అవ్వ పేరే ముసలమ్మ  (Author: పాణ్యం దత్తశర్మ)

‘‘డాన్ బాస్కోస్‌’ ఇంటర్నేషనల్‌ జూనియర్‌ కాలేజీ నల్ల ఆర్చ్ పై పసుపు పచ్చని అక్షరాలు మెరుస్తున్నాయి. పేరు చూసి మోసపోకండి. అక్కడ విదేశీ విద్యార్థులు చదవరు. విదేశీ లెక్చరర్లు చెప్పరు. అదేదో సినిమాలో సుత్తి వీర భద్రరావు చెప్పినట్లు ‘‘పదం బాగుందని’’ పెట్టుకున్నారంతే! గ్లోబల్‌, కాన్‌సెప్ట్‌, లాంటి పదాలు తగిలిస్తే, వెర్రి తల్లిదండ్రులు ఇంకా మోజుపడి తమ పిల్లలను చేర్పిస్తారని!

          స్టాఫ్‌ రూంలో కూర్చుని, క్లాసుకు ప్రిపేరవుతున్నాడు వెంకటసాయి. తర్వాత అతనికి సీనియర్‌ ఇంటర్‌ ఎం. ఇ. సి వాళ్ల క్లాసుంది అతనక్కడ జూనియర్‌ లెక్చరర్‌ ఇన్‌ ఇంగ్లీష్‌! ఇంతలో కెమిస్ట్రీ మేడమ్‌ శ్రీరంజనిగారు ఒక అమ్మాయిని వెంటపెట్టుకుని వచ్చారు.

          ‘‘గైస్‌! (ఈ మధ్య ఈ పిలుపు ఫ్యాషనయింది. ఫ్రెంచి పదమది ‘గై’ అంటే వ్యక్తి అని అర్తం. దానికి మనం ఏ విశేషణాన్ని జోడిస్తే ఆ వ్యక్తి అవుతాడు. గుడ్‌ గై, నైస్‌ గై, వికెడ్‌ గై, టిపికల్‌ గై... అలా) ఈమె పేరు సెలీనా. ఈరోజే మన కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా చేరింది’’ అంటూ స్టాఫ్‌ రూమ్‌లో ఉన్న కొందరిని ఆమెకు పరిచయం చేసింది.

          ‘‘వెల్‌కమ్‌ టు డాన్‌ బాస్కోస్‌!’’

          “నైస్‌ టు మీట్‌ యు, సెలీనా!’’

          అంటూ ఆమెను ఆహ్వానించారు. వెంకటసాయి ఆమెకు నమస్కరించబోతే, నవ్వుతూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది. ఆమె అరచేయి మెత్తగా, మృదువుగా, వెచ్చగా ఉంది. వెంకటసాయి షేక్‌ అయ్యాడు!

          ముట్టుకుంటే మాసిపోయే రంగు సెలీనాది! “నీరజాప్తుని రాపోడి చల్లి మెదిపి, పదను సుధనిడి చేసెనో పద్మభవుడు లేకున్న గలదె ఈ మేనికాంతి?’’ అని అల్లసాని వారు ప్రవరుని గురించి వరూధినితో అనిపించినట్లు, వెంకటసాయికనిపించింది.’’ అదేమిటి? వెంకటసాయి ఇంగ్లీష్‌ లెక్చరర్‌ అన్నావు కదా! అంత తెలుగు కావ్యపరిజ్ఞానం అతనికెలావస్తుంది?’’ అనే డౌటనుమానం మీలో రేకిత్తింది గదా! అక్కడే మీరు సాంబారులో కాలేశారు! వెంకటసాయి డిగ్రీలో స్పెషల్‌ తెలుగు తెలుసాండి? తర్వాత ఎ.యులో ఎమ్‌.ఎ ఇంగ్లీషు చేశారు. తీరిందా? అదేనండి అనుమానం!

