ఉత్తరాయణం  (Author: యల్లనూరు వేంకట రమణా రెడ్డి)

శరత్కాల వెన్నెల్లో వేకువ స్నానం, మంచు ముసిరిన వీధుల్లో దోబూచులాటలూ, వణికిస్తున్న చలిపులి పంజా ఓవైపు, ధనుర్మాస వ్రతదీక్షకు కంకణం కట్టడం, ఆధ్యాత్మికాభావంతో శ్రీహరికి వేడుకోలు, ముగ్గులేసి మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానించడం.. చెప్పుకుపోతే బోలెడన్ని మధురస్మృతులు. గడచిపోతున్న సంవత్సరానికి వీడ్కోలిస్తూ, కొత్తసంవత్సరానికి స్వాగతంచెబుతూ, భవిష్యత్తును ఆహ్వానించే ‘డిసెంబరు’ నెలంటే ఇష్టపడని వారుండరేమో..?

“ఓసారి వీలు చూసుకుని ఊరెళ్లిరావాలి. చిగురాకులతో కబుర్లాడి, చిలకమ్మను పలకరించాలి. తూనీగలా మారి, బాల్యాన్ని తిరగెయ్యాలి. పక్షిగూట్లోని గువ్వనై, వేకువను ఆస్వాదించాలి. కారుమబ్బులను ముద్దాడి, మొదటి చినుకునవ్వాలి. పారుతున్న సెలయేటికి జతకట్టి, చిందులేయాలి. చేలగట్లమీద డుర్రుమంటూ పరుగెత్తాలి. గోధూళివేళ సందడై, వెన్నెల్తో ఊసులు చెప్పాలి. పల్లె తెలుగుతేనె రుచి చూసి, కొండకోనల్లో వాగుపాటలు పాడి, ఇంద్రధనస్సులా రంగులహోళీతో తిరిగిరావాలి. వీలవకున్నా, వీలు చేసుకుని ఓసారి ఊరెళ్లిరావాలబ్బా..!” ప్రతి సంక్రాంతికి ముందూ తెలుగువారి తలపుల్లో వచ్చే మాటే ఇది.

         సొంతూరంటే.. చిన్నప్పటి స్నేహితులు, దగ్గరి బంధువులు, తిరుగాడిన వీధులు, నేర్చుకున్న పాఠాలు, మరపురాని జ్ఞాపకాలు. సంవత్సరానికి ఒక్కసారి ఊరితో ఉన్న ముడిని గుర్తుచేసే ఏకైకపండుగ 'సంక్రాంతి'. ‘మనకూ ఓ ఊరు ఉంది’ అనే భావనతో సంతోషాన్నిచ్చే పండుగ ‘సంక్రాంతి’.

         ఇంటిముందర వేసిన రంగవల్లికలు ఓ అందం. గడపకు రాసిన పసుపు ఓ అందం. గుమ్మానికి కట్టిన పచ్చని తోరణం ఓ అందం. ఇంట్లో కుప్పలుగా నిలువున్న ధాన్యం ఓ అందం. ఊరిచివర.. పచ్చనిపొలాలు ఓ అందం. నాగలి, గోమాత, కాడెడ్లుగల చావడి ఓ అందం. ఆదిదంపతులైన అమ్మానాన్నలు (/అమ్మమ్మతాతయ్యలు) ఓ అందం. ఆకాశాన రివ్వున ఎగిరే పతంగి ఓ అందం. వీధిలో తిరిగే డూడూ బసవన్నలు ఓ అందం. ఈ రంగుహంగులన్నీ అమ్మాయి మేనిని సింగారిస్తే, అదే తెలుగువారి సంప్రదాయ వేడుక. రంగురంగుల కళతో ముస్తాబు చేసే సంక్రాంతి అందరి మనసుల్లో నిలిచివుండే సదాక్రాంతి.

         ఇవన్నీ ఓ పదీ, పదిహేను సంవత్సరాలక్రితం నాటి సరదాలు. ఆ తర్వాతా.. ఓ అయిదేళ్లపాటూ కాస్తోకూస్తో బాగున్నా, తర్వాతికాలంలో ఊరి సంగతుల గురించి తెలిసినవారిని విచారించినప్పుడో, సోషల్ మీడియా ద్వారానో తెలుస్తోందేమంటే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కరువు విలయతాండవమాడుతోందని..!

“రాబోయే సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోబోతున్నారు..?” అని ఓ యువ విలేకరి అడిగిన ప్రశ్నకు ఓ పెద్దాయన "నాలుగైదు సంవత్సరాలక్రితం వరకూ.. ధాన్యంతో నిండాల్సిన గాదెలు నిండుకుని, అనాధగా ఆకలికేకలు పెట్టేవి. ఉన్న పాడె గేదెల్ని, ఎద్దుల్ని అమ్ముకుని, ఊరంతా నాలుగైదు ఎద్దులతో నెట్టుకొస్తున్నందున, గంగిరెద్దుల విన్యాసాలుండేవిగాదు. సరిపడా వర్షాలు లేక బోర్లు-బావులు ఎండి, త్రాగడానికే నీళ్ళు దొరక్క అవస్థపడుతుంటే.. భోగిస్నానాలు, పాలపొంగులకు చోటుండేదిగాదు. కరవు రక్కసి పడగకు బెంబేలెత్తి, ఎండిన డొక్కల పశువులను కబేళాలకు తోలేస్తోంటే, ఇంటిముంగిట గొబ్బెమ్మల శోభను ఊహించలేకపోయాము. పంటసాగుకని తెచ్చుకున్న అప్పులు తీర్చలేక, నట్టనడిఊర్లో కట్టుకున్న పెద్ద మేడలాంటి ఇళ్లను తాకట్టుపెట్టి, పొలాల్లోని మోటారుషెడ్లలో నివశించాము. వడ్డీవ్యాపారులనుంచి తప్పించుకొనేందుకు.. చెట్టుకు ఉరేసుకున్న ఆత్మహత్యల సంఖ్యా ఎక్కువే. రైతు అనే ఉనికే ప్రశ్నార్థకమవుతోంటే, పల్లె పండుగకు నగరవాసిని ఆహ్వానించలేకపోయాము. మూడుపూట్ల తిండిసంగతి దేవునికి ఎరుక.. ఓ పూటా పూర్తిగా నాలుగేళ్లూ నోట్లోకి వెళ్లలేనిదశలో.. నగరాలకు వలసవెళ్లిన వారిని పల్లెకు ఆహ్వానించి, పండుగ భోజనం పెట్టలేకపోయాము. గత మూడేండ్లుగా సమృద్ధిగా వర్షాలుపడి, వాగులు-వంకలు పొంగి, భూముల దాహార్తి తీరి, పంటలు దండిగా పండి, అప్పులన్నీ తీరి, సొంతిళ్లలోకి మారిపోయాము. పశువులు సైతం పొట్టనిండా తిని నెమరేసుకుంటున్నాయి. గాదెలు తిండిగింజలతో నిండాయి. నగలు-నగదుతో బీరువాలు నిండాయి. కాబట్టి, వచ్చే సంక్రాంతికి అందర్నీ ఆహ్వానించి సంకురాతిరి సంబురాలు పూర్వంలా చేసుకోబోతున్నాము” అని హృద్యంగా బదులిచ్చాడు.

