గునుగు పూలు నవ్వాయి
గునుగు పూలు నవ్వాయి (Author: వంజారి రోహిణి)
తండ్రి, కొడుకులు ఇద్దరు రూమ్ లో ఒకరు ఆన్లైన్ క్లాసులో, మరొకరు లాప్టాప్ ముందు ఉన్నారు. టైం తొమ్మిదిన్నర అయింది. ఇంకో అర్ధ గంటలో ఆన్లైన్ క్లాస్ లో కూర్చోవాలి. వంకాయ కూర. పుంటికూర పచ్చడి. మజ్జిగ పులుసు చేయడం అయింది. ఇడ్లిలు స్టాండ్ నుంచి తీసి హాట్ బాక్స్ లో వేసాను. చట్నీ కప్పులోకి తీసి మిక్సీ జార్ సింకులో వేసాను. ఇక బియ్యం కడిగి రైస్ కుక్కర్ లో నీళ్లు పోసి పెట్టేస్తే చాలు. తినే ముందు వండితే చాలు. ఒళ్ళంతా గడ్డ చెమట పట్టేసింది. జుట్టు వెనక్కి దువ్వి చుట్ట చుట్టి నడినెత్తిన క్లిప్ పెట్టుకున్నాను. టవల్ తీసుకుని స్నానానికి వెళుతుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ టైం ల ఎవరై ఉంటారు.
తలుపు తీసి తీయక ముందే” అక్కా.. మీ ఇండ్లల్ల ఏమైన పని ఉంటే చెప్పుండ్రి” గంపెడాశ ముఖంలో పెట్టుకుని ఆతృతగా అడిగింది. ఆమె అక్కా అనటం నాకు కాస్త ఆశ్చర్యం కలిగించింది. కాస్త తేరిపారగా చూసాను. వయసు పాతిక కంటే తక్కువే ఉండచ్చు.
నుదిటిపైనా పావలా కాసంత బొట్టు, మేడలో నల్లపూసల దండ, చేతులకి ఆకుపచ్చని రంగు మట్టి గాజులు, చంద్ర వంకల డిజైన్ తో ముదురు ఎరుపు రంగులో పండిన మైదాకుతో అరచేతులు. కొద్దిగా మాసిన ఎర్ర చీర. ఆమెను చూడగానే ఎందుకో కాస్త జాలిగా అనిపించింది నాకు ఒక్క క్షణమే.
“మాకు పెద్దగా పని లేదు. అవసరం లేదు", అని తలుపు వేయబోయాను. క్లాస్ కి ఆలస్యం అవుతోందని కాస్త చిరాకుగా ఉంది.
తలుపు మూయనీకుండా చేత్తో ఆపి” గట్లనకక్కా!. పిల్లలైనదాన్ని. గిన్నెలు, బాలీసులు మంచిగా తోముత. ఇల్లు ఊడ్చి దినాం మాప్ ఏస్త. వాషింగ్ మిషన్ల బట్టలేసి మంచిగా ఆరేస్తా..చెప్పుకుంటూ పోతోంది" ఆ మాటల్లో ఏదో అయస్కాంతం దాగిఉందనుకుంటా, నన్ను పూర్తిగా ఆకర్షించింది. ఇక తలుపు వేయలేకపోయా. పాపం నిజంగా పని అవసరమేమో ఈ అమ్మాయికి అనిపించింది. తెలివైన మాటలు, అమాయకమైన చూపులతో ఇక నన్ను మారుమాట్లాడనీకుండా చేసింది.
నా కళ్ళల్లోని అంగీకారం, భరోసా తనలో ఎంత ఉత్సహం నింపిందో ఏమో, చనువుగా వంటింట్లోకి వెళ్లి సింకులో పడిఉన్న అంట్ల గిన్నెలు చకాచకా తోమడం మొదలుపెట్టింది.