          ఉట్టి రంగే కాదు. అద్భుత లావణ్యం సెలీనా సొంతం. ఐదడుగుల ఎనిమిదంగుళాల ఎత్తుందా అమ్మాయి. లేత పసుపురంగు చూడీదార్‌, పింక్‌ కలర్‌ దుపట్టా వేసుకుంది. ఆమె నుదురు విశాలంగా ఉంది. చిన్న, కనీ కనబడని నల్లని స్టిక్కర్‌ పెట్టుకుంది. ఆమె జడ పిడికెడు వెడల్పున బారెడు పొడుగున, నల్లగా, నిగనిగలాడే త్రాచులా ఉంది.

          నోరు తెరుచుకుని ఆమెనే చూస్తుండిపోయాడు వెంకటసాయి. ఆమెను నఖశిఖ పర్యంతమూ స్కాన్‌ చేయసాగాడు. సెలీనా అతన్ని అలా పరిశీలించలేదు. అదీ మగవారికీ ఆడవారికీ తేడా!

          రెండ్రోజుల్లోనే అందరికీ ఆమోద యోగ్యురాలయింది సెలీనా. జెండర్‌ బయాస్‌ లేకుండా మగవారితో కూడ స్వేచ్ఛగా మాట్లాడేది. కాలేజి క్యాంటీన్‌కు వెళ్లేది. తెలుగు క్లాసు అంటే బోర్‌గా ఫీలయ్యే స్టూడెంట్స్‌, సెలీనా వచ్చిం తర్వాత మారిపోయారు. ‘ఆమె అందాన్ని చూసి లెండి’ అని అనుకుంటున్నారా అప్పుడే? మళ్ళీ అయితే ఈసారి మజ్జిగ పులుసులో కాలేశారు తమరు.

          సెలీనాకు తెలుగు భాషపై మంచి పట్టుంది. పద్యాలను శ్రావ్యంగా పాడగలదు. సరిగ్గా చెప్పగలిగితే, సాహిత్యం ఎటువంటి విద్యార్థినైనా కట్టిపడేస్తుంది. పాఠం చెప్పేటప్పుడు ఆమె హావభావాలు, అత్యంత సహజంగా ఉంటాయి.

          సహజంగానే వెంకటసాయికి తెలుగు సాహిత్యంలో అభినివేశం ఉంది. లీజర్‌ పీరియడ్‌లో సెలీనా అతనితో సాహిత్యాన్ని గురించి చర్చించేది. విచిత్రమేమంటే, డిగ్రీలో ఆమె ఆప్షనల్స్‌లో ‘అడ్వాన్స్‌డ్‌ ఇంగ్లీష్‌’ ఒకటి.

          ఒకరోజు టీ బ్రేక్‌లో ఇద్దరూ టీ తాగుతున్నారు.

          ‘‘సెలీనా, మీపేరు అరుదైనది. దాని అర్థం తెలుసుకోవచ్చా’’ అని అడిగాడు ఆసక్తిగా.

          ‘‘మీరే కనుక్కోండి ఇంగ్లీష్‌ మాస్టారు!’’ అన్నది ఆ అమ్మాయి అల్లరిగా యండమూరి నవలల్లో హీరోయిన్‌లాగా. అప్పుడయితే సదరు హీరో ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి నానాపాట్లు పడేవాడు. కాని ఇప్పుడు ‘‘గూగులమ్మ’’ ఉందిగా? వెంటనే సెర్చ్‌ చేసి చూశాడు.

          సెలీనా అంటే ‘‘మూన్‌ గాడెస్‌’’ అనీ, ప్రపంచంలోని అత్యంత అరుదైన ఇరవై అమ్మాయిల పేర్లలో అదీ ఒకటనీ ఉంది.

          ‘‘తెలిసిపోయింది మేడమ్‌, మీ పేరుకర్థం ‘‘జాబిలమ్మ’’! అన్నాడు.

          ‘‘గూగులమ్మనడిగి జాబిలమ్మ అని తెలుసుకున్నారా మాస్టారు!’’ అన్నది సెలీనా నవ్వుతూ. తెల్లని, తీరైన ఆమె పలువరుస మెరిసి ఆమె వదనం మరింత మెరిసింది. ‘‘సుపక్వదాడిమీ బీజ వదనాయై నమో నమౌ’’ అన్న లలితాదేవి అష్టోత్తరంలోని అమ్మవారి నామం గుర్తొచ్చింది వెంకటసాయికి.

