నారీ భారతం
నారీ భారతం (Author: డాక్టర్ తొగట సురేశ్ బాబు)
ఉ. శ్రీ రమణీయభూరుచులు స్నేహసుధాంబుధిఁదేలు మానవుల్
నీరము పొంగు వాహినులు నిత్యము శోభిలు పైరు పంటలున్
క్రూరతలేని యోచనల కూరిమి కోరెడు మానసాబ్జముల్
మీ రహిఁ బెంచు భూషలివి మీకిదె యంజలి భారతాంబికా!
తే.గీ. 'యత్ర నార్యస్తు పూజ్యతే' యన్న సూక్తి
భారత ఖండాన ప్రభవించి ప్రభను పొందె;
కాల గతిలోన మసిబారి తేలికయ్యె
నబల నవమాన పరచుటే ఖ్యాతి యనుచు!
సీ. వంట యింటను నిల్చి బ్రతుకునీడ్చుమటంచు కట్టుబాట్లు మనికి కాల్చివేసె;
చదువులు నేర్చుట సరికాని పనియని బడిబాట నెరుగని బ్రతుకు గల్గె;
ముకుపచ్చలారని ముగ్ధబాల్యమున వివాహపాశమ్ములు బ్రతుకుఁ గాల్చె;
బహుళమై పెరిగిన వైధవ్య నియమాల జీవనానందమ్ము చీకిపోయె;
తే.గీ. ఆడపిల్లగ పుట్టుటే యఘమటంచు
కాకులౌచును పలుకగ లోకులెల్ల
ఆడ బ్రతుకయ్యె కష్టాలకాలయమ్ము
తరతరమ్ముల నుండి హృదయము లేడ్వ!
ఉ. క్రూరపు సంఘ పద్ధతుల కూకటి వేళ్ళతొ కూల్చివేయ సం
స్కార మనస్కులెందరొ జగమ్మున స్త్రీలకు మేలు గూర్చ శ్రీ
కారముఁ జుట్టి యత్నములు గణ్య విధమ్మున చేసినారు; బ
ల్తీరుల బుద్ధి మార్గములు దృక్కులనంటగ చేసిరెంతయన్!
ఉ. విద్దెలు నేర్చుచున్ గరిమ వేదికలెక్కుచు మాటలాడుచున్
గద్దెలనెక్కుచున్ వరిమ గణ్యసుపాలన నందజేయుచున్
అద్దిర క్రీడలందున మహాద్భుత రీతి జిగీషఁ జూపుచున్
ముద్దర వేసినారు కడుమోహన శోభల నింతులెంతయున్!
సీ. పంతులమ్మలు నౌచు బాల బాలికలకు ప్రీతిగా చదువు నేర్పించుచుండ్రి;
నర్సు, డాక్టర్లుగా నయముగా రోగుల సేవల నింపుగా సేయుచుండ్రి;
శాస్త్రవేత్తలు నౌచు శాస్త్ర విజ్ఞానాల సరికొత్త శోధనల్ సల్పుచుండ్రి;
సైన్యమ్ములోఁ జేరి సమరరంగమునందు విక్రమదీప్తుల వెలయుచుండ్రి;
ఆ.వె. అన్నిరంగములను నత్యంత దీక్షతో
కాలు మోపినారు కార్యదీక్ష;
పురుషులకును తాము సరిసమానమటంచు
అలరుచుండ్రి నేడు అతివలెల్ల!
తే.గీ. అక్కడక్కడ మునుపొక్కడో ఇద్దరో
నీచులుండ్రి ధాత్రి కీచకులుగ;
నడుగడుగున నేడు యగుపడుచుండిరి
కీచకులను మించి నీచులకట!