         ఏ కాలంలోనైనా అమ్మ అమ్మే..! మొబైల్ ఫోన్లో గ్రీన్-బటన్ నొక్కడం మాత్రమే తెలిసిన ‘అమ్మ’.. నగరంలో వున్న తన కొడుకు ఫోన్ చెయ్యగానే, 'అన్నం తిన్నావా నాయనా..?' అని అడుగుతుంది. కుశలప్రశ్నలన్నీ భగవన్నామస్మరణలాగా పలికి, ‘పండక్కి రారా’ అని ఏకైక కోరిక కోరుతుంది. ‘ఈసారి సంక్రాంతికి వస్తానమ్మా’ అని బదులిచ్చిన కొడుకుమాటతో ఆమెకళ్ళలో వెలిగిన జ్యోతి, కొడుకు కుటుంబం తిరుగుప్రయాణం వరకూ మెరుస్తూనే ఉంటుంది.

         అయినా, ధన సంపాదనలోపడి రోజుకు పది-పన్నెండుగంటలపాటు పనిచేసుకునే నగర / విదేశీజీవికి సొంతూరికి వెళ్ళొద్దాం అనే ఆలోచనేదీ..? ఊరెళదామంటే, సరిపడేనన్నిరోజుల శెలవు దొరకడం బహుకష్టం. ఇంకేం సంక్రాంతి..? కోవిడ్ తర్వాత, కోడిపందేలు వర్చువల్ అయిపోయాయి. పిండివంటలు స్వగృహఫుడ్స్’లో లభ్యమవుతున్నాయి. బిగ్-బాస్కెట్'లో గొబ్బెమ్మలు, స్విగ్గీలో పొంగలి ప్యాకెట్లు, అమెజాన్'లో ప్లాస్టిక్ ముగ్గులు, గ్రాఫిక్స్'లో భోగిమంటలు, స్టేటస్'లో హరిదాసు బొమ్మలు.. ఇవీ నగరాల్లో / విదేశాల్లో ఘనంగా జరుపుకునే సంక్రాంతి వేడుకలు.

~~~~~~

         ‘మాధవ్-లక్ష్మి’లది పదిహేనేళ్లు దాటేసిన దాంపత్యం. ఇద్దరూ సాఫ్ట్-వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ కెనడాలో స్థిరపడ్డారు. వీరి కూతురు 'అమూల్య'పై మక్కువతో ఏడాదికో, రెండేండ్లకో కొడుకు / కూతురు ఇంటికి వస్తుండేవారు మాధవ్-లక్ష్మిల తల్లిదండ్రులు. విదేశీ జీవనానికి సరిపడని వృద్ధాప్యంవల్ల కొన్ని సంవత్సరాలుగా రావట్లేదు.

“ఎప్పుడూ నగరంలోని ఏకైక ఆలయంలో జరిగే అభిషేకాలేనా..? ఈసారికి సంక్రాంతి మూడురోజులూ పల్లెకు జరిగే పట్టాభిషేకాన్నీ చూసొద్దాం. ఇక్కడి నాటకీయ పలకరింపులతో విసిగిపోయాము. హృదయపూర్వక ఆహ్వానంతో పులకరించే స్వస్థలాన్ని తాకివద్దాం. పిజ్జా-బర్గర్, కెఎఫ్-సీ, ఛాట్-మసాలాలేనా ఎప్పూడూ..? సొంతూరి పిండివంటలతో కడుపునింపుకొద్దాం. మొబైల్-గేమ్స్, మల్టీప్లెక్స్-షోలు బోరుకొట్టాయి. కోడిపందేలలో పాల్గొని, సరదా తీర్చుకుందాం. సొంతూర్లో అమ్మానాన్నదగ్గర కొడుకనే ఆప్యాయతను, అత్తారింట్లో అల్లుడిహోదానూ అలరిద్దాం. చిన్ననాటి స్నేహితులతో కబుర్లాడి, మరోమారు పసివాళ్లమై మనసారా జీవిద్దాం‌‌‌‌. భోగి-సంక్రాంతి-కనుమ మూడ్రోజులూ పల్లెను ఉబ్బితబ్బిబ్బయ్యేలాజేసి, మురిపించి, తిరిగి బయలుదేరే సమయాన.. కన్నీరు చిందించే పల్లెమనసులు ఊరడిల్లేలా మళ్ళీ సంక్రాంతికి తప్పక వస్తామని మాటిచ్చిమరీ తిరిగొద్దాం. విదేశాల్లో జీవిస్తున్నా.. చివరి మజిలీ పల్లేనని ప్రమాణం చేసుకుందాం..!” అంటూ మాధవ్ చెబుతోంటే, ‘ఏంటి.. మీరేనా ఇలా మాట్లాడుతోంది..? ’ అని ఆశ్చర్యపోయింది లక్ష్మి. ‘ఇండియాకి వెళ్ళొద్దాం’ అనగానే ఎగిరి గంతేసింది అమూల్య.

“టీవీలో చూస్తున్నాముగా.. దేశమంతా కరోనాతో కకావికలమయినా, తెలుగు రాష్ట్రాల పల్లెలు మాత్రం కాస్తోకూస్తో కాసులతో కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు ఉపాధికి వలస కేంద్రాలు'నగరాలు'. కానీ నేడు, కరోనా ధాటికి పల్లెలే ఆశాదీపాలైనాయి. దశాబ్దాల తర్వాత ఊహించని విధంగా ప్రాజెక్టుల పుణ్యమాని'వ్యవసాయం'ఆర్థిక వనరుగా మళ్ళీ పుంజుకోవడంతో పల్లె జనాభా 30% పెరిగిందట. ఇకపై, సొంత ఊర్లో ఎవరికివారు హాయిగా బ్రతకొచ్చనే భరోసా పల్లె జనాలకు లభించిందట. సాగునీరు పుష్కలం, పండిన పంటను కొనే ప్రభుత్వం, రైతుబంధు క్రింద ఎకరానికింత డబ్బు అకౌంట్లో జమ.. ఇంతకంటే ఇంకేం కావాలి నిర్భయంగా బ్రతకడానికి..! పల్లెల్లోని ప్రతి గడపలో సిరులు కురిశాయి. రైతు కుటుంబాల్లో కొనుగోలు శక్తి పెరిగి, రకరకాల వాహన కొనుగోళ్ళు పెరిగాయట. కరోనా దెబ్బకు నగరంలో అన్ని రంగాలు కుదేలయితే పల్లెల్లో మాత్రం రైతు రాజుగా మారాడట. ఇకపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పల్లెలే పట్టుకొమ్మలేమో..? దశాబ్దాల తర్వాత పారిశ్రామిక రంగం చూపు వ్యవసాయం వైపు మళ్లిందని మీడియా చెబుతోందిగా..? ఒకవేళ మీడియా అబద్ధం చెబుతోందనుకోవడానికి.. గత మూడు సంవత్సరాలుగా పల్లెల్లో మార్పొచ్చిందని మన అమ్మానాన్నలూ చెబుతున్నారుగా..?” అని నమ్మబలికింది లక్ష్మి.

         అనుకోవడమే ఆలస్యం, సంక్రాంతి పండుగకోసమని ఓ పదిరోజులు ఆఫీసులో ఇద్దరూ లీవ్ పెట్టేయడం, ప్రయాణానికి సిద్ధపడటం జరిగిపోయింది. విమాన ప్రయాణం ఓ పదిహేను గంటలు, అక్కడినుంచి తమ గ్రామానికి కారులోనైతే ఓ మూడుగంటలు. ముందురోజు రాత్రి బయలుదేరడంవలన భోజనసమయానికి ముందే గ్రామ పొలిమేరలు చేరుకున్నారు మాధవ్ కుటుంబం. ఒకప్పుడు వీరి ఊరికెళ్ళాలంటే, దగ్గర్లోని మండలకేంద్రం నుంచీ దాదాపు మట్టిరోడ్డే. అయితే, ఈ మధ్యే వేసిన జాతీయ రహదారిని చూసి, మాధవ్ ముచ్చటపడ్డాడు. కాలువ పక్కనే రోడ్డు. రోడ్డుకి అటుపక్క కొబ్బరిచెట్లు.. అప్పుడే అభ్యంగన స్నానం చేసి తలలు ఆరబెట్టుకుంటున్న మగువల్లాగా ఉన్నాయి. ఇప్పుడు కార్లో వెళ్తోంటే ప్రయాణమైతే సుఖంగా ఉందిగానీ, నాలుగువరుసల రహదారి కదా, ఊరి పొలిమేరల్లోని పేదల ఇళ్ళు కొన్ని కనుమరుగైపోయాయి. ఆనందించాలో, బాధపడాలో అర్థంగాని స్థితి మాధవ్’ది.

