శిక్ష నాది కాదు  (Author: హరి వెంకట రమణ)

'ఒరే మీ అక్క, అయ్యా వొచ్చారు.'

రెండు ఇనుప గేట్లు తాళం తీసాక, బయటకు వొచ్చాను, ముఖానికి కొంచెం ఎండా, కొండమీంచి వొచ్చిన గాలీ తగిలాయి. హాయిగా అనిపించింది. వొంటి సబ్బు, బ్రష్షు, పేస్ట్ వున్న కవరు ఇచ్చింది అక్క. అక్కడ సివిలు డ్రెస్సులో స్టాఫ్ వుంటారు, అలాగని వాళ్ళు పోలీసులు కాదు, అబ్సర్వేషన్ హోమ్ సిబ్బంది. ఇక్కడ అన్ని వైపులా కెమెరాలు ఉంటాయి. బయట ఒక కుక్క వుంది, కానీ అది కట్టేసి ఉంటుంది, దాన్ని వొదిలేస్తే పరిగెత్తినపుడు పిక్క పట్టి ఆపేస్తది. దానికీ నాకు పెద్ద తేడా ఏమీ లేదు, దాని తాడు వేశారు, నన్ను సెల్లులో వేశారు.

‘ఈ వారం కూడా నాకు బెయిల్ ఇవ్వలేదు, ఇంకొన్ని రోజులు లోపలే ఉండమంటున్నారు జడ్జీ గారు, లోపట వుండలేకపోతాన్నే అక్కా 'అన్నాను." కాసేపు అక్క, అయ్యా ఎవరూ మాట్లాడలేదు, కొండంత నిశ్శబ్దం అది, 'ఎందుకు నాయనా ఇలా ఇరుక్కున్నావు?' అని అడిగితే బాగుండేది కానీ మా అయ్య అడగడు, నేను తప్పు చేశాను అని నమ్ముతున్నాడో, చేయలేదనుకుంటున్నాడో కూడా చెప్పడు, అక్క తినడానికి మూంగీ డాల్ ప్యాకెట్టు ఇచ్చింది. 'వొచ్చేవారం వొస్తాం చిన్నా' అని అక్క వెళ్లిపోయింది. నేనక్కడ ఆ పాకెటు చించి తినడం మొదలుపెట్టాను. అక్కడున్న ఒక చెట్టు కింద కూర్చున్నాను.

నేను ఎటూ బయటకు వెళ్ళనని నమ్మకం కలిగిందేమో ఇందాక పిలిచి దగ్గర్లో నుంచున్న మనిషి ఏమీ అనలేదు, సర్లే కూర్చో అన్నట్టు వొదిలీసాడు.

లోపల ఒక గదిలో ఇరవై మంది ఉంటాము, దాన్ని ఆనుకునే బాత్రూము, స్నానాలగది. రోజంతా తోచడానికి కేరమ్ బోర్డు ఉంటుంది, పుస్తకాలు ఇస్తారు కానీ ఎవడూ చదవడు. మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా అన్నం పెట్టేస్తారు, రాత్రి ఏడింటికల్లా అన్నం పెట్టేస్తారు, ఆకలేసినా వేయకపోయినా తినేయాల్సిందే.

ఇక్కడకి వొచ్చాక దీనిని జువెనైల్ హోమ్ అంటారని తెలిసింది, నాలా తప్పు చేసిన వాళ్ళని తీసుకొస్తారు. అయితే నేనేమీ పెద్ద తప్పు చేయలేదు, పెద్దదంటే పెద్దది కాదు ఆ తప్పు, అసలు నేను డైరెక్టుగా ఏ తప్పూ చేయలేదు, వూరికే ఇలా ఇరుక్కున్నాను.

ఇంకా కొంత మంది తల్లితండ్రులు వొచ్చారు వాళ్ళ వాళ్ళని చూడటానికి, దాంతో ఇందాక నన్ను చెట్టుకాడ కూర్చోమన్న అంకులు లోపలికి పదమన్నాడు.

నాకు పద్దెనిమిది నిండడానికి ఇంకా మూడునెలలు పడుతుంది. ఒక వేళ నేరం పెద్దదయితే పెద్ద వాళ్ళ జైలుకి ఇక్కడ శిక్ష అయిపోయాక పంపుతారు.

