కిటికీతో పనేముంది  (Author: శింగరాజు శ్రీనివాసరావు)

పదవీవిరమణ చేసి దాదాపు పది సంవత్సరాలు అయింది. ఒంటరితనం నా గుండెను తాకి నేటికి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. నలభై సంవత్సరాలు నాతో గడిపిప సగభాగం ననువీడి గగనతలానికి ఎగిరిపోయింది. అదేమిటో బ్రతికినంత కాలం బాధ్యతల కొలిమిలో కాలిపొమ్మని ఆ భగవంతుడు ఆడవారి నుదుట వ్రాశాడేమో. పెళ్ళికి ముందు తల్లిదండ్రుల కోసం, పెళ్ళయ్యాక భర్త కోసం, తరువాత పిల్లలకోసం, ఆ తరువాత పిల్లల పిల్లలకోసం తపన పడుతూనే ఉంటుంది. ఎంత వద్దన్నా ఆమె అందులోనే ఆనందం ఉందని బంధాల వెంట పరిగెడుతూనే ఉంటుంది. నా శ్రీమతి విలాసిని కూడ అదే కోవకు చెందిన మహిళ. మరణానికి ముందు రోజు వరకు వంటయింటిని అంటిపెట్టుకునే ఉన్నది. తన చేతులతోనే మనవడికి బాక్సు కూడ సర్దిపెట్టింది. మాయదారి గుండె ఇక ఆ బంధాలను మోయలేక మొండికేసిందేమో, ఇక విశ్రాంతి కావాలని పదేపదే గొడవపెట్టి నిద్రలోకి జారుకుంది. ఆమె ఉన్నంత కాలం తను నా స్వేచ్ఛకు అడ్డు అనే భ్రమలో బ్రతికిన నేను, ఆమె లేనిదే నేను లేనన్న నిజం తెలుసుకోవడానికి ఒక్క నెల కూడ పట్టలేదు. మిగిలినవన్నీ ఎప్పటిలా జరిగిపోతున్నా, ఆమె లేని జీవితాన్ని ఆస్వాదించలేక పోతున్నాను. అనుభవంతో చెప్పే పెద్దల మాట మదిలో మెదిలింది. "భర్త లేకున్నా భార్య బ్రతుకగలదు, కానీ భార్య లేని భర్త ఒక జీవచ్ఛవమే, ఎంతోకాలం జీవించలేడు". అవును ఆ మాట నిజం.   పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చి వారితో కలిసి పోతుంది స్త్రీ. అక్కడ నుంచే సర్దుబాటు అలవాటవుతుంది ఆమెకు. ఆ తరువాత భర్త తరఫు బంధువులతో మమేకమవుతూ పుట్టింటిని మర్చిపోతుంది. అలా మరుపు అలవాటవుతుంది. అలా మరుపును, సర్దుబాటును నేర్చుకున్న ఆమె, భర్త కాలం చేసినా బిడ్డల వద్ద ఇమడగలుగుతుంది. కానీ మగవాడు అలా కాదు. జననం నుంచి మరణం వరకు తను ఒకే రకమైన జీవితానికి అలవాటు పడి వుంటాడు. భార్య అనే కొత్త బంధాన్ని తన ఇంటికి తెచ్చుకుని ఆమెను తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అందుకే అతనికి భార్యతో తప్ప, మరి ఏ ఇతరులతోను మానసికబంధం పెద్దగా ఉండదు. అందువలన భార్య మరణం అతనికి అశనిపాతమే అవుతుంది. మరీ బలహీనులైతే సంవత్సరం తిరగకుండానే ఆమెను చేరుకుంటారు. ఏదో నాలాంటి మొండిఘటాలు మాత్రం కొంతకాలం ఏటికి ఎదురీదుతూ ఉంటారు. అందుకే ఇంకా భూమి మీద బ్రతుకుతూ నూకలు తింటున్నాను. నాలాగే నా స్నేహితుడు మధుమూర్తి కూడ బ్రతుకు బండిని లాగిస్తున్నాడు. కాకపోతే వాడికి, నాకు ఒకటే తేడా. నాకు ఒక ప్రత్యేక గది ఇచ్చి అందులో మంచం వేసి చూస్తున్నాడు నా కొడుకు భార్గవ. అందుకు భిన్నంగా తండ్రిని వృద్దాశ్రమంలో వదిలిపెట్టి, 'ఇంటికన్నా ఆశ్రమమే పదిలం నాన్నా' అని నచ్చజెప్పి అక్కడ మంచం వేయించాడు వాడి కొడుకు భరద్వాజ. లోకానికి నా కొడుకు శ్రావణకుమారుడు, వాడి కొడుకు స్వార్థపరుడు. ఎక్కడవున్నా ముసలి బ్రతుకులకు ఆదరణ అత్యల్పమని మా మనసులకు మాత్రమే తెలుసు. మధుమూర్తిని  ఆశ్రమంలో చేర్చిన రోజు నాకు ఇంకా గుర్తున్నది. మనసు గతంలోకి జారింది.

