అద్దాల సౌధం  (Author: పాట్నీడి వి. వి. సత్యనారాయణ)

గుండెల్ని పిండేసే బాధ. నరనరానా పాకి నెత్తురును గడ్డ కట్టించే నైరాశ్యం. అనకొండలా అమాంతం మింగేసే రక్కసి. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ అసలు స్వరూపం. జీవనపోరాటంలో అలసి సొలసి,  విశ్రాంతి కోరుకొనే శరీరం ఓ పక్క, నేనున్నానంటూ సేదతీర్చే తోడు చూస్తుండగానే కనుమరుగై, అహాన్ని చల్లార్చే చిరునామా గల్లంతైన ఆ క్షణాన, నైరాశ్య విశ్వరూపం వికటాట్టహాసం చేస్తుంటే, చుట్టూ చస్తూ బతికే శవాలు, బతుకుతూ చచ్చే శవాలు.. ఈ సమాజనికే సవాలు. ఈ బాధను అనుభవించని వాళ్ళు అపహాస్యం చెయ్యొచ్చు, కానీ అనుక్షణం అనుభవించే రావుకి, ఆ బాధలోని అణువణువూ తెలుసు.

          ‘నా కొడుకు అమెరికాలో ఉంటాడు, అదంతా భూతలస్వర్గం, రెండు మూడు సార్లు వెళ్లొచ్చాను, కొంచెం ఖరీదు ఎక్కువైనా కల్తీ లేని జీవితం’ ఇలా రొమ్ము విరుచుకుంటూ, వంట్లో నెత్తురున్నంత సేపూ విర్రవీగిన ఆనందరావుని ‘రావు’ అనే పరిచయస్తులంతా పిలుస్తూంటారు. అలాంటి రావుకి వయసు మీద పడుతూండడం, అర్ధాంగికిగా అనునిత్యం సేవలు చేసిన అనంత లక్ష్మి శాశ్వతంగా దూరం అవ్వడం లాంటి వాటితో ఒంటరితనం నిలువెత్తున విరుచుకు పడింది, నాగుపాములా నిలువెత్తున లేచింది, కాలనాగులా కాటేయడానికి సిద్ధంగా ఉంది. అయినా, ముందునుండీ భర్తకి చెబుతూనే ఉండేది శారద. “ఉన్న ఒక్కగానొక్క కొడుకుని అలా అమెరికాకు పంపించడం భావ్యం అంటారా చెప్పండి? వెళ్ళినవాళ్ళు నూటికో కోటికో ఎవరో వస్తున్నారు తిరిగి. అక్కడ అలవాటైన వాళ్ళు, తిరిగి ఎంతమంది వచ్చారో మీరే చెప్పండి?” అంటూ, జాగ్రత్తలన్నీ చివరిదాకా చెబుతూనే, అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ పేరుతో దూరం అయిపోయింది. ఆమె చెప్పింది చెప్పినట్టే అక్షరాలా జరుగుతూండడం, రావు ఇప్పుడు కళ్ళారా చూస్తూనే ఉన్నాడు.

          తల్లి అంత్యక్రియలకు ఆదరాబాదరాగా వచ్చిన కొడుకు, తప్పనిసరై వచ్చిన కోడలు, తాము భవిష్యత్తులో ఇక ఇండియా రామని, ‘ఒక్కరూ ఉండలేక పోతే, మీరు కూడా అమెరికా వచ్చెయ్యండి’ అంటూ ఓ సలహా ఇచ్చేసి, అంతే ఆదరాబాదరాగా అమెరికాకి వెళ్ళిపోయారు.