సువర్ణ పనిలో చేరి మూడు నెలలు గడిచిపోయాయి. తను వచ్చాక నా ప్రాణానికి హాయిగా ఉంది. పనిలో చేరిన రోజు నుంచి చూస్తున్నా..! తను మాటల పుట్ట. చేతులు పనిచేస్తున్న నోరు మాత్రం ఊరికే ఉండదు. వాళ్ళ బస్తీలో జరిగిన లొల్లి గురించో, ఇంటి దగ్గర జరిగిన బోనాల పండగ సందడి గురించో, వాళ్ళ అత్త పెట్టే ఆరళ్ళ గురించో ఏదో ఒక ముచ్చట నాకు చెప్పాల్సిందే. గాసిప్స్ వినడం ఇష్టం లేకపోయినా ఎందుకో అమాయకంగా సువర్ణ చెప్పే ముచ్చట్లకు నేను బానిసనైనాను. అలాంటిది ఈ రోజు తను ఒక్క మాట కూడా లేకుండా అంట్లు తోముతోంది.
“ఏంటి సువర్ణ. !ఈ రోజు ఇంటి దగ్గర విశేషాలు ఏం లేవా..? ఏం ముచ్చట చెప్పలేదు నాకు" అన్నాను నవ్వుతూ బ్రెడ్ టోస్టర్ నుంచి తీసి జాం రాస్తూ.
అప్పుడు కళ్ళెత్తి నా వంక చూసింది.అంతే కట్ట తెగిన చెరువు నుంచి పరుగులు తీసే వరద నీటిలా దాని కళ్ళల్లో నుంచి చెంపల మీద కారిపోతున్నాయి కన్నీళ్ళు. ఎప్పటి నుంచి ఏడుస్తోందో కళ్ళు ఉబ్బి ముఖం ఎర్రగా కందిపోయి ఉంది.
సువర్ణని అలా చూడగానే కంగారు వేసింది నాకు.” అయ్యో..! ఏమైంది సువర్ణా..? ఇంట్లో అందరు మంచిగా ఉన్నారు కదా. ఎందుకు ఏడుస్తున్నావు. ?" కదిలిస్తే కబుర్ల పెట్టెలా గలగలా నవ్వుతూ మాట్లాడేది కాస్తా ఏడుస్తూ కనపడేసరికి ఒక్కసారిగా విస్మయం చెందాను.
“అందరు మంచినే ఉన్నరు అక్కా. నాకే ధీమాకు ఖరాబు అయింది. నా మొగుడు యాదగిరి కొట్టిండు" అంది. మళ్ళీ ఆమె కళ్ళు మంజీరా ప్రవాహాలౌతూ ఉన్నాయి.
“అయ్యో.. ! ఎందుకు..ఎందుకు కొట్టాడు నిన్ను" బ్రెడ్ పక్కన పెట్టేసి తను ఏం చెప్తుందా అని ఆత్రుత గా చూసాను
“అక్కా.. వాడు రోజు కైకిలికి పోడు. పోయిన దినం కైకిలి పైసలుతో గుడుంబా తాగి ఇంటికొస్తడు. ఇంట్లో కరుసంతా నాకొచ్చే పైసలుతోని నడుస్తది. తాగచ్చి” లగ్గం అప్పుడు ఇస్తానన్న కట్నం ఇంకా ఈలేదు నీ అయ్య. ముగ్గురు పోరిలను కని నా నెత్తికి చుట్టినవ్" అంటా ఇష్టమొచ్చినట్లు బాదేస్తాడు. నా ఈపు చూడక్కా" అంటూ వీపు చూపించింది
ఆమె వీపు మొత్తం ఎర్రగా కందిపోయినట్లు ఉన్న అరచేతి వేళ్ళ గుర్తులు. జబ్బల మీద కట్టే తో కొట్టినట్లు దెబ్బలు. పాతికేళ్ళు కూడా నిండని సువర్ణ కు ముగ్గురు పిల్లలా..! అదిరిపడ్డాను.
“అయ్యో.. ఇంట్లో ఇంత దారుణాన్ని ఎదుర్కుంటున్నావా నువ్వు?. మరి ముగ్గురు ఆడపిల్లలను కన్నావు కదా, ఇక పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నావా లేదా?" సువర్ణ పరిస్థితికి చాల ఆవేదన కలిగింది నాలో.
