సందళ్ళు. సమయం గురించి ఎవరికీ పట్టినట్లు లేదు. పదిన్నరకు గానీ అతిథులు బైటకు రాలేదు.

         అనంతయ్య మెట్ల మీది స్విచ్ ఆన్ చేశాడు. వరండా నిండా పాల వెన్నెల కాంతి పరుచుకొంది.

         ఆ కాంతిలో ఓ మూల కొయ్యకుర్చీలో కాళ్ళు కిందికి జార్చి జోగుతున్న ముసలమ్మ బాసు కంటపడింది. రైలింజను కూత మాదిరి ఆమె పెట్టే గురకలు విని కిచకిచమన్నారు ఆడంగలు కొందరు.

         ఆ అలికిడికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ముసలమ్మ. గభిక్కున లేచి నిలబడపోయింది. ఆ తడబాటులో తలమీది కొంగు ఓ పక్కకు జారిపోయింది. నెత్తిమీదున్న గుప్పెడు తెల్లవెంట్రుకల నుంచీ నున్నటి గుండు కనిపించటంతో కిసుక్కుమని నవ్వారెవరో. అనంతయ్య పైప్రాణాలు పైనే పోయాయి.

         'హు ఈజ్ షి?' చిరునవ్వుతో ప్రశ్నించారు బాసు. వెర్రి మొగమేశాడు అనంతయ్య.

         అమెరికన్ బాసుకు కొంత అర్థమయినట్లుంది. సానునయంగా పెద్దావిడ దగ్గరకు వెళ్ళి 'హౌ ఆర్యూ!' అన్నారు కుడి చెయ్యి ముందుకు చాచి.

         పెద్దావిడకు ఏం చెయ్యాలో తోచింది కాదు. కొయ్యబారినట్లు నిలబడిపోయింది.

         అనంతయ్యకు చచ్చే సిగ్గేసింది. అపాలజిటిగ్గా బాసు వంక చూసి అన్నాడు 'సారీ సర్! షి ఈజ్ మై మదర్. అనెడ్యుకేటెడ్. సిటీ కల్చర్ కొత్త. పల్లెటూర్లో పుట్టి పెరిగింది.'

         'యూ మీన్ రూరల్ ఫోఁక్? వ్వెరీ నైస్. మై గ్రాండ్ పా ఆల్సో సర్వ్ డ్ హియర్ ఫర్ సమ్ టైమ్ యాజే మిషనరీ. హి హాజ్ కలెక్టెడ్ ఎ ప్రెట్టీ నంబర్ ఆఫ్ యువర్ ఫోఁక్ సాంగ్స్. కుడ్ యూ ప్లీజ్ ఆస్క్ యువర్ మదర్ టు సింగ్ ఒన్ ఆర్ టూ లైన్స్ ఫర్ మీ?'

         అనంతయ్య గొంతులో పచ్చివెలక్కాయ పడ్డది. లలితాస్తోత్ర నామాలు తప్ప తల్లి వేరే పాట లెప్పుడూ పాడగా తను వినలేదు. బాసు ఆదేశం కాబట్టి ఎట్లాగో మేనేజ్ చేయక తప్పదు.

         ‘అమ్మా! మా సార్ నిన్నేదైనా ఓ పాట పాడమంటున్నారు. పాడు! '

         పెద్దావిడ బిత్తరపోయింది.

         'పాటలా! నాకేం పాటలొచ్చు నాయనా! నేను పాడంగా నువ్వెప్పుడైనా విన్నావా?'

         'ఏదో ఒకటి పాడేయమ్మా! ఆయన నీ పాట కోసం ఎదురు చూస్తున్నారు.'

         కొడుకు మొహంలో మారుతున్న రంగులు చూసి పెద్దావిడలో కంగారు ఎక్కువయింది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది.

         'ఊఁ! కానియ్యీ!' అనంతయ్యలో తనకలవాటైన అసహనం.

         పెద్దావిడ కళ్ళనిండా నీళ్ళు గిర్రున తిరిగాయి. కోడలి వంక చూసింది బేలగా. నువ్వైనా నాకు సాయానికి రావచ్చుగా.. అన్నట్లుంది ఆమె చూపు.