~~~~~~

         మనవరాలి బుగ్గలు గిల్లి, మాధవ్ కడుపు తడిమి, కోడలు చెయ్యి పట్టుకుని, ‘ఎప్పుడు తిన్నారో ఏమో.. ముందు ముఖం కడుక్కుని రండి’ అంటూ మాధవ్ అమ్మ 'అన్నపూర్ణమ్మ' ఆప్యాయంగా చేరదీసింది. అట్టడుగున ఎప్పుడూ క్షమ కనబడే లోతయిన అగాధం ‘తల్లి హృదయం’. నవ్వుతోటే పలకరించాడు మాధవ్ నాన్న ‘పరమేశ్వరరావు’.

“సూర్యచంద్రులను నిద్రపుచ్చుతాడు. అందరూ నిదరోయిన తర్వాత, చుక్కల్ని చూస్తూ ఊసులు చెప్పుకుంటాడు. తొలిఝాములోనే నిద్రలేచి సూర్యున్నే నిద్రలేపుతాడు. వృత్తివ్యాపారాల్లో నిజాయితీకి నిలువెత్తు రూపం. అనుబంధ ఆప్యాయతలకు, కుటుంబ బంధాలకు సనిర్వచనం. చద్దన్నం సైతం అల్పాహార ప్రసాదంగా భావిస్తాడు. తీరికలేని పనుల్లో సతమతమైనా, దొరికే నిమిష విరామమే మధ్యాహ్న భోజనం. కథ చెప్పమనే మనుమలు, మనుమరాళ్ల పలుకే.. కడుపు నిండిన రాత్రి భోజనం. ఆధునిక మాయలోపడి కూలగొట్టుకుంటున్న, చెదురుతోన్న అనుబంధాల గూడును.. పండిపోయిన అనుభవసారంతో తిరిగి అల్లమని, ఆదర్శప్రాయుడుగా నిలవాల్సిన సమయమిదేనని మనసెరిగిన అర్థాంగి మాటల అంతరార్థాన్ని గుర్తెరిగి, తనలోని పెద్దరికమనే పాత్రనూ సదా పోషిస్తుంటాడు..!” ఎవరనుకుంటున్నారు..? మన ఇళ్లల్లో వుండే పెద్దతరం పెద్దాయన.

“ఆమె నాకు తినిపించిన గోరుముద్దలన్నీ ఎవరో ఒకరి పేరుతో తిన్నవే. అమ్మ ముద్దనో, నాన్న ముద్దనో, అక్క ముద్దనో ఇలా నేను గుటుక్కుమనిపించిన ముద్దలు.. అన్నం కలిపే ఆమె చేతి కిటుకులు. మామిడితోటల్లో ఆమెవెంట నడుస్తున్నప్పుడు కాలిబాటలే మావైపుకు పరిగెత్తుకొచ్చేవి. దారిపొడవునా చెట్లకొమ్మలు విసనకర్రలై గాలి ఊపేవి. చీకటి ఆకాశాన్ని నులకమంచంపై నిదరపుచ్చే వేళ ఆమె నోటివెంట దొర్లే జానపదగాధలన్నీ నక్షత్రాలై నింగితెరమీద మెరిసేవి. వెన్నెలనిచ్చెనద్వారా దిగివచ్చే చంద్రుణ్ణి సైతం ఆమె తనఒళ్ళో వేసుకుని నాతోబాటూ జోకొట్టేది. ఎప్పుడైనా తనని మా అమ్మ కసురుకుంటే, ఆమెముఖంలో చంద్రుడు మాయమైపోయేవాడు. తన ముఖంపైని ముడతలన్నీ పారే నదులయ్యేవి. అప్పుడు నా కళ్లనుంచీ కూడా తడితడిగా జారేవి నీటి చుక్కలు..!” ఇంకెవరు..? నానమ్మ.

