అధ్యక్షుని సందేశం
అధ్యక్షుని సందేశం (Author: అన్నా మధు)
నమస్కారం,
తెలుగు కళా సమితి (TFAS) తరపున గత కొన్ని నెలలుగా జరిగిన విశేషాలను మరియు కార్యక్రమాలను ఈ నివేదిక ద్వారా తెలియజేస్తున్నాము.
దీపావళి జాతర, open grounds లో చేసి న్యూ జెర్సీ తెలుగు పెద్దలు, మన సభ్యుల నుంచి అనూహ్యమైన మెప్పును పొందిన ఆనందంతో; భారత్ లో నాకుమారుణ్ణి, మనమలను చూడటానికి వెళ్లిన నాకు తెలుగు కళాసమితి జెండాతో భారత్ లో కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే అవకాశం మన తెలుగు సమితి కల్పించింది. నా స్వస్థలమైన గుంటూరు తెలుగు సమితి ద్వారా సంగీత వాగ్గేయకారుడు శ్రీ శ్రీ శ్రీ నారాయణ తీర్థుల కృష లీలా తరంగిణి మహోత్సవం స్థానిక త్యాగరాజ సాంస్కృతిక సంఘం వారి సహకారంతో జనవరి 10వ తేదీ నాడు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మన శ్రేయోభిలాషులు, NATS మాజీ ఛైర్మన్ మరియు A.P. స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ శ్రీ మన్నవ మోహన కృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించి తమ సంతోషాన్ని, TFASకి తన సహకారాన్ని అని చెప్పడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమంలో గుంటూరు సంగీత కళాశాల విద్యార్థులు, గుంటూరు, విశాఖపట్నం నుండి వచ్చిన కళాకారులు నారాయణ తీర్థుల వారి కీర్తనలను తమ నాట్యాలతో అద్భుతంగా ప్రదర్శించడం మధురానుభూతి. తెలుగు కళా సమితి యొక్క 42 సంవత్సరాల చరిత్రలో అంతర్జాతీయంగా (భారత్ లో) ఒక కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రప్రథమం. ఇటువంటి కార్యక్రమ నిర్వహణ లో నాకు చేయూత నిచ్చిన TFAS కార్యవర్గ సభ్యులదరికీ నా మనఃపూరక కృతజ్ఞతలు.
జనవరి 11వ తేదీన - యువత వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడేలా - "UX/UI Explained" అనే అంశంపై ఒక Tech Talk Webinar నిర్వహించబడింది. TFAS ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్‌లో సుమారు 50 మంది సభ్యులు, ముఖ్యంగా యువత పాల్గొని ఈ అంశంపై వివరాలను తెలుసుకున్నారు.
గత సంవత్సరం లాగానే న్యూజర్సీ రాష్ట్రాన్ని జనవరి 25న భయంకరమైన మంచు తుఫాను అతలాకుతలం చెయ్యబోతోందని వాతావరణ శాఖ ద్వారా తెలిసిన వెంటనే, మా కార్యవర్గం వేగం పుంజుకుని జనవరి 24ననే సంక్రాంతి సంబరాల్ని సోమర్సెట్లోని వడ్తాల్ దాం - స్వామినారాయణ మందిరం – లో TFAS యువ వాలంటీర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. మొట్టమొదటి సారిగా నిజమైన గోమయం తో చేసిన గొబ్బెమ్మలకు పూజ చేసి సుమారు 70 మంది మహిళలు గొబ్బెమ్మ పాటలతో నర్తించడం ఒక మరువలేని దృశ్యం. ఈ కార్యక్రమమం లో పూజా మంత్రాలతో వేదికపై పొంగలి ప్రదర్శించి ప్రసాదంగా పంచడం, సభ్యులని ఆనందంతో ముంచెత్తింది. సుమారు 40 మంది యువ వాలంటీర్లు వ్యాఖ్యాతలుగా, ప్రదర్శకులుగా అందరినీ ఆకట్టుకొన్నారు. ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన పెళ్లి సందడి అనే matrimony కార్యక్రమద్వారా సుమారు 40 మంది యువతీయువకులు కలుసుకునే అవకాశం కల్పించి, ఎంతో విజయవంతమయ్యింది.
అంతేకాకుండా, తెలుగు భాషాభివృద్ధికి గాను సుమారు 30 మంది బాలబాలికలు, పెద్దలు ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, చిత్రలేఖనం పోటీల లో పాల్గొన్నారు. విజేతలందరికీ బహుమతులు అందజేయబడ్డాయి.
ఈ సంక్రాంతి సంబరాల విజయంతో ఉత్తేజం పొందిన మా కార్యవర్గం రాబోయే నెలలలో TFAS విలువలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ప్రణాళికలలో ఇప్పడినించే నిమగ్నమయ్యారు.
ఈ కార్యక్రమాల విజయానికి - ప్రేమతో, అభిమానంతో - విరాళాలిచ్చిన దాతలకు, సహకరించిన కార్యవర్గ సభ్యులకు, మరియు వాలంటీర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు. రాబోయే కాలంలో కూడా సభ్యులందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రగాఢ విశ్వాసంతో... వచ్చే కార్యక్రమాలలో మళ్లీ కలుద్దాం.
నమస్కారం,
మీ అన్నా మధు
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)