          రావుకి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. చాలామంది చేసినట్టుగానే కాలక్షేపం పేరుతో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, విఆర్ ఇచ్చేశాడు. ఇప్పుడు తన యాభై ఏళ్ల వయసులో భార్య పోవడంతో, ఒక్కసారిగా ఒంటరితనం చుట్టుముట్టడానికి సిద్దం అవుతోంది. ఎన్నాళ్లుగానో వీళ్ళ యింట్లో అంట్లు తోమే మాచరమ్మ, అనంతలక్ష్మిగారు పోవడంతో, పెదకర్మ అయ్యేంతవరకూ ఆ పనీ ఈ పనీ చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది. ‘అయిగోరూ, అమ్మగారంటే నాకు మా సెడ్డ గోరవం ఆండీ. మీరేటిత్తారని అడక్కుండానే ఇన్నాళ్ళూ పన్జేసినానండి, ఇప్పుడూ సేత్తానండి... రోజంతా ఈడనే ఉండిపోతున్నానని కాతావొళ్లంతా గోలెడుతున్నారయ్యా... రేపట్నుండి ఒప్పుడూ వచ్చినట్టే వచ్చి, అంట్లు తోఁవేసి ఎల్లిపోతానయ్యా’ అంటూ పెదకర్మ అయిన మర్నాడే బాంబు పేల్చింది మాచరమ్మ. ‘నిజమే, కన్నకొడుకే ఉండలేనప్పుడు, అది మట్టుకు ఎన్నాళ్ళని ఉంటుంది? ’ అనుకున్నాడు రావు.  

          ఉన్నప్పుడు తెలియలేదు గానీ, భార్య లేని లోటు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది రావుకి. ఉదయం కాస్సేపు వాకింగూ, కాస్సేపు పేపరూ, బయటికెళ్ళి టిఫినూ, మరి కాస్సేపు వంట చేసుకొని తింటం, ఇంకాస్సేపు మాచరమ్మ అంట్ల చప్పుడు, తోచక మళ్ళీ సాయంత్రం వాకింగూ, తినాలనిపిస్తే రాత్రి టిఫినూ, ఏ అర్ధరాత్రో అపరాత్రో కాస్సేపు కలత నిద్ర.. ఇదే దినచర్యతో జీవితం మీద పూర్తిగా విసిగెత్తి పోయింది రావుకి ఆర్నెల్లలోనే.

          అకస్మాత్తుగా చారి జ్ఞాపకం వచ్చాడు రావుకి. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికి ఏం సలహా కావల్సినా అతన్నే ఆశ్రయిస్తారు. ‘అయినా, మీ కొడుకునీ కోడల్నీ తప్పు పట్టలేం. ఎవరి జీవితం వారిదీ. శుభ్రంగా పెళ్లి చేసుకో. అన్నీ పరష్కారం అవుతాయి’ అన్నాడు చారి సలహా అడిగితే. ‘నా కెందుకో మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదురా’ చెప్పాడు రావు. ‘సర్లే, ఏదోటి ఆలోచిద్దాంలే ’ అన్నాడు చారి. నాలుగైదురోజులు పోయాక మళ్ళీ గుర్తుచేశాడు రావు. ‘రా, అలా బయటికి వెళ్ళొద్దాం.. నీకేం పని లేదు కదా’ అన్నాడు చారి ఓ రోజు అకస్మాత్తుగా వచ్చి. ‘అవతలి వాళ్ళు తన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా, తనొస్తే వాళ్ళకేమైనా అభ్యంతరం ఉందా అంటూ లౌక్యంగా ప్రశ్నించే తత్వం చారి సొంతం. వీడు మహా లౌక్యుడు’ ఆలోచిస్తూ చారితో బయలుదేరాడు రావు. చాలా సందులు తిప్పాడు చారి ఎక్కడెక్కడికో. చివరకి ఓ గడప తొక్కారిద్దరూ.

          ‘రండి చారిగారూ,  రండి.. మళ్ళీ కలవలేదు మనం, కూర్చోండి, ఈయనా..? ’ అంటూ రావు వంక చూస్తూ ప్రశ్నించాడు ఎదుటి వ్యక్తి. ‘ఈయన రావుగారని నా స్నేహితులు. గవర్నమెంట్ ఆఫీసులో పని చేస్తూ, విఆర్ ఇచ్చేశారు. భార్య ఈ మధ్యే పోయింది. ఈయనీ మధ్య ఒంటరితనం ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తే, నేనే తీసుకొచ్చాను ఇక్కడకి.  నాలా జాబ్ లేకపోతే, బతకలేము అనే టైపు కాదీయన. వెనుక బాగానే ఉంది... అన్నట్టు మీతోనే కాస్త పనుండి వచ్చాము’ అంటూ రావు వైపు తిరిగాడు. ‘నీ సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరకొచ్చు, అందుకే తీసుకొచ్చానిక్కడికి’ అన్నాడు చారి రావుతో. కాఫీలు తెప్పించబోతే తిరస్కరించారిద్దరూ.  