“జీవితమంతా కకావికలమైన ఎవరి జీవితానికైనా ఓ మంచి వ్యక్తి లేదా ఆదిదంపతుల దర్శనం.. కేవలం ఊరడింపు, సమాధానం, ఉపశమనం, విముక్తి..!” మిధునం సినిమాలోని దంపతుల్లా అగుపించే.. ఆదిదంపతులైన అమ్మమ్మ, తాతల ఆశీర్వాదం తీసుకున్నారు మాధవ్-లక్ష్మి-అమూల్యలు.

         అమ్మ చేతివంట తింటుంటే.. ‘ఇది కదా అమృతం’ అనిపించింది మాధవ్-లక్ష్మిలకు. తను వండిన వంటల్ని తన పిల్లలు తమ ప్లేట్లలో నింపుకుంటూ ఉంటే చూడటాన్ని మించిన సంతోషం మరొకటి ఉండదు ఏ తల్లికైనా. అనంతమనిపించే కబుర్లతో గంటలు నిమిషాల్లా గడిచాయి. నాన్నమ్మ చూపించిన పాత ఫోటోల ఆల్బమ్ చూసి మురిసిపోయింది అమూల్య. వయస్సు యాభైకి చేరువవుతున్నప్పుడు.. పాతికేండ్లక్రితంనాటి ఫోటోలు చూసిన మాధవ్, ‘ఆనాటి నా అందం గురించి నేను ఆ రోజుల్లో సరిగ్గా గర్వపడలేదేమో’ అని మనసులోనే మురిసిపోయాడు.

         గణేష్ ఫెస్టివల్, దసరా, దివాళీ వీటితో పోలిస్తే ఈ సంక్రాంతి స్పెషల్ ఏంటి నానమ్మా..? అని అడిగింది అమూల్య.

“శ్రీరామ’నవమి' వినాయక'చవితి' విజయ'దశమి' పండుగలన్నీ తిథులతో ముడిపడినవి. వీటికి భిన్నంగా, రాశితో జతకలిపి, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే శుభవేళ ఏతెంచి, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అన్యోన్యంగా స్వాగతించే పెద్ద(ల) పండుగ 'సంక్రాంతి'. గ్రహరాశుల గమనాన్ని గణించిచెప్పే పండితుల లెక్క ఇది. దేశ వ్యవసాయ సంస్కృతికి నిలువుటద్దమై, మట్టివాసనకు పట్టంకడుతూ, నేలతల్లి కన్నపేగుకు కనకాభిషేకం జరిపిస్తుంది. చలిబాధ భోగిమంటల్లో బుగ్గికాగా, ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై, సంక్రాంతి రథం అలా సాగుచుండగా, పశుపూజలోనైనా పశుపతిని కాంచమనే ‘భోగి-సంక్రాంతి-కనుమ’ అనే మూడుపండుగల మేళవింపు. భారతదేశానికి ఆయువుపట్టులాంటి పల్లెటూళ్ల పర్వదిన సౌందర్యం సంక్రాంతి రోజుల్లో వేయిరూపాల్లో దర్శనమిస్తుంది. ప్రకృతిపరంగా పల్లెలకు సంక్రమించే అపురూపకానుక, నగరాలను ఊరించే కోరిక 'సంక్రాంతి'. హేమంతం హృదయ ఆహ్లాదకర రుతువు. ప్రత్యూషవేళ గరికపరకల చిరుకొసల్లోని నిహారికల దర్శనంతో మనసు దూదిపింజలా తేలికవుతుంది. ఆ తన్మయస్థితిలోనే విరబూసిన గుమ్మడిపూవు మధ్యలో చేరిన మంచుబిందువు బుట్టలో కూర్చొండబెట్టిన నవవధువులా తోస్తుంది‌ మరి. వదులుగా ఉంచుకోవాల్సినవేవో, వదుల్చుకోవలసినవేవో తేల్చుకోమంటుంది 'భోగి'. పిల్లగాలులు గిలిగింతలు పెడుతుంటే, మట్టివాసన మనసున మత్తుగొల్పుతుంది 'సంక్రాంతి'. పశువులను ఆప్యాయంగా సముదాయించేవేళ రైతుల కళ్లలో మెరిసే తడివెలుగులో మన మూలాలను వెతుక్కోమంటుంది 'కనుమ'. పండుగలన్నింటిలో పెద్దపండుగ కాబట్టే.. పట్నంలోనో, విదేశాల్లోనో నివసించే మీలాంటివారు అంత ప్రయాసపడి మరీ పల్లెలకు పరుగులుతీసేది..!” అంటూ కన్నయ్యకు యశోద గోరుముద్దలు తినిపించినట్లుగా విశదీకరించింది అమూల్య నానమ్మ అన్నపూర్ణమ్మ.

         అంతేగాక,“అలవాట్లను కూడితే మనిషి, మనుషుల ఆచారాలను గుణిస్తే సంస్కృతి, తెలుగుజాతి సంస్కృతికి ప్రతిబింబం ‘సంక్రాంతి’. అది ఓ మూడక్షరాల పేరో, మూడురోజుల పండుగో కాదు. వాస్తవం తెలియాలంటే.. వాన చినుకుల్లో మబ్బు సంతకాలనూ, మాను చిగురులతో వేళ్ల మంతనాలనూ గుర్తించగల లోచూపు అలవడాలి. అంతే తప్ప.. కోడిపందాలు, కొత్తసినిమాలనేవి పురాతన ఆచారాలకు కొలమానాలు కావు. అది అర్థమయినప్పుడే.. జాతి జీవననాడి పరిచయమౌతుంది. సూర్యునితో కలిసి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సంక్రాంతి నడచివస్తుంది. హేమంతపువేళ నూతనసీమంతపు వధువువలే, సింగారముగా ధాన్యరాశులు బంగారుదారులందు లక్ష్మి కదలి వస్తుంది. కవులది ఇహానికి చెందిన వర్ణన, పండితులు పేర్కొనేది పరానికి సంబంధించిన సూచన. ఇలా ఇహపరాలను కలిపి గుణించడమే సంక్రాంతి పండుగ ప్రత్యేకత. సంక్రాంతి సొగసు, సౌభాగ్యాలకు ఆలవాలం. బోసిపోయిన నగరవీధులు కావు వాసికెక్కిన పల్లెసీమలు. నగరజీవనంతో బతుకు నసి చెడినప్పుడల్లా, మనసు పల్లెల దిశగా పరిగెడుతుంది. ఆ పరుగుల్లోని అసలైన ఆరాటాలనూ, వాటివెనుక ఆంతర్యాలను గ్రహిస్తే, అన్ని పండుగలకంటే మిన్నగా సంక్రాంతిని తెలుగుజాతి సంస్కృతికి చెందిన కాంతి పరివేషం ఆవరిస్తోందని తెలుస్తుంది, గుండెల్లోకి క్రాంతి ప్రసరిస్తుంది..!” అంటూ తనదైన అధ్యాపకవృత్తికోణంలో ఓ విద్యార్థికి అర్ధమయ్యేలా బోధించే గురువులా విశదీకరించాడు అమూల్య తాతయ్య పరమేశ్వరరావు.