         సుభద్రకిక కలగచేసుకోక తప్పింది కాదు 'అత్తయ్యగారూ! మొన్న మా ఉష కూతుర్ని ఉయ్యాలలో వేసినప్పుడు పాడారు చూడండి వాళ్ళమ్మగారూ.. అట్లాంటిదే ఏదైనా ఓ పాట.. రెండు చరణాలు పాడేయండి.. చాలు'

         కోడలి మాటల్తో పాతికేళ్ళనాటి అనంతయ్య కళ్ళ ముందు కదలాడాడు. పిల్లాడు నిద్ర పోనని మారాం చేసినప్పుడల్లా కూనిరాగాలేవో తీస్తుండేది తాను.. ఆజోల పాట చరణాలు కొద్దిగా కొద్దిగా గుర్తొస్తున్నాయిప్పుడు!

         కళ్ళు మూసుకొని మెల్లగా ఓ రాగం అందుకోబోయింది. గొంతు జీరబోయింది. మళ్ళీ ఆడంగుల కిచకిచలు! ముందుకిక సాగేది లేదని మొరాయించింది రాగం.

         'కానియ్యమ్మా!' అనంతయ్య గొంతులో అదిలింపు! మరోసారి ప్రయత్నించింది. ఊహూఁ! గొంతు మరింత బిగుసుకుపోయింది.

         కంటి నిండా నీళ్ళు. ఆ కన్నీటి పొర గుండా ఏడాది పాపడు అనంతయ్య కక్కటిల్లుతూ కనిపించాడు వుయ్యాలలో పోర్లుతూ. పసిబిడ్డ రోదనతో తల్లి తల్లడిల్లింది. తల్లిగొంతుక ముడి చిన్నగా సడలటం మొదలయింది. సడలిన గొంతుక నుంచి సన్నటి కూనిరాగం జోలపాటై గాలిలో తేలసాగింది..

         ‘ లాలి లాలి ఓ లాలి నీవే నా పాప లాలి
లాలి లాలి ఓ లాలి నీవే నా పాట లాలి..

         పసిసాప దివ్య మోహన మంగళ రూపం’.. చిర్నవ్వు దివ్వెల వెలుగులో కాంతులీనటం చూసి తల్లి హృదయం మరింత ఉప్పొంగింది..

         ‘.. లాలి లాలి ఓ లాలి నీవే నా అమ్మ లాలి
లాలి లాలి ఓ లాలి నీవే నా జోల లాలి
లాలి లాలి ఓ లాలి నీవే నా జో జో లాలి.. రాగబిందువులొక అనురాగ సింధువుగ మారి జోల ఝరి..

         ‘.. జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా పాప లాలి
జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా పాట లాలి.. ’

         పరవశంలో మునిగి తేలే బోసి నవ్వుల పసిపాపడు రువ్వే పకపకలతో.. ఇహ అడ్డే లేదన్న చందంగా తల్లి డెందం పొంగి పొర్లింది. 


         ‘జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా అమ్మ లాలి
జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా జోల లాలి
జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా జో జో లాలి.. ‘

         భుజాలు పట్టుకొని ఎవరో బలంగా ఊపేస్తున్నారు.

         కళ్ళు తెరిచి చూస్తే బాసుగారి భార్య ఆనందంతో ఆమెను గాఢాలింగనం చేసుకొని గాలిలో ఉపేస్తున్నది. అమెరికన్ బాసుతో సహా యావత్ అతిథి బృందం ఆనందంగా చేసే కరతాళధ్వనులతో వరండా మొత్తం సంగీత కచేరిని మరిపించింది.          నివ్వెరపోయి చూస్తున్న కొడుకు వంక చూసి తలదించుకొంది ముసలితల్లి.

         ***

         రాత్రంతా ఆమె కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తూనే వున్నాయి.