          ‘చూడండి రావు గారూ, నా పేరు బానోజి. చారిగారు చాలాకాలం నుండి తెలుసు... ఈ మధ్య మన సిటీల్లో నడుస్తున్న ట్రెండ్ గురించి మీకు తెలుసే ఉంటుంది. ఇది ఉభయ తారకం’ అన్నాడు బానోజి. అర్థం కానట్టు చూశాడు రావు. ‘కన్ఫ్యూస్ పడకండి చెబుతా. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు మేం పరిష్కారం చూబెడతాం... మీకు తొందరగా అర్ధం కావాలంటే, ఈ మధ్య పెళ్లిగాని కుర్రకారు ‘సహజీవనం’ పేరుతో, కలసి జీవిస్తున్నారు. ఇది అలా కాదు. ఒంటరితనంతో అలమటించే మీ లాంటి వాళ్ళకు ఉపశమనం కల్గించడమే మా పని, అది ఆడైనా, మగైనా. బిజీగా ఉండే ఈ ప్రపంచంలో, తమ ఒంటరితనం వదిలించుకోడానికి, కాలక్షేపం అవ్వడం కోసం నచ్చినవాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవారిని, అలాంటి ఉద్యోగం అంగీకరించి చేసేవారినీ... ఇద్దర్నీ కలపడమే మా బాధ్యత, ఇందుకోసం ఫీజు ఇవ్వడం మీ బాధ్యత’ అన్నాడు బానోజి నవ్వుతూ.

          రావుకి ఇలాంటి విషయాలు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. కాకపోతే, ఎక్కడో పడమర దేశాలలో ఇలాంటి సంస్కృతి నడుస్తూ ఉందని పేపర్లో చదవడమే గుర్తు. అది ఇక్కడిదాకా, అది కూడా తనదాకా పాకిందా? ఆలోచనలో పడ్డ రావును పక్కకు తీసుకెళ్ళాడు చారి. ‘ఇంతకన్నా మంచి పరిష్కారం నీకు దొరకదు. నీకు నచ్చినంతసేపు వాళ్ళతో కాలక్షేపం చేస్తావు, లేకపోతే బ్రేక్ అప్... నీకూ ఒంటరితనం దూరం అవుతుంది. అలా అని వాళ్ళనే అంటిపెట్టుకుని ఉండక్కర్లేదు పెళ్ళాంలాగో, లేక తప్పనిసరి పరిస్థితిలో భరించాల్సిన స్నేహితుడిలాగో,... ఫీజు కాస్త ఎక్కువైనా, అలాంటి సమస్య నీకు లేదు కాబట్టి చెబుతున్నా... ఆలోచించి చూడు’ అన్నాడు చారి. అయిదు నిమిషాల పాటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు రావు.

          ‘నా లాంటి వాళ్ళ అవసరాలు తీర్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడెవరైనా ఉన్నారా? ప్రశ్నించాడు రావు బానోజిని. ‘ఇప్పుడు సిద్దంగా గంగావతి అనే ఆవిడ ఉన్నారు. వయస్సు నలభై అయిదు ఏళ్లు. ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే, వంటల్లాంటి ఇంటి పన్లేమీ చేయరు. ఏదైనా పుస్తకాలు చదివి వినిపించమంటే, వినిపిస్తారు. తోచకపోతే కబుర్లు చెబుతారు, అదీ రోజుకి నాలుగ్గంటలు. అది ఆవిడ కండిషన్. ఉదయం పదిగంటలకొచ్చి రెండు గంటలూ, మూడింటికి వచ్చి రెండుగంటలూ మీతో ఉంటారంతే. దీనికోసం నెలకెంత తీసుకుంటారో ఆవిడే చెబుతారు, నచ్చితే పిలిపిస్తాను’ అన్నాడు బానోజి. రావు రెండు మూడు క్షణాలు ఆలోచించి సరేనని తలూపాడు. ఫోన్ చేసిన గంటకు వచ్చిందామె. రంగు చామన ఛాయ కన్నా కాస్త ఛాయ తక్కువే. కానీ ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరికీ పరస్పర పరిచయాలు చేశాడు బానోజి. తన గురించి ఆమెకి వివరంగా చెప్పాడు రావు. అయిదు నిమిషాలు ఇద్దర్నీ ఏకాంతంగా మాట్లాడుకోమన్నాడు బానోజి.