          ‘‘మీ నవ్వు చాలా బాగుంటుంది!’’ అనేసి ‘సారీ!’’ అన్నాడు వెంటనే.

          ‘‘సారీ ఎందుకు సార్‌, ఇటీజ్‌ ఎ కాంప్లిమెంట్‌ ఫర్‌ మి! ధాంక్యూ’’

          లలితా దేవి నామం గురించి చెప్పాడు. ఆమె నొచ్చుకుంది.

          ‘‘తప్పుసార్‌! అమ్మవారు అమ్మవారే! మనలాంటి సామాన్య మానవులను ఆమెతో పోల్చకూడదు’’ అంది.     

          ఆమె సంస్కారానికి ముగ్ధుడైనాడు వెంకటసాయి. మళ్లీ ‘‘సారీ!’’ అన్నాడు.

          ‘‘దేరీజ్‌ నో లారీ టు క్యారీ యువర్‌ సారీ’’ అన్నదామె. నవ్వుకున్నారు.

          ‘‘మీరెక్కడ ఉండేది?’’ అనడిగాడు.

          ‘జ్ఞానాపురం సార్‌. వైజాగ్‌ రైల్వేస్టేషన్‌ వెనుకవైపు. మీరు?’’

          ‘‘సింహాచలంలో నండి’’

          ‘‘మీ పేరెంట్స్‌?’’

          ‘‘మా డాడీగారు శామ్యూల్‌. జి.వి.ఎం.సిలో సెక్షన్‌ ఆఫీసర్‌. మమ్మీ దేవ కుమారి. సెయింట్‌ మేరీస్‌ స్కూల్లో మ్యాథ్స్‌ అసిస్టెంట్‌ వాళ్లకు నేనొక్కదాన్నే’’

          ‘‘క్రిస్టియన్స్‌ అని క్లియరైంది. ఎందుకో నిరుత్సాహ పడ్డాడు వెంకటసాయి. ‘‘మరి మీ పేరెంట్స్‌?’’ అనడిగింది సెలీనా.

          ‘‘నాన్నగారు సూర్యనారాయణమూర్తి. సింహాచలం దేవస్థానంలో సీనియర్‌ అసిస్టెంట్‌ మా అమ్మ శమంతకమణి. ఒక చెల్లి దాని పేరు విలక్షణ. గోపాలపట్నం శ్రీ చైతన్యలో ఇంటర్‌ బైపిసి ఫస్టియర్‌.’’

          ‘అబ్బా! మీ అమ్మగారి, చెల్లి పేర్లు ఎంత బాగున్నాయి సాయీ?’’ అన్నదామె ప్రశంసగా.

          ‘‘మీ పేరు కూడా’’ అన్నాడు మనస్ఫూర్తిగా.

          ‘నాలుగు కళ్లు రెండైనాయి. రెండు మనసులు ఒకటైనాయి’ ఆ మహానుభావుడు ఆత్రేయ ఎందుకన్నారో గాని, అవి యువతీ యువకులను కలుపుతూనే ఉన్నాయి.

          ఈ ప్రేమ అనేది ఉంది చూశారూ ఇది ఒక పట్టాన ఇతరులకు అర్థం కాదు. ప్రేమించుకునేవారికి తప్ప.

          వెంకటసాయి సెలీనా అంత అందగాడు కాదుగాని, ‘‘స్మార్ట్‌ గై’’ అని చెప్పొచ్చు. ఇద్దరూ క్రమంగా స్నేహితులైనారు. ‘మీరు’ నుంచి ‘నువ్వు’ లోకి మారారు. సాహిత్యం వారిని మరింత చేరువ చేసింది. ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాల గురించి చర్చించుకునేవారు. ఒక ఆదివారం సెలీనాను తనయింటికి తీసుకెళ్లాడు. సెలీనా అందాన్ని చూసి విలక్షణ విస్తుబోయింది. శమంతకమణి ఆ అమ్మాయిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. ‘‘డ్రస్‌ కొనుక్కోమ్మా’’ అని వెయ్యి రూపాయలు చేతిలో పెట్టింది. అప్పుడు సాయి నాన్న యింట్లో లేడు.