         జీవితంలో ఎక్కువ ఎదురుదెబ్బలు తిన్నవాళ్ళతో ఓ సమస్య ఉంటుంది. వాళ్ళ అనుభవాలు.. అనుభవాల్లా వుండవు. పొడుపు కథల్లాగానో, ఎత్తిపొడుపు కథల్లాగానో ఉంటాయి.

~~~~~~

         భోగి, సంక్రాంతి, కనుమ విశేషాలను స్వయంగా చూద్దామని వచ్చిన మాధవ్-లక్ష్మి-అమూల్యల ఆశ నిరాశే అయింది. ఏడాదికోసారైనా సంక్రాంతికి సొంతూరికి వెళ్లాలనుకునేది కేవలం పల్లె వాతావరణాన్ని ఆస్వాదిద్దామనే. అలాంటిది, పల్లె కాస్తా నగరాన్ని ఒంట బట్టించుకుంది. ఎలాగంటే...

         కొక్కరకోమనే కోడికూత బదులు ఇక్కడా మొబైల్‌ అలారమే మ్రోగింది. పచ్చని పంటలు సగంకు పైగా మాయమై, ఓపెన్ ప్లాట్ల లే-ఔట్లు సింగారించుకున్నాయి. అందుకేనేమో.. ఉషోదయ భానుడి కిరణాలూ సుర్రుమన్నాయి. కల్లాపు చల్లి చక్కగా ముగ్గేసే స్థలమేదీ..? ఇంటి ముందంతా కాంక్రీట్ చదునైపోయెనే..! వేపపుల్లని తోసేసి, టూత్ బ్రష్ పట్టుకున్నారు. వీధి అరుగుల్లో ముచ్చటేసే ముచ్చట్లేవీ..? ఏ ఇంట చూసినా సౌండ్ బార్ హోమ్ థియేటర్ టీవీ శబ్ధాలే. మజ్జిగ అంబలి బదులు.. థమ్సప్, ఛాయ్. గాబులు, గుమ్ముల్లో సంవత్సరాలుగా దాచే ధాన్యం కేవలం ఒకట్రెండు బస్తాల్లోనే అగుపిస్తోంది‌. ఓనాటి గ్రామ రచ్చబండ.. నేడు అనాధ బిడ్డడైండు. నాగలిని మోసుకెళ్లే రైతు కనబడలేదు. ట్రాక్టరును నడిపే రైతులే అందరూ. ట్రాక్టర్ దుమ్ము రేపుతోంటే, నాగలికి చెదలు పట్టె. ఇంటిముందు పచ్చని పందిరా..? ష్యామియానా క్షణాల్లో వేసేస్తున్నారుగా..! మోటబావి వద్దా మోటారు పంపే. అప్ డేటెడ్ మరి. సొర బీర చిక్కుడు కూరగాయల పందిళ్లా..? ఎందుకూ..? వెజ్ ఫ్రెష్ షాపుంది. అన్నీ ఏసీలో ఫ్రెష్ గానే దొరుకుతాయి. భోజనానికి చెక్క పీటలు, డైనింగ్ టేబుళ్లు కాదు.. బఫేనే మంచిగుంటదట, ఎంతైనా తినొచ్చునట. కుండ నీళ్లా..? డబుల్ డోర్ ఫ్రిజ్జుందిగా..? కుండలో వంటా..! కుక్కర్లున్నాయిగా..? పాడిగేదెలను, ఎద్దుల్ని పెంచుకోవాలా..? ఎందుకూ, ఉదయాన్నే ప్యాకెట్ పాలొస్తున్నాయిగా. ‌‌.! ఇంటికో ట్రాక్టరూ ఉండనే ఉన్నాయి. కుట్టు మిషనా..? రెడీ మేడ్ షాపులున్నాయిగా..! ఎడ్ల బండ్లో షికార్లా..? ఇంటికో రెండు కార్లున్నాయిగా..! వీధుల్లో చేలల్లో మట్టి ఆటలా..? ఎంచక్కా మొబైల్ గేమ్స్ బెటరు కదా..! బారు కిక్కుకు బానిసలయ్యాక, తాటికల్లు చేదయింది. కలసిమెలసి మాటల ముచ్చట్లా..? వాట్సప్ గ్రూపులు బోలెడున్నాయిగా..!

         పట్నం సొగసులు అద్దుకోవడానికి సహజ అమాయకత్వాన్ని త్యజించాల్సొచ్చె ‘పల్లె తల్లి’. నాగరికత విషవలయంలో చిక్కుకుని, అనుబంధాలు బక్కచిక్కి, గ్రామ మానవీయ విలువలు విలవిలలాడె. ఇలాగైతే, సంక్రాంతికి పల్లెకు వెళ్లాలని ఏ నగరవాసి అనుకుంటాడు..?

         సంవత్సరాల తరబడి ఓ అమూల్యమైన అనుభవం కోసం ఎదురుచూస్తాం. ఆ అనుభవం అనుభవంలోకి వచ్చినప్పుడు.. ఆ అనుభవం రుచికాక, ఆ అరుదైన అనుభవం దాన్ని దూరంగా నిలిపి ప్రశ్నిస్తుంది. అది రుచించదు. ఎందుకంటే, అనుభవించే క్షణం కాదది. సంవత్సరాల తరబడి తన ఆలోచనల్ని పరీక్షకు పెట్టిన క్షణం. అనుభవాన్ని భద్రంగా దాచుకోవాల్సిన క్షణం.

         గ్రామంలో నగరవాతావరణాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన మాధవ్'ని చూసి“ జీవితం అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదు. అనుభవించాల్సిన వాస్తవం..!” అని ఓ హితోక్తితో సంతృప్తి పరిచింది లక్ష్మి.

         కొందరి.. పైపై పలకరింపులు చూసి,“భోగి మంటల్లో పనికిరాని వస్తువుల్ని కాల్చడంలోని ఉద్దేశ్యం.. అవసరాల్లో ఆదుకోని బంధాల్ని దూరం చేసుకోమనే..!” అనే సత్యం అవగతమైంది మాధవ్-లక్ష్మిలకు.

