మార్గదర్శి  (Author: రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి)

"ఏవండి…. అత్తయ్య గారు - ఓ అరగంటలో రైతు బజార్ దాకా వెళ్లోద్దాం, రెడీ అవు - అన్నారు" చెప్పింది ఇరవై వసంతాల కొత్త పెళ్లికూతురు సుప్రియ భర్త కుమార్ కి.

         "వెళ్ళిరా.." భర్త సమాధానం, లాప్ టాప్ నుండి తల త్రిప్పకుండానే.

         "ఏం లేదు… ఒక్క పనికి ఇద్దరెందుకు అనీ" అన్నది సనుగుతున్న రీతిలో సుప్రియ.

         "సాధారణంగా అమ్మ అనవసరంగా ఎవరినీ తోడు తీసుకెళ్ళదు, అవసరమనుకుంటే తప్ప! నీకేమన్నా నేర్పుతుందేమో! నీకు ఒకసారి రైతు బజార్ చూపించడానికి కూడా కావచ్చు. దానివల్ల ఈ ఇంటి అలవాట్లు, అవసరాలు నీకు తెలుస్తాయి కూడా!".

         భర్త ఓటు తనకు పడకపోవడంతో సుప్రియ చేసేది లేక రైతుబజార్ కు వెళ్ళడానికి తయారైంది. కాసేపటికి అత్తగారు శారద ఒక పెద్దది, మరొకటి చిన్నది సంచులు పట్టుకొని వచ్చి, స్కూటర్ తాళం తీసుకుని "వెళ్దాం పద" అంది. ఆమె వెనకాలే నడిచింది సుప్రియ అయిష్టతను బయలు పరచకుండానే.

         "నేను నడపనా అత్తయ్య గారు" అడిగింది సుప్రియ.

         "ఇవాల్టికి నేనే నడుపుతానమ్మా" అంటూ స్కూటర్ తీసి స్టార్ట్ చేసింది ఐదు పదుల వయసున్న శారద. వెనకాల కూర్చొని అత్తగారి భుజంపై చెయ్యి వేసింది సుప్రియ దన్ను కోసం.

         ఈ ఇరవై రోజుల కొత్త కాపురంలో ఇది రెండోసారి తను అత్త గారి వెనక స్కూటర్ మీద బయటకి వెళ్ళడం. మొదటిసారి మూడు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక గుడికి తీసుకెళ్ళింది ఆమె. అక్కడ అమ్మవారికి పట్టుచీర కొత్తకోడలు చేత సమర్పింప చేసింది శారద. అత్తగారి బండి నడపడం మీద మొదటి అనుభవంలోనే మంచి నమ్మకం ఏర్పడింది సుప్రియకు. ఇంటికి అవసరమైన బయటి పనులన్నీ శారద తనే చేసుకుంటుంది, భర్త పైన గానీ, కొడుకు కుమార్ పైన గానీ ఆధార పడకుండా.

         "ఇంటి ముందుకే వచ్చి అమ్ముతారు కదండీ కూరల వాళ్లు.. అవి బాగుండవా?" నర్మగర్భంగా అడిగింది.

         అర్థమైనా కూడా "అవి ఓపిక లేని వాళ్ళ కోసం. మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకోవడంలో నచ్చినవి, మంచివి తెచ్చుకోవడం అనే ఒక వ్యాపకంగానే కాకుండా, చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు కదా" చెప్పింది శారద బండి నడుపుతూ.

         ఈ కొద్ది రోజుల్లో అత్తగారితో దగ్గరగా మసలడం వలన ఆమేంటో కొంచెం కొంచెం తెలుస్తోంది సుప్రియకి. స్వభావంలో నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి శారద. అవసరమైనప్పుడే మాట్లాడుతుంది. అనవసరంగా ప్రతిదీ పట్టించుకునే మనిషే కాదు. ఇంటి విషయాలలో సుప్రియ భర్త కుమార్ కానీ, మామయ్య గారు కానీ తలదూర్చరు. ఆమె సర్వస్వతంత్రురాలు. దానికి కారణం ఆమె సమర్థతే. సుప్రియకు మొదట్లో అత్తగారి దగ్గర భయం, బెరుకూ వున్నా అవి పోయేలా శారద ప్రవర్తించడంతో సుప్రియ అత్తగారిని అర్థం చేసుకునే ప్రయత్నంలో వుంది. ఆమె తనంటే గౌరవం తగ్గకుండా చూసుకుంటుంది. ఎక్కడా చనువు తీసుకొనే అవకాశం కూడా ఇవ్వనట్లుగా ఉంటుంది అత్తగారి నడత. కొత్త కాపురం కనుక ఇంకా ఎవరు ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంది సుప్రియ.