         ఏది జరగరాదని తపించిందో అదే జరిగిపోయింది క్రితం రాత్రి. వారం రోజుల బట్టి కొడుకు పడ్డ హైరానా నిష్ప్రయోజనమైపోయింది తన మూలకంగా. తన పేదరికాన్నిసైతం లక్ష్యపెట్టకుండా వళ్ళు ముక్కలు చేసుకొని మరీ కొడుకును కోరినంత చదువు చదివించింది. మారుమూల పల్లెలో పుట్టి పెరిగినా బుర్ర చురుకు కాబట్టి, కొడుకు గ్రామంలో ఎవరూ చదవనంత చదువు చదవగలిగాడు. తన శ్రమకూ, వాడి కష్టానికీ ఫలితంగా ఆ ఏడుకొండలస్వామి బిడ్డకు మంచి జీవితం ప్రసాదించాడు. పెళ్ళయి తనకంటూ ఓ సంసారం సమకూరాక కన్నవారిని కాదు పొమ్మంటున్నారు అంటూ పెద్దవాళ్లు నిష్టూరాలు పోవటం తను చూస్తూనేవుంది. మారుతున్న కాలాన్ని అర్థం చేసుకొంటే అట్లాంటి ఆవేదనకు ఆస్కారం వుండదు. లోకరీతిని అవగాహన చేసుకొన్నది కాబట్టే అనంతయ్య ప్రవర్తన పట్ల తనకు అణుమాత్రమైనా చింతకలగ లేదు. తను కోరుకొన్నదల్లా వాడికి గొప్ప జీవితమూ.. చక్కటి సంసారమూ!

         చేస్తున్న ఉద్యోగంలో పై మెట్టు కెళ్ళాలన్న వాడి తపన తనకు అర్థమయింది. పై వాళ్ళను ప్రసన్నం చేసుకొనేందుకే ఇంత భారీ విందు పెట్టుకుందనీ తెలుసు. అందుకే ఎట్లాంటి విఘాతం కలగకుండా ఈ శుభకార్యం దిగ్విజయంగా జరిగిపోవాలని కోరుకుంది. చివరికేమయింది? తన పిచ్చి చేష్టలవల్ల ఆశాభంగమయింది. జీరపోయిన గొంతుతో గుర్తులేని లాలి పాటను కర్ణకఠోరంగా పాడి బిడ్డను నవ్వుల పాల్చేసింది. ఇంత జరిగిన తరువాత కొడుక్కిక తన ముఖం చూపించలేకనే పచ్చిమంచి నీళ్ళయినా ముట్టకుండా గదిలో నక్కి ఉన్నది.'

         ముసలమ్మ ఆలోచనలో మునిగి వుండగానే తలుపు దగ్గర అలికిడయింది.

         'అమ్మా! తలుపు తియ్యి!'..

         అనంతయ్య గొంతు.

         ముసలి తల్లి గుండెలు దడదడలాడాయి.

         ఆగకుండా తలుపు బాదుతూనే వున్నాడు కొడుకు.

         'అమ్మా! తలుపు తియ్యి!'.. 'అమ్మా! తలుపు తియ్యి!'.. 'అమ్మా! తలుపు తియ్యి!'..

         ఇక చేసేదిలేక కుక్కిమంచం మీద నుంచి లేచి.. కళ్ళు తుడుచుకొని.. కర్రకొట్టుకుంటూ నెమ్మదిగా వెళ్ళి తలుపు గడియ తీసింది తల్లి.

         ఎదురుగా అనంతయ్య. తాను భయపడ్డట్లు కోపంగా లేడు! చిర్నవ్వుతో 'మా బాస్ వాళ్ళ అమ్మగారు.. నిన్ను చూస్తారంట! హాయ్ చెబితే హాయ్ చెప్పు!'చేతిలోని సెల్ ఫోన్ ఆమెకు అందించాడు.

         సెల్ ఫోన్ లో ముగ్గుబుట్ట ముసిలావిడ.. తనలాగే ఉంది.. కాకపోతే గౌనులో.. కుర్చీలో దర్జాగా కూర్చోనుంది. ఆమె వెనకాల అనంతయ్య బాసు.. ఆయన పెళ్ళామూ! చలాకీగా చేతులూపుతున్నారు. ముసలామె ఆయన తల్లి కాబోలు! రెండు చేతులూ జోడించి నమస్కారం చేసింది. ముసలమ్మకు ఏం చెయ్యాలో తోచలేదు. నెత్తిమీది కొంగు సర్దుకుంది బిడియంగా.

         'బాసువాళ్ళ అమ్మగారు.. ఆ లాలి పాట వింటారంట. పాడు.. నీ కొచ్చినట్లే పాడు.. పర్లేదు' అన్నాడు అనంతయ్య.

         కొడుకు వంక నిర్ఘాంతపడి చూసిందొక్కసారి ముసలామె. ఆమె కళ్ళ వెంట నీళ్ళు ధారాపాతంగా రాలుతున్నాయి. అనంతయ్య తల్లి కన్నీళ్ళను తుడుస్తూ తనూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు.

添加评论