          ‘నా పేరు గంగావతి. నాకు పెద్దగా చదువు లేదు. ఎప్పుడో ఇంటర్ చదివాను. మా ఇద్దరి అక్కల పెళ్ళిళ్ళు అతి కష్టం మీద చేసి ఇక నా పెళ్లి చేయలేక పోయారు. ఇంటి దగ్గర బట్టలవీ కుడుతూ ఉంటాను.. ఆదాయం అంత స్థిరంగా ఉండదు. నాకు ఫిక్సెడ్ ఇన్కమ్ కావాలి. నాకో బాధ్యత ఉంది. నాకు నెలకు ఇరవై వేలు ఇస్తే, నేను చెప్పిన నాలుగ్గంటల టైములో మీ ఇంటికి వస్తాను. వారానికో రోజు, ఆదివారం నేను రాను. అంగీకారం అయితే చెప్పండి. ఆలోచించి చెబుతానంటే ఒకటి రెండ్రోజులు టైమ్ తీసుకోండి’ అంది గంగావతి. ఆలోచించి రేపు బానోజీ గారికి చెబుతానన్నాడు రావు. ఇంటికెళ్ళిన తరవాత ఆలోచనలో పడ్డాడు రావు. ‘నేను దీనిని ఒప్పుకుంటే, రేప్పొద్దున్న కొడుకూ కోడలూ ఏమీ అనరు కదా? అయినా, నేను చేస్తున్న తప్పేమిటి? నెలకింత కూలిచ్చి కాలక్షేపం కోరుకుంటున్నాడంతే. అది కొడుకూ కోడలూ ఇవ్వలేనిది’ రావు తనకు తాను సమర్ధించు కోవడంతో, అతని మనస్సు శాంతించింది. మర్నాడు తన అంగీకారం తెలియజేశాడు బానోజీకి.  

          మళ్ళీ ఇద్దరూ బానోజీ దగ్గరకి వెళ్లారు. అతను తన ఫీజు తీసుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం మూడింటికి రావు ఇంటికి వస్తానని చెప్పి, అతని చిరునామా తీసుకొని వెళ్ళిపోయింది గంగావతి. ‘జాగ్రత్త, అపరిచితులతో, కొన్నాళ్ళ వరకూ’ హెచ్చరించాడు చారి. అనుకున్నట్టుగానే సాయంత్రం సరిగ్గా మూడింటికి రావు ఇల్లు వెదుక్కుంటూ వచ్చిందామె. ఉదయం నుండి ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నాడు రావు. కాలింగ్ బెల్ మోగిన వెంటనే తలుపు తీసి చూస్తే, నవ్వుతూ గంగావతి నిల్చుని ఉంది. ‘రండి, రండి’ అంటూ ఆహ్వానం పలికాడు రావు. హాల్లోకి వస్తూనే, కనబడ్డ మేరా ఒక్కసారి ఇల్లంతా ఆసక్తిగా పరిశీలించింది. ‘మంచి నీళ్ళు తీసుకోండి’ అన్నాడు రావు ఆమె చేతికి గ్లాసు ఇస్తూ. ‘థాంక్స్’ చెబుతూ చిరునవ్వుతో తీసుకొని, పోయిన అనంత లక్ష్మి ఫోటోను పరిశీలించింది. కాస్సేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.