         **********

         ఏడుకొండలవాడిని ఒకసారి దర్శించుకుని వద్దామని తిరుమలకు వెళ్ళాను. ప్రభుత్వం వారి పుణ్యమా అని సీనియర్ సిటిజన్ కోటాలో పెద్దగా కష్టపడకుండానే శ్రీవారి దర్శనం చేసుకుని అరగంట లోపే బయటపడ్డాను. వంట్లో ఓపిక సన్నగిల్లని కారణంగా కాస్త బాగానే నడుస్తున్నాను. దర్శనం అయ్యాక లడ్ల కౌంటరు వద్దకు వెళ్ళి లడ్లు తెచ్చుకోవడం పెద్ద ప్రహసనం. చిన్నగా దాన్ని కూడ ముగించుకుని తిరుపతికి చేరుదామని రామ్ బగీచ బస్టాండు వైపుకు వస్తుంటే ఫోను మ్రోగింది. 'ఎవరబ్బా' అనుకుంటూ చూశాను. మధుమూర్తి నుంచి ఫోను. వాడికి నేను తిరుమలకు వస్తున్నట్లు తెలియదు. నేనే చెప్పడం మర్చిపోయాను.

         "హలో మధు.. చెప్పు"

         "ఏమిట్రా ఎన్ని సార్లు ఫోను చేసినా తీయవు. అరగంట నుంచి కొట్టుకుంటున్నాను. భార్గవకు ఫోను చేస్తే, వాడి ఫోను స్విఛాఫ్ వస్తున్నది. ఎక్కడున్నావురా"

         "సారీరా.. నీకు చెప్పడం మర్చిపోయాను. నేను నిన్న ఉదయం బయలుదేరి తిరుమలకు వచ్చాను. నువ్వు ఫోను చేసినప్పుడు నేను దర్శనం క్యూలో ఉన్నాను. ఫోను నా దగ్గర లేదు. కౌంటరులో ఉంచి వెళ్ళాను. ఇప్పుడే తీసుకుని ఆన్ చేశాను. ఇంతలోనే నీ నుంచి కాల్. ఇంతకూ ఏమయింది?"

         "చెప్తానుగానీ, దర్శనం బాగా జరిగిందా? ఎంతసేపు పట్టింది?"

         "ఎంతరా.. ఇరవై నిముషాలలో దర్శనం అయింది. వృద్ధుల కోటా గదా.. త్వరగానే జరిగింది. అది సరే.. ఇంతకూ ఎందుకు ఫోను చేశావు"

         "నువ్వెప్పుడు వస్తావు ఇంటికి?"

         "రేపు ఉదయానికల్లా అక్కడ ఉంటాను. అంత టెన్షనుగా ఉన్నావు.. ఏంటిరా విషయం?"

         "నన్ను, నా కొడుకు వృద్ధాశ్రమంలో చేరుస్తానంటున్నాడు. వాళ్ళిద్దరూ పిల్లాడి చదువు కోసం బెంగుళూరు బదిలీ చేయించుకున్నారుట. నన్ను ఒక్కడినే ఇంట్లో ఉంచడం మంచిదికాదని, నన్ను ఆశ్రమంలో చేర్చి ఈ ఇల్లు అద్దెకు ఇచ్చి వెళతారట"