         పావుగంట తర్వాత రైతు బజార్ చేరుకున్నారు. స్కూటర్ స్టాండ్ లో వుంచి ఇద్దరూ లోపలికి వెళ్లారు. సుప్రియ చేతికి చిన్న సంచీ ఇచ్చి, తాను పెద్దసంచి పట్టుకుంది అత్తగారు శారద. రైతు బజార్ రద్దీగా ఉండడం వలన సుప్రియ అత్తగారి కంటే ఒక అడుగు వెనక నడుస్తోంది.

         సుప్రియ శారద గురించే ఆలోచిస్తోంది -“ఇప్పుడు ఈ మార్కెట్ కి నన్ను తీసుకు రాకపోతే ఏమయ్యేది?. లేకపోతే నన్నూ ఆయన్ని పంపించి ఉండచ్చుగా. నన్ను సంచులు మోయడానికి తెచ్చుకుంది లాగా ఉంది. ఇట్లా ఇంకా ఎన్ని చూపిస్తుందో? నాకు కూరలు తేవడం నేర్పాలనా? తెలియకపోతే కదా!”

         శారద వెనక్కి తిరిగి "సుప్రియా… నీకు కొన్ని దుకాణాలు చూపిస్తాను గుర్తుంచుకో. అక్కడ మంచి కూరగాయలు దొరుకుతాయి. నువ్వు వచ్చినప్పుడు అక్కడే తీసుకోవచ్చు" చెప్పింది.

         "సరే నండి" సుప్రియ సమాధానంగా పలికింది. మనసులో మాత్రం "వేరే చోటివి కూరగాయలు కాదా ఎంటి" అనుకుంది.

         శారద తను ఎప్పుడూ వెళ్లే దుకాణాల దగ్గరకే వెళుతోంది. వాళ్ళు ఆమెని పలకరించడం, స్నేహపూర్వకంగా ఉండడం, వాళ్ళ దగ్గర ఏ రేటు అడగకుండా బేరాలు చేయకుండా కావలసినంత తూకం వేయించుకుని అడిగిన డబ్బులు ఇవ్వడం సుప్రియకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

         ఒక అరగంట గడిచేసరికి ఇద్దరి చేతుల్లోని సంచులు కూరగాయలతో నిండిపోయాయి. తను కొన్న ప్రతిచోటా విడిగా అరకిలో మళ్ళీ తూయించి, సుప్రియ సంచీలో వేయించేది శారద. అది సుప్రియకు అర్థం కాని విషయం, అయినా అడిగే ధైర్యం చెయ్యలేక పోయింది. మనసులో మాత్రం"నా చేత ఇప్పుడే వేరే స్టవ్ పెట్టిస్తుందా ఏంటి అతయ్యగారు" అనుకుంది. ఆ ఆలోచన రాగానె ఒక్కసారి వణుకు పుట్టింది సుప్రియకి.

         రైతు బజార్ నుండీ తిరిగి వచ్చేటప్పుడు ఒక రెండు అంతస్తుల ఇంటి ముందు స్కూటర్ ఆపి శారద, "ఇక్కడ ఓ పది నిముషాలు పని ఉంది. రా..." అని ముందుకు నడిచింది. వెనకే సుప్రియ నడుస్తూ"ఇప్పుడు ఇవన్నీ వేసుకుని, మోసుకునీ పలకరింపులకు వెళ్లాలా?" అని లోపల్లోపల అనుకుంది.

         లోపలికి వెళ్ళాక తెలిసింది సుప్రియకు అది ఒక అనాధాశ్రమామని. అక్కడి ఉద్యోగులు అందరికీ సుప్రియను పరిచయం చేసింది శారద. ఇంతలో ఎవరు చెప్పారో గానీ శారద వచ్చినట్లు తెలిసి ముఫైదాకా పిల్లలు పైఅంతస్తు నుండి బిరబిర మంటూ వచ్చి శారదను చుట్టేశారు. సుప్రియ ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే వాళ్ల అందరి పేర్లూ అత్తగారికి తెలిసి ఉండడం. అందర్నీ పేరు పేరునా ఆమె పలకరించడం.

