క్రొత్త అధ్యాయం  (Author: దినవహి సత్యవతి)

శంషాబాద్ విమానాశ్రయంనుంచి క్యాబ్ లో బయలుదేరిన హిమన, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ నిద్రలోకి జారుకున్నదల్లా, క్యాబ్ ఒక్క కుదుపుతో ఆగడంతో, ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.

ఏం జరుగుతోందో అర్థమయ్యేలోగానే క్యాబ్ డ్రైవర్, జంగమయ్య, వెనక డోర్ తెరిచి, హిమనని కారులోంచి బయటకి లాగాడు. వాడేం చేయబోతున్నాడో అర్థమై, అడ్డుకుందామని శాయశక్తులా ప్రయత్నించసాగింది హిమన. జంగమయ్య ప్రవర్తన అంతకంతకూ శృతిమించుతుండడంతో, భయంతో సహాయం కోసం కేకలు పెట్టసాగింది. కానీ ఆమె అరుపులు గాలిలో కలిసిపోయాయి!

హిమన నోరు గట్టిగా మూసి, చేతులు వెనక్కి విరిచి పెట్టి, వికృతంగా నవ్వుతూ ఆమెపై చేయివేసిన జంగమయ్య, ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్లై, ఎవరో విసిరేసినట్లుగా ఎగిరి అల్లంత దూరంలోపడ్డాడు. అసలు వాడలా ఎందుకు ఎగిరిపడ్డాడో, ఆ తరవాత వాడికేమైందో తెలిసేలోపే, అప్పటివరకు తనని తాను రక్షించుకోవడానికి జరిగిన పెనుగులాటకి, నీరసం ఆవహించి ఉన్నచోటే కుప్పకూలింది హిమన...

 &&&

ఆ రోజు ఉదయంనుంచీ సాయంత్రంవరకూ, ఢిల్లీలో ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ కి హాజరై, ముగియగానే, తిరిగి విమానంలో, హైదరాబాద్ బయలుదేరింది హిమన. వాతావరణం ప్రతికూలించడంతో, రాత్రి ఎనిమిది గంటలకి హైదరాబాద్ చేరుకోవలసిన విమానం, ఆలస్యమై, పన్నెండు గంటలకి శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది.

‘ఛ, ఛ, మరీ ఇంత ఆలస్యమా, ఎప్పుడూ సమయానికి చేరే ఈ విమానం, ఇవాళే ఆలస్యం కావాలీ నా ఖర్మ కాకపోతే’ తిట్టుకుంటూ, విమానాశ్రయం బైటకి వచ్చి, క్యాబ్ బుక్ చేసింది హిమన.

పదినిమిషాల తరవాత వచ్చిన క్యాబ్ ఎక్కి, తన లైవ్ లొకేషన్, స్నేహితుడు అభిమన్యుకి, ఇంకొక పరిచయస్తురాలికీ పంపిస్తూ, యాథాలాపంగా తలెత్తి చూసిన హిమనకి, ఎదురు అద్దంలో, తనవైపే దొంగ చూపులు చూస్తున్న డ్రైవర్, జంగమయ్య, కనిపించాడు.

‘ఛి, ఛీ! అమ్మాయి కనిపిస్తే చాలు, చొంగలు కార్చుకుంటారు ఈ మగాళ్ళు. వీడూ ఆ కోవకి చెందినవాడిలానే ఉన్నాడు. వెధవచూపులూ వాడూను’ ముఖం చిట్లించి చూపులు తిప్పుకుంది. సమయం అర్థరాత్రి పన్నెండున్నర దాటింది. క్యాబ్ కుదుపులు లేకుండా వెళుతుంటే, ఎంత అప్రమత్తంగా ఉండామనుకున్నా ప్రయాణపు అలసటతో, తెలియకుండానే నిద్రలోకి జారుకున్న హిమన, జంగమయ్య, క్యాబ్ ని నిర్మానుష్యమైన రోడ్దులోకి మళ్ళించడం గమనించనేలేదు...

 &&&

పరిచయస్తురాలినుంచి ఎటువంటి స్పందనా రాకపోయినా, హిమన పంపిన క్యాబ్ లైవ్ లొకేషన్, ఫోన్ లో గమనిస్తున్న అభిమన్యు, క్యాబ్ రూటు మారడం గమనించి, వెంటనే, షి టీం ని అలర్ట్ చేసి, హుటాహుటిన బైక్ మీద బయలుదేరాడు. దాదాపు పదిహేనునిమిషాల తర్వాత, ఒకే సమయానికి, హిమన ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు అభిమన్యు, షి టీం కూడా. అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నారు.