లోపలి కి వొచ్చాక మళ్ళీ సెల్లులో పెట్టి తాళం వేసేసారు, లోపలున్నోళ్లు వొక్కోడు ఒక్కో పొజీషన్లలో వున్నాడు. పైగా ఒక్కోడు ఒఒక్కో నేరంతో లోపలికొచ్చినోడు, ఒకడు పదిహేనేళ్ల అమ్మాయిని లేపుకుపోయి గుళ్ళూ గోపురాలు తిరిగీసి దొరికిపోయినోడు, మరొకడు సెల్ ఫోన్ దొంగ, మరొకడు రేప్, మరొకడు హత్య, ఇంకొకడు గలాటలో, ఆ చివరోడు బైకుల దొంగ.

మా సెల్లు గది కిటికీ బాగా పైకి ఉంటుంది, కానీ చిన్నగా ఆకాశం కనపడుతుంది. ఇందాక ఎండగా వున్న ఆకాశం మబ్బు పట్టింది, మా గది పగలే చీకటిగయిపోయింది. ఇలా మబ్బులు పట్టినపుడు బైకుల మీద తిరగడమంటే నాకు చాలా మజా. అలా తిరగడమే నా కొంప ముంచింది.

 * * *

పదిహేను రోజుల క్రితం…… ఇలాగే మబ్బుగుందని నా బైకు మీద తిరుగుతున్నాను, తిరిగీ తిరిగీ బీచ్ దగ్గర ఆగి ఒడ్డునున్న దిమ్మ మీద కూర్చొని మురి మిక్చర్ తింటూ కూర్చున్నాను. వెనక నుంచి ఫాట్.. మని నా వీపు మీద కొట్టాడు. వెనక్కి చూస్తే పామ్ గాడు.. ఆడిని మేమందరం పాముగా అంటుంటాము, ఎందుకంటే ఆడు బండి నడిపినా, నడుచుకుంటూ వెళ్లినా పాములా నడుస్తాడు, ఎవరైనా అమ్మాయిఈడి వంక చూస్తే పాములాగా నాలుక బయటకు తీసి ఆడిస్తాడు.

'ఒరే నా బైకు లేదు అలాగే ఎయిటీ ఫీట్ రోడ్డు వైపు పోనీరా'అన్నాడు. ‘వుండు బే ప్రశాంతం గా మురీ మిక్చర్ తిననీరా బాబూ' అన్నాను నేను.

ఆడు కూడా చెయ్యేసాక ఇద్దరం మురీ మిక్చర్ తిని పారీసాము. నా బైకు తీసి ఆడు చెప్పిన చోటకు పోనిచ్చాను. మెల్లగా సాయంత్రం పోయి చీకటవుతోంది. మాముందర ఒక అంటీ గారు నడవలేక నడవలేక వాకింగ్ చేస్తుంది. పాముగాడు ఒరే కొద్దిగా ఆ ఆంటీకి దగ్గరగా పోనీరా అన్నాడు, నేను కొంచెం ఆవిడ పక్కనుంచి పోనిస్తున్నాను, అంతే వీడు ఆవిడ మెడలో పుస్తెలతాడు గట్టిగా లాగి పడేసాడు, ఆ లాగుడుకి ఆవిడ కింద పడిపోయింది.

పెద్దగా కేకలు వేసేసింది బాగా భయపడి, ఆవిడ మెడ మీద రక్తం. నేను గాభరా పడిపోయాను.

చాలా దూరం వెళ్ళాక బండి ఒక రోడ్డుపక్క మట్టిరోడ్డుకి వెళ్లే దారిలో ఆపాను. వాడు పుస్తెలతాడు చూపించాడు, ఒక చోట రక్తం అంటుకొని వుంది తాడుకి.

'యేటి బే ఇది చెప్పి చెయ్యాలి కదా, నన్నెందుకు ఇరికించావు ఇందులో' అన్నాను, 'ఆవిడకు ఏదైనా అయితే కేశవుతుంది కదా?' అన్నాను.

పామ్ గాడు దమ్ముకొడుతూ'అలాగేటవదురా, కంప్లైంటు ఇస్తారు గానీ ఆ చీకట్లో ఆవిడ మన ముఖమూ చూడలేదు, బండి నంబరూ చూడదు, ఆవిడ గాభరాలో ఆవిడ ఉంటుంది' అన్నాడు. నాకు ఆడు చెప్పింది రైటే అనిపించింది.