          ‘ఆవిడకి ఏమైంది, ఎలా పోయారు? ’ ప్రశ్నించింది గంవతి. గంగావతి గురించే ఆలోచిస్తున్న రావు, భార్య ప్రస్తావన రాగానే, విషాద భరితంగా మారిపోయాడు. ఉద్వేగంతో మాట్లాడలేక పోయాడు. ‘సారీ,  ఏమనుకోకండి, మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశ్యం కాదు’ నొచ్చుకుంది రావునే గమనిస్తున్న గంగావతి. ‘రోజూ మీరు ఏమేం చేస్తూ ఉంటారు? ’ అంటూ మాట మారుస్తూ మళ్ళీ ప్రశ్నించింది. ‘ఏముంది? లేవడం, కాస్సేపు వాకింగ్, తినడం, పేపర్ చదువు కోవడం, పడుకోవడం.. రొటీన్, మధ్యలో పని మనిషి నాంచారమ్మ వచ్చి పోతుంది. అంతే’ టాపిక్ మారినా రావులో పెద్దగా మార్పు రాలేదు గానీ, సమాధానం అయితే చెప్పాడు. ‘ఏమీ లేదండీ, సడన్గా హార్ట్ ఎటాక్.. అంతే, ఆవిడ లేని జీవితం ఊహించలేక పోతున్నాను, కానీ తప్పడం లేదు ’ అన్నాడు మళ్ళీ. ‘ఎవరెవరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో ఎవ్వరూ చెప్పలేం’ వేదాంతం ధ్వనించింది ఆమె గొంతులో. కాస్సేపు ఇల్లంతా తిరిగి చూసింది. ‘ఈవిడ గంగావతి గారు. నా స్నేహితురాలు’ అంటూ నాలుగింటికి వచ్చిన నాంచారమ్మకి గంగావతిని పరిచయం చేశాడు. ‘రేపు కలుస్తాను’ అంటూ టైమ్ చూసుకొని అయిదింటికి వెళ్ళి పోయిందామె. ఆమె సరిగ్గా వేళకి రావడం, వేళకి పోవడం గమనించాడతను.

          మొహం నిండా చెమటతో వచ్చిందో రోజు. ఎందుకింత హడావిడిగా వచ్చారని రావు ప్రశ్నిస్తే, ‘ఏదైనా, డ్యూటి డ్యూటియే కదండీ, నేను ప్రతిఫలం పొందుతున్నప్పుడు, దానికి న్యాయం చేయాలి కదా! ’ అంది. ఆవిడకున్న బాధ్యత ఏమిటని ప్రశ్నిస్తే, నవ్వి ఊరుకుంది. టైమ్ చూసుకుని వచ్చి వెళ్ళి పోయేది. మొదటిసారిగా ఆమె టైమ్ సెన్సుకి చిరాకేసింది రావుకి. రావు అసహనంగా చూస్తూన్నా, పట్టించుకోలేదామె.

          మళ్ళీ మధ్యాహ్నం ఆమె వచ్చినపుడు ముభావంగా ఉండిపోయాడు రావు. ‘మీదేం ఉద్యోగం, మధ్యలో ఎందుకు మానేశారు? ఫరవాలేదనుకుంటేనే చెప్పండి’ అడిగింది గంగావతి. రావు మాట్లాడలేదు. ‘ఏమీ అనుకోకండి. అలా ప్రతీ దానికి టైమ్ మైన్టైన్ చేయడం నాకలవాటు. ఉదయం మధ్యలో వెళ్లిపోయినందుకు మీరు అలిగారని నాకు అర్ధం అవుతూనే ఉంది’ అంది నవ్వుతూ. ఆ మాటంటే గానీ మళ్ళీ ఈ లోకంలోకి రాలేదు రావు. మళ్ళీ కబుర్లలో పడ్డారు. పనిమనిషి వస్తేగాని లోకం తెలియలేదు రావుకి. అప్పుడప్పుడూ పుస్తకాలు వినిపించేది.

          రోజులు వేగంగా గడిచి పోతున్నాయి. మొదట్లో లాగా, రావు ఇప్పుడు అలగడం మానేశాడు. ‘ మీ భార్యపోతే, మళ్ళీ పెళ్లి ఆలోచన ఎందుకు చేయలేదు? ’ అడిగిందోసారి రావుని. రావు సమాధానం ఇవ్వలేదు. వత్తిడి చేయలేదామె. ‘మళ్ళీ ఎల్లుండి వస్తాను’ అంది ఓ రోజు. ‘రేపు రారా?! ఏమైనా పనుందా? ’ ఆశ్చర్యంతో ప్రశ్నించాడు రావు. ‘రేపు నా వీక్లీ ఆఫ్.. అదేనండీ ఆదివారం.. మరచిపోయారా? గుర్తు చేసింది. ఆ సంగతే మరచిపోయాడు రావు. ‘అయి గోరూ, మా ఊరెల్లి శానా దినాలయింది. పది రోజులు రోజులు సర్దుకోండయ్యా’ అంటూ నాంచారమ్మ కూడా చెక్కేసింది.  