         వరుసకు చిన్నమ్మ అయ్యే వసుంధరమ్మ ఇంటికి వెళ్లిన మాధవ్-లక్ష్మిలకు అక్కడ పండుగ వాతావరణం ఏమాత్రం కనిపించలేదు.“అరిసెల బుట్ట ఇప్పుడొక అంటరాని వస్తువయింది. నాకూతురికి ఒబెసిటి, అల్లుడికి కొలెస్ట్రాల్, మనవడికి పుట్టుకతోనే మధుమేహం..!” అని అమూల్యను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెబుతుంటే, కాస్త బాధాకరమనిపించి, ఎక్కువసేపు ఉండలేక తిరిగొస్తుంటే, వరుసకు అత్తయ్యే సువర్ణమ్మ పిలిచేసరికి వారింటికి వెళ్లారు. "నీలాగా మా అల్లుడూ పండగకు వచ్చునుంటే బాగుండేది" అని బాధపడింది సువర్ణమ్మ. ‘ఆయనకు శెలవుల్లేవని చెప్పాకదమ్మా’ అని చెప్పింది అత్త కూతురు స్వప్న. ఇంటికొచ్చిన తర్వాత, అమ్మ చెప్పగా తెలిసిందేంటంటే, కృత్రిమ మేధ ప్రభావం వల్ల అతడి ఉద్యోగం పోయిందని..!

“బలగం, బంధుత్వాలు.. సోషల్ అండ్ ఫైనాన్సియల్ సెక్యూరిటీతో ముడిపడి వున్న ఓ సెటప్” అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సేపు పట్టలేదు మాధవ్-లక్ష్మిలకు.

         చీదరబుద్ధి ఎంత తగ్గింది అనే దాన్ని బట్టి వివేకపు పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చు. గ్రామంలోని పురాతన ఇళ్లను డుప్లెక్స్ ఇల్లుగా, తోటల్లో ఫామ్-హౌస్'లుగా కట్టుకున్నారు. వ్యక్తిత్వాన్ని నిర్మించిన బడిని మొత్తంగా పునర్నిర్మించారు. ఈతనేర్పిన చెరువు పూడిక మొత్తాన్ని తీయించేసేశారు. చీకటికి నెలవైన రామాలయంను పునర్నిర్మించి, నిత్యదీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. ఊరి వీధుల్లోని మట్టిరోడ్డును సెమెంటు రోడ్డుగా మార్చేశారు. వారానికొకసారి తెరిచే ఆసుపత్రిని'24/7'పని దినాలుగా అభివృద్ది చేశారు. తోడుకునే చేదబావి నీటిని కుళాయి నీటిగా ఇంటింటికీ ప్రవహింపజేశారు. మనుషుల్లోనూ మానవత్వం కాస్తోకూస్తో మిగిలుందనిపించింది. అన్ని గ్రామాలు ఇలానే ఎంతోకొంత అభివృద్ధిచెందితే ఎంతబాగుండునో కదా..! అప్పుడుకదా..'అమ్మ ముద్దుపెట్టుకున్న ఆనందం.., నాన్న భుజం తట్టిన అనుభూతి' కలిగేది. పల్లెను దత్తత తీసుకోవడమంటే.. మట్టికి దండం పెట్టుకోవడమే. ఆచరణలో పెట్టని ప్రణాళిక వట్టి కల మాత్రమే. ప్రణాళిక లేని ఆచరణ కాలయాపన మాత్రమే. ఆచరణ, ప్రణాళిక కలిసినప్పుడే ప్రపంచాన్ని మార్చగలం. ఆశ అనేది మెలకువతో ఉన్న స్వప్నం.

         చిన్నప్పుడు మాధవ్ ఇంట్లో పనిచేసిన ఓ ముసలావిడ వీరిని చూద్దామని వచ్చింది. 'ఏం అవ్వా ఎలాగున్నావ్..?' అని మాధవ్ పలకరించేసరికి.. "చదువురాని అనామకురాల్ని ఏంజెప్పను నాయనా..? తినడానికో ముద్ద, తాగడానికో గుక్కెడు నీళ్లు, ఒళ్లు దాచుకోడానికో కోక, ఉండడానికో గది.. వీటికైతే కొదవలేదనే జెబుతాను. బిందె పట్టుకుని బాయికాడికైతే పోవట్లేదు, కుళాయి నీళ్లొస్తాన్నాయి. పంటలు పండట్లేదని పట్నానికెళ్లిన బిడ్డలు.. మస్తు వానలు కురిసి, కాల్వల్లో నీరు పారతాంటే ఏడాదికి రెండు పంటలేసుకుని ఖుషీగున్నరు. భూమి విలువా పెరిగింది. ప్రైవేటు స్కూళ్లలాగా సర్కారుబడీ ఉండేసరికి, పశువులు కాసుకునే మనవండ్లూ సదువుకోబడిరి. ఆడబిడ్డ పెండ్లంటే గుబులుపుట్డి నిద్దరొచ్చేదిగాదు. పెండ్లికానుకని గవర్నమెంటోల్లే కట్నమిత్తాండ్రు. కొంగులో చిల్లరడబ్బులు ముడెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే ఫించను డబ్బు ఖాతాలో జమైతాంది. గుడిసెలో ఐదారుగురితో చాలీచాలని బ్రతుకుల్నుంచి, అందరూ ఓచోటుండేలా మూడుగదుల ఇల్లిచ్చి, సుఖంగా కాపురం జేసుకునేలా జేశారు. అవసరానికి ఆదుకునే మీ అమ్మానాన్నలాంటి పెద్ద మనసున్నోళ్లున్నారు. నాకైతే గివే తెల్సు నాయనా..!" అని బదులిచ్చింది. ‘తక్కువలోనే అతి ఎక్కువ సంతృప్తిని పొందే వ్యక్తి లోకంలోనే అత్యంత సంపన్నుడు’.

