విహారయాత్ర  (Author: అప్పరాజు నాగజ్యోతి)

అలవాటుగా ఉదయం అయిదుగంటలకే మెలకువొచ్చేసింది. ఎప్పట్లా పిల్లాడి ఏడుపుగానీ, వంటింట్లోనుండీ పాలగిన్నెలచప్పుళ్ళు గానీ వినిపించకపోవడంతో ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత రెండుక్షణాలపాటు చుట్టూ కలియచూసాక, మేమున్నది ఊటీలో గెస్ట్ హౌసులోనని స్ఫురణకి వచ్చింది. ప్రక్కకి తిరిగి చూస్తే, హైమఆదమరిచి నిద్రపోతోంది.

మెల్లిగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని, వాచ్‍మెన్‍తో కాఫీ తెప్పించుకుని త్రాగుతూ బాల్కనీలో కూర్చున్నాను.

కళ్ళు ఊటీలోని ఉషోదయం అందాలని తిలకిస్తుంటే మనసు మాత్రం ఆలోచనల ఉధృతిలో ఉరకలేస్తోంది.

***

నాన్న చనిపోయాక, వంటపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చిన అమ్మకి గుండెజబ్బు రావడంతో యిక పనిచేయలేని పరిస్థితి ఎదురయింది. సరిగ్గా అదేసమయానికి, నా డిప్లొమా పూర్తయి ఉద్యోగంరావడం నిజంగా మా అదృష్టమేనని చెప్పాలి!

ఆతర్వాత రెండేళ్ళకి హైమతో నా వివాహం జరిగేటప్పటికి నా వయసు సరిగ్గా ఇరవైఏళ్ళు, తనకేమో పదిహేడేళ్ళు. మా ఆర్ధికపరిస్థితులదృష్టా మేమిద్దరం కలిసి హనీమూన్ పేరిట ఏ విహారయాత్రలకీ వెళ్ళలేకపోయాము. ఇద్దరిదీ పరువం ఉరకలేసే వయసే అయినా, ఇంట్లో పెళ్లి కాని ముగ్గురుచెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు వుండడంమూలాన మా కోరికలకి కళ్ళెం వేయవలసివచ్చింది.

సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‍లోనే కుటుంబసభ్యులం అందరమూ సర్దుకుని వుండేవాళ్ళం. నా వివాహానంతరం, ఉన్న ఒక్క బెడ్రూంనీ మాకే కేటాయించినా, ఇంట్లో ఎవరో ఒకరు అల్మారాలో బట్టల కోసమో, అటకపైన వస్తువులకోసమో బెడ్రూంలోకి వచ్చిపోతూ వుండేవాళ్ళు. దానికితోడు బెడ్రూంలో ఏ చిన్నశబ్దమైనా బైట హాల్లో పడుకున్నవాళ్ళకి స్పష్టంగా వినిపించేంత ఇరుకుగదులవడంతో కొత్తదంపతులమైన మేము స్వేచ్చగా మసులుకునే అవకాశం లేకపోయింది.

ఆ తర్వాత వరసవరసగా చెల్లెళ్ళ వివాహాలూ, వెనువెంటనే వాళ్ళ సూడిదలు, పురుళ్ళు, తమ్ముళ్ళ చదువులు, ఉద్యోగాలూ వీటన్నింటితో మా దంపతులకు ఏకాంతం కాదు కదా, ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకలేదు.

బాధ్యతలన్నీ తీర్చుకునేప్పటికి మా యవ్వనమంతా కరిగిపోయింది. భార్యాభర్తల స్థానంనుండి మేమిద్దరం మొదట తల్లిదండ్రులుగా రూపాంతరం చెంది, ఆ పైన ఈమధ్యనే ఏడుమాసాలక్రితం బామ్మాతాతయ్యలమయినప్పటినుండీ మా జీవితాలు మరింత బిజీగా మారాయి. ఎందుకంటే, మా మనవడు ఏముహూర్తంలోనైతే పుట్టాడోగానీ నోరుతెరిచాడంటే ఆరున్నొక్కరాగమే, ఇంటిల్లిపాదీ వంతులవారీగా ఆ బుడతని మోస్తూనే వుండాలి. పిల్లలని జోకొట్టి నిద్రబుచ్చడంలోని ఒడుపు హైమకి తెలిసినట్టుగా కోడలుపిల్లకి వంటబట్టకపోవడంతో, రాత్రుళ్ళు పిల్లాడు లేచినప్పుడల్లా మాగదిలోకి వచ్చి అత్తగారి చేతుల్లో చంటాడిని పెట్టేసేది. అందుకోసమని మా బెడ్రూమ్ తలుపులని రాత్రుళ్ళు కూడా తెరిచే ఉంచుతాము.