         తర్వాత కాసేపు వాళ్ళతో గడిపి మళ్లీ ఆఫీసు లోకి నడిచింది శారద. వెనకాలే వెళ్లిన సుప్రియకు కనపడింది, అత్తగారు కొన్ని ఐదు వందల రూపాయల నోట్లు ఒకామె చేతిలో పెట్టడం. ఆమె వాటిని అలాగే సోరుగులో వుంచింది.

         "ఈ నెలలో ఎవరిదైనా పుట్టినరోజు వుందా?" అడిగింది శారద.

         "అశ్వనిది వుంది మేడమ్" అక్కడి ఉద్యోగిని సమాధానం.

         "తనకి ఇష్టమైనది ఏదైనా కొనివ్వండి" అంటూ మరో రెండు ఐదువందల నోట్లు తీసి ఇచ్చింది శారద.

         "వచ్చేవారం పదకొండో తారీఖున అశ్వని పుట్టిన రోజు" డబ్బు తీసుకుంటూ చెప్పింది ఉద్యోగిని.

         "మర్చిపోను… తనది ఆది ఫ్రాక్ ఒకటి ఇవ్వండి" శారద చెప్పడంతో ఆ ఉద్యోగిని వెంటనే మరొకరి చేత తెప్పించి శారదకు ఇచ్చింది.

         ఆశ్రమంలో నుండీ బయటకు వస్తుంటే పై అంతస్తు బాల్కనీలోకి వచ్చిన పిల్లలు "థాంక్యూ ఆంటీ… బై.. ఆంటీ" అంటుండగా శారద వాళ్ళకి చేయి ఊపి స్కూటర్ స్టార్ట్ చేసింది. వెనకనే సుప్రియ కూర్చోని పిల్లల వైపు చేయి ఊపింది.

         తిరిగి ఇంటికి వెళుతూ తాముండే ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఇంటిముందు స్కూటర్ ఆపింది శారద. "రా… సుప్రియా" అంటూ ఆ ఇంటి లోపలికి నడిచింది. వెనుకనే కూరగాయల సంచీ మోసుకుని వస్తూ పరికించి చూసింది సుప్రియ. మరమ్మత్తులు లేక పాడుపడిన పెంకుటిల్లు. అక్కడక్కడా చెదరి విరిగి పోయిన కప్పు పెంకులు. వెల్లవేసి కొన్ని ఏళ్లు అయివుండచ్చు అనిపించేలా గోడలు దర్శనం ఇచ్చాయి. ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం, అందులో కొన్ని పూలచెట్లు, కూరగాయల మొక్కలు. ఇల్లు శిథిలావస్థలో వున్నా ఇంటిచుట్టూ మాత్రం రమ్యంగా, శుభ్రంగా ఉంది.

         బావి దగ్గర ఉన్న తొట్టిలో నీళ్లతో కాళ్ళు కడుగుకొని, "కాళ్ళు కడుక్కొని రా" అని చెబుతూ లోపలికి నడిచింది శారద.

         ఇంటి లోపల ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులని "విశ్వనాధం బాబాయి గారు, విశాలాక్షి పిన్నిగారు" అని కోడలుకు, "తను మా కోడలు సుప్రియ" అంటూ వాళ్లకు పరిచయం చేసింది శారద.

         ఆ తరువాత సుప్రియ చేతిలో ఉన్న కూరల సంచీ తీసుకుని లోపలి వంట గదిలోకి వెళ్ళింది శారద. సుప్రియను విశ్వనాధం గారు మాటల్లోకి దించారు.