         ఆ మాటలు విన్న నాకు మతి పోయినంత పనయింది. భరద్వాజను, మధు ఎలా పెంచాడో, వాడికోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. భరద్వాజకు అయిదు సంవత్సరాల వయసులో పచ్చకామెర్లు వచ్చి, బాగా సీరియస్ అయింది. బ్రతుకుతాడో, బ్రతకడో అని అందరూ భయపడుతుంటే, దిక్కుతోచక ఆ ఏడుకొండల వాడికి మొక్కుకున్నాడు. 'బిడ్డకు బాగయితే వాణ్ణి తీసుకుని మోకాళ్ళతో కొండను ఎక్కుతానని'. వాడి అదృష్టమో, ఆ దేవుని అభయమో కానీ, పదిహేను రోజులలో భరద్వాజకు కామెర్లు తగ్గి మామూలు అయిపోయాడు. అంతే.. భరద్వాజను మెడమీద కూర్చోబెట్టుకుని మోకాళ్ళతో కొండను ఎక్కి దైవదర్శనం చేసుకుని వచ్చాడు మధుమూర్తి. అప్పుడు దోక్కుపోయిన అతని మోకాలి చిప్పలు బాగుపడడానికి నెల రోజులు పైనే పట్టింది. అటువంటి తండ్రిని నిర్దాక్షిణ్యంగా బయట వదిలిపెట్టి వెళ్ళడానికి భరద్వాజకు మనసెలా ఒప్పింది. నా మనసు బాధగా మూలిగింది.

         "మధూ.. నువ్వు తొందరపడకు. నేను వచ్చి వాడితో మాట్లాడుతాను" అని ఫోను పెట్టేశాను. అన్యమనస్కంగానే సాగింది నా తిరుగు ప్రయాణం.

         ******

         ఇంటికి రాగానే స్నానం చేసి వెంటనే మధుమూర్తి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి భరద్వాజ, మధుమూర్తితో ఏదో మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే లోపలికి వెళ్ళి మా కోసం కాఫీ తెచ్చాడు.

         "ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నావేమిట్రా భరద్వాజ" అని అడిగాను కాఫీ కప్పు అందుకుంటూ.

         "తప్పేముంది మామయ్యా. నేనేమన్నా నాన్నను గాలికి వదిలేసి పోతున్నానా.. లక్షణంగా పదిమంది తన వయసు వాళ్ళు ఉన్న దగ్గర ఉంచి వెళుతున్నాను. ఎలాగూ మీరు ఇక్కడే ఉన్నారు. అప్పుడప్పుడు నాన్నను కలిసి వస్తుంటారు కదా. ఇందులో దారుణమేముంది"

         "ఈ వయసులో ఆయనను అనాథలా ఆశ్రమంలో పారేసి పోతూ ఇంకా సమర్థించుకుంటావా. నీకోసం మీ నాన్న ఎంత చేశాడో గుర్తుందా నీకు"

         "ఆవేశపడకండి మామయ్యా. ప్రతి తండ్రి బిడ్డకోసం కష్టపడతాడు. అది అతని బాధ్యత. కన్న తరువాత పెంచడం ధర్మం. నేను కూడ నా కొడుకు చదువు కోసం బెంగుళూరు వెళుతున్నాను. అంతమాత్రాన నేను వాణ్ణి ఉద్ధరించినట్లా. కాదుగదా. వాడికి మంచి జీవితం ఇవ్వడానికి నేను చేసే ప్రయత్నమిది. దానికే నేనేదో త్యాగం చేస్తున్నానని అనుకుంటే ఎలా?"

         "నిజమేరా.. తండ్రిది బాధ్యతే.. కాదనను. కానీ ఇప్పుడు నువ్వన్న మాటలు ఈ వయసులో నీకు కరెక్టే అనిపిస్తాయి. రేపు నీ కొడుకు కూడ నిన్ను ఇలాగే ఎక్కడో విసిరేసి పోతే అప్పుడు తెలుస్తుంది నీకు, నీ తండ్రి ఇప్పుడు పడుతున్న బాధేమిటో"