 ఘటనా స్థలిలో ఒక ప్రక్క అచేతనావస్థలో హిమన, ఇంకో ప్రక్క గాయాలతో క్యాబ్ డ్రైవర్ పడున్నారు.

వెంటనే ఇద్దరినీ ఆంబులెన్సులో ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. పోలీసు కేసు నమోదు చేయబడింది.

తెల్లవారి స్పృహలోకి వచ్చిన హిమన చెప్పినది విని,“ఏంటీ, ఆ డ్రైవర్ నీపైన దుర్మార్గపు ఆలోచనతో చేయి వేసి, నువ్వు తొయ్యకుండానే, వాడంతట వాడే గాలిలోకి ఎగిరి అల్లంత దూరంగా పడ్డాడా?” నమ్మశక్యం కానట్లుగా చూసింది షి టీం లీడర్.

“అవును మేడం, నేను చెప్పేది నమ్మండి. ఎవరో ఎత్తి పడేసినట్లుగా వాడు గాలిలోకి ఎగరడంవరకే నాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందీ నాకు తెలియదు” ఎన్నిసార్లడిగినా అదే చెప్పింది హిమన.

జంగమయ్య స్పృహలోకి వచ్చాక,“ఒంటరి ఆడపిల్లని, బెదిరించి, లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను” చెప్పాడు పోలీస్ ఇన్స్పెక్టర్.

“సార్! ఈసారికి క్షమించండి. ఇంకెప్పుడూ ఈ తప్పు చేయను. అమ్మో! అసలది అమ్మాయి కాదు సార్ ఆడదయ్యం” హిమన గుర్తుకొచ్చి భయంతో వెడల్పయ్యాయి జంగమయ్య కళ్ళు.

“ఏంటీ, పిచ్చిపిచ్చిగా వాగుతున్నావు. మతిగానీ పోయిందా?” ఉరిమాడు ఇన్స్పెక్టర్.

“నిజం సార్, నేను చెప్పేది నమ్మండి. ఆ అమ్మాయిని ఇలా ముట్టుకున్నానో లేదో పెద్ద షాక్ తగిలినట్లైంది సార్! ఆ అమ్మాయి ఒళ్ళంతా కరెంటుంది సార్”

“ఇదిగో! కాన్స్టేబుల్, వీడికి మతి చెడినట్లుంది. కాస్త జాగ్రత్తగా చూసుకో. గాయాలనుంచి కోలుకోగానే జైలుకి తరలిద్దాం. కోర్ట్ లో చెప్పుకుంటాడు కరెంట్ షాక్ కథలు” వెటకారంగా నవ్వాడు ఇన్స్పెక్టర్.

 &&&

రాత్రి పదకొండు కావొస్తోంది. తొమ్మిది దాటితే చాలు నిర్మానుష్యంగా మారిపోయే తమ వీధిలోంచి, ఇంటి వైపు అడుగులు వేస్తోంది ఝాన్సీ. వేగంగా నడుస్తుండడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇంతలో వెనుక అడుగుల చప్పుడు వినిపించి ఆమె గుండె చప్పుడు వేగమైంది. నెమ్మదిగా తిరిగి చూసింది... భీకరాకారంతో, తనవైపే చూస్తూ మీద దూకడానికి సిద్ధంగా ఉన్న మూడు తోడేళ్ళని చూసి కెవ్వుమని కేక వేసింది...

“అమ్మగారూ... అమ్మగారూ... ఏందండీ అట్టా అరిసారు, గుండాగినంత పనైందమ్మా” నెలరోజుల క్రితమే పనిలో చేరిన రంగి, భుజాలు పట్టి కుదుపుతుంటే కళ్ళు తెరిచి, అయోమయంగా చూసింది ఝాన్సీ.

‘దేవుడా, మళ్ళీ అదే కల! ఇంకా ఎన్నాళ్ళు ఈ కల నన్ను పట్టి పీడిస్తుంది? కానీ ఈ మధ్య కాలంలో రాని కల మళ్ళీ ఇన్నాళ్ళకు వచ్చిందేమిటో? అసలేం జరుగుతోంది? ’ తల నెప్పిగా అనిపిస్తే కణతలు రుద్దుకుంటూ లేచి,“వేడి వేడి కాఫీ ఇద్దూ కొంచం” రంగికి చెప్పి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూం వైపు అడుగులు వేసింది.

రంగి ఇచ్చిన కాఫీ త్రాగుతూ, ఫోన్ లో మెసేజ్ లు చూస్తున్న ఝాన్సీ, గత రాత్రి వచ్చిన ఒక అలర్ట్ మెసేజ్ చూసి, భృకుటి ముడివడింది. వెంటనే ఆ నంబర్ కి కాల్ చేసింది కానీ అవతలనుంచి ఎటువంటి ప్రతిస్పందనా రాకపోవడంతో, ఫోన్ దగ్గర పెట్టుకుని, అదే నంబర్ కి పదే పదే కాల్ చేస్తూనే నిత్యకృత్యాలలో నిమగ్నమైంది.