         పావుగంట తర్వాత శారద, విశాలాక్ష్మి పిన్నిగారు ఉన్న చోటికి వచ్చింది సుప్రియ. వాళ్ళ వంట గదిలో తాము ప్రత్యేకంగా అరకిలోలుగా తెచ్చిన కూరలు, అక్కడ ఉన్న సామాను సర్దుతూ కనిపించింది అత్తగారు శారద. సుప్రియకు ఆశ్చర్యంతొ పాటుగా ఉత్సుకత కూడా కలిగింది - అత్తగారు ఎందుకు ఇంతగా ఈ దంపతుల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారని! మళ్లీ అత్తగారే అందరికీ టీ చేసింది. సుప్రియా, శారదా అక్కడ ఉన్నంతసేపు ఆ వృద్ధదంపతులలో నూతన ఉత్సాహం చోటు చేసుకోవడం సుప్రియ గమనించింది. మరి కాసేపటికి బయలుదేరుతుంటే పిన్నిగారు అన్నారు "మళ్లీ వచ్చే వారమేనా కనపడడం?".

         "మీకు ఎప్పుడు అవసరమైనా ఫోను చేయండి… వచ్చేస్తాను" శారద సమాధానం.

         "వారమంతా ఈ ఒక్క రోజు కోసం వేచి చూస్తుంటాం" నిట్టూర్పుతో బాబాయిగారు.

         "సుప్రియా నువ్వు కూడా రావచ్చు… ఒక్క దానివైనా. దగ్గరేగా మా ఇల్లు" మళ్ళీ ఆయనే అన్నారు.

         "వస్తుందిలేండి.. ఇప్పుడు చూసిందిగా" అంటూ తమ ఇంటి కోసం కొన్న కూరల సంచీ చేత పుచ్చుకుంది శారద.

         బయటకు వచ్చాక సుప్రియనే స్కూటర్ ఇంటికి నడపమని, శారద వెనకాల కూర్చుంది.

         బండి నడుపుతున్న సుప్రియ మదిలో ఏన్నోరకాల ఆలోచనలు - అతయ్యగారు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఆమె చేసేవన్నీ నాకు తెలియ చేయడానికా? నేను కూడా ఆమెను అనుసరించాలనా? ఆమెకు నచ్చింది నాకు నచ్చాలని లేదుగా? అయినా అనుసరించక తప్పదా? ఆమెది కీర్తి కాంక్ష కాదా?

         ************

         ఇంటికి వచ్చాక భర్తఉన్న గదిలోకి వచ్చి అతని ప్రక్కన కూర్చుని చెప్పింది సుప్రియ, అత్తగారు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళింది ఏవేం చూపించి చెప్పిందీ.

         అంతా విన్న సుప్రియ భర్త కుమార్ వివరణగా చెప్పాడు -

         “నాలుగేళ్ల క్రితం అమ్మకు చాలా జబ్బు చేసింది, కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు చేతులెత్తేశారు. మా ఆశల మీద నీళ్ళు చల్లారు.“ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆమె బ్రతకడం కష్టం” ట. నాన్న మాత్రం ఎంత ఖర్చయినా సరే వైద్యం ఆపక సాగించాలని నిర్ణయించుకొన్నారు. నెలరోజుల తర్వాత కోమా నుండి అమ్మ బయట పడింది. అది నిజంగా అద్భుతమే, అమ్మ నమ్మిన దేవుళ్ళ అనుగ్రహమే!

         పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ, నేనూ నాన్నా ఇద్దరం కాదనలేని ప్రతిపాదన మా ముందు ఉంచింది.

         - నేను బాగా ఆలోచించాను. నేను బ్రతికి బయటపడి పొందిన ఈ జీవితం నాకు పునర్జన్మ. దీనికి బలమైన కారణం, అర్థం ఉండి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ బోనస్ జీవితాన్ని ఆపన్నుల సహాయం కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు మీరిద్దరూ నాకు సహకరించాలి. ఇప్పటి వరకు నేను కుటుంబ బాధ్యతలను నిర్వహించాను. ఇకపై వేరేవాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపే బాధ్యత తీసుకుంటాను. దాన్లో దొరికే ఆనందం వెలకట్టలేనిది. ఈ కారణంగానే నేను తిరిగి ప్రాణం పోసుకున్నానేమో! మీరు ఉద్యోగాలు చేస్తునట్టు నేను ఈ సేవలను ఉద్యోగంగా భావించి నిర్వహిస్తాను. మీ ఇద్దరినీ ఇందుకు ఒప్పుకోమని అడుగుతున్నాను. - ఇదే అమ్మ ప్రతిపాదన!