'ఒరే నాకిందుల వాటా ఏమీ వొద్దు నన్ను ఇందులో ఇరికించకుంటే సాలు' అన్నాను. ఆ తరువాత పామ్ గాడిని నేను కలవలేదు, ఆడు నాకంటే వయసులో రెండేళ్లు పెద్ద. మా ఏరియా గుంటలు ఒక్కడూ నాన్యంగా ఉండడు, తేలు గాడు అని మేము పిలిచే సాంబా గాడు బ్లేడ్ బ్యాచ్చీతో తిరుగుతుంటాడు, ఆళ్లు రాత్రిళ్ళు బయట పార్కింగ్ చేసిన బండ్ల సీటు కవర్లు బ్లేడ్ లతో కోసేస్తారు, పెట్రోల్ లేపేస్తారు.

అమ్మవారి పండగలు జాతరలు అయినపుడు బ్లేడ్లతో కోసేస్తుంటారు జనాన్ని, ఆల్లదో రకం సైకో బ్యాచీ. ఇంకొంతమంది గంజాయి అమ్ముతారు కొంటారు. కొండ మీద ఏజెన్సీ ఏరియాకి వెళ్లి తెచ్చి కిందన అమ్ముతుంటారు. ఖాళీ ఉన్నప్పుడల్లా పబ్జీ ఆడుతారు, ఆన్లైన్ రమ్మీ ఆడతారు. మా వాళ్ళందరూ ఏదో తెలీని కసితో వుంటారు, అందరికీ కోపం బాగా బతుకుతున్నోళ్లంటే కోపం, నీతులు చెప్పే ముసిలోళ్లన్నా, మధ్య వయసోళ్లన్నా కోపం. మాకు అన్నీ సరిగాలేవని కోపం, కొంతమందికే అన్నీ ఉన్నాయని కోపం. నేనివన్నీ చేయలేక బండి వుంది కదా అని ఆన్లైన్ లో ఫుడ్డు, సరుకులు తీసుకొని ఇళ్లకు వెళ్లి ఇచ్చే పని ఒప్పుకున్నాను. అలా పని చేసే వాళ్ళని గిగ్ వర్కర్ అంటారట ఒకసారి హోటలోడు చెప్పాడు. నా దగ్గర బండి వుంది కానీ, స్మార్ట్ ఫోన్ లేదు కానీ రెండురోజుల్లో సంపాదించాననుకో.

రోజుకి వెయ్యి రూపాయలు పైనే వొస్తుంది ఆన్లైన్లో సరుకులు, తిళ్ళు తీసుకెళ్లి ఇస్తుంటే., కానీ గౌరవం లేదని నా మనసు.. వూ.. అని పీకుతుండేది.

పది మందిలో ఒకరో ఇద్దరో చిన్న చిరునవ్వుతో డబ్బులిస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ నన్నేదో దొంగను చూసినట్లు అనుమానంగా చూస్తారు.

నేను మరీ దొంగలాగా ఉన్నానా? అని ఒకసారి మంగలి షాపులో చూసుకున్నాను, నాకు నేను బానే కనిపించాను ఎక్కువ జుత్తు, తలకు ఆయిల్ కూడా లేకుండా గిడస బారిపోయి వుంది, బాగా పెరిగిన గెడ్డం అంతా ఇప్పటి హీరోల్లాగే మైంటైన్ చేస్తున్నాను గానీ అయినా ఈ దొంగనాకొడుకులకు నేనెందుకు దొంగలాగా కనపడుతున్నానో అర్ధం కాలేదు.

ఆరోజు నేను సంకనాకిపోవాలని రాసిపెట్టున్న రోజు. పామ్ గాడు సరిగ్గా పన్నెండు గంటలకి ఫోన్ చేసాడు, ‘బీరేద్దాం రా మావ.. ’ అని. అప్పటికి సరుకులు డెలివరీ ఆర్డర్ పనిలో వున్నాను, కాసేపుంటే ఫుడ్ ఆర్డర్ కూడా పెరుగుతుంది. కానీ బాగా అలిసిపోయి వున్నానేమో ఆరోజు ఇంక ఈ పూటకి ఆపేసి సాయంత్రమే రేపో పనిచేద్దాంలే అనుకున్నాను.