         "మీలా మేము పిల్లల మీద ఆశలు పెంచుకోవడం లేదు, తరువాత బాధపడడానికి. అయినా ఇప్పుడు నేను చేస్తున్న తప్పేమిటి? ఈ ఇంట్లో నాన్న ఒంటరిగా ఉండలేడని ఆశ్రమంలో చేరుస్తున్నాను. అక్కడైతే నాన్నను జాగ్రత్తగా చూసుకుంటారు. ఈయన వయసు వాళ్ళు ఉంటారు కనుక కాలక్షేపం అవుతుంది. నెలకొకసారి డాక్టరు పర్యవేక్షణ ఉంటుంది. ఈ ఇంటిని అద్దెకు ఇస్తే పదిహేనువేలు వస్తాయి. వాటిని ఆశ్రమంలో కడితే ఆయన్ను మహరాజులా చూస్తారు. ఇక ఆయనకు వచ్చిన బాధేమిటి ఇందులో. మమ్మల్ని చిన్నతనంలో హాస్టలుకు పంపినప్పుడు మీకు తప్పు అనిపించనిది ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రమాలలో ఉంచితే తప్పని ఎందుకు అనిపిస్తున్నది మామయ్యా" ముఖం సీరియస్ గా పెట్టి అడిగాడు భరద్వాజ.

         వాడి మాటలు సూటిగానే తగిలాయి.   తల్లిదండ్రులు మంచి భవిష్యత్ కోసం బిడ్డలను పసితనం నుంచే హాస్టళ్ళకు పంపుతున్నారు. అందుకు మేము కూడ మినహాయింపు కాదు. ఇంటరు నుంచి భార్గవను, భరద్వాజను హాస్టలులో ఉంచే చదివించాము. పెద్దవాడినని కూడ చూడకుండా వాడు మాటకుమాట చెబుతుంటే ఉక్రోషం పొడుచుకు వచ్చింది నాకు.

         "అంటే మేము మిమ్మల్ని హాస్టలులో ఉంచామని. ఇప్పుడు వీణ్ణి ఆశ్రమంలో పారేస్తావా. అంటే కసి తీర్చుకుంటున్నావా" అన్నాను.

         "అపార్థం చేసుకోకండి మామయ్యా. ఏదో ఉదాహరణగా చెప్పాను. మీరు చేసింది తప్పని కాదు. మీరు ఎలాగైతే మా భవితకోసం మమ్మల్ని హాస్టలులో చేర్చారో, అలాగే మేము కూడ మీకు ఒంటరితనం అనే లోటు కనిపించకుండా ఉండడం కోసం వృద్ధాశ్రమంలో చేరుస్తున్నాము. మీరు ఎంతసేపటికి ఆశ్రమం అనగానే అదేదో మేము మిమ్మల్ని భరించలేక బయటకు పంపుతున్నామని ఆలోచిస్తున్నారు తప్ప, మీ మనసుకు ఆనందాన్ని, మంచి కాలక్షేపాన్ని అందించడానికని ఆలోచించడం లేదు. నెగటివ్ గా ఆలోచించకుండా కాస్త పాజిటివ్ గా ఆలోచించండి మామయ్యా" అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. అంటే వాడొక నిర్ణయానికి వచ్చాడు. ఇక ఎవరు చెప్పినా వినడని అర్థమయింది నాకు.

         అప్పటిదాక మా మాటలలో జోక్యం కలిగించుకోకుండా కూర్చున్న మధు వాడు వెళ్ళగానే నోరు తెరిచాడు.

         "ఒరేయ్ వాసు. వాడిని ఇబ్బంది పెట్టకురా.. వాడికి ఏది అనుకూలమో అదే చెయ్యనివ్వు. ఎలాగూ రాలిపోయే పువ్వులం.. నాలుగు రోజులు ముందే రాలిపోతాం. అంతేకదా. ఇక నువ్వు ఏమీ మాట్లాడకు. అనవసరంగా నిన్ను ఇందులో ఇరికించాను. వాడు నీ మాట కూడ లెక్కచేయలేదంటే, ఇక ఎంత మొత్తుకున్నా వినడు. కొందరి జీవితాలు అంతేరా. ఎవరికీ కొరగావు" వాడి కళ్ళలో కన్నీరు. వాడి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.