~~~~~~

         కనుమ పండుగ తర్వాతిరోజు.. మండలకేంద్రంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి లక్ష్మి-అమూల్యతో సహా వెళ్ళాడు మాధవ్. దాదాపు పాతిక సంవత్సరాల క్రితంనాటి స్నేహితులు. అందరి వయస్సు యాభై చేరువవుతున్న రీత్యా, కొందరి ముఖాల్లో గుర్తించలేనంత మార్పు..! కానీ, దాదాపు అందరూ పలకరించారిలా..“మాధవ్’గారూ బాగున్నారా..? మంచి ఆరోగ్యంతో హీరోలాగా ఉన్నారు మీరింకా..! విదేశాల్లో ఉండీ, అమ్మానాన్నలకు ఇక్కడ మంచి ఇళ్లు కట్టించారండీ..! పేరున్న కంపెనీలో మంచి స్థానంలో సెటిలయ్యారటగా..? మా అబ్బాయికి ఓ జాబు ఇప్పించండీ..!” మాధవ్ చాలా నిరాశపడ్డాడు. ఒక్కడు కూడా వచ్చి, ఆప్యాయంగా 'రేయ్.. ఎలావున్నావురా..?' అని పలకరించలేదు.

         "జీవితం చాలా చిన్నది. ప్రేమించడానికి, సన్నిహితులను సంపాదించుకోవడానికి సమయం తక్కువ ఉంది. ఎవరి ఇష్టాయిష్టాలు, ఆలోచనలు వారికుంటాయి. డిఫరెన్స్ అఫ్ ఒపీనియన్’ను గౌరవించాలి..!" అంటూ లక్ష్మి పలికిన మాటలు మాధవ్'కు నచ్చాయి.

         నిత్యం ఉద్యోగంతో సతమతమవుతూ, పట్నంలో నివసిస్తున్న జనానికి ఓ మూడు రోజులు ప్రకృతి ఒడిలో ఒదిగి, అలుపేలేకుండా పక్షిలా విహరించే మధుర జ్ఞాపకం 'సంక్రాంతి' పండుగ. బాల్యంలో తెలియదుగానీ, సంసార యాసలో పడి, నాలుగుపదులు దాటాక, మనల్ని మనం కోల్పోతున్న ఉరుకులపరుగుల జీవితంలో అప్పటి జ్ఞాపకాలు ఎంతో ఆహ్లాదం.

         సైకిల్ మీద పయనం, చొక్కా జేబులో పట్టనంతగా రేగుపళ్ళ సేకరణ, ఉదయం తోటగట్లపై నడుస్తుంటే గడ్డిపైన నిలిచిన మంచుబిందువులు పాదాలను తాకుతుంటే.. జిల్లుమనే ఓ పులకరింత, నాన్నతోబాటు పంటకు నీళ్ళు కట్టాలన్న తపన, 'వద్దులేరా అబ్బాయ్' అనే నాన్న చిరుమందలింపు, ఏ పండగొచ్చినా.. తాత, నానమ్మలకు బట్టలుపెట్టి, పూజ తర్వాత ‘తాత పేరు’ నిలబెట్టాల్సింది నువ్వేరా అని, తాత పంచెకట్టి మురిసిపోయే నాన్న, ‘తాత-నాయనమ్మలకు అన్నంపెట్టిన పళ్లెమిది’ ఇందులో తిను. మీ తాతకు నువ్వంటే చాలాఇష్టం అనే అమ్మ. చెప్పుకుపోతే ఇలాంటివి మరెన్నో..! నిజం చెప్పాలంటే, జాతి సంస్కృతి పట్నంకాదు.. పల్లె / మన ఊరు.

         ఉద్యోగ బాధ్యతల్లో కూరుకుపోయి, సరిగ్గా పండగరోజు మధ్యాహ్నానికి మన ఊరు చేరితే 'ఒక్కరోజు ముందు రావచ్చుకదాయ్యా' అనే అమ్మ గొంతునుంచి భారంగా వచ్చేమాట గుండెను పిండుతుంది. ఉద్యోగం.. ఉద్యోగం.. సంపాదించాలి.. పిల్లలకు పెద్దపెద్ద చదువులు చెప్పించి, మనలాగే వారినీ తయారుచెయ్యాలి. ఇదే తపన నేటి తల్లిదండ్రులది. ముందు తరాలైనా మారతాయని ఆశిద్దాం..!

         సారె చీరలతో పెరిగిన లగేజీలు, తిరుగు ప్రయాణంలో బరువెక్కే గుండెలు. నగరాల్లో ఉద్యోగం, ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు. అయినా, ప్రతి సంక్రాంతికీ పట్నంమొత్తం పల్లెదారి పట్టేది ఇందుకే.“పండగలాంటి మనుషులను కలవడానికి ఉత్తినే'సంక్రాంతి'అని పేరు పెట్టారంతే..!” పల్లెనుంచీ పట్నానికి తిరిగివెళ్తున్న ఒక్కో కుటుంబాన్నీ చూస్తూ మాధవ్ మనసులో మెదిలిన మాట.

“మామగారిళ్లలో కొత్తదంపతుల ముచ్చట్లను చూసిన సూర్యునికి.. తన ప్రేయసిని కలుసుకోవాలనే కోరిక మరి కాస్త తొందరపెట్టింది. అందుకే తన చేతులుసాచి, ఉత్తరదిక్కనే సతిని (ఉత్తరాయనంలోకి ప్రవేశించాలని) కౌగిలించుకోవాలని ఆ వైపు తన సప్తాశ్వరథాన్ని దౌడు తీయిస్తున్నాడు దివాకరుడు. అసలే మన్మథ ధ్వజమైన మకరరాశిలోకి అడుగుపెడుతున్నాడాయె..! ఆ మాత్రం కోరిక కలగడంలో ఆశ్చర్యమేముందిలే..!” అని కవితాత్మకంగా మాధవ్ చెబుతుంటే.. ‘ప్రేమిక చెంత ప్రతి ఒక్కరూ కవిగా మారతారు’ అంటూ పొగిడింది లక్ష్మి.