‘ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... ’ రింగ్ టోన్ విని ఆలోచనలలోంచి తేరుకుంది ఝాన్సీ.

 ఫోన్ స్క్రీన్ పైన, అపరిచిత నంబరు చూసి, ‘అరే! నిన్న రాత్రి ఈ నంబరునుంచే నాకు అలర్ట్ మెసేజ్ వచ్చింది కదా” అనుకుని ఆత్రంగా“హలో ఎవరూ?” అంది.

“నేనే హిమనని”

“అదేమిటీ ఇది నీ నంబరా”

“అవును. క్రొత్తనంబరు. ఈ ఢిల్లీ ప్రయాణం హడావిడిలో నంబరు నీకు ఇద్దామనే ధ్యాసే రాలేదు ఝాన్సీ, సారీ”

“అవునా, మరి అప్పటినుంచీ ఎన్నో సార్లు కాల్ చేస్తూనే ఉన్నా పలకలేదు, ఏమైంది బిజీగా ఉన్నావా?”

“అవును అత్యవసరంగా పంపించాల్సిన ఒక రిపోర్ట్ తో తలమునకలౌతున్నాను. కంగారుపడ్డావా?”

“ అవును మరి, కంగారనిపించదా? ఇంతకీ అంతరాత్రి వేళ అలర్ట్ ఎందుకు పంపావు? అంతా సరిగ్గానే ఉందా?

“ఆ ఉంది ఆ దేవుడి దయవల్ల”

“అమ్మయ్య. నీకు అవసరమైనప్పుడు స్పందించ లేకపోయినందుకు క్షమించు. నిన్న రాత్రి విపరీతమైన తలనెప్పిగా ఉండి, మాత్ర మింగడంతో ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసిందే. ఇంతకీ ఏమైంది?” ఝాన్సీ స్వరంలో కించిత్ పశ్చాత్తాపం.

“అయ్యో ఫరవాలేదులే. ఎందుకైనా మంచిదని నీతోపాటే అభిమాన్యుకి కూడా అలర్ట్ మెసేజ్ పంపించాను. సమయానికి అభిమన్యు రెస్పాండ్ అయ్యాడు కనుక సరిపోయింది” అంటూ జరిగినదంతా చెప్పుకొచ్చింది.

“అవునా!” హిమన చెప్పింది విని, మాటల్లో కంగారు ప్రదర్శించింది.

మనసులో మాత్రం ‘నీకేమీ కాదని నాకు తెలుసులే హిమనా’ అనుకున్న ఝాన్సీ పెదవులపై చిరునవ్వు కదలాడింది.

“మరిక ఉంటాను ఝాన్సీ. కాసేపట్లో మీటింగ్ ఉంది. కలుద్దాం ఎప్పుడైనా” అని, ఫోన్ పెట్టేసి, మీటింగ్ కి నోట్స్ తయారు చేసుకోవడంలో నిమగ్నమైంది హిమన.

 &&&

హిమన పైన జరిగిన దాడి తాలూకు కథనం, చిలవలుపలవలుగా మారి రాష్ట్రమంతా వ్యాపించింది.

ఆ తరువాత, ఢిల్లీలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక యువతి పై నలభయ్యేళ్ళ వ్యక్తి జరిపిన లైంగిక దాడి; మహారాష్ట్రలోని చంద్రపూర్ అడవుల దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో పదేళ్ళ బాలిను లొంగదీసుకో చూసిన దుష్టుడు... ఇలా దేశంలోని భిన్నప్రాంతాలనుంచి ఇటువంటి వార్తలే వినవచ్చాయి. చిత్రంగా ఆ ఘటనలు జరిగిన విధానం కూడా ఇంచుమించు హిమాన చెప్పినట్లే ఉన్నదని తెలియవచ్చింది.

ఇలా ఆడవాళ్ల పై దాడికి పూనుకుంటున్న దుర్మార్గులు ఆస్పత్రి పాలౌతూ ఉండడం, వాళ్ళల్లో కొంతమంది భయంతో మతిభ్రమించినట్లుగా ప్రవర్తించడం, కొంతమంది తీవ్రమైన గాయాలతో ఆస్పత్రి పాలవడం విని, వాళ్ళకి తగినశాస్తి జరుగుతోందని కొంతమంది సంతోషించినా, అసలు ఆ ఆడవారికి అంతటి శక్తి ఎలా, ఎక్కడనుంచి వస్తోందన్నది ఎవ్వరికీ అంతుబట్టని రహస్యంలా తయారైంది!