          మర్నాడు ఆదివారం అతి భారంగా గడిచింది రావుకి. ఆమెతో గడిపే ‘ఆ నాలుగు గంటల’ గురించి సోమవారం వరకూ ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఈ లోపులో బయటికెళ్తే, ఇరుగూపొరుగూ ఆరాలు. ‘రోజూ మీ ఇంటికి వచ్చే ఆవిడ మీ బంధువా? ’ అంటూ. ఆదివారం రాత్రంతా నిద్రలేదు రావుకి. ఉదయం రావు జోగుతూ ఉంటే, ‘గుడ్ మార్నింగ్’ అంటూ పదింటి కొచ్చి విష్ చేసింది గంగావతి. ఆ కబురూ ఈ కబురూ చెబుతూ, మధ్యలో కింద ఉన్న ఏవో వస్తువులను గంగావతి తన బేగ్ లో పెట్టుకోవడం, చూసీ చూడనట్లు చూసాడు రావు. చారికి ఫోన్ చేయబోతే తన ఫోన్ కనబడలేదు రావుకి, షర్టులో చూడబోతే పర్స్ కనబడలేదు. ఏదో అనుమానం. ఇక్కడ డబ్బూ, సెల్లూ కాదు ముఖ్యం. నమ్మకం. అది లోకపోతే బంధాలు బీటలు వారతాయి. ఇల్లంతా వేదికి, రింగ్ చేయిస్తే, ఫోన్ స్విచ్ ఆఫ్. గంగావతి కూడా వెదికింది కానీ ఎక్కడా దొరకలేదు. చారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ‘అపరిచితులతో జాగ్రత్త’ ఈ అనుమానం రెట్టింపవుతూ వచ్చింది రావులో. ఆమె వాష్ రూముకి వెళ్ళి నపుడు, బేగ్ చెక్ చేద్దామనుకున్నా, ఆ అవకాశం రాలేదు. మొత్తానికి ఆ అనుమానం పెరుగుతూ, స్థిర పడుతూ వచ్చింది.

          మర్నాడు రావుకి ఒకటే జ్వరం, నూట మూడు. ఉదయం వస్తూనే, రావు పరిస్థితి చూసి ఎవరో డాక్టర్ కి ఫోన్ చేసింది గంగావతి. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి, టాబ్లెట్స్ ఇచ్చాడు. కిచెన్లోకి వెళ్ళి, గుడ్డ తడిపి నుదుటి మీద వేసింది. భార్య తప్పించి, ఇంతవరకూ అలా సేవ సేవ చేసినివాళ్ళు ఎవరూ తారసబడ లేదు రావుకి. ‘మీ కెందుకూ శ్రమ’ కొంచెం సిగ్గుగా అనిపించి తిరస్కరించ బోయాడు. వూరుకోలేదు ఆమె. ‘ఇలాంటప్పుడు చేయక పోతే, మానవత్వానికి అర్థం ఏముంది? ’ టాబ్లెట్స్ మింగిస్తూ అంది. టైమ్ చూస్తే, మధ్యాహ్నం వొంటి గంట. ‘ఏమండీ, మీ టైమ్ దాటి గంటయింది’ గుర్తు చేశాడు. ‘ష్.. మాట్లాడకుండా పడుకోండి’ పడుకోబెట్టి, పక్కన కూర్చుంది. ‘బాగా లేకపోతే, ఫోన్ చెయ్యొచ్చు కదా! ’ ప్రశ్నించింది. ‘నా ఫోన్ ఏమయిందో కనిపించలేదు’ నీరసంగా అన్నాడు. ‘ఇంకా మీ ఫోన్ కనిపించలేదా?! ’ ఆశ్చర్యంగా అంది. మధ్యలో ఎవరికో ఫోన్ చేసి సాయంత్రం వస్తానని చెప్పింది. ఈ లోపులో నిద్ర పట్టేసింది రావుకి. లేచి చూస్తే, గ్లూకోజ్ గ్లాస్ తో గంగావతి. ‘కాస్త తాగి రెస్ట్ తీసుకోండి’ అంటూ వద్దన్నా తాగించింది. ‘మీరు ఇంటికి వెళ్ళలేదు కదా, మీకు భోజనం? ’ నీరసంగా ప్రశ్నించాడు. ‘ఒకపూట లేకపోతే నష్టం లేదు లెండి’ అంటూ నవ్వింది. ‘రాత్రి మీరు ఒక్కరూ ఉండగలరా? ’ ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు రావు. ఆ రాత్రి అక్కడే ఉండి పోయింది గంగావతి. ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతయింది.

