చివరి వీడ్కోలు  (Author: చిత్రాడ కిషోర్ కుమార్)

అమ్మ వెళ్ళిపోయింది

ఉలుకూ పలుకూ లేకుండా

ఎవర్నీ బాధపెట్టకుండా

ప్రశాంతమైన దీర్ఘ నిద్రలోకి జారుకుంది

అమ్మ తిరిగాడిన ప్రదేశమంతా

ఇప్పుడు చిమ్మచీకటి అలుముకుంది

 

ఇప్పుడు నేనెంత మాట్లాడినా

ఒక్క మాటకూడ అమ్మకు వినిపించదు

అచేతనమైన దేహం ప్రక్కన కూర్చొని

దుఃఖిస్తున్న దుఃఖం అమ్మకు కనిపించదు

దేహానికి వేసిన పూలమాలల సువాసన

అమ్మకు తెలియదు, ఎందుకంటే?

మరణానంతరం అమ్మ దేహం

శివైక్యంలో ఉంటుంది కనుక!

 

భుజాలమీద ధైర్యాన్ని వేసుకొని

కొంత దూరం అమ్మతో

ఆఖరి ప్రయాణం చేసాను

ముడతలు పడ్డ పలచని చేతిని

పైకెత్తి అమ్మ చివరిసారి వీడ్కోలు చెప్పింది

చితిలో దహనమైపోయిన అమ్మ దేహం

స్మృతిలో అమ్మ మానసిక రూపం

నాకు మురిపిస్తూ కనిపిస్తూనే ఉంటుంది

కానీ, మరణానంతరం అమ్మ జ్ఞాపకాలు

మమతానురాగాల కావ్యాలుగా మిగిలిపోతాయి!!

0 hozzászólás