సీ. రాజకీయములందు రాణకెక్కిన గాని యబలబలను మాటలధికమయ్యె;
చట్టమున్ న్యాయమున్ శాసించినను గాని యబలబలను మాటలధికమయ్యె;
మగవారితో పాటు తెగువ చూపిన గాని యబలబలను మాటలధికమయ్యె;
విశ్రాంతినెరుగక విధులెన్ని చేసినన్ యబలబలను మాటలధికమయ్యె;
ఆ.వె. అన్ని వృత్తులందు నతులిత మౌరీతి
ప్రతిభ చూపిన మరి పడుతులిపుడు
ప్రజల మనసులందు ప్రబలుచు పెంపొందె
అబల యబల యన్న అధమతలపు!
తే.గీ. వావి వరుసలు లేకుండ పాడు జనులు
కుటిల యోచనల్ మదిలోన కూర్చుచుంద్రు
సుదతుల వికృత దృష్టితో చూచు నట్టి
వింతపోకడ పెంపొందె విశ్వమందు!
సీ. ప్రక్కింటి అంకులై పక్కలో బల్లెమై చిన్నారి బ్రతుకును చిదుమునొకడు;
తన అన్న మిత్రుడై తగుమాటలాడుచు వికృత చేష్టలతోడ వెలయునొకడు;
బడిలోని హితుడౌచు భయమన్నదేలేక లైంగికాకృత్యమ్ములందునొకడు;
అదుపు నాజ్ఞలులేక ఆకతాయిగనుండి అత్యాచారమొనర్చి నణచునొకడు;
ఆ.వె. ఇరుగుపొరుగులందు నిందందుననరాని
అన్ని తావులందు నదనుజూచి
నిస్సహాయతఁ గని నిస్సిగ్గుగా మాన
ప్రాణములను తీసి వరులు చుండ్రు!
ఆ.వె. మృగము కన్ననెంచ మిగుల హీనత పొంది
చాలు నాడదైన చాలటంచు
ముగ్ధ బాలలైన మదుసలివారైనఁ
జెప్పరానిరీతిఁ జెరుపు చుండ్రి!
ఉ. చట్టము లెన్నియో గలవు సత్ఫలమందుట మృగ్యమయ్యెడున్
దిట్టతనంబుతో ప్రభుత దృక్కుల నందక ధూర్త మానవుల్
గట్టిగ యత్నముల్ నెరపి గౌరవ మందుచు సాగుచుండగా
నెట్టుల విశ్వసింత్రు మది నెవ్వరునైన ప్రభుత్వ దక్షతన్!
ఉ. భోగములంద కొందరిట పూనిక మత్తు పదార్థ దాసులై
జాగదిలేక డబ్బుకయి జారిణులై యవమాన మందగా
నాగములయ్య జీవితములక్కట రౌరవబాధలందుచున్
రాగములేని జీవనము లాగుచు నుండిరి కృంగచిత్తముల్!
ఉ. తీయని మాటలన్ బలికి తీర్చుకొనంగను దేహతాపముల్
పై యధికారులౌచు తమ ప్రాభవ మెల్లను చూపి ధూర్తులై
మాయలు పన్ని చిక్కుకొన నమాయక సుందరహంసయానలన్
చేయగరాని కృత్యములు చేతురు కామ మదెంత గొప్పదో?
సీ. నడిరేయి నొంటిగా నడయాడ యబలలు
గాంధీజీ పల్కులు కల్లలైపోయెనా పగలైన నడయాడ భయముఁగల్గు;
ఏ కాముకుని చూపు లెటునుండి వచ్చునో? ప్రసరించి బ్రతుకును భస్మపరచు
ననుచింత తనువెల్ల నావిర్భవింపగా తడబడు యడుగుల తరుణి సాగు
ఆ.వె. చూచు చూపులన్ని నీచ మసహ్యమై
చిత్తమెల్లమిగుల చిధ్రమయ్యె
భయము లేని రోజు ప్రభవించు నాయంచు
దిగులు పెరిగిపోయె దినదినమ్ము!
**************
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)