“అందుకనే అక్కా సచ్చినోడు కొట్టింది. నేను ఆపరేషన్ చేయించుకుంటానన్నాను. పోరడు పుట్టే దాక నువ్వు కనాల్సిందే అని నా మొగుడు, అత్త ఇద్దరు కూడబలుక్కుని నన్ను కుమ్మేసినారు రేతిరి" మళ్ళా బావురుమంది.
లోపల నుంచి మా సంభాషణ అంతా విన్నాడేమో ఎన్నడూ మా మాటల్లో కల్పించుకోని ఆయన బయటకు వచ్చి” సువర్ణా..! నువ్వు భయపడకు. మీ ఆయన దగ్గరకు వచ్చి నేను మాట్లాడతాను. ఆడపిల్లలు తక్కువ కాదు. మగపిల్లవాడు ఎక్కువ కాదు. మంచిగా పెంచి విద్యా బుద్దులు నేర్పిస్తే ఎవరైనా ఒకటే అని మీ ఆయనకి అర్ధం అయ్యేలా నేను చెప్తాను. నీకు ఆపరేషన్ చేయించేలా మీ అత్తా వాళ్ళని నేను ఒప్పిస్తాను. నువ్వు దిగులు పడకు." నాకు తెలిసిన నిఖిల్ లోని ఈ కొత్త మనిషిని ఇప్పుడే సంబ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయాను.
“గట్లనే సారూ. నిన్నటి సంధి నేను పడుతున్న బాధ మీ మాటల్తో తీరిపోయింది. కానీ నా మొగుడు, అత్తా మంచోళ్ళు కాదు సారు. వాళ్ళకి ఎవరిని మోసం చేద్దామా, పైసలెట్ల గుంజుతామా అని తప్ప ఇంకో పనిలేకుండె. గా మైసమ్మ తల్లి చల్లగా చూడాల మిమ్ములిని" దాని కళ్ళల్లో ఏదో నిశ్చింత. రెండు నెలలు పోటీపడి మరి పరుగు పందెంలో పాల్గొన్నట్లు ముందుకు దూసుకుపోయాయి.
అంట్లు తోముతూ సింకు మీద నుంచి కిందికి వాలిపోయింది సువర్ణ సూరజ్ కి హార్లిక్స్ కలుపుతున్నాను. గబా గబా గ్లాస్ టేబుల్ మీద పెట్టి పోచమ్మని లేపి నెమ్మదిగా నడిపించి సోఫాలో కూర్చోబెట్టాను. ఫ్రిడ్జ్ లో నుంచి గ్లూకోస్ పాకెట్ గ్లూకోస్ వాటర్ కలిపి ఇచ్చాను. నెమ్మదిగా తాగింది. పాపం పని చేసిచేసి ఎంత అలిసిపోయిందో అని జాలి వేసింది తప్ప మరో సందేహం ఏం కలగలేదు నాలో అప్పటికి.
ఐదు నిముషాలు కూడా కాలేదు. నోటికి చేయి అడ్డు పెట్టుకుని సింకు దగ్గరకు పోయి భళ్ళున వాంతి చేసుకుంది. ఈ సారి మాత్రం కాస్త అనుమానంగా చూసాను తనవైపు. నా చూపులకు తప్పు చేసినట్లు తలవంచుకుంది.
అంటే సువర్ణ మొగుడు యాదగిరికి చిలక్కి చెప్పినట్లు నిఖిల్ చెప్పిన మాటలు పెడచెవిన పెట్టారన్నమాట వాళ్ళు. నా సందేహాన్ని తీరుస్తున్నట్లు" వినీతక్కా... ఆపరేషన్ చేసుకొనికి నా అత్త, మొగుడు అసలు ఒప్పుకుంటాలేదు. వంశం నిలబెట్టే పోరడు పుట్టే దాక కనాల్సిందే, లాకుంటే నీ పుట్టింటికి పొమ్మని చెప్పిర్రు" నీరసంగా అంది కింద కూర్చుంటూ.
