సంపాదకీయం
సంపాదకీయం (Author: ఊటుకూరు విజ్ఞాన్ కుమార్)
2026 ఉగాది సంచిక సంపాదకీయం
ప్రతి రెండేళ్ళకీ మన కళా సమితికి ఎన్నికలు వస్తాయి. మామూలుగా ఎన్నికలంటే రాజకీయాలూ, రాజకీయాలంటే పోట్లాటలూ, పోట్లాటలంటే వక్ర వ్యవహారాలూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో తప్పుడు ఆలోచనలొస్తాయి. కానీ ఇన్నాళ్ళుగా అవేవీ ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడగలిగాం. 1984 లో, అంటే ఇడ్లీ చేసుకోవాలంటే ఉప్పిడి రవ్వ దొరకక, తినాలంటే Lexington Avenue, New York City కి ఒక తీర్ధ యాత్రలా వెళ్ళి ఒక్కొక్క ఇడ్లీకి ఒక్కొక్క డాలరూ, సాంబారుకి ఒక డాలరూ మొక్కుబడిలాగా చెల్లించుకుని సంతృప్తి పడిన రోజుల్లో స్థాపించిన సమాజం మనది. అప్పటి నుంచి ఈ నలభై రెండు సంవత్సరాలూ పెద్ద ఒడిదొడుకులు లేకుండా నడుపుకొచ్చాం. ఏదో సంవత్సరానికి ఒక మూడో నాలుగో మాట్లు కలుసుకనే స్థితి నుంచి ఎన్నో కార్యక్రమాలూ, ఎన్ని రకాలైన కార్యక్రమాలూ జరుపుకుంటున్నాం. జరిపిన కార్యక్రమాలగురించి అన్నా మధు గారు తన అధక్ష సందేశంలో గురించి విపులంగా రాశారు. ఇలా రాసుకుంటూ పోతే స్వకుచ మర్దనమౌతుందేమో కానీ మన సమాజం నిజంగా పెద్దగా సమస్యలు లేకుండా నడిచింది, నలభై సంవత్సరాల పైగా.
మొన్ననే ఎన్నికలు జరుపుకున్నాం, ఎప్పటిలాగే దీక్షతో పని చేసే కొత్త కార్య వర్గాన్ని ఎన్నుకున్నాం. అధ్యక్షురాలిగా ఎన్నికైన మాకం ఉమ గారికీ వారి కార్య వర్గానికీ మా అభినందనలు.
ఇక ఈ సంచికకొస్తే:
హనుమంతరావు గారు తన కథ ‘హైదెరాబాదు హరిదాసు’ కథలో ఇలాంటి సత్పురుషులు ఈ కాలంలో ఉన్నారా అని ఆలోచించమన్నారు.
కీర్తి గారు తన తెలుగు అభిమానం చూపించారు, ‘ఇది నిజంగా నిజం’ అన్న కవితలో
అప్పలరాజు గారు, చరవాణి చెరలో చిక్కుకుపోయిన తన కొడుకుని పిలిచారు, ‘ఒరేయి నాన్నా’ అన్న తన కవితలో
సరోజ గారి అనువాద కవిత, ‘రెండు నీలు రంగు పెట్టెలతో’, విహంగంలా ఎగిరిపోవాలనుందన్నారు.
మత్స్యవతార కథని మాయ చేప కథలా మలచి రాశాడు నాలుగేళ్ళ నిటలాక్ష రాముడు
మంజీర కుమార్ గారి, 'యువత మార్చేను భవిత', వర్తమానం నిజంగా అంత అన్యాయంగా ఉన్నదా అని ఆలోచింపజేస్తుంది.
కృష్ణమాచార్యులు గారి 'త్యాగం కోరే చదువులు', బంగారు ‘రేపటి’ కోసం ‘ఇవాళని’ త్యాగం చేయ్యక తప్పదు కదా అనిపిస్తుంది.
గడ్డం దేవీప్రసాద్ గారి కవిత, (brick and mortar) ‘పుస్తకాలయం’ పై రాసినా అది ఈ రోజుల్లో అంతర్జాలం లోని వనరులకి కూడా వర్తిస్తుంది.
ఎన్ని ఉపన్యాసాలైనా ఒక పాటకి తూగవన్నారు, పోతన్న గారు, తన ‘పాట ప్రపంచంలో’!
రమ్య గారు, సంసారం, ఉద్యోగం మధ్య జరిగే ఘర్షణని ఒక Dr. Jekyl and Mr. Hyde లాగా చర్చించారు.
నాగజ్యోతి గారి ‘విహార యాత్ర’, తలలు బోడులైన తలపులు బోడి కావు కదా అని పిల్లలకర్ధమైతే ఎంత బావుణ్ణు అనిపించింది.
నాగజ్యోతి గారి 'మనీషి' కలల్లో కనిపించే మనిషా, నిజంగా అటువంటి మనుషులుంటారా అనిపించింది.
తాతారావు గారు, ఆడారి తనపు 'పంజరం' లో చిక్కుకుని ఒ తృటిలో తన జీవితాన్నంతటినీ తన చేతితోనే చెరిపేసుకున్న ఒక మహేష్ గురించి మనని ఆలోచించమన్నారు.
సింహగిరి గారు, తెలుగు అంతరించిపోతోందని వాపోయే వారు ‘ఎవరు వారు’ అని గద్దించి అడిగారు.