          మరో ఆదివారం సాయిని తన యింటికి తీసుకెళ్లింది సెలీనా. సంప్రదాయ క్రైస్తవుల యిల్లు ఎలా ఉండాలో అలాగే ఉంది వారిల్లు శామ్యూల్‌గారు. దేవకుమారిగారు సాయిని సాదరంగా రిసీవ్‌ చేసుకొన్నారు. సాయి వినయం వారికి నచ్చింది.

***

          ఒక సంవత్సరం గడిచింది. ఒకర్నొకరు అర్థం చేసుకోడానికి అది చాలా ఎక్కువ. కైలాసగిరి. శివాజీ పార్కు, జగదాంబ ధియేటర్‌, కనక మహాలక్ష్మి గుడి, సిరిపురంలోని సి ఎస్‌ ఐ సెయింట్‌ పాల్స్‌ చర్చ్‌, వారి విహారానికి సహాయమయ్యాయి. సాహిత్యం వారిలో విశాల దృక్పథాన్ని పెంచింది. సెయింట్‌ పాల్స్‌ చర్చి ఎక్స్‌టీరియర్స్‌ చూసి ముగ్ధుడయ్యాడు వెంకటసాయి.

          ‘‘ఇది మా ప్రొటిస్టెంట్స్‌ చర్చి సాయీ!’’ అన్నది సెలీనా. ‘‘క్యాథలిక్స్‌ చర్చికి మనం వెళ్లకూడదంటారు డాడీ! అదే నాకు నచ్చదు. క్రైస్తవలుందరికీ జీసస్‌ దేవుడైనపుడు, ఈ విభేదాలెందుకు?’’

          ‘‘తేడాలు అన్ని మతాల్లో ఉన్నాయిలే సెలీ! మా మతంలో శైవ, వైష్ణవ భేదాలు! అప్పట్లో అవి మరీ దారుణంగా ఉండేవి. ఇప్పుడు కొంచెం నయం.’’

          ‘‘అవును’’ ‘దశావతారం’ సినిమాలో చూశాం కదా!’’

          ‘‘బుద్ధుడు ఒకడే! కాని ఆ మతంలో హీనయానం, మహాయానం అని రెండు ముస్లింలలో షియాలు, సున్నీలు వేరు.’’

          కాని అన్ని మతాల బేసిక్‌ సూత్రాలు ఒకటిగానే ఉంటాయి.

          ‘ఆత్మవత్‌ సర్వభూతాని’ అంటుంది హిందూమతం ‘‘లవ్‌ దై నైబర్‌ యాజ్‌ దైసెల్ఫ్‌’ అంటుంది క్రైస్తవం. ‘‘ఎదుటివాడు ఆకలితో ఉంటే నీవు తినడం దైవం పట్ల చేసే అపచారం’’ అంటుంది ఖురాన్’’ అన్నాడు సాయి.

          ‘‘బాగా చెప్పావు దీనినే ‘‘ఏకం సత్‌ విప్రాః బహుధావదన్తి’’ అన్నారు కదా’’ అన్నది సెలీనా. అబ్బురంగా చూశాడు మా వైపు’’ ఇక్కడ విప్రాః అంటే పండితులు అని అర్థం’’ అన్నాడు.

          ఏదో సామెత చెప్పినట్లు, అవ్వంటే అవ్వ, ముసలమ్మాంటే ముసలమ్మ, అవ్వే ముసలమ్మ. అన్ని మతాల సారం ఒకటే మరెందుకో ఈ ద్వేషాలు?’’ అన్నది సెలీనా.

          ‘‘సడన్‌గా అన్నాడు.’’ సెలీ! మనం పెళ్లి చేసుకుందాం! నీకు అభ్యంతరం లేకపోతే’’ అన్నాడు. సెలీనా. బుగ్గలు కాగిన పాలరంగు అవి లేతగులాబీ రంగులోకి మారాయి సాలోచనగా అంది.

          ‘‘మరి మన మతాలు? పేరెంట్స్‌ ఒప్పుకుంటారా?’’

          ‘‘ఒప్పిద్దాం. ఎవరమూ మతం మారే పనిలేదు. ఎవరి మతాన్ని వారు అనుసరించుకుంటూ హ్యాపీగా ఉందాం. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుందాం’’ అన్నాడు సాయి ధృఢంగా.

