భాషాభిమానిని నేను...!  (Author: కోరుకొండ వెంకటేశ్వర రావు)

భాషాభిమానిని నేను...! తెలుగు వీరాభిమానిని నేను...!!

భాషా దినోత్సవ వేళ … ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న

అలనాటి రాయల మాట పదే పదే వల్లిస్తాను... వల్లె వేస్తాను!

రాష్ట్ర జన్మ దినాన ‘మా తెలుగు తల్లికీ మల్లె పూదండ‘ అంటూ

శంకరంబాడి సుమధుర గానాన్ని ఉచ్చ స్వరంలో ఆలపిస్తాను!

తెలుగు భాష తియ్యదనం.. … తెలుగు జాతి గొప్పతనం

తెలుసుకున్న వాళ్లకి.. … తెలుగే ఒక మూలధనం …! ‘ అన్న

చంద్రబోసు గీతాన్ని ఉద్యమ స్పూర్తితో గొంతెత్తి నినదిస్తాను;

‘అయ్యా’ అంటే అవమానం.. … ‘సార్’ అంటేనే అతిశయం!

పర పాలనకు స్వస్తి పలికా; చిత్రంగా పర భాషకే బానిసనయ్యా!!

పేరుకే తెలుగోణ్ణి;... కట్టూ బట్టా, మాటా మంతీ, చదువూ సంధ్యా

అన్నింటా అప్రాచ్యమే!.. … కాకుంటే, గడవదు నాకొక్క క్షణం!!

థాంక్యూ, సారీ ల మధ్య నా తెలుగు ఊపిరాడక సతమతం;

పండగల్లో మాత్రం... పంచ కట్లు, పట్టు పరికిణీలు, జరీ చీరెలు

గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు..!

పూజలు, పునస్కారాలతో కిటకిట లాడే గుళ్ళూ, గోపురాలు...!!

ఇంట్లో ఇంపైన ఇల్లాళ్లు … ముంగిట్లో ముచ్చట గొలిపే ముగ్గులు;

బూరెలు, గారెలతో ప్రతి ఇంటా మెరుస్తుంది తెలుగుదనం!

తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా! ‘… షరా మామూలే!!

తేనెకన్న తీయనిది నా తెలుగంటూ ఉద్వేగంతో ఊగిపోతా…

లక్షలు ఖర్చయినా నా పిల్లల్ని మాత్రం కాన్వెంట్లోనే చదివిస్తా;

సాఫ్ట్ వేర్ వైపుగా అడుగులు వేయిస్తా … డాలర్ల వర్షంలో తడుస్తా!

తెలుగు తెర మరుగై పోతోందంటూ మొసలి కన్నీరు కారుస్తా;

జై జై తెలుగు’ నినాదాల నీడలో నన్ను నేనే దాచేసుకుంటా!

తెలుగు భాషాభిమానిని నేను.. … కపట వీరాభిమానిని నేను...!!

 ********* ********** **********

0 Comments