వంశం సంగతేమో కానీ ఈలోపల నీ వొళ్ళు హూనం అయిపోయేట్లు ఉంది. కాస్త ఆరోగ్యం బాగా చూసుకో. కొన్ని రోజులు విశ్రాంతి అవసరం నీకిప్పుడు. ఎక్కువ పని చేయవద్దు. డాక్టర్ కి చూపించుకో, పండ్లు కొనుక్కుని తిను. ఓ వారం రోజులు పనికి రాకు.నేనెలాగో చేసుకుంటానులే. బాగా విశ్రాంతి తీసుకో" అంటూ వెయ్యి రూపాయలు తన చేతిలో పెట్టాను.
శనివారం వారాంతపు సెలవు రోజు. కాస్త రిలాక్స్ గా టీ తాగుతున్నాం. సూరజ్ ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకుంటానని వెళ్ళాడు.
“చూసారా నిఖల్..! సువర్ణ మళ్ళీ గర్భవతి అయిందట. ఆ రోజు మీరు వెళ్ళి మీరు అంత సేపు చెప్పిన మాటలు బూడిదలో పోసిన పన్నీరు అయినాయి. మీ మాటలు పేద చెవిన పెట్టారు వాళ్ళు. వంశోద్ధారకుడు కావాలి అంటూ మళ్ళీ ఆ అమాయకురాలి ఉసురు పోసుకుంటున్నారు"
“అయ్యో.." అంటూ అభావంగా చూసాడు నా వంక.
“సూరజ్ తర్వాత మనం పాపా కావాలని ఎంత కోరుకున్నా, నా గర్భాశయంలో సిస్టులు పెరుగుతున్నాయి చాల ప్రమాదం అని హిస్టరెక్టమీ ఆపరేషన్ చేసి బిడ్డ సంచి తీసేసారు కదా. నాలో ఇక అమ్మతనాన్ని పొందే అవకాశం లేదని ఎంత కుమిలిపోయానో ఆ రోజు గుర్తుందా నిఖిల్..?" దుఃఖపు జీర నా మాటలకు అడ్డుపడింది.
“నాకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ దమయంతి చెప్పేసారు కదా. కావాలన్న వాళ్ళకి అవకాశం ఉండదు" సన్నటి నీటి పొర నా కళ్ళను మసకబార్చింది.
“నువ్వు ఎక్కువగా ఆలోచించకు వినీ.. నీ ఆరోగ్యం పాడౌతుంది. మనకు సూరజ్ ఉన్నాడు కదా. వాడితోనే తృప్తి చెందుదాం." మనకు ప్రాప్తం అయిన దానితో తృప్తి పడే మనఃతత్వం నిఖల్ ది.
కానీ నా తల్లి ఒడి మాత్రం ఓ పాపను లాలించాలని తపన పడుతోంది.
పొద్దున వస్తూనే నన్ను చుట్టేసి బావురుమంది సువర్ణ. ఏం జరిగిందో తెలియని కంగారు నాలో. తనని అలాగే హత్తుకుని అనునయంగా వీపు నిమురుతున్నాను.
“వినీతక్కా..రేపటి నుంచి పనికి రాను" కన్నీళ్ళు దాని బుగ్గలు తడిపేస్తున్నాయి
“అయ్యో. ఏమైంది నీకు.ఆరోగ్యం అంతా మంచిగా ఉంది కదా. ఎందుకు సువర్ణా..!..నీకిప్పుడు ఐదో నెలే కదా”
“అందుకు కాదక్కా..మేము కూలీపనులకోసం ఐద్రాబాద్ వెళ్ళిపోతున్నాం"
“అయ్యో. అదేంటి. నువ్వు ఉత్తమనిషివి కాదు కదా. నువ్వు ఎలా కూలీపనులకు వెళ్తావు"
“నాకిష్టం లేదక్కా. నా అత్తా, మొగుడు ఐద్రాబాద్ లో అపార్ట్మంట్ల పనుల్లో మంచిగా పైసలు వస్తాయని బలవంతంగా అక్కడికి నన్ను, పోరీలను తోలుకపోతున్నారు.వాళ్లిద్దరూ అనుకుంటే ఇక నా మాట లెక్కజయ్యరు అక్కా" నిన్నటి నుంచి ఎంత దుఃఖభారాన్ని మోస్తోందో గట్టు తెగిన చెరువులాసువర్ణ కళ్ళల్లోనుంచి నీళ్ళు ఆగకుండా.