ప్రభుత్వాలూ, పోలీసులూ చేయలేని పనిని, ఏదో దైవిక శక్తి, ఆడవారిని కాపాడుతోందని అందరూ విశ్వసించడం మొదలు పెట్టారు.

దుష్టాత్ముల గుండెల్లో భయం మొదలైంది.

‘దైవికశక్తి అమ్మాయిలని కాపాడుతోందని అనుకున్నప్పటికి, అది కొంతమందినే ఎందుకు కాపాడుతోంది? మిగతా వాళ్ళెందుకింకా దాడులకు గురయ్యామని గోలపెడుతున్నారు? అసలేం జరుగుతోంది? ’ ఇదీ ప్రస్తుతం టి. వి. ఛానెల్స్ లో ప్రధానంగా చర్చించబడుతున్న విషయం!

“దాడి చేసినవారిని గాయపరుస్తూ తమని తాము రక్షించుకుంటున్న అమ్మాయిలందరూ క్షుద్రశక్తుల్ని ప్రయోగిస్తున్నారు. కనుక వారి గురించి పూర్తిగా సమాచారం సేకరించి, తగిన చర్యలు తీసుకోవలసింది” అని కొంతమంది గగ్గోలుపెడితే,

“ఇన్నేళ్ళుగా అమ్మాయిలపై దాడులు చేస్తున్న దుష్టులని కఠినంగా శిక్షించకుండా ఉపేక్షించి, ఇప్పుడు వాళ్ళని ఒక దైవికశక్తి కాపాడుతుంటే, దాన్ని తాంత్రికశక్తిగా పరిగణించడం అన్యాయం, ఇది సహించబోము” అని మరికొంతమంది గళం లేపారు.

దేశంలో ప్రముఖ చర్చాంశనీయంగా మారిన ఈ కేసుని, సువో మోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించింది కోర్టు.

 &&&

ఆరోజు, హిమనతో మొదలై, ఆడవారిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశమంతా దుమారం రేపిన కేసు గురించి, కోర్టులో విచారణ మొదటి రోజు.

“హలో ఝాన్సీ, నా కేసు గురించి జరుగుతున్న హంగామా అంతా వింటున్నావా?” అంటూ ఉదయాన్నే హిమన ఫోన్.

“ఆహా... మిగిలిన పనులన్నీ ప్రక్కన పెట్టి, అదొక్కటే తు. చ. తప్పకుండా ఫాలో అవుతున్నాను. నేను అనుకున్నది నెరవేరే సమయం దగ్గరికొచ్చింది” అంది.

“నువ్వనుకున్నదా? ఏమిటో నువ్వు మాట్లాడేది నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. సరే ఇక ఉంటాను. కోర్టుకి వెళ్ళే సమయమైంది. ఇంతకీ నువ్వు వస్తున్నావా?” ఝాన్సీ సమాధానం కోసం ఎదురుచూడకుండానే హిమన ఫోన్ కట్ చేసింది.

‘నేను రాకుండా ఉంటానా? ’ చిన్నగా నవ్వుకుని, కోర్టులో జరగబోయే కేసు గురించి తాను సేకరించిన సమాచారంతో కూడిన ఫైల్ తిరగేయసాగింది ఝాన్సీ...

! +! +!

వాది ప్రతివాదుల తాలూకు లాయర్లు కూర్చున్న ప్రదేశం వెనుక, రెండవ వరుసలో, కూర్చున్న లక్ష్మి తన చేతిలోని ఫైల్ ని ఒకసారి ఆప్యాయంగా తడిమి, ‘ఇది ఎన్నో సంవత్సరాల నా శ్రమకు ఫలితం. ఇవాళ చూడాలి దీని భవితవ్యం ఏమౌతుందో’ అనుకుంది.

‘జడ్జిగారు రావడానికి సమయం పట్టేలా ఉంది’ అనుకుని కూర్చున్న చోటునుంచే, తలతిప్పి, కోర్టు హాలంతా పరికించి చూసింది లక్ష్మి...

విశాలమైన కోర్టు హాలు. నాలుగు వైపులా గోడలపై దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్ముల చిత్రపటాలు. న్యాయాధిపతి కుర్చీ వెనకాల చిద్విలాసంగా నవ్వుతున్న మహాత్మాగాంధీ పెద్ద పటం. న్యాయాధిపతి కుర్చీకి ఒక ప్రక్కగా, కళ్ళకు గంతలు కట్టబడిన న్యాయదేవత నిలువెత్తు విగ్రహం.