అలా పెళ్ళైన తొలినాళ్ళనుండీ ఇప్పటిదాకా ఏకాంతమన్నదే ఎరగని మా దంపతులం ఇన్నేళ్ళకి, ఇలా జంటగా ఊటీకి వచ్చామంటే అది ఖచ్చితంగా మా ఏకైక పుత్రరత్నం అభినవ్ చొరవే!

***

అయిదురోజులక్రితం...

ఆఫీసునుండి ఇంటికి వస్తూనే“ నాన్నా, రేపు రాత్రి బస్సుకి తిరుపతికి రెండు టికెట్లు దొరికాయి. మీకు తిరుపతి మొక్కు వుందిగా! పిల్లాడితో మేము ప్రయాణం చేయలేం కాబట్టి ఈసారికి మీరిద్దరూ వెళ్లి రండి. రేపు సాయంత్రం అయిదున్నరకి నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి తయారై వుండండి, మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను“ అన్నాడు అభినవ్.

చాన్నాళ్ళకి ఆ తిరుపతి వేంకటేశుని దర్శనానికి వెళ్ళడం శుభసూచకంగా అనిపించడంతో నేనూ, హైమా ఆనందంగా బట్టలు సర్దుకున్నాం.

ఆ మరుసటిరోజు ఆఫీస్ నుండి అభినవ్ ఇంటికి రాగానే ముగ్గురం వాడి కారులో బయల్దేరాము.

కారు బస్సు స్టాండ్‍కి చేరాక మా సూట్‍కేసుతో పాటు మరో చిన్న ట్రాలీబ్యాగ్‍ని డిక్కీలో నుండి బైటకి తీసాడు అభినవ్.

“ ఈ బ్యాగ్ దేనికిరా...“ అంటూనే తలెత్తిన నాకు ఎదురుగా ఊటీకి వెళ్ళే వోల్వోబస్సు కనిపించింది.

“అభీ, ఇది తిరుపతి బస్సు కాదనుకుంటా..” అంటున్న నా మాటలని పట్టించుకోకుండా ఆ బస్సు క్రిందభాగంలో మా లగేజీనిగబగబా సర్దేసాడు అభినవ్.

“ నాన్నా, ఈ బస్సు ఊటీకి వెళ్తుంది. మూడురోజులు అక్కడ గడిపాక అటునుండీ కొడైకెనాల్‍కి వెళ్లిరండి. మీ ప్రయాణం, వసతి ఏర్పాట్లన్నీ ఆన్‍లైన్‍లో చేసేసాను“ అంటూ నా చేతిలో టికెట్లు పెట్టిన అభినవ్ వేపు ఆశ్చర్యంగా చూసాము.

మేమలా అయోమయంలో ఉండగానే“ వివరాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు బస్సు ఎక్కండి“ అంటూ మమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్ళిపోయాడు అభినవ్.

***

ఈ మూడురోజుల్లో మా స్వంతమైన మధురానుభూతులని నెమరేసుకుంటూ మా అభినవ్‍కి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకుంటుండగా“ నందూ, వేడివేడి ఇడ్లీలని సాంబారుతో ఓ పట్టుపడుదురు రండి“ అంటూ తలారా స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటూ వచ్చింది హైమ.

‘ నందూ ‘ అన్న ఆ పిలుపుని హైమ నోటినుండీ విని ఎంతకాలమయిందో!

తనివితీరా ప్రేమఊసులు చెప్పుకునేందుకుగానీ, చనువుగా ముద్దుపేర్లతో పిలుచుకునేందుకుగానీ మాకసలు సమయంగానీ, ఏకాంతంగానీ చిక్కిందేలేదు. ఆలస్యంగానైనా మొత్తానికి యిలా మేమిద్దరమే యిలా జంటగా గడపడం నాకు చాలా ఆనందం వుంది.