మూడ్నెల్ల జీతం అదనంగా ఇచ్చి, నాలుగు కాటన్ చీరలు కవర్ లో పెట్టి తన చేతికి ఇచ్చాను. అంతకంటే ఇంకేం చేయలేకపోయాను అప్పటికి. కృతజ్ఞత నిండిన కళ్ళతో చూస్తూ నా కాళ్ళకి మొక్కాలని వంగబోయిన సువర్ణని పట్టుకుని లేపి గుండెలకు హత్తుకున్నాను. తనని ఎప్పుడూ పనిమనిషిలా చూడలేదు నేను. అమ్మానాన్నలకు ఒక్క కూతురినైన నాకు చెల్లో, తమ్ముడో ఉంటే ఎంత బాగుండేది అనిపించేది. తను అక్కా అన్నపుడల్లా తను నా చెల్లె అనుకున్నా.
"వినీతక్కా..నాకు పోరడు పుట్టాలని దీవించక్కా" అంటున్నప్పుడు దాని కన్నీళ్లు నా భుజాలను తడిపేసాయి. అదే తనని చివరిసారి చూడడం. మళ్ళీ కనిపించలేదు.
సంగారెడ్డిలో అన్న కొడుకు పెళ్ళి చూసుకుని, హైదరాబాద్ వచ్చాము. ఫ్రెండ్ ఒకరు యూ.ఎస్. వెళుతుంటే తనతో రెండురోజులు ఉండాలని తీసుకువచ్చాడు నిఖిల్. కోఠి బజార్, ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లి వచ్చాము. రెండో రోజు మధ్యాన్నం తాజ్ బంజారాలో లంచ్. అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. నాలుగు గంటల ఫ్లైటుకి రంజిత్ కి వీడ్కోలు చెప్పి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం.
ఉదయం చిలుకూరు బయలుదేరాం క్యాబ్లో. భాగ్యనగరపు ట్రాఫిక్ లో ఎదురు కోల అప్పుడు ఆగిఆగి నడిచే కొత్త పెళ్ళికూతురిలా ఆగిఆగి కదులుతోంది క్యాబ్. మెహిదీపట్నం రైతు బజార్ దాటడానికి అర్ధగంట పట్టింది. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ దిగాక కాస్త తగ్గింది ట్రాఫిక్. కాస్త ఊపిరి పీల్చుకు-న్నాం. క్యాబ్ విండో తెరిచాను, కాస్త బయటి గాలి కోసం.
అర్ధ కిలోమీటర్ వెళ్ళాక దారిలో గుంపుగా జనాలు ఉన్నారు. జనాలంతా గోలగోలగా మాట్లాడుతుంటే, ఆ గోలలోనుంచి ఓ పసిబిడ్డ ఏడుపుతో పాటు ఎవరినో బతిమాలుతున్నట్లు దీనమైన ఓ స్వరం. ఎక్కడో విన్నట్లు, సుపరిచితమైన గొంతు అనిపించింది నాకు. ఏదో అనుమానం కూడా ఇంతింతై, వటువింతై అన్నట్లు పెరిగిపోసాగింది నాకు. ఇక ఆగలేక డ్రైవర్ ని కారు ఆపమన్నాము.
ఇద్దరం కారు దిగాం. ఆతృతగా జనాలను తోసుకుని వెళ్ళాను. అదిరిపడ్డాను. అక్కడి దృశ్యాన్ని చూసిన వెంటనే స్పందించిన నిఖిల్ “ఆగండి..! ఎందుకు ఆమెని బలవంతంగా లాకెళ్ళుతున్నారు" పోలీస్ వంక చూస్తూనే సెల్ ఆన్ చేయబోయాడు నిఖిల్.
