భూమి మింగిన సూరీడు
భూమి మింగిన సూరీడు (Author: దొండపాటి నాగజ్యోతిశేఖర్)
బాగా పొద్దుపోయింది
చెమట చుక్క ఇంకా ఇల్లు చేరలేదు
మట్టి కాళ్ళ శబ్దమైనా వినిపించడం లేదు
అరకకు అలుపొచ్చి ఏ నిద్ర గన్నేరు చెట్టు కిందో నడుం వాల్చలేదు కదా...!
ఈ మధ్య అన్నీ నిదుర లేని రాత్రులే!
పొలం బిడ్డ నీటికే ఏడ్చిందో...
ఎరువుకై ముఖం మాడ్చిందో
పొద్దుననగా పొట్టలో పడ్డ ఆకలి
ఏ పేగు చివర మంట పెట్టిందో
ఇంకా వాకిట్లోకి రాని తలపాగాని ఎట్టా అడిగేది...?!
బుట్టలో పోగేసిన కష్టాన్ని
ఏ దళారి గ్రద్దో ఎత్తుకుపోలేదు కదా...
గిట్టుబాటు కాని శ్రమ నెత్తురిని
రోడ్లపై పారబోయలేదు కదా...?!
గేటు దాటొచ్చే గడ్డిమోపు కోసం
పశువుల పాక ఎదురుచూస్తోందని
ఆ మాత్రం గుర్తులేదూ....
బాగా పొద్దు పోయింది....
కూటి కుండ చల్లారిపోతుంది...
అన్నం పండించే చేయి ఇంకా కంచం దగ్గరకు రాలేదు
మనస్సు దుక్కిటెద్దు దున్నినట్టు పొక్కి పోతున్నది
వెతుక్కుంటూ వెళ్లిన లాంతరు
వెక్కుతూ వచ్చింది
కూడా వచ్చిన ఖాళీ పురుగుమందు డబ్బా
ఆ ఇంటి పచ్చని చేనును అప్పుల పురుగు తినేసిందని
ఎర్రని కుంకుమ బొట్టుతో చెప్పి కూలబడింది
ఎదురుచూపుకు చీకటితెర పడింది
దుఃఖపు నదిలో నిండా మునిగిపోతూ
ఆమె
తనలో తను గొణుక్కుంది
"నా'పొద్దు'పోయింది!"