‘న్యాయదేవత కళ్ళకి ఆ గంతలెందుకో? ’ కోర్టులో విగ్రహం చూసినప్పుడల్లా అదే సందేహం కలుగుతుంది లక్ష్మికి. అప్పుడే ఆమె సునిశిత దృష్టి, న్యాయదేవత విగ్రహం చేతిలోని త్రాసు నెమ్మదిగా అటూ ఇటూ ఊగుతుండడం గమనించింది. నిజంగానే త్రాసు ఊగుతోందా లేక అది తన భ్రమా అనుకుని, కళ్ళు గట్టిగా నులుముకుని, కొంచంగా ముందుకి వంగి, మళ్ళీ నిశితంగా పరిశీలించింది, త్రాసు నిజంగానే లోలకంలాగా ఊగుతోంది. అయితే ఎంతో పరిశీలిస్తే తప్ప, త్రాసు ఊగుతోందనే విషయం ఎవరూ కనిపెట్టలేరు, ‘చిత్రంగా... ఆ త్రాసు కదలిక నా మనసులోని భావాలకి అనుగుణంగా ఉంద’ నుకుని నవ్వుకుంది.

దేశమంతటా సంచలనం రేపి, కోర్టు సువో మోటోగా స్వీకరించిన కేసు విషయంలో, నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆసక్తితో, కోర్టు హాలంతా జనంతో నిండిపోయింది.

న్యాయాధిపతి ఆగమనాన్ని సూచిస్తూ ప్రకటన వినిపించగానే అక్కడ ఉన్న అందరూ వినయంగా లేచి నిలబడి, ఆవిడ కూర్చోగానే కూర్చున్నారు.

ప్రతిష్టాకరమైన ఈ కేసు న్యాయాధిపతి జగద్ధాత్రికి అప్పగించబడింది. కఠినమైన ప్రజాహిత నిర్ణయాలు అమలుచేయడంలో పేరు మోసిన దిట్ట జడ్జి జగద్ధాత్రి అనే పేరుంది.

 తుఫాను ముందు ప్రశాంతతలా, కోర్టు హాలంతా కొంతెసేపు నిశ్శబ్దం ఆవరించింది.

ప్రప్రథమంగా హిమనని, క్యాబ్ డ్రైవర్ జంగమయ్యనీ కోర్టులో హాజరు పరిచారు.

జనబాహుళ్యానికి సంబంధించిన కేసు కాబట్టి, అక్కడ జరిగే కార్యకలాపాలని ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని కోర్టు ఆదేశించింది.

హిమనకి, జంగమయ్య కీ, తమ కథనం వినిపించేలా అనుమతి ఇవ్వబడింది.

“ముందుగా నువ్వు చెప్పు అసలేమి జరిగిందో” హిమనని ఆదేశించింది జగద్ధాత్రి.

“అందరికీ నమస్కారం...” అని ఆరంభించి, ఘటన రోజున జరిగినదంతా విపులంగా చెప్పింది హిమన.

“ఇప్పుడు నువ్వు చెప్పు” జంగమయ్యని ఆదేశించింది.

“అమ్మా! నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. నాపైన ఏదో తాంత్రిక శక్తి వాడిందయ్యా. ఆ దెబ్బకి, చూడండయ్యా, నా చెయ్యెట్టా కొంకర పోయిందో? ఇక నేనెలా బ్రతికేది. నాకు డ్రైవింగ్ తప్ప మరేదీ తెలవదే?” ఘొల్లుమన్నాడు జంగమయ్య.

“నిన్ను నమ్మి, నీ క్యాబ్ ఎక్కిన అమ్మాయి పైన దాడి చేసే ముందు అవన్నీ గుర్తురాలేదా?” కోపంగా ప్రశ్నించింది జగద్ధాత్రి.

“బుద్ధిగడ్డి తిన్నదమ్మా. మన్నించండి. ఇక అట్టాటి పనులే చెయ్యను. కానీ నాకు నాయం చెయ్యండమ్మా” దీనంగా ముఖం పెట్టాడు క్యాబ్ డ్రైవర్.

“మీరు తాంత్రిక శక్తులు ఉపయోగించారని ప్రతివాది అభియోగం. మీరేమంటారు?” హిమనని ప్రశ్నించారు జడ్జి.

“యువరానర్! నేనొక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నాకీ తాంత్రిక శక్తులూ, దయ్యాలూ భూతాల గురించి అస్సలు తెలియదు, నమ్మకం లేదు. ఆ క్యాబ్ డ్రైవర్ ఎలా ఎగిరిపడ్డాడో నిజంగా నాకు తెలియదు. నన్ను నమ్మండి” వేడుకోలుగా అంది హిమన.