         "మధూ.. నీకు నేనున్నానురా. దిగులుపడకు. రెండు రోజులకు ఒకసారైనా వచ్చి నిన్ను కలుస్తాను. ఇన్నాళ్ళూ దగ్గర ఉంచుకుని చూసినవాడు ఈరోజు ఇలా వదిలేసి వెళుతున్నాడంటే, వాడిది ఎంత అవసరమైన పనో. నువ్వు వాడితో పాటు బెంగుళూరు పోయినా అక్కడ నీకు మాత్రం ఏం తోస్తుందిరా. అదే ఆశ్రమంలో అయితే అంతా మన బాపతే కనుక, ఒకరి బాధలు మరొకరితో పంచుకుంటూ కాలం వెళ్ళదీయవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. నేను కూడ అప్పుడప్పుడు నీకు తోడుగ వస్తుంటాను" అని వాడిని సమాధాన పరచడానికి ప్రయత్నించాను. పరిస్థితి అనుకూలించనపుడు సర్దుబాటు ఒకటే పరిష్కారమార్గం.

         "అంతేలేరా మనలను మనం సముదాయించుకోవడమే. రేపే వాడు నన్ను ఆశ్రమంలో చేరుస్తానన్నాడు. సరేరా.. వీలుచూసుకుని ఒకసారి అక్కడికి రా" అన్నాడు మధు గుండె దిటవు చేసుకుని.

         వాడికి వీడ్కోలు చెప్పి ఇంటికి చేరాను.

         *****

         అలా భరద్వాజ, మధుమూర్తిని ఆశ్రమంలో దించి వెళ్ళి దాదాపు సంవత్సరం కావస్తున్నది. వీలుకుదిరినప్పుడల్లా మధు దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాలో ఏదో తెలియని అసంతృప్తి మొదలయింది. పదే పదే మధు గుర్తుకు వస్తున్నాడు. ఈరోజు ఎందుకో ఒకసారి మధును కలిసి వద్దామని అనిపించింది. ఆఫీసుకు బయలుదేరుతున్న భార్గవను అడిగాను.

         "భార్గవా.. వనస్వినిని ఆఫీసులో దించి మరల వస్తావా? అటునుంచి అటే ఆఫీసుకు వెళతావా?"

         "అటే ఆఫీసుకు వెళతాను. దేనికి నాన్నా అలా అడిగారు"

         "అదేరా.. మధును చూసి పది రోజులు దాటింది. ఒకసారి వెళ్ళి వద్దామని"

         "సరే ఆటోలో వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి" అని  వెళ్ళిపోయాడు భార్గవ.

         ఆటోలో ఆశ్రమానికి వెళ్ళి మెల్లగా మధు వుండే గదికి చేరుకున్నాను. ఎప్పటిలాగే వాడు కిటికి దగ్గర కూర్చుని ఉన్నాడు. బహుశా వాడు వాడి కొడుకు కోసం చూస్తున్నాడేమో. అవును వాడే కాదు, కొడుకు ఇంట్లో వుంటూ నేను కూడ సాయంత్రం కాగానే కిటికి నుంచి బయటకు చూస్తుంటాను. నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని. ఈ అలవాటు నాకు మొదటినుంచి వున్నది. నేను సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి భార్గవ స్కూలు నుంచి వచ్చేవాడు కాదు. వాడికోసమని నేను తెచ్చిన తినుబండారాలను వాడికి నా చేతితో తినిపిద్దామని కిటికి దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని చూస్తుండే వాడిని. ఈ రోజుకు కూడ అలాగే చూస్తుంటాను. వాడికి నా చేతితో తినిపించాలని కాదు. వాడు వచ్చి 'నాన్నా.. ఏంచేస్తున్నావు?' అని అడిగే మాటకోసం. మొదట్లో నేను కోరినట్లుగానే జరిగేది. కానీ రోజులు గడిచేకొద్ది వారానికొకసారి నుంచి కాలవ్యవధి పెరుగుతూ వచ్చి ఇప్పుడు వాడి పలుకే బంగారమై పోయింది ఈనాడు. కానీ ఎవరికి చెప్పుకోగలను. చెప్పుకుంటే చులకనయి పోతాను. ఓదార్పు లేకపోగా వెటకారాలు ఎక్కువవుతాయని ఆ బాధను నాలోనే దాచుకున్నాను. మధుతో చెప్పుకుందామనుకున్నా వాడిది నాకంటే దారుణమైన పరిస్థితి. అందుకే నా బాధ నాలోనే సంకెళ్ళు వేసుకుంది.