ఇడ్లీలు తింటుండగా“ నందూ, మనవడి భారమంతా కోడలిపై పెట్టేసొచ్చాం. నెలలపిల్లాడితో ఎలా నిభాయించుకుంటోందో ఏమో! ఈ వయసులో కృష్ణారామా అనుకుంటూ మనవడితో గడపక టింగురంగామంటూ విహారయాత్రలకి బయల్దేరారంటూ కోడలుపిల్ల మనల్ని తిట్టుకుంటోందేమోనండీ“ అన్న హైమ మాటలకి నేను మౌనంగా లోనికి వెళ్లి రెండు ఉత్తరాలని తెచ్చి ఆమె చేతిలో పెట్టాను.

మమ్మల్నిబస్సు ఎక్కించేముందు అభినవ్ సర్దితెచ్చిన ట్రాలీబ్యాగులో స్వెట్టర్లు, శాలువాలతోపాటు అడుగున వున్న ఆ లేఖలు ఈ ఉదయమే నాకంటపడ్డాయి.

నావేపు విస్మయంగా చూస్తూ వాటినందుకుంది హైమ.

మొదటిలేఖ తెరిచింది.

ప్రియమైన అత్తయ్యగారికి

ఎన్నడూ లేనిది నేనిలా మీకు ఉత్తరం వ్రాయడం ఆశ్చర్యంగా వుంది కదూ! కొన్నికొన్ని మాటల్ని ఎంత దగ్గరివాళ్ళకైనా ముఖ: తా చెప్పడం ఇబ్బందిగా వుంటుంది, అందుకే ఈ లేఖ.

రెండువారాలక్రితమనుకుంటా, బాబు అర్థరాత్రి లేచి గుక్క త్రిప్పకుండా ఏడుస్తుంటే మీగదికి తీసుకొచ్చాను. మీరు వాడికి జోలపాడుతూ పదేపదినిముషాల్లో వాడ్ని నిద్రబుచ్చి మాగదిలో పడుకోబెట్టి వెళ్ళారు. అయితే మీరు వెళ్ళిన అరగంటకే బాబు ఒళ్ళు వెచ్చబడడంతో నాకు భయమేసింది. ఆయనేమో ఊళ్ళో లేరు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి మీ గదితలుపులు త్రోసాను. గదిలో మిమ్మల్నీ, మామగారినీ చూడకూడనిస్థితిలో చూసిన నేను బిత్తరపోయాను, మీరేమో సిగ్గుతో చితికిపోయారు. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను.

ఆ తర్వాత అయిదునిముషాలకి మీరు వచ్చి నాతో ఏదో చెప్పబోతే మొహం త్రిప్పేసుకున్నాను. రాత్రంతా బాబు ప్రక్కనే కూర్చుని వాడి నుదిటిపై తడిగుడ్డ మార్చిమార్చి వేస్తూ గంటగంటకీ టెంపరేచర్ చెక్ చేస్తున్నా మనసులో మాత్రం ‘ఈ వయసులోనూ వీళ్ళకి ఈ యావ తగ్గలేదన్నమాట. మనవడిని ఎత్తుకుంటున్న వయసులోనూ ఇంకా నవదంపతుల్లా, ఛ, ఛ’ అంటూ మిమ్మల్ని తిట్టుకుంటూనే ఆ రాత్రంతా గడిపేసాను. బహుశా నా మనసులో మాటలు నాకళ్ళల్లో ప్రతిబింబించాయేమో, ఆ తర్వాత రెండుమూడురోజులపాటు మీరూ నన్ను తప్పించుకునే తిరిగారు. నాకూ మీతో మాట్లాడాలనిపించలేదు. రాత్రుళ్ళు బాబుని మీ వద్దకి పంపేందుక్కూడా నాకు మనస్కరించలేదు.

ఆ తర్వాత మీఅబ్బాయి క్యాంపునుండి తిరిగొచ్చిన రాత్రి ఉన్నట్టుండి బాబు నిద్రలేచి ఏడుపు లంకించుకుంటే, వాడిని సముదాయించలేక నేను పడుతున్న అవస్థని చూసి ‘ బాబుని అమ్మకిచ్చి వస్తాను ‘ అంటూ లేవబోతున్న ఆయన్ని చేయి పట్టుకుని ఆపేస్తూ ‘ వృద్ధజంట రాసలీలలకి వీడు అడ్డంలేద్దూ, వదిలేయండి ‘ అన్న నా మాటలకి ఆయన నివ్వెరబోయారు.

ఆ తర్వాత అడపాదడపా ఆయన వద్ద మిమ్మల్ని ఇలాగే హేళన చేస్తూవచ్చాను.