అలా చాలాసేపు ఇరువురు చెప్పినదీ విన్న జడ్జి,“కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత, కోర్టు నిర్ణయం ఏమిటంటే...“ ఒంటరి అమ్మాయిపై, దురుద్దేశంతో, దాడికి పాల్పడిన నేరానికి జంగమయ్యకు ఒక సంవత్సరం కఠిన కారాగారశిక్ష విధిస్తున్నాను. ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో జంగమయ్య గాయపడడానికి పరోక్షంగా కారకురాలైన హిమనకు, మూడునెలల జైలు శిక్ష, పదివేల జరిమానా...”

తీర్పు ముగియకుండానే,“మన్నించండి యువరానర్” అంటూ ఒక కంచుకంఠం కోర్టు హాలులో మారుమ్రోగింది.

“ఎవరది? ఏదైనా చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి బోనులో నిలబడి చెప్పండి” జడ్జి ఆదేశం విని, నెమ్మదిగా తనున్న చోటునుంచి కదిలి, బోనులోకి వచ్చి నిలబడింది లక్ష్మి.

“ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? ఈ కేసుకూ నీకూ సంబంధమేమిటీ?” అడిగింది జగద్ధాత్రి.

“యువరానర్! నా పేరు లక్ష్మి. నాకూ, ఈ కేసుకీ చాలా దగ్గర సంబంధం ఉంది. హిమన నిర్దోషి. ఇందులో ఆమె తప్పేమీ లేదు. దీనికంతటికీ ప్రత్యక్షంగా నేనూ, పరోక్షంగా ఇదీ కారణం” అంటూ, తన బ్యాగులోంచి ఒక చిన్న నలుచదరపు పలుచటి పరికరాన్ని తీసి, కోర్టులో అందరూ చూసేలా, రెండు చేతులలో ఎత్తి పట్టుకుని చూపించింది.

“కానీ ఈ వస్త్రానికీ ఈ కేసుకీ సంబంధమేమిటీ?”

“యువరానర్! రోజు రోజుకీ ఆడవారిపై దాడులు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో, అమాయకులైన వారికి, నిస్సహాయ స్థితిలో, రక్షణ కవచంలా ఉపయోగపడేందుకు, ఈ సాంకేతిక ఉపకరణాన్ని, గత కొన్నేళ్ళుగా, శాస్త్రీయ పరిశోధనలు (సైన్స్ రీసర్చ్) చేసి కనిపెట్టాను. మీరందరూ చూసినట్లుగా ఇది కేవలం ఒక పరికరమే కాదు, మహిళలపై దాడులు జరిగినప్పుడు, వారికి కవచంలా మారి రక్షణనిచ్చే ఉపకరణం. ఇది ఎవరి శరీరం పైనైనా చక్కగా ఇమిడిపోతుంది. ఉపయోగించడానికి సౌకర్యంగా ఉండడమే కాకుండా, వారిపై దాడులు జరిగినప్పుడు, భయాందోళనలతో వారి శరీరంనుంచి విడుదలయ్యే ప్రకంపనల శక్తి ఈ పరికరంలో కేంద్రీకృతమై, వారిని తాకిన వాళ్ళకి విద్యుద్ఘాతంలా తగులుతుంది. పర్యవసానం, దాడి చేసిన వ్యక్తికి తీవ్రమైన కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుంది. ఆ సమయంలో వాళ్ళున్న ప్రదేశాన్నిబట్టి తగిలే గాయాల తీవ్రత ఉంటుంది. దాడికి గురైనప్పుడు ఒక మహిళ అనుభవించే భయం, మానసికక్షోభ మాటలలో వర్ణించశక్యం కానిది. అలాంటప్పుడు దాడి జరిపిన వ్యక్తికి ఆమాత్రం శిక్ష న్యాయమే కదా యువరానర్”

“మీరు కనిపెట్టిన ఈ ఉపకరణ విక్రయానికి చట్టపరమైన అనుమతులు ఉన్నాయా?”

“ఉన్నాయి యువరానర్” అని బ్యాగులోంచి ఒక ఫైల్ తీసి యిచ్చింది లక్ష్మి.

ఫైల్ ని క్షుణ్ణంగా పరీక్షించి,“అయితే లక్ష్మి, ఒక విషయం చెప్పండి, ఈ ఉపకరణం ఉపయోగించినప్పుడు సంభవించే పరిణామాల గురించి కొనుగోలుదారులకు అవగాహన కలిగించడం జరుగుతున్నదా?”

“అవసరం లేదు యువరానర్. ఇది మామూలు ఉపకరణమే. దాడుల నేపథ్యంలో మహిళలకు కేవలం శారీరిక బలం, ఆత్మబలం మాత్రమే ఉంటే సరిపోదు, ఇటువంటి రక్షణకవచాలు కూడా ఉండాలని అభిప్రాయపడుతున్నాను”

“అన్యాయం... అన్యాయం...” లక్ష్మి మాటలకి కోర్టులో కలకలం మొదలైంది.