         నాన్నా నేనూ ఇద్దరం బాగా ఆలోచించాం. తన జీవితాన్ని పరులలో ఆనందం చూడడం కోసం వెచ్చించాలను కుంటోంది. అమ్మ బ్రతికి బయటపడి ఉండకపోతే? ఎంతటి శూన్యం మా జీవితాల్లో!? అది తలచుకుంటేనే భయం పుట్టేది. అందుకే అమ్మకు అన్ని విధాలా సహకరించాలని నిర్ణయించుకున్నాం. మా జీతాలలో అమ్మకోసం ఇరవై అయిదు శాతం కేటాయించాం. అమ్మ తన ఆలోచనలను అమలులో ఉంచడం మొదలు పెట్టినప్పటి నుండి, చాలా సింపుల్ లివింగ్ కి మారిపోయింది తను. తను పట్టుచీరలను త్యజించి చుట్టాలకు, తెలిసిన వాళ్ళకు ఇచ్చేసింది. తను మాకు ఒక దైవత్వం నిండిన మనిషిలాగా కనపడ సాగింది.

         అమ్మ ఇప్పుడు ఒక్క ఆదివారం మాత్రమే కుటుంబం కోసం కేటాయిస్తోంది. మిగిలిన ఆరు రోజులు నాన్న ఆఫీసుకు వెళ్లినట్టు తను పరుల అవసరాలకోసం ఉపయోగిస్తోంది. అందుకోసం తన పుట్టింటి నుండి వచ్చిన ఆస్థితో ఒక ట్రస్టు ఏర్పాటు చేసింది. తన ఆస్తి, తన సంతోషం కోసం ఖర్చుచేసుకుంటోంది అనుకున్నాం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమ్మ ఇప్పుడు వెనకటి కంటే చాలా ఎనర్జిటిక్ గా ఉంటోంది. సంతోషాన్నిచ్చే పని ఏదైనా శక్తిని కూడా ఇస్తుంది అనడానికి అమ్మే నిదర్శనం!

         అమ్మ చేసే కొన్ని పనులు మాకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. విశ్వనాథం, విశాలాక్షి దంపతులకి చనిపోయే లోపు కాశీకి వెళ్లి ఆదిదంపతుల దర్శనం చేసుకోవాలని ఉందని అమ్మతో అన్నారట. అంతే నెల తిరక్కుండానే వారంరోజుల్లో వాళ్ళకి కాశీ, ఆ చుట్టుపక్కల పుణ్య క్షేత్రాలు చూపించి తీసుకు వచ్చింది.

         మన ఇంటి ముందు జీబ్రా క్రాసింగ్ యెట్లా వచ్చిందో తెలుసా? అమ్మ వల్లనే! రోడ్డుకు అవతలపక్క ఉన్న స్కూలుకు వెళ్ళే పిల్లలకి రోడ్డు దాటడం కష్టంగా ఉంటోంది, ఒక జీబ్రా క్రాసింగ్ పెట్టించండి అని ప్రభుత్వానికి అప్లై చేసింది. వాళ్ళ పనితీరు తెల్సిందేగా! వాళ్ళు పట్టించుకోలేదు. రెండు మూడు సార్లు తిరిగి, విసుగుపుట్టి, తను తన ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు కలిసి స్కూల్ టైమింగ్స్ లో అక్కడ నిలబడి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మొదలు పెట్టారు పిల్లలు రోడ్డు దాటడం కోసం, రోజుకి రెండుసార్లు - పొద్దున, సాయంత్రం! కొంతమంది నెటిజన్లు దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నాలుగు రోజుకల్లా అక్కడ జీబ్రా క్రాసింగ్ ఏర్పడింది! సేవ చెయ్యడానికి అమ్మకు వచ్చే పట్టుదల, పోరాడే శక్తి ఊహించలేనిది!