సరే అని ఆడు చెప్పిన బార్ దగ్గరకెళ్ళాను, ఆడు అప్పటికే ఒక బీరు వేసాడు. నేనో మూడు బీర్లు వేసేను. వేపిన కానా గరతలు తిన్నాము, నాకు బార్లో చికెను అంటే భయ్యం, ఇవైతే కల్తీ చెయ్యలేరు కదా. ఆడు ఇంకో మూడు బీర్లు తాగేసాక బయలుదేరుదాం అన్నాడు. నేను ఊగిపోతున్నాను, బండి నడపలేనని అర్ధమయ్యింది. నా బండి అక్కడే ఉంచేసాను, ఎందుకంటే నాకు బాగా ఎక్కేసింది. పాముగాడు మాత్రం మంచి స్టడీగున్నాడు. సరే అని ఆడి బండి మీద వెళ్తున్నాము, ఆడు పాములాగా రోడ్లు మీద తిప్పి తిప్పి మా ఇంటి దగ్గర వొదిలీసాడు.

నేను పడుకుండి పోయాను. రాత్రి ఏడవుతుంది. ఇక బారు దగ్గరున్న బండి తెచ్చుకోవాలనుకున్నాను, సరిగ్గా అప్పుడొచ్చాడు వొలంగా వున్న ఒక మనిషి. నన్ను ‘ఇలారా మాట్లాడదాం.. ’అని మెల్లగా తీసుకెళ్లి వీధి చివర వున్న పోలీసు జీపు ఎక్కించారు. నాకు అర్ధం కాలేదు, చాలా గాభరా ఏసేసింది. 'ఎందుకు సార్ నానేటి జెయ్యలేదు సార్' అన్నాను.

పోలీసాయన నా వొంక చాలా సీరియస్ గా చూసాడు, నాకు తడారిపోయింది.

'మీరేటి చేశారో మీకు తెలీదురా? మీరు చేసిన నిర్వాకం రికార్డు అయ్యింది, పద పద' అన్నాడు. అంటే పాము గాడు దొరికి పోయి నన్ను ఇరికించీసాడన్నమాట, దొంగ లండీ కొడుకు ఆడు, అంతా దొంగ బుద్ధి, ఆలాటోడితో తిరగడం నా బుద్ధి తక్కువ.

నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, మా అయ్య, అక్కా ఏడ్చుకుంటూ స్టేషన్ కి వొచ్చారు, చిన్న పిల్లోడు సార్, ఇంకా పద్దెనిమిది నిండలేదు అని నా ఆధార్ కార్డు. పోలీసోళ్ళకు చూపించారు.

వాళ్ళేదో రాసుకొని నన్ను అప్పటికప్పుడు వేరే చోటకి వెంటనే పంపించీసారు, ఆ చోటే ఇది.

* * *

అబ్సెర్వేషన్ హోమ్ లో కలకలం మొదలయ్యింది, అందరూ గోలగా మాట్లాడుతున్నారు. అంటే రాత్రి భోజనం టయిము అయ్యింది. పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళని పిల్లలు అంటారట, నేనేమో పెద్దోడి నయిపోయానని పనికి వెళ్ళిపోతున్నాను, బండి నడిపేస్తున్నాను.

తప్పులు చేసిన పిల్లలు వున్న జైలునే అబ్సెర్వేషన్ హోమ్ అంటారట. మధ్యలో ఒక సంస్థ వాళ్ళు వొచ్చారు మాకు మంచి విషయాలు చెప్పడానికి అప్పుడు మా హోమ్ సూపరింటెండెంట్ కూడా వాళ్ళతో పాటు వున్నాడు, ఫోటోలు మా వీపులు పడేటట్టు తీసుకోమన్నారు ఆ సంస్థ వాళ్ళని, పైగా వీటిని ఎక్కడా పేప ర్లోనూ, వాట్సాప్ లోనూ పెట్టొద్దన్నాడు వాళ్ళతో.