“ఆర్డర్... ఆర్డర్... ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పండి” బోను చూపించించింది జగద్ధాత్రి.

హాలులో కూర్చున్న జనంలోంచి ఒక యువకుడు వచ్చి,“యువరానర్, మీరు అనుమతిస్తే నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. అందులో ఒకటి, ఏదైనా ఒక ఉపకరణం మార్కెట్ లో అమ్మకానికి పెట్టినప్పుడు, దాని ఉపయోగానంతరం సంభవించే విపరీతపరిణామాల గురించి, కొనుగోలుదారుకి అవగాహన కల్పించడం అత్యవసరం. అందుకు ఇష్టమైనవాళ్లే దాన్ని కొనుక్కుంటారు. అంతేకానీ అది చెప్పాల్సిన అవసరం లేదనడం సరి కాదు. ఇక రెండవది, స్త్రీల రక్షణకై కనిపెట్టిన ఈ ఉపకరణం, శరీరంలో భయాందోళనలవల్ల జనించే ప్రకంపనలు గ్రహించి శక్తిగా మారుస్తుంది అంటున్నారు ఈ మేడం. కానీ యువరానర్, ఆడవారికి భయాందోళనలు కేవలం దాడుల నేపథ్యంలోనే జరుగుతాయనే ఎందుకు అనుకోవాలి? వేరే విధమైన మానసిక ఒత్తిడులవల్ల కూడా సంభవించవచ్చు. అటువంటప్పుడు వారి శరీర ప్రకంపనల ద్వారా జనించిన శక్తి, వారి సంపర్కంలోకి వచ్చిన ఎవరికైనా హాని చేసే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాల పై పునరాలోచించవలసినదిగా మనవి చేస్తున్నాను” వినయంగా చెప్పాడు సదరు యువకుడు.

“ఊ... నువ్వు చెప్పినది సమంజసంగానే ఉంది” అని లక్ష్మితో,“అసలింతకీ ఇటువంటి ఉపకరణం కనిపెట్టాలనే ఆలోచన కలగడానికి కారణం?” అడిగింది జగద్ధాత్రి.

“నేను ఒక అనాథను యువరానర్. చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు మరణిస్తే దయాళువు ఒకరు నన్ను అనాథాశ్రమంలో చేర్చారు. అక్కడ ఒకసారి నాపైన దాడి జరిగింది. కానీ ఆ చిన్నవయసులో, వాళ్ళని ఎదుర్కునే శక్తి నాకు లేకపోయింది. తప్పనిసరి పరిస్థితులలో అక్కడే ఉండి, నన్ను నేను కాపాడుకుంటూ, దాతల సహాయంతో చదువుకున్నాను. స్వశక్తితో ఉద్యోగం సంపాదించుకుని అక్కడినుంచి బయటపడ్దాను. కానీ ఆ భయానకమైన సంఘటన మాత్రం నన్ను ఇప్పటికీ ఒక పీడకల రూపంలో వెన్నాడుతూ, మనసుని కలతపెడుతూనే ఉంది. అందుకే నాలాంటి స్థితి మరెవ్వరికి కలగకూడదని, మహిళల రక్షణకై ఏదైనా ఉపకరణం తయారుచేయాలని ఆ రోజుల్లోనే నిశ్చయించుకున్నాను. నా ఆలోచనని ఆచరణలో పెట్టే క్రమంలో, చాలా ఆలోచించిన మీదట ఇది అన్నిటికంటే సులభము, క్షేమకరము మరియు ఉత్తమమైన మార్గం అనిపించింది యువరానర్” అంది లక్ష్మి.

అలా చెప్తున్నప్పుడు తనకి తరచూ వచ్చే భయంకరమైన స్వప్నం గుర్తొచ్చి వెన్నుజలదరించింది లక్ష్మికి.

లక్ష్మి చెప్పింది విన్నాక, కోర్టులో కొంతసేపు నిశ్సబ్దం ఆవరించింది. ఆ తరువాత ఆ ప్రాంగణమంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

హిమనకి అప్పుడు అర్థమైంది, ఒకసారి ఝాన్సీ తనకి ఆ ఉపకరణాన్ని అమ్మడం, ప్రయాణాలలో దాని తప్పని సరిగా శరీరంపై ధరించమని చెప్పడం. అయితే ఆ క్షణంలో దాని ఉపయోగమేమిటో అడగాలని చిత్రంగా తనకు స్ఫురించలేదేమిటో! ‘ఏది ఏమైనా ఝాన్సీవల్ల నాకు మేలే జరిగింది’ అనుకుంది.