         నా అలికిడి విని వెనక్కు తిరిగాడు మధు.

         "రారా వాసు.. చాలా రోజులయిందిరా నిన్ను చూసి. ఈ మధ్య రావడం బాగా తగ్గించావు. రా కూర్చో.. భార్గవ, కోడలు, పిల్లలు బాగున్నారా" అంటూ కుర్చీ చూపించాడు.

         "అంతా బాగానే ఉన్నారురా దేవుడి దయవల్ల. కాకపోతే నాకే ఒకరోజు వున్న హుషారు మరో రోజు ఉండడం లేదు. ఉదయాన్నే వాకింగుకు వెళ్ళిరావడం తప్ప వేరే పనేమి లేదు కదా. సెల్ తో కాలక్షేపం మాత్రం ఎంతసేపని చెయ్యగలం. ఇప్పటి తరానికైతే అదే లోకం. మనకు అలా కాదుకదురా. చిన్నతనం నుంచి కాళ్ళు, నోరు రెండూ ధారాళంగా వాడిన వాళ్ళం. ఇప్పుడు కాళ్ళు కట్టేసుకుని, నోరు మూసేసుకుని బ్రతకాలంటే కాస్త కష్టంగానే ఉంటున్నది. అయినా తప్పదు కదా. నా సంగతి సరే. నీకెలా తోస్తున్నదిరా" అడిగాను.

         "ఏదో అలా జరిగి పోతున్నదిరా. సాయంత్రం అయిదు గంటలకు అందరం క్రింద ఉన్న గుడి దగ్గరికి చేరుకుంటాం. కొద్దిసేపు భజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ తరువాత ఎవరో ఒకరు భగవద్గీతనో, రామాయణాన్నో చదువుతారు. లేకపోతే ప్రవచనకారుల ఉపన్యాసాన్ని క్యాసెట్ పెట్టి వినిపిస్తారు. ఆ తరువాత టిఫిను తిని ఎవరి గదులకు వాళ్ళం వెళ్ళిపోతాం. పగలంతా ఎవరికి వారే"

         "ఏదోలే కాలం వెళ్ళబుస్తున్నాం. ఇంతకూ భరద్వాజ నెలకు ఒకసారైనా వస్తున్నాడా, లేదా"

         "ఎక్కడరా వాడు వచ్చి నేటికి ఆరు నెలలు దాటి పోయింది. ఫోను చేస్తే అది స్విఛ్ ఆఫ్ వస్తుంది. పోయిన నెల ఫోను చేస్తే మ్రోగింది కానీ రాంగ్ నెంబర్ అని పెట్టేశారెవరో. వాడి నెంబరు కోసం అద్దెకుండే వారికి కూడ ఫోను చేశాను. వాళ్ళదీ అదే పరిస్థితి. వాడు ఇంకొక నెంబరు ఇచ్చాడని, అది కూడ కలవడం లేదని అన్నారు. ఎంత బిజీగా ఉన్నాడో ఏమో" వాడి గొంతులో దిగులు ధ్వనించింది.

         నా మనసులో ఏదో ఒక మూల అనుమానం పొడచూపింది. భరద్వాజ కావాలనే అలా చేస్తున్నాడేమో.

         "వాడి కోసమేనటరా నువ్వు ఆ కిటికి దగ్గర కూర్చుని ఎదురు చూసేది. అంతగా దిగులు పడకురా. వయసు పెరిగే కొద్ది మనం బంధాలను దూరం చేసుకుంటూ రావాలి" అని వాడికి వేదాంతం చెప్పానుగానీ, నేను కూడ రోజు కిటికి దగ్గర కూర్చుని చేసే పని అదే కదా.

         "వాడి కోసం కాదులేరా.. ఏమీతోచక" అన్నాడు కానీ, వాడి ముఖంలో కొడుకు కోసమే ఎదురుచూపులని అర్థమయింది నాకు.

         కొద్దిసేపు చిన్నప్పటి సంగతులు మాట్లాడుకుని కాసింత నవ్వులు పంచుకుని బయలుదేరడానికి లేచాను.

         "వాసూ.. మళ్ళీ ఎప్పుడొస్తావురా?"