ఆ వొచ్చి చెపుతున్నాయన మాకేదో హితబోధలు చేస్తున్నట్లు మాట్లాడతాడు, అతనికి మాట్లాడటం రాదని నాకు అర్ధమయ్యింది, ఈ మాత్రం పనికి అతనికి అటూ ఇటూ టీ షర్టులు వేసుకున్న అమ్మాయిలు వున్నారు, వాళ్ళు బాగున్నారు. వాళ్ళు వాలంటీర్లట చదువుకుంటూ ఈయన సంస్థకు వొచ్చి సేవ చేస్తారట, వాళ్లకు చప్పట్లు కొట్టమన్నారు కొట్టాము. ఈ నీతి బోధల సోది చెప్పినాయనకి చప్పట్లు కొట్టమన్నా నాకు కొట్ట బుద్ది కాలేదు.

తిండం, తెల్లారడం, ఆలోచించడం, అలా ఇంకో రెండున్నర నెలలు గడిచిపోయాయి, నాకు బెయిల్ మాత్రం ఇవ్వలేదు.

ఈ రెండున్నర నెలలు నరక యాతన అందరికీ ఒకటే బాత్రూము, వెళ్లి వొచ్చినోడు నీళ్లు కొట్టడు, గది రొచ్చు వాసన. లేదా ఫినాయిల్ వాసన, ఒక్కోడు అదోలా చూస్తాడు, ఆడు రాత్రయితే నా ప్యాంటు ఎక్కడ లాగేస్తాడో అని నాకు ఒకటే టెన్షను.

 * * *

'ఒరేయ్ నీ ఫ్రెండ్ అదే పామ్ గాడు, చైన్ స్నాచింగ్, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ బుక్కయ్యాడు, పెద్దోళ్ల జైలులో ఇంకా బెయిల్ రాక లోపలే వున్నాడు, ఆది కేసు ట్రయల్ అవుతుంది.'

'నీ అదృష్టమేంట్రా అంటే ఉరేయ్ నీకు పద్దెనిమిది నిండడానికి సరిగ్గా రెండున్నర నెలలు తక్కువయ్యాయి, అదీ కాక సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు నీ గురుంచి కొంచెం మంచిగా వొచ్చింది మీ ఏరియాలో, అల్లే లేకపోతె నీ పని ఇత్తడి మూకుడులో మెత్తని పకోడీ యే' సూపరింటెండెంట్ చెప్పడం ఆపి నా కళ్ళలోకి తీక్షణంగా భయపెట్టేట్లు చూసాడు.

నేను తలదించుకున్నాను. 'ఒరే నీ టయిము అయిపోయిందిరా, మరింక ఇటు రాకుండా జాగర్తగుండు' అన్నాడు మళ్ళీ ఆయనే. హమ్మయ్యా.. బతుకు జీవుడా అని బయట పడ్డాను. ఆటోలో మా అయ్యకు, అక్కకు నాకు మాటల్లేవు.

ఆ సాయంత్రం నా ఫోను తీసుకొని ఆన్ చేశాను, నిజానికి అది నాది కాదు, ఒక ముసలాయనది, ఒక అర్ధరాత్రి ముఖానికి రుమాలు కట్టుకొని అటాక్ చేసి దొబ్బుకొచ్చాను. అంటే ఆ శిక్ష తప్పించుకున్నాను, ఈ శిక్ష అనుభవించాను. సరిపోయింది గా, కుంచుమాంబ తల్లి సరిగ్గా గుణపాఠం నేర్పింది నాకు. అది.. అప్పుడు నా మీద ఏ కేసు అవ్వలేదు, నేను దొరకలేదు, ముసిలోడు కంప్లైంటు ఇచ్చాడో లేదో కూడా డౌటే. ఇప్పుడు తెలిసీ తెలియక నాకా ఉద్దేశ్యం లేకపోయినా పామ్ గాడి వల్ల ఇరుక్కొని శిక్ష అనుభవించాను. ఫోన్లో నా సిమ్కార్డు తీసీసి.. ఫోను అమ్మవారి హుండీలో వేసీసాను.

పైన ఆకాశం వొంక చూసాను, అదిప్పుడు శుభ్రంగా, స్వచ్చంగా వుంది, అక్కడక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి, నాకు చాలా హాయిగా అనిపించింది.

సమాప్తం.

0 hozzászólás

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)