ఝాన్సీ చెప్తున్నదంతా వింటున్నక్యాబ్ డ్రైవర్ జంగమయ్య నోరు భయాశ్చర్యాలతో తెరిచినది తెరిచినట్లే ఉండిపోయింది!

“ స్త్రీల రక్షణకై లక్ష్మి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమే అయినా, ప్రజాభిప్రాయం విన్న తరువాత, ఈ ఉపకరణం ఉపయోగించడంవలన కలిగే పరిణామాలు కొనుగోలుదారులకి చెప్పకుండా దాచడమనేది సిద్ధాంతపరంగా సబబు కాదు, ప్రత్యేకించి దానివల్ల ఒక్కొక్కసారి నిరపరాథులైన వ్యక్తులకు హాని కలిగే అవకాశం ఉన్నప్పుడు. కనుక ఆ ఉపకరణం అమ్మకాన్ని సత్వరమే నిలిపివేయాలనీ, ఇప్పటివరకూ అమ్మినవన్నీ వెనక్కు తీసుకోవాలనీ, వినియోగదారుల కోణంనుంచి మరింత కూలంకషంగా అధ్యయనం చేసి, చర్చించి, కొనుగోలుదారులకి పూర్తి అవగాహన కల్పించిన అనంతరమే ఒక నిర్ణయానికి రావాలనీ ఆదేశించడమైనది.

ఈ విషయంలో అవసరమైతే, లక్ష్మికి, ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలనీ తెలియజేస్తున్నాను. అసహాయ స్థితిలో ఉన్న ఆడవారిపై దాడుల నివారణ దిశగా శ్రీకారం చుట్టబడిన ఈ పరిశోధనవల్ల స్త్రీలకి లాభం చేకూరేలా కార్యాచరణ రూపొందించి, ఆ దిశగా పరిశోధన చేయడానికి ఈమెకు అన్ని వెసులుబాట్లు కల్పించవలసినదిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాను. ఈమె కథనం అనుసరించి, పూర్వాపరాలు పరీక్షించి, హిమనని నిర్దోషిగా పరిగణించి విడుదల చేస్తున్నాను” అంటూ జడ్జి జగద్ధాత్రి వెలువరించిన తీర్పుకి సర్వత్రా హర్షం వ్యక్తమైంది. లక్ష్మి మనసు ఆనందంతో పులకించింది.

ఒకవైపు జగద్ధాత్రి తీర్పు మహిళా లోకాన్ని ఆనందసాగరంలో ఓలలాడిస్తే మరోవైపు జంగమయ్యవంటి దురాత్ముల మనసుల్లో భయంతో కూడిన ప్రకంపనలు మొదలయ్యాయి...

! +! +!

‘అహహ... అఃహహ... వెధవల తిక్కకుదిరింది... నేనే గెలిచాను, నేనే గెలిచాను... ’ అంటూ పెద్దగా చప్పట్లూ, వెన్నంటి అరుపులూ విని, వంటింట్లో పని చేసుకుంటున్న రంగి, ఏమైందోనని కంగారుగా పరిగెత్తుకొచ్చింది. తీరా చూస్తే. ఝాన్సీ సోఫాలో వెనక్కివాలి కళ్ళు మూసుకున్న స్థితిలోనే పెద్ద పెద్దగా అరుస్తోంది.

గబుక్కున దగ్గరకు వెళ్ళి భుజాలు అపట్టుకుని కుడుపుతూ,“అమ్మా! అమ్మా! ఏమైంది?” కంగారుగా అడిగింది.

రంగి కుదుపులకి ఇహలోకంలోకి వచ్చి, ‘ఏమిటీ? ఇదంతా కలా? అబ్బ! ఎంత మంచికల!” అనుకుని,“ఏమీలేదులే రంగి, నువ్వెళ్ళి పని చూసుకో” అంది నొసలు రుద్దుకుంటూ.

“ఏమ్మా తలనెప్పిగా ఉందా, కాఫీ ఇమ్మంటారా?”

“ఆ ఇవ్వు. త్వరగా తీసుకురా” అని, చూస్తున్న ఫైల్ మూసి లేచి, ‘అన్నీ అనుకున్నట్లు జరిగి, పరిస్థితులు అనుకూలిస్తే, నా, ఈ ప్రయోగం, భవిష్యత్తులో, మహిళల సంరక్షణ విషయంలో ఒక క్రొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది’, ఒక అవ్యక్తమైన ఉత్సాహం మనసుని ఆవరించగా, కోర్టుకి వెళ్ళడానికి సిద్ధమైంది ఝాన్సీలక్ష్మి.

 &&&


0 hozzászólás