         "వీలుచూసుకుని వస్తానురా"

         "వీలుచూసుకుని కాదురా, వీలుచేసుకునిరారా. నేను మరణించినా నా కొడుకు వస్తాడనే ఆశ లేదురా. ఆరునెలల నుంచి వాడు వస్తాడని ఈ కిటికి నుంచి చూసి చూసి అలిసిపోయానురా. ఎవరూలేని ఒంటరినై పోయానని అనిపిస్తున్నది. మనలో ఎవరుముందో, ఎవరం వెనకో మనకే తెలియదురా. అందుకే కనీసం వారానికి ఒకసారైనా వచ్చి కనిపించరా. నీరాక కోసం ఇదే కిటికీలో నుంచి ఎదురు చూస్తుంటాను" మధు కళ్ళు చెమర్చాయి.

         "అలాగేలేరా.. తప్పకుండా వస్తాను" అని మధు భుజంతట్టి బయలుదేరాను. ఏదో ఒకటి చేసి మధు ఒంటరితనాన్ని పోగొట్టాలి అని నిర్ణయించుకున్నాను.

         ******

         "నువ్వలా వాడిని వదిలేసి ఇలా నాతో కలిసి విడిగా వేరే ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడటరా భార్గవ"

         "నలుగురి నోట్లో నన్ను నాన్చకు నాన్నా.. అని బ్రతిమాలాడురా. వాడికి నీ పరిస్థితి వివరించాక'సరే మీ ఇష్టం'అన్నాడు. మా కోడలు నాకు బాగ సపోర్టు చేసింది. అన్ని బంధాలకంటే స్నేహబంధం గొప్పదని చెప్పి, నా నిర్ణయాన్ని మెచ్చుకున్నది. అందుకే ఇకనుంచి ఈ గదిలో మనిద్దరమే ఉంటాం. భార్గవకు తెలిసిన వంటావిడ ఇంటినుంచి మనకు టిఫిను, కాఫీ, భోజనాలు వస్తాయి. నా పెన్షను, నీ ఇంటి అద్దెలతో మనం సంతోషంగా గడపవచ్చు. మా ఇంటి పనమ్మాయి వచ్చి ఇక్కడ కూడ ఇంటిపని చేసి వెళ్తానన్నది. చేతిలో సెల్ ఉన్నది. అవసరమైతే భార్గవకు ఫోను చేస్తే వస్తాడు. మనమిక స్వేచ్ఛగా కాలం గడపవచ్చు"

         "వాసూ.. స్నేహితుడివంటే నువ్వేరా. కన్నకొడుకే నన్ను వదిలి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు నాకోసం.." నన్ను పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

         "ఛ.. ఏడవకురా. మనిద్దరి మధ్య బంధం ఈనాటిది కాదుకదురా. మనకు కొడుకులు పుట్టకముందు నుంచి ఉన్న అనుబంధం. మన మధ్య ఉన్నది స్వార్థం అంటని స్నేహబంధంరా. ఈ వయసులో మనం ఒకరికి ఒకరం తోడు. అన్ని మర్చిపోయి ఆనందంగా, చిన్నతనంలో ఎలా వున్నామో అలా ఉందాం" అని వాడి వీపు తట్టాను. వాడి మనసు పొంగిపోయింది. గదంతా ఒక్కసారి కలయచూశాడు.

         "వాసూ.. ఈ గదికి కిటికి లేదురా"

         "మనం కిటికీ నుంచి ఎవరికోసమో ఎదురుచూడనక్కరలేదు కదురా ఇకనుంచి. నా ఎదురుగా నీవు, నీ ఎదురుగా నేను. ఇక మనకు కిటికి అవసరమేముంది" అన్నాను నవ్వుతూ.

         "కరెక్టుగా చెప్పావురా" అని మనస్పూర్తిగా నవ్వాడు మధు. ఇన్నాళ్ళకు వాడు మనసారా నవ్వుతున్నాడు. వాడలా నవ్వుతుంటే నాలో ఏదో తృప్తి. మాది రక్తసంబంధం లేని బంధం.. అందుకనేనేమో "స్నేహానికన్న మిన్న లోకాన లేదంటారు". వేయి వోల్టుల బల్బులా వెలుగుతున్న మధు ముఖాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాను.

                                    *********

0 hozzászólás