వారంరోజుల తర్వాత మా రాధత్తయ్య ఊళ్లోకి వచ్చిందని తెలియడంతో తనని కలిసేందుకు మా బాబాయి ఇంటికి వెళ్లాను. మా రాధత్తయ్య అందరికంటే చిన్నది. నన్ను ఎక్కువకాలం ఎత్తుకుని మోసి, ముద్దు చేసే రాధత్త వద్ద నాకు చాలా చనువూ, ఇష్టమూను. అందుకే, మనవడిని చంకలో వేసుకుని గుమ్మంలోనేఎదురైన అత్తయ్యతో“ అత్తా, ఈ వయసులోనూ నాతో సమానంగా పిల్లవాడ్ని ఎత్తుకుతిరుగుతున్నావు, నువ్వు గ్రేట్ అత్తా“ అంటూ సరదాగా హాస్యం చేసాను.

ఎన్నడూలేనిది ఆవేళ నామాటలకి రాధత్త మొహం చిన్నబోయింది.

“ అదేంటత్తా, ఏదో వేళాకోళానికి అన్నానంతే. నువ్వు సీరియస్ అయినట్టున్నావు. సారీ“ అన్న నా మాటలకి“ ఫర్లేదులే రీతూ, అందరూ అంటున్నమాటే నువ్వూ అన్నావు“ అని భారంగా అన్న అత్తయ్య కళ్ళల్లో నీళ్ళు చూసి కంగారుపడ్డాను.

“ అత్తా, నువ్వు దేనికో బాధపడుతున్నావు. నాతో పంచుకోకూడదా“ అంటూ తన రెండుచేతులూ పట్టుకున్నాక, అప్పుడు రాధత్త చెప్పిన మాటలు అజ్ఞానంతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించాయి.

“ రీతూ, మా పెళ్ళికి నా వయసు పదహారు, మీ మామయ్యకి ఇరవైఏళ్ళు. నేను మెట్టినింటికి వెళ్ళేప్పటికి ఆ ఇంట్లో పెళ్లికాని ఇద్దరు ఆడపడుచులు, ఆఖరున పుట్టిన మరిది వున్నారు. మా మామగారు మాపెళ్ళికి రెండేళ్ళక్రితమే చనిపోవడంతో తోబుట్టువుల భారమంతా ఆయనపైనే పడింది. భార్య వచ్చాక కొడుకు మారిపోతాడేమో, తమని పట్టించుకోడేమోనన్న భయంతో మా అత్తగారు ఇరవైనాలుగ్గంటలూ మాకు కాపలాగా వుండేది, రోజంతా నాకు ఏదో ఒక పని అప్పచెబుతుండేది. దాంతో నాకూ, మీ మామయ్యకీ ఏ అర్థరాత్రికో తప్ప అస్సలు ఏకాంతమే దొరికేది కాదు. అప్పటికే అలిసిపోయిన దేహాలు చేరువైనా పెద్దగా అనుభూతి వుండేది కాదు.

తోబుట్టువుల చదువులూ, పెళ్ళిళ్ళు, పురుళ్ళు అన్నీ ముగించుకునేప్పటికి ఆయనకి ముప్ఫైరెండేళ్ళు, నాకు ఇరవైఎనిమిదేళ్ళు నిండాయి. ఆ తర్వాత మాపిల్లల బాధ్యతలని తలకెత్తుకున్నాం. వాళ్ళ చదువులూ, పెళ్ళిళ్ళు అయేందుకు మరో పద్నాలుగేళ్ళు పట్టింది. ‘ హమ్మయ్య ‘ అని ఊపిరి పీల్చుకునేలోపే మీ బావకి ఈ చంటాడు పుట్టేసాడు. వాడ్ని నా చంకకి కట్టేసి నా కొడుకు, కోడలు టింగురంగామంటూ ఊళ్లు తిరుగుతుంటారు. ఏమైనా అంటే, ఇదిగో ఇప్పుడు నువ్వన్నట్టే ‘ఈవయసులో మీకు మరో పనేముంది. హాయిగా మనవడి ఆలనాపాలనా చూసుకుంటూ ఉండక‘ అనేస్తారు. మనవడి ముద్దుముచ్చట్లు దగ్గరుండి చూసుకోవడం మాకు సంతోషమే అయినా, దంపతులుగా మాకంటూ కొంత ఏకాంతసమయం కావాలని కోరుకోవడం తప్పంటావా రీతూ? ఇప్పుడు నా వయసెంతనీ? నలభైనాలుగేళ్ళు. ఈకాలంలో పిల్లలు ముప్ఫైలూ, నలభైలూ దాటాక పెళ్ళిళ్ళు చేసుకుని, చేతులు కలుపుకుని జంటగా తిరుగుతున్నారు. అలాంటిది, బాధ్యతలన్నీతీర్చుకున్నాకైనా భార్యాభర్తలం మాకంటూ కొంత ఏకాంతసమయాన్ని కేటాయించుకోవాలనుకోవడం నేరమా? ఇన్నేళ్ళకైనా మీమామయ్యతో కలిసి నాలుగురోజులపాటు సరదాగా ఏ విహారయాత్రలకో, తీర్థయాత్రలకో వెళ్లివద్దామంటే నా కొడుకూ, కోడలూ పడనివ్వరు. చివరకి నా తమ్ముడిని చూసేందుకు వస్తున్నా, ఇదిగో యిలా చంటాడ్ని మావెంటే పంపిస్తారు. ఇవన్నీ తలుచుకుంటే మనసుకి చాలా బాధ కలుగుతుంది. అందుకే, అందరిలాగే నువ్వూ నా వయసు గురించి మాట్లాడేటప్పటికి తట్టుకోలేకపోయాను రీతూ“