          రెండు మూడ్రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. ఆమె వచ్చి నెల అయి పోయిందప్పుడే. ‘బయటికి వెళ్దామా? ’ అడిగితే సరేనంది. ఇద్దరు కారులో వెళ్తూంటే, మెడికల్ షాప్ దగ్గర అపాడు రావు. ‘నాలుగు రోజుల క్రితం ఇక్కడకొచ్చి, మీ సెల్లూ పర్స్ మరచిపోయి వెళ్ళిపోయారు. సెల్ స్విచ్ ఆఫ్ అయి ఉంది, ఎప్పుడూ వస్తుంటారు కదా వస్తే ఇద్దామని చూస్తున్నాను’ అన్నాడు షాప్ ఓనర్. ‘ఇంకా ఇంట్లోనే పోయిందనుకున్నాను’ అన్నాడు రావు. తిరిగి చూస్తే, గంగావతి. కత్హి వాటుకు నెత్తురు చుక్కలేదు రావులో. ‘తనా మాట అనడానికి కారణం చారి హెచ్చరిక.. ఇప్పుడు నేను తనను అనుమానించినట్టు అనుకుందా? ’ ఆమె ముఖంలోకి బెరుకుగా చూశాడు.

          గంగావతి ముఖంలో ఏ భావమూ కనిపించలేదతనకి. ఏ భావమూ తొందరగా కనిపించదు ఆమె ముఖంలో. ఈ నెల్లోనే గంగావతి అతని జీవితంలో ముఖ్యభాగం అయిపోయింది. ఆమె లేని ఆదివారం వస్తేనే, దిగాలు పడే స్థాయికి వచ్చేశాడు రావు. నెలలోనే రావులోని ఒంటరితనం పోయి, మనిషిలో హుషారు వచ్చింది. అది స్పష్టంగా కనిపిస్తూందని చెప్పాడు చారి. సాయంత్రం ఆమె వెళ్ళేప్పుడు, ఆమెకివ్వాల్సిన ఇరవైవేలు ఇచ్చేశాడు.

          ‘రావు గారూ.. ఏమనుకోవద్దు. నేను రేపట్నుండి రావడం లేదు’ అంటూ బాంబు పేల్చింది. షాక్ అయిపోయాడు రావు. ఆ మాట అతనే మాత్రం ఊహించనిది. ‘ఎందుకలా అంటున్నారు? డబ్బు ఇంకా కావాలా? ’ అనుకోకుండా ప్రశ్నించాడు. ‘నమ్మకం కావాలి. అది నాలో మీకు కనిపించడం లేదు. అది మీ తప్పు కాదు. నెల రోజులైనా, అది మీకు కలిగించలేక పోవడం నా తప్పు. క్షమించండి. ఇక ఉండలేను ’ అంటూ రావు ఏం చెప్పబోయినా వినకుండా వెళ్ళి పోయింది. బుర్ర తిరిగిపోయింది రావుకి. ఆరోజు చారి హెచ్చరిక మనసులో మెదిలి, మెడికల్ షాప్ ఓనర్తో తానన్న మాటకు గంగవతి మనసు బాగా గాయపడిందని అర్ధం అయింది రావుకి. ఇక ఉండబట్టలేక చారికి జరిగిందంతా చెప్పాడు. ‘ముందే చెప్పాను కదా, ఆమె కాకపోతే మరొకరు’ అన్నాడు చారి.  

          మనస్సు పూర్తిగా వికలమై పోయింది రావుకి. ఒకరు పోతే మరొకరు అంటే, ఇదేమైనా వ్యాపారమా? మనసు... మనస్సేమిటి? తాను చేసింది వ్యాపారమే కదా, ‘జస్ట్ అగ్రీమెంట్ అండ్ డిటాచ్మెంట్’ అగ్రీమెంట్ గెలిచిందా? మనసు గెలిచిందా? పరిపరి విధాలా పోతోంది రావు మనస్సు. సాయత్రం వాకింగుకి వెళ్ళి బెంచ్ మీద ఎంతసేపు కూర్చున్నాడో, వాచ్మాన్ చెప్పేదాక అతనికే తెలియలేదు. గంగావతికి ఫోన్ చేసినా, లిఫ్ట్ చేయ లేదు. రెండు రోజులు పూర్తిగా నిద్రపట్టక, పూర్తిగా నీరసించి పోయాడు. అందులోకీ ఈ మధ్యే జ్వరం వచ్చి తగ్గింది.