“ఈమె మీకు తెలుసా? పురిటి బిడ్డని బస్టాండ్లో అమ్మకానికి పెట్టింది. అది చట్ట రీత్యా నేరం. అందుకే స్టేషన్కి తీసుకెళుతున్నాం" కోపం, దర్పం మేళవించిన గొంతుకతో అన్నాడు ఆ పోలీస్ అధికారి. లేడీ కానిస్టేబుల్ సువర్ణ ని లాఠీతో కొడుతూ,లాక్కెళుతోంది.
మమ్మలిని చూడగానే” వినీతక్కా..అంటూ సంకలో బిడ్డతో సహా నన్ను పట్టుకుని బావురుమంది. అంత దీనమైన పరిస్థితిలో తనని చూస్తాననుకోలేదు. నాకు తెలీకుండానే నా కళ్ళు కూడా నీటి చెలమలైనాయి. పాలుగారే పసిబిడ్డని చేతుల్లోకి తీసుకున్నాను. లోకం పోకడ తెలీని ఆ పసిది నిద్రలోకి జారుకుంది.
“ఆపండి..! ఈమె మాకు బాగా తెలుసు. ఆమె బిడ్డను అమ్మకుండా చూసే పూచి మాది. ఆమెని వదిలి పెట్టండి. లేకుంటే మీ పై అధికారులచేత చెప్పిస్తాను". కాస్త కాఠిన్యం, మరికాస్త మార్దవం కలగలిసిన నిఖిల్ స్వరానికి ఆ పోలీస్ అధికారి కొంచెం దిగివచ్చాడు. మా పూచికత్తు మీద వాళ్ళు సువర్ణ ని విడిచిపెట్టారు.
ఇంటికొచ్చేసాం. హార్లిక్స్ కలిపి సువర్ణకి ఇచ్చాను. ఏ వేళప్పుడు ఏం తిన్నదో ఏమో కానీ హార్లిక్స్ కాస్త వేడిగా ఉన్నా గట గట తాగేసింది. ఎక్కిళ్ళు తగ్గి కాస్త నిమ్మళించి, కొంగు కప్పుకుని బిడ్డకి పాలు పట్టింది.
“ఇప్పుడు చెప్పు సువర్ణా.. బిడ్డను ఎందుకు అమ్మాలనుకున్నావు..?" సూటిగా అడిగిన నా ప్రశ్నకి మళ్ళా “అక్కా" అంటూ బావురుమంది.
“ఈ తడవ కూడా నాకు ఆడపిల్లనే పుట్టే. ఆడపిల్లతోని ఇంటికి వస్తే ఇద్దరిని చంపేసి మళ్ళీ పెళ్లిచేసుకుంటానన్నాడు నా మొగుడు యాదగిరి. అత్త వాడికి వంత పాడింది. ఈ బిడ్డతోని ఇంటికి వెళితే వాళ్ళు అన్నంత పని జేస్తరని భయమైంది. బిడ్డ పుట్టిన మూడో రోజునే దవాఖాన నుంచి బయటకు తోలినరు నన్ను. పుట్టింటికి పోదమంటే నాకు అవ్వ లేదు. పోనీ అయ్య దగ్గరికి పోదామన్న నా దగ్గర పైసలు లేకుండే. ఏం చేయనికి అర్ధం కాక బస్టాండ్ కొచ్చిన. అక్కడ ఎవలో పిల్లలవని వాళ్ళు పైసలిచ్చి బిడ్డను తీసుకుంటామన్నరు. అందుకని" అని ఆగింది.
“అందుకని కన్న బిడ్డని పైసలికి అమ్ముకుంటావా..! ప్రాణమెట్ల ఒప్పిందే నీకు" కోపం తో బొంగురు పోయింది నా గొంతు.
“బిడ్డతోని ఇంటికి పొతే చంపేస్తరని అట్లా చేసిన అక్కా..నాకు బిడ్డనమ్ముకోవడం ఇస్టమైతే లేదు. నేను పెంచలేను. ఎక్కడో ఓ చోట మంచిగా పెరుగుతుందని, ఇంక ఏమి చేయనికి తోచక బిడ్డను అమ్ముదామనుకున్న అక్కా. పైసలు కోసం గాదు" వెక్కుతూ బిడ్డను గుండెకు అదుముకుంది.