రాధత్త మాటలు నాకు చెంపపెట్టులా అనిపించాయి. నాలో అంతర్మధనం మొదలైంది.

వాళ్ళలాగే మీదీ చిన్నవయసులో జరిగిన వివాహమే, ఇంటికి పెద్దకొడుకు, పెద్దకోడలిగా మీరిద్దరూ ఏళ్లతరబడి బాధ్యతలబరువుని మోసి ఇప్పుడే కాసింత అలసట తీర్చుకుంటున్నారు. బహుశా దాంపత్యసౌఖ్యంలోని అనుభూతి ఇప్పుడిప్పుడే మీకు అనుభవంలోకి వస్తుండాలి. ఇలా అనుకున్నాక మీ పట్ల గత కొన్నిరోజులుగా నా ప్రవర్తనని తరచితరచి చూసుకుని నా కుసంస్కారానికి సిగ్గుపడ్డాను.

ఇంటికి వెళ్ళగానే అభినవ్‍తో ఈవిషయమే మాట్లాడాను. ఇద్దరం కలిసి బాగా ఆలోచించి మిమ్మల్ని విహారయాత్రలకి పంపాలని అనుకున్నాము. ముందే చెబితే మీరు మొహమాటపడతారని తిరుపతి యాత్ర అని చెప్పి పంపించాము.

తల్లిదండ్రుల్లాంటి మీపట్ల నా అనుచితప్రవర్తనకి నన్ను క్షమించండి. చక్కటి అనుభూతులెన్నో ఈ హనీమూన్‍లో మీ స్వంతం కావాలని ఆశిస్తూ

మీ

రితిక.

ఆ లేఖని నా చేతిలో పెట్టి, రెండవలేఖని తెరిచింది హైమ.

ప్రియమైన నాన్నకి

ముందుగా మీతో ఒక్కమాటైనా చెప్పకుండా యిలా హడావిడిగా మిమ్మల్ని విహారయాత్రకి పంపినందుకు తప్పుగా భావించకండి. ఎన్ని ఆర్ధికసమస్యలున్నా నాకుమాత్రం ఏ లోటూ రానీకుండా పెంచిన మీరన్నా, అమ్మన్నా నాకు ఎంతో గౌరవం, మరెంతో ప్రేమ! అలాంటి మీగురించి, మొట్టమొదటిసారిగా మీ కోడలు నా ఎదుట వ్యంగ్యంగా మాట్లాడడం నా మనసుని కలిచివేసింది. బాబుకి జ్వరం వచ్చిన రాత్రి జరిగిన చిన్నసంఘటనని రితిక నాతో పదేపదే వర్ణించి చెబుతుంటే, నా పద్నాలుగేళ్ళ వయసులో జరిగిన విషయమొకటి చప్పున నా మనసులో మెదిలింది.

అప్పుడు నేను తొమ్మిదోక్లాసులో వున్నాననుకుంటా! పరీక్షలకి చదువుకుంటుంటే నాతోపాటు మీరూ హాల్లో ఏదో పుస్తకం తిరగేస్తూ తోడుగా కూర్చున్నారు. అర్థరాత్రి దాటుతుండగా, చదువు ముగించి నేను అక్కడే సోఫాలో పడుకున్నాక నాకు దుప్పటి కప్పి మీరు బెడ్రూమ్‍లోకి వెళ్ళారు.