***

          సెలీనాను పెల్లి చేసుకుంటానని చెప్పినప్పుడు సూర్యనారాయణ మూర్తి ఉగ్ర నరసింహమూర్తి అయ్యాడు.

          ‘‘ఇంత బ్రతుకు బ్రతికి (?) ఇంటి వెనకాల చచ్చినట్లు, కిరస్తానీ వాళ్లతో సంపర్కం ఏమిట్రా అప్రాచ్యపు వెధవా!’’ అని కేకలేశాడు.

          ‘‘నా కడుపున చెడ బుట్టావు కదరా’’ అన్నది తల్లి.

          ‘‘వదినె మాత్రం సూపర్‌’’ అన్నది చెల్లి.

          ‘‘నీవు నోర్ముయ్‌’’ అన్నాడు తండ్రి.

          ‘‘నీవలాంటి అఘాయిత్యం (?) చేస్తే ఉరి పోసుకుంటామని బెదిరించారు. చెల్లికి పెళ్లి కాదన్నారు. సాయి చలించలేదు. తన నిర్ణయం సరైనదని అతని అంతరాత్మ చెబుతూన్నది.

          ఇదే సీను కొంచెం తేడాగా సెలీనా యింట్లో కూడా జరిగింది. ‘‘జీసస్‌! ఎటువంటి మాటలు వింటున్నాను’’ అని అరిచాడు శామ్యూల్‌.

          ‘‘బేబీ, శారీరిక ఆకర్షణ తగ్గిం తర్వాత, ఇప్పుడున్నంత ‘ఇది’ ఉండదు అమ్మా! భిన్నధృవాలు కలవవు’’ అన్నది తల్లి.

          ‘‘పోనీ బాప్టిజమ్‌ తీసుకుంటాడా ఆ అబ్బాయి?’’ అనడిగాడు తండ్రి చివరి బాణం వేసి.

          ‘‘అవసరం లేదు నాన్నా! ఎవరి మతం వాళ్లది!’’

          ‘‘మరి పెళ్లి? వాళ్ళ పద్ధతిలో జరిగితే ఛస్తే ఒప్పుకోను!’’ అన్నది దేవకుమారి చచ్చింతర్వాత ఒప్పుకునేదేముంది? నవ్వుకుంది కూతురు.

          ‘‘ఎవరి పద్ధతిలో కాదు మమ్మీ సర్కారీ పద్ధతిలో చేసుకుంటాం.’’

          ‘‘అంటే?’’ అంది మమ్మీ అయోమయంగా.

          ‘‘రిజిస్టర్‌ మ్యారేజ్‌ అని!’’ అన్నాడు తండ్రి కోపంగా.

***

          పిల్లలిద్దరూ వినేలాలేరని తల్లిదండ్రులే రాజీపడ్డారు. లేకపోతే, వాళ్లు తెగించి పెళ్లి చేసుకునేలా ఉన్నారు. ప్రవక్త కొండను పిలిస్తే అది రాలేదట. సరేలే అని ఆయనే కొండ దగ్గరకు వెళ్లాడట. అలా ఉంది వారి ఒప్పుకోలు!

          అక్కయ్యపాలెంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ వారి కార్యాలయంలో పెళ్లిళ్ల రిజిస్ట్రారు ఎదుట సంతకాలు పెట్టి, దండలు మార్చుకున్నారు సెలీనా, వెంకటసాయి. డాన్‌ బాస్కోస్‌ లెక్చరర్సు కొందరు హాజరైనారు. బంధువులు ముఖం చాటేశారు.

          పెళ్లి తర్వాత దైవ దర్శనం చేయాలన్నారు ఇరువైపులా పేరెంట్స్‌ ముందు చర్చికా, గుడికా? అదో వివాదం. సత్యం కంప్యూటర్స్‌ సీతంపేటలోని చర్చికి వెళ్లారు. అక్కడ ఫాదర్‌ ఇలా ప్రార్థన చేశారు. ‘టిల్ డెత్‌ డు అజ్‌ నెవర్‌ పార్ట్‌, అవేక్‌ అండ్‌ అస్లీవ్‌, ఇన్‌ జాయ్‌ అండ్‌ సారో, ఇన్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌, ఓ హోలీ స్పిరిట్‌, బ్లెస్‌ దెమ్‌’.