          ఇక నరకం భరించలేక, గంగావతి అడ్రసు వెతుక్కుంటూ వెళ్ళాడు... దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఉండే ప్రాంతం అది. రెండు పోర్షన్ల పెంకుటిల్లు. తలుపు తట్టబోయి ఆగిపోయాడు. ‘ఏదో మా అక్క లేదని నీ బాధ్యత తీసుకున్నాను. మూణ్ణెల్లో నీ డిగ్రీ అయిపోతే ఉద్యోగం చూసుకుంటావనుకుంటే ఇంకా, చదువుతా నంటావేమిటి? అయినా నాకిప్పుడు ఏ ఉద్యోగం లేదు, అది గ్రహించు’ అంటోంది గంగావతి. తలుపు తట్టాడు రావు. అతనిలా సరాసరి తన ఇంటికి రావడం ఊహించక షాక్ అయిందామె. రావే చొరవ చేసి, లోపలికెళ్ళి కూర్చున్నాడు. రెండు క్షణాలు మౌనంగా ఉండి గొంతు విప్పాడు.

          ‘గంగా!.. ఇలా ఏకవచనంతో పిలుస్తున్నానని ఏం అనుకోవద్దు. నేను మళ్ళీ పెళ్లెందుకు చేసుకోలేదని అడిగావ్. నా భార్య స్థానంలో ఎవర్నీ ఊహించుకోలేదు ఇన్నాళ్ళూ. సంస్కృతి, ఆచారవ్యవహారాలు, అలవాట్లు, ఆహారం, సర్దుబాట్లు.. ఇలా అన్నీ కలిస్తేనే, ఏ బంధమైనా బలపడుతుంది. ఇన్నీ ఉన్నా, ఆ బంధాన్ని చివరకు మన సమాజం కూడా గుర్తించాలి. ఇది, నా దగ్గర నువ్ చేసే కాంట్రాక్ట్ ఉద్యోగంలో దొరకదు. నీతో గడిపే క్షణాలన్నీ, నాకు ఆపాత మధురాలే. ఇక నేను ఓ బలహీనక్షణంలో ఆలోచించకుండా, అనుమానిస్తున్నట్టు మాట్లాడాను. నన్ను మనస్పూర్తిగా క్షమించు. నువ్ లేని ఈ రెండు రోజులూ ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నాను. నీ జీవితం ఎలా దిద్దుకోవాలో, అది పూర్తిగా నీ ఇష్టం. కానీ గంగా, నువ్వు లేని నా జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. నీకు నచ్చితే... ఎప్పుడైనా పగిలిపోయే అద్దాల సౌధం లాంటి ఈ కాంట్రాక్టు ఉద్యోగాన్ని కాన్సెల్ చేద్దాం. భవిష్యత్తుకి భరోసా నిచ్చే బంధానికి బాటలు వేద్దాం. వివాహం చేసుకుందాం. నా బలహీనతలన్నీ నీకు తెలుసు. నీ బాధ్యతలన్నీ మనవి. అన్నీ ఆలోచించి ఓ గంటలో ఫోన్ చెయ్యి’ అంటూ బయటికి వచ్చేశాడు రావు.  

          ఆ రోజంతా తలుపు తెరచి ఎదురు చూసినా, గంగావతి దగ్గర నుండి, ఏ ప్రతిస్పందన రాకపోవడంతో ఢీలా పడిపోయాడు రావు. బుర్ర పగిలి పోతుంటే, కిచెన్ లోకి వెళ్ళి, టి పొడుం కోసం వెదకసాగాడు. ‘అంతసేపు వెదుక్కుంటారేంటండీ, ఈ ఆల్మరాలో, పైనుండి రెండోది’ వెనక్కి చూస్తే గంగ. ‘ఇంతసేపూ ఫోన్ చేయలేదేంటి? ’ ప్రశ్నించాడు రావు. ‘మళ్ళీ అలగకండి, అయినా నా ఇంటికి రావడానికి టైమ్ ఏమిటి? ’ చనువుగా రావు చేతిలో టీ పొడిని తీసుకుంటున్న గంగను చూస్తూంటే, రావు కళ్ళు మిల మిలా మెరిసాయి.

0 Comments