రాత్రి రెండూ, రెండున్నరగంటలకి నిద్రలో ఏదో పీడకల రావడంతో, ఉలిక్కిపడి లేచిన నేను గాభరాగా మీ తలుపులు త్రోసాను. ఆ గది గడియ ఎప్పుడూ లూజుగా ఉంటుండేది కాబట్టి తలుపులు ధడేల్మంటూ తెరుచుకున్నాయి. అప్పుడు గదిలో మిమ్మల్నీ, అమ్మనీ చూడకూడని స్థితిలో చూడడంతో, ఒక్కక్షణం బిత్తరపోయినా వెంటనే తేరుకుని గిర్రున వెనక్కి తిరిగి హాల్లోకి వెళ్ళిపోయాను.

పరీక్షలహడావిడిలో ఉండడంవలననేమో మరి ఆ సంఘటన నాపైన పెద్దగా ప్రభావం చూపలేదు. నేనసలు ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను కూడా! మళ్ళీ ఇన్నేళ్ళకి, అటువంటి విషయమే రితిక నోటినుండి వినడంతో అదంతా మళ్ళీ గుర్తుకొచ్చింది.

మీకోడలు అడపాదడపా ‘ ముసలాళ్ళకి దసరా పండగన్నట్టు ఈ వయసులో ఈ వేషాలు ఏమిటో ‘ అంటూ చేతులు త్రిప్పుతుంటే నాకు ఏదోలా అనిపించేది. ఆకాలంలో మీకు చాలా చిన్నవయసులో వివాహం జరగడంతో మీరు త్వరగా తాతయ్య, నానమ్మ అయ్యారే గానీ, నిజానికి మీకేమంత వయసయిందని? మొన్ననేగా మీకు నలభైతొమ్మిది నిండి యాభై వచ్చింది. అమ్మకైతే ఇంకా నలభై ఆరేగా!

ఎలా జ్ఞానోదయమయిందో తెలియదుగానీ, ఆలస్యంగానైనా మొత్తానికి తనతప్పు తాను తెలుసుకున్న రితిక మీపట్ల తన ప్రవర్తనకి సిగ్గుపడుతోంది. బాధ్యతలబరువుతో మీరిద్దరూ క్రుంగిపోయారనీ, ఇకనైనా మీఇద్దరికీ విశ్రాంతినిచ్చి జాగర్తగా చూసుకోవాలంటూ బాబాయిలూ, అత్తయ్యలూ పదేపదే చెబుతుండేమాటలు గుర్తుకురాగా, మీరిద్దరూ ఇన్నేళ్ళుగా కోల్పోయిన ఏకాంతాన్నీ, మధురానునుభుతూలనీ మీకందివ్వాలన్న తలంపు కలిగింది. దాని ఫలితమే, ఈ విహారయాత్ర! ముందే చెబితే మీరు కాదంటారేమోనన్న సందేహంతో చివరినిముషందాకా దాచిపెట్టాము.

వయసు, వృద్ధాప్యం అన్నవి శరీరానికేగానీ మనసుకి కాదుగా నాన్నా! ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో, ప్రేమని పంచే అమ్మలాంటి చక్కటి జీవితభాగస్వామి సమక్షంలో, మనసుతోపాటు శరీరంకూడా యవ్వనాన్ని సంతరించుకుంటుందన్న నమ్మకంతో మేము చేస్తున్న ఈ చిరుప్రయత్నం సరైన ఫలితాన్నందిస్తుందనే అనుకుంటున్నాను.

ఈ విహారయాత్ర మీఇద్దరికీ జీవితంలో మరిచిపోలేని మధురమైన జ్ఞాపకమవాలనీ, అలవికాని ఆనందానుభూతులు మీ స్వంతమవాలనీ ఆశిస్తూ

మీ

అభినవ్

రెండులేఖలనీ ఆసాంతం చదివాక తలెత్తిన హైమ కళ్ళల్లో చిప్పిల్లిన సంతోషమే నా కళ్ళల్లోనూ తొణికిసలాడగా ఆప్యాయంగా చాచిన నాచేతుల్లో ఆనందంగా ఒదిగిపోయింది హైమ.

నిజమే, వృద్ధాప్యమన్నది శరీరానికేగానీ మనసుకి కాదు!!!

0 hozzászólás