          తర్వాత ఆశీలుమెట్ట దగ్గర్లో సి. బి. ఎం. కాంపౌండ్‌లోని సంపత్‌ వినాయకుడి గుడికి వెళ్లి, స్వామిని దర్శించుకున్నారు. అక్కడ పంతులుగారు వారిని ఆశీర్వదించి ‘‘నాతిచారమి’’ ‘‘నాతిచరితవ్యా’’ అని పలికించారు. ఇరు మతాలసారం ఒకటే అని తెలిసిన ఆ జంట నవ్వుకున్నారు.

          ఈ మతాంతర వివాహం వల్ల, వైజాగ్‌లోని సముద్రం అల్లకల్లోలం అవలేదు. ఆకాశం క్రిందపడలేదు. వాయుగుండం ఏర్పడలేదు. కాబట్టి తుఫానుగా మారలేదు. సో, ప్రకృతి దీన్ని అంగీకరించింది. కాని, మనుషులే గగ్గోలు పెట్టారు. అయినా, రావిశాస్త్రిగారన్నట్లు ప్రపంచం సా....గి పోతూనే ఉంది.

          వీళ్లింట్లో వరాహనరసింహస్వామివారు, ఏసుక్రీస్తు ప్రభువు ఒకే చోట కొలువుదీరారు. మనం కొట్టుకుచావవలసిందేగాని, వాళ్లు వాళ్లు ఒకటేనండోయ్‌.

          సాయి వెంట చక్కగా గుడికి వస్తుంది చంద్రకాంత. ఈమెవరు? కొంపదీసి విడిపోయారా? ఈమె రెండో భార్యా? అని అప్పుడే మొదలు పెట్టేశారా? సెలీనా అంటే మూన్‌ గాడెస్‌ అని చెప్పుకున్నాం కదా! మర్చిపోయారా? సెలీనాను అలా అనువదించాం. ఏమిటి.. . ‘‘తమరిబొంద!’’ అంటున్నారా? ఐ పిటీ యు గైస్‌!

          సెలీనా వెంట బుద్ధిగా చర్చికి వెళతాడు వెంకటసాయి. ఆమెకు నాన్‌ వెజ్‌ వంటకాలు రెస్టారెంట్‌లో తినిపిస్తాడు. ఒకే మతంలో, ఒకే కులంలో, ఒకే శాఖలో పెళ్లి చేసుకున్నా, సఖ్యత కుదిరిచావక విడిపోయి చస్తున్నారు కదా? దాని గురించి మాట్లాడరేం?

          ఒక సం. తర్వాత సర్వీస్‌ కమీషన్‌ పరీక్షల్లో సెలెక్ట్‌ ఐ, ఇద్దరూ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్లు అయ్యారు. ఒకరికి పూసపాటిరేగ కాలేజీకి, మరొకరికి సబ్బవరం కాలేజీకి పోస్టింగ్‌ ఇచ్చారు. మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీలో ఒక అపార్టుమెంట్‌ అద్దెకు తీసుకొని, పార్ట్‌ అవకుండా హ్యాపీగా ఉన్నారు. ఎవరి మతం వారిదే. అన్నట్లు ఎవరి బండి వారిదే. సాయిది పల్సర్‌, సెలీనాది యాక్టివా.

          కానీ, ఇద్దరికీ ఒకే కొడుకు. వాడి పేరేమై ఉంటుందో ఊహించండి! సింహకిషోర్‌! అబ్బే కాదండి! ఏసుప్రసాద్‌! సారీ! అది కూడా కాదు. ‘‘నీవే చెప్పిచావు!’’ అంటున్నారా. సరే వినండి ఆ బుజ్జిగాడి పేరు ‘‘లౌకిక్‌ స్ఫూర్తి’’!

          ఏమిటలా ముఖం పెట్టారు? నచ్చలేదా? తమరి ఖర్మ! ఏమిటో హాస్య కథ రాద్దామని కూర్చుంటే ఇలా తయారైంది!

View Attachment 1
1 تعليق