“ఉత్తరాయణం మొదలైన తర్వాత.. గాలి ఏ దిశగా వీస్తుందో, గాలివేగం ఎంతగా ఉంటుందో, ఆ గాలిలో తేమశాతం ఎంత ఉంటుందో దాన్నిబట్టీ రాబోయేకాలంలో పంట దిగుబడికి కావాల్సిన వర్షపాతాన్ని ఇట్టే లెక్కించగలడు ఏ రైతయినా..! ఆ కారణంగా, రైతులకి రాబోయేపంట సమాచారాన్ని తెలుసుకోగలిగామనే ఆనందానుభవం'సంక్రాంతి'. తెలుగుజాతి పౌరుషాలకు ప్రతీకలుగా, ఎర్రెర్రని మిరపకాయలు కోతకొస్తాయి. దేశానికి అన్నంపెట్టే వరిపైర్లు తోటల్లో పచ్చగా మెరుస్తుంటాయి. పంటదిబ్బలమీద.. వంగలు, బెండలు, చిక్కుళ్లు, సొరపాదులు మొదలైనవి విరగకాసి బరువెక్కేది సంక్రాంతప్పుడే..! గుమ్మడి పచ్చపచ్చగా పూలు పూసేది, మంచు కురిసేదీ ఆ కాలం లోనే. మంచి గుమ్మడిపువ్వులో నిలిచిన మంచుబిందువు.. తట్టలో కూర్చొన్న పెళ్లికూతురిలా ఉంటుంది. ఉత్తరాయాణాన్ని సద్వినియోగం చేసుకున్నోడే అసలుసిసలైన ‘స్థితప్రజ్ఞుడు’. అర్థమైందా రాజా..!” అంటూ స్వతహాగా రైతుబిడ్డయిన లక్ష్మి చెబుతుంటే ఆశ్చర్యపోయాడు మాధవ్.

         మాధవ్ ఊరికి దగ్గర్లోనే లక్ష్మి అమ్మానాన్నల ఊరూ. అక్కడా ఓ మూడు రోజులు ఉండి తిరిగొచ్చారు. మరుసటిరోజు కెనడాకు తిరిగివెళ్ళాలి. కాస్త ఇబ్బందిపడుతున్న మాధవ్’ని చూసిన తండ్రి పరమేశ్వరరావు.. చూడు మాధవ్, విదేశాలకు తిరిగి వెళ్లాలనిపించని మీ ఇరువురి అంతర్మధనం నాకు అవగతమవుతోంది. ఓ మాట చెప్పనా..?“ఓడరేవులో ఓడ సురక్షితంగా ఉంటుంది. కానీ, అది ఉండాల్సినచోటు అదికాదు. కదలడమనే మార్పు బాధాకరమే. కానీ, ఉన్నచోటే ఉండిపోవడమంత బాధాకరమైనది మరొకటి ఉండదు..!” అంటూ హితబోధచేసి, ఇరువురినీ సమన్వయపరిచి వారిని మరుసటిరోజు ప్రయాణానికి సిద్ధపరిచాడు.

         ప్రొద్దున ఆరు గంటలయింది. రాత్రంతా పరచుకున్న చీకటి ఆధిపత్యాన్నీ, శాశ్వతత్వాన్నీ ఒప్పుకోను అన్నట్లు, వెలుగును నింపేస్తూ సూరీడు తూరుపు కొండల మాటు నుంచి పైకి వచ్చేశాడు. నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతోంది. అందరికీ వీడ్కోలు చెప్పి, బయలుదేరారు మాధవ్-లక్ష్మి-అమూల్యలు.

         ఊరినుంచి విమానాశ్రయానికి కారులో వెళ్తోంటే, దారిలో కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లలు కనిపించారు.

         కాబోయే భర్తతో కంటే, చేయబోయే డిగ్రీతోనే ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడపిల్లలు. భర్తొస్తే.. భార్యహోదా వస్తుందనీ, భార్యహోదా గుర్తింపు తెస్తుందనీ వాళ్లకేం ఉండదు. 'చదువు' పూర్తీచేస్తే, మంచి ఉద్యోగంవస్తుందనీ, 'కేరీర్'ను తమకు నచ్చినట్లు మలచుకోవచ్చనే ధ్యాసే వారికుంటుంది. ఒకవేళ డిగ్రీకన్నా భర్తగారే ముందుగావచ్చినా, అతన్నీ 'కేరీర్'లో భాగంగానే చూస్తారు. మంచిభర్త దొరకాలని నేటి ఆడపిల్లలు గుడికెళ్లి మొక్కట్లేదు. వచ్చేవాడు ఎలాంటోడోననేది దేవునికే తెలియనప్పుడు, ఏ భగవంతుడూ చెప్పలేనప్పుడు, గుడికెళ్లి ప్రదక్షిణలు చేసేబదులు పరీక్షల్లో ఏ ప్రశ్నలొస్తాయో ఆలోచించి, గెస్-పేపర్ తయారుచేసుకోవడం ఎంతో మంచిదనేది వారి అభిప్రాయం. ఊహించిన ప్రశ్నలన్నీరాకున్నా, పూర్తిగా ఊహకు అందనివైతే రావుగా..? భర్తగా ఎలాంటివాడు వస్తాడనేది దేవుడే గెస్ చేయలేనప్పుడు.. చదువులో 'టెన్ బై టెన్ గ్రేడ్' తెచ్చుకుంటే మాత్రం.. టెన్తో, ఇంటరో పూర్తయిన పిల్లేం గెస్ చేస్తుంది..? చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ ఉణికిపడుతుంటుంది. ‘చదువులో ఉన్న మహిమ అది’ అనుకుంటూ ముచ్చటపడ్డారు మాధవ్-లక్ష్మిలు.

“తప్పనిసరి విహారాలు చేయడమొక్కటే జీవితాన్ని అనుభవించగలిగే ఒకేఒక దగ్గరిదారి అని మన చివరిదశకు ముందు స్పష్టంగా అర్థమవుతుంది..!”

         అమ్మానాన్నలతో సొంతూరులో ఆనందంగా గడిపిన మాధవ్ కుటుంబాన్ని, తమ గమ్యమైన విదేశానికి చేరవేయడానికి విమానం ఆకాశంలోకి ఎగిరింది. ఒక్కోసారంతే.. పువ్వులు పూసి, కాయలు కాసే మహావృక్షాన్ని వదులుకుని, కలుపుమొక్కకోసం ఎంతో దూరం వెళ్తుంటాం..!

         జగన్నాటకంలో నటులెందరో ప్రేక్షకులూ అందరే..! జీవిస్తారు, జీవితాన్ని చూస్తారు, మరో ఆటకై పరిగెడతారు. నటులూ, ప్రేక్షకులూ వెళ్ళిపోయినా మరో ఆటకోసం ‘వేదిక’ మాత్రం అక్కడే ఉంటుంది.. ‘పల్లెలాగా’.

********

أضف تعليقات