         అమ్మ ఒక్కతే కాదు ఈ సేవలు చేసేది, ఆమె స్నేహితులు ఇంకో నలుగురు వున్నారు. కానీ ప్రారంభించింది మాత్రం అమ్మే! వాళ్లకు అమ్మే ప్రేరణ! వీళ్లంతా కొన్ని పేద, చితికిపోయిన కుటుంబాలని దత్తత తీసుకున్నారు. వాళ్ళకి రోజువారీ జీవనానికి ఏ లోటు లేకుండా చూసుకోవడమే వీళ్ళ ధ్యేయం. వీళ్ళవి ఏ ఇబ్బందులు లేని జీవితాలేం కాదు. ఐనా వాళ్లకు తెలిసి, వాళ్ళకంటే తక్కువ అవకాశాలతో ఎక్కువ కష్టపడుతున్న అభాగ్యులకి సహాయపడి ఆనందాన్ని కలగచేయడంలో ఆనందం ఉందని తెలిసి, అదే లక్ష్యంగా సాగుతున్నారు. జీవితాన్ని సార్ధకం చేసుకుంటూ ఆనందిస్తున్నారు.

         సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి సాయపడవోయ్! బోధనకు కార్యరూపం ఇస్తున్నారు!” ముగిస్తూ చెప్పాడు కుమార్.

         సుప్రియ ఆలోచించ సాగింది -“అవతలి వాళ్ళ కష్టాలను అవగాహన చేసుకోవడం ఇంత ప్రేరణను ఇస్తుందా! సానుభూతి మాటల్లో కాక చేతల్లో చూపడం ఎంతమందికి సాధ్యం? ఎంపతి ఫీల్ అవగలిగిన వాళ్ళకే ఆనందం చేరువ అవుతుంది!”

         సుప్రియ మనసులో సంశయాలన్నీ తీరినాయి భర్త ఇచ్చిన వివరణతో.

         ఆ గది నుండీ బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద అశ్వనికి పుట్టినరోజుకు గౌను కుట్టేందుకు తయారు అవుతున్న మానవత్వం ఒడిలో ఒదిగి పోయి, తనకు ఆనందం దొరికే ఒక కొత్త మార్గాన్ని చూపిన ఆమెతో "థాంక్యూ అత్తమ్మా" చెప్పింది సుప్రియ.

         “కొత్త కొడలివి గనక ఇష్టమున్నా లేకున్నా వచ్చి ఉంటావు నాతో అనుకున్నాను. అందుకు నేనే థాంక్స్ చెప్పాలి నీకు” చిరునవ్వుతో అన్నది శారద.

         “ఇంటికి వచ్చాక మీ అబ్బాయి వివరంగా చెప్పారు. అది నాకు మీ మీద గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించేసింది” మనస్ఫూర్తిగా చెప్పింది సుప్రియ.

         “ ప్రపంచంలో ఎంతోమంది కంటే నేను మెరుగైన జీవితాన్ని అనుభవించాను, అనుభవిస్తున్నాను. ఈ క్రమంలో నాకు సహాయపడిన వాళ్ళు ఎందరో. వాళ్ళు నాకు సహకరించకుంటే నన్ను ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉండేది.

         నా కడుపు నిండినా నేను ఇంకా కంచంలో పెట్టించుకుంటే వదిలివేయాడానికే కదా? అది వేరొకరి ఆకలి తీరిస్తే ఎంత తృప్తి!? ఈ ఆలోచనే నన్ను ఈ మార్గంలో సాగేందుకు దోహదమయ్యింది!” చెప్పింది తన మనసులో మాట శారద.

         “ఇకనుండి ఈ పనులన్నింటిలో నన్ను పార్టనర్ చేసుకోండి అత్తమ్మా.”

         “పార్టనర్ అయ్యేందుకు నీకు ఇంకా టైం ఉంది లెమ్మా, ఇప్పుడేగా కాపురానికి వచ్చావు. నన్నంటే చేసుకోనిస్తాడుగానీ, నిన్ను ఇప్పుడే చేయనిస్తాడా మావాడు” నవ్వుతూ అంది శారద. ఆమె మాటలకు సిగ్గు పడుతున్న సుప్రియ నవ్వు జత కలిసింది.

         తనను అర్థం చేసుకొని తన బాటలో నడిచేందుకు సిద్ధపడుతున్న సుప్రియ తలను నిమురుతూ అనుకుంది శారద తన తదనంతరం, తను స్థాపించిన సేవా ట్రస్టును నడిపించగల అర్హత, సామర్థ్యం సుప్రియకు కలగాలని!

         ********* సమాప్తం*****

0 hozzászólás