నిఖిల్, నేను ఒకరిముఖం ఒకరు చూసుకున్నాం. ఒకరి భావం ఒకరికి అర్ధం అయింది.
“మరి సువర్ణా.. నీ బిడ్డని నాకు దత్తత ఇస్తావా..? మాకు ఆడ పిల్ల కావాలని చాలా ఇష్టం. కానీ ఇక పిల్లలను కనే అదృష్టం నాకు లేదు. నీ బిడ్డని మా బిడ్డగానే ప్రేమగా చేసుకుంటాము. ఆలోచించి చెప్పు. నీకు ఇష్టమై, మా మీద నమ్మకం ఉంటేనే ఇవ్వు. నీకు ఇష్టమైనన్ని రోజులు నువ్వు మాతోనే ఉండు" ఆశగా తన చూస్తూ అడిగాను.
వెంటనే ఆ కళ్ళల్లో మెరుపులుమెరిసాయి.” అక్కా.. మీరు నా బిడ్డను పెంచుతమంటే, అంతకంటే అదృష్టం ఏముంది నాకు. బిడ్డను మంచిగ పెంచి, సదివించడం నాతోని కాదు. నా దగ్గర కన్న మీ దగ్గరే నా బిడ్డ మంచిగా పెరుగుతుంది. మీ పెద్ద మనసులకి ఎంత మొక్కినా తక్కువే” అంటూ ఆ మూడు రోజుల పసిగుడ్డుని నా ఒడిలో పెట్టింది సువర్ణ.
“అక్కా..ఇంకో మాట" అనింది ఆమె." సందేహంగా చూసాం తను ఏం చెప్తుందా అని
“ఆడ పిల్ల పుడితే ఇక ఇంటికి రావద్దు అని, వొస్తే చెంపేస్తామన్నరు కదా నా మొగుడు, అత్త. ఆ కసాయి వాళ్ళ ఇంటికి ఇక వెళ్ళను అక్కా. నా ముగ్గురు ఆడపిల్లలను ఎట్లైనా నేను తెచ్చుకోవాలె. ఈ బిడ్డకు ఇక మీరే అవ్వ, అయ్యా. నేను ఒక ఆయా లెక్క మీకు, బిడ్డకు సేవ చేసుకుంటూ మీ పంచలోనే ఉండిపోతాను" సువర్ణ కళ్ళనిండుగా ఆత్మవిశ్వాసం పొంగిపొరలింది ఆ క్షణం.
సువర్ణ కళ్ళల్లోని ఆత్మస్థయిర్యం, నా పట్ల ఉన్న అపారమైన నమ్మకం చూసి ఇక మేము తన మాటకు తలవొగ్గాము.
రూమ్ లోపల నుంచి వచ్చిన సూరజ్ నా ఒడిలో పాపని చూసి" అబ్బా.. ఈ పాపా చాలా బాగుంది అమ్మ. ఎవరీ పాపా. ఇలాంటి చెల్లి నాకు ఉంటే ఎంత బాగుంటుందో” అన్నాడు ఆ చిన్నారి లేత బుగ్గని మెల్లగా నిమురుతూ.
“ఇలాంటి చెల్లి కాదు సూరజ్. ఈ పాపా నీకు నిజంగా చెల్లె నే" అన్నాను నవ్వుతూ.” అవునా" అంటూ
వాడు సంతోషంగా తలవూపాడు. ఈ పసిపాప రాకతో మా ఇంట్లో కొత్త సందడి, మా మనస్సులో కొండంత ఆనందం వెల్లివిరిసాయి.
“నా ఒడిలో పడుకుని నిద్రలో ఉన్న ఆ చిన్నారి ఏ తియ్యటి కల కనిందో ఏమో కానీ, ఆ చిన్ని పెదవులు విచ్చుకుని, బుగ్గలు సొట్టలు పడేటట్లు నవ్వింది. ఆ నవ్వుని చూసి సువర్ణ నవ్వింది. ఇద్దరిని చూసి మేము నవ్వాము. వాళ్ళిద్దరిని చూస్తుంటే పేర్చిన బతుకమ్మలో గునుగుపూలు నవ్వినట్